
వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 148వ అంతర్జాల సాహితీ సమావేశం డిసెంబర్ 13, 2024న హాస్యవల్లరిగా, ఆహ్లాదంగా జరిగింది.
ద్వాదశాబ్ది కాలం పైబడి నెల నెలా వీక్షణం సాహితీ విందు చేస్తూనే ఉంది. ఈ విందులలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతీసారి ఒక క్రొత్త వంటకాన్ని వండి వడ్డిస్తూ వుంటారు. దేనికదే గొప్ప రుచి. 2024లో చివరి సమావేశమైన ఈ సమావేశం సాహితీవంకాయలో ఉల్లికారం కూరి వడ్డించిన గుత్తివంకాయ కూర వంటిది. అబ్బ! ఏమి రుచో !
ఎప్పటిలా వీక్షణం అధ్యక్షులు డా కె.గీతగారి స్వాగత వచనాలతో సభ ప్రారంభమైంది. ఈనాటి ప్రత్యేక అతిథి, హాస్యావధాని డా. శంకర నారాయణ గారి వైశిష్ట్యాన్ని, వారి వందలకొలదీ బిరుదాలనూ, అవార్డులను గురించి గీత గారు విపులీకరించారు. ఇన్ని కిరీటాలు ఒక వ్యక్తికి సాధ్యమా అని నోరు వెళ్ళబెట్టడం మావంతు అయింది.
శతాధిక పురస్కార గ్రహీత, విశ్వవిఖ్యాత హాస్యరస సార్వభౌమ, హాస్యబ్రహ్మ అయిన డాక్టర్ శంకరనారాయణ గారి వివరాలు ఇవీ:-
వీరి పూర్తి పేరు టి. శంకరనారాయణరావు. లక్ష్మీనారాయణ, వెంకట నరసమ్మ గార్ల కుమారులు. 24-09-1956 న మంగినపూడి, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. 1976-78 లలో ఎం.ఏ తెలుగు చేసారు. హాస్యబ్రహ్మగా ప్రఖ్యాతి వహించిన హాస్యావధాని డాక్టర్ శంకరనారాయణ అంతర్జాతీయ కళాకారులు. ఆయన తన హాస్యావధానంతో రెండుసార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు. అంతే కాకుండా రెండు గౌరవ డాక్టరేట్లు, రెండు స్వర్ణపతకాలు, ఒక వెండి కిరీటం, 114 పురస్కారాలు అందుకున్నారు. దేశ విదేశాల్లో 25 సంవత్సరాల నుంచి 500కు పైగా హాస్యావధానాలు చేశారు. 15 అష్టావధానాలు చేశారు. బహుముఖ ప్రజ్ఞావంతులయిన శంకరనారాయణ పత్రికల్లో కాలమిస్టుగా, వక్తగా, వాస్తు శాస్త్రవేత్తగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆయన తెలుగులో స్నాతకోత్తర పట్టభద్రులు. నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏలో రెండో స్థానంతో ఉత్తీర్ణులయ్యారు. పాత్రికేయరంగంలో 42 సంవత్సరాల పాటు వివిధ పత్రికల్లో వివిధ సంపాదక హోదాల్లో పనిచేసిన శంకరనారాయణ ఈనాడులో సీనియర్ చీఫ్ సబ్‌ఎడిటర్‌గా పదవీ విరమణ చేశారు. తెలుగు వెలుగు విభాగానికి కన్సల్టెంట్‌గా సేవలందించారు. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక, సీటీవీలో కూడా గతంలో పనిచేశారు. ఆయన పత్రికల్లో 38 కాలమ్స్ రాశారు. అలాగే 70 పుస్తకాలు ప్రచురించారు. ఈనాడు, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, ఆంధ్రజ్యోతి దినపత్రికలు, తెలుగువెలుగు, విపుల, చతుర, ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలు, ఆంధ్రప్రభ వారపత్రిక, ప్రజామత, జనసందేశ్ పక్షపత్రికలు, ఫేస్‌బుక్‌లో మొత్తం 4000కు పైగా వ్యాసాలు, కవితలు, కథలు ప్రచురితమయ్యాయి. 2012లో తిరుపతిలోనూ, 2017లో హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ, 2019లో అమెరికాలో జరిగిన తానా మహాసభల్లోనూ హాస్యావధానాలు చేసి విశ్వవ్యాప్తమైన కీర్తిని సంపాదించుకున్నారు. "హాస్య బ్రహ్మ శంకరనారాయణ జీవితం - రచనా విన్యాసాలు" అనే అంశం మీద నాగార్జున యూనివర్సిటీ పరిశోధన చేయించి చొప్పరపు శ్రీనివాసరావుకు పి హెచ్ డి పట్టాను ప్రదానం చేయడం విశేషం. శంకరనారాయణ చదువుకున్న యూనివర్సిటీ నుంచే ఈ గౌరవం దక్కడం మరీ విశేషం.
వీరి ప్రచురిత గ్రంథాలు: (1). ఫన్‌గన్ (2). ఫన్‌దేహాలు (3). పన్ పరాగ్ (4). శంకరనారాయణ అప్రస్తుత ప్రసంగాలు (5). అగ్నిసంగీతం (6). కన్నెకంటివారి కవితా సమీక్ష (7). చమక్కులు (8). నవ్వే నజరానా (9). మీనవ్వు మీ ఇష్టం (10). మహర్దిశ (11). ఫన్‌టానిక్ (12) కనకదుర్గ శతకం (13)శంకరాలు (14) కవులున్నారు జాగ్రత్త (15) ఇంగ్లీషుకు తల్లి తెలుగు (16) సరస్వతీపుత్రులు (17)తీపిగుర్తులు (18) తీగలాగే భార్య (19) చలియో... చెల్లకో (20) సోదర సోదరీమణులారా (21) ‘సర్వే’శ్వరా గెలిపించరా (22) సభకు నమస్కారం (23) ఉద్యోగ విజయాలు (24) అగ్నిసంగీతం (రెండో ముద్రణ) (25) ‘పొట్టా’భిషేకం (26) శంకరాలు-2 (27) శంకరగీత (28) సంతోషిమాత శతకం (29) విదేశాల్లో హాస్యావధానం (30) హార్ట్ ఆఫ్ లివింగ్ (31) సత్యభామ శతకం (32) నవ్వుల నయాగరా (33) నవ గణేశ శతకం (34) వెంకటేశ్వర శతకం (35). సరస్వతి శతకం (36) రామ శతకం (37) శంకర శతకం (38) గంగతల్లి శతకం (39) మన్మథ శతకం (40) చెన్నకేశవ శతకం (41) వాసవీ కన్యకా పరమేశ్వరి శతకం (42) నర్సింహ స్వామి శతకం (43) చిత్రగుప్త శతకం (44) షిరిడీ సాయిబాబా శతకం (45) అయ్యప్ప శతకం (46) ఆంజనేయ శతకం (47) కృష్ణ శతకం (48) న్యాయ శతకం (49) విజయలక్ష్మి శతకం (50) సత్యనారాయణ స్వామి శతకం (51) ఆంజనేయ శతకం 51. మన్నెంకొండ శతకం 52. వ్యాస శతకం 53. విధి శతకం 54. వాల్మీకి శతకం 55. పద్మ శాలి శతకం 56.ఇంజనీరు శతకం 57. డాక్టర్ శతకం 58. గాయత్రీశతకం 59. అమ్మ శతకం 60. పార్వతీశతకం 61.పుష్పవిలాసం 62.భరత సీమ శతకం 63.సీతా శతకం 64.లక్ష్మీ శతకం 65.యమ ధర్మ రాజ శతకం 66.శని శతకం.
వీరి ఆత్మకథలు: తీపిగుర్తులు, ఉద్యోగ విజయాలు, విదేశాల్లో హాస్యావధానం, సినిమా వాళ్ళతో నేను వివిధ పత్రికల్లో 38 కాలమ్స్ రాసారు. అవి: (1). ఫన్‌గన్ (2). ఫన్‌దేహాలు (3). పన్‌పరాగ్ (4). పన్‌చాయతీ (5). పూనకం (6) విట్‌బిట్స్ (7). పంచతంత్రం (8). ఫన్‌దేమాతరం (9). సమసారం (10). ఫన్నింగ్ కామెంటరీ (11). మహర్దిశ (12). వాణిజ్యవాస్తు (13). ఆదివారం ఆంధ్రప్రభవాస్తు కాలమ్ (14). వాస్తుమర్మాలు (15). తిరగమోత (16). అడ్డగోలు (17). శ్రీశంకర (18). వారం వారం అవధానం (19). పన్‌ధా (20). పెన్‌ఫన్ (21). ఫన్నండోయ్ (22). ఫన్నింగ్ రేస్ (23). డబుల్ మీనింగ్ డాట్ కామ్ (24). జోక్‌సత్తా (25). ఫన్నెస్ట్ (26). ఎన్నికల నిఘంటువు (27). వాస్తుభక్తి (28). ఫన్‌కర్ (29). ఫంటాస్టిక్ కాలమ్ (30). నవ్వునీతం (31). పన్నీరు (32) ఫటాఫట్ (33). రెటమతం (34) మాటకు తూటా (35). రాజనీతి చంద్రిక (36) మాటలు-ఈటెలు (37) మాటకు తూటా (38) కామ్రేడ్ వితండం
శంకరనారాయణ లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్సులో రెండు రికార్డులు సాధించారు. 2001 మార్చి 21న హైదరాబాద్ త్యాగరాయ గానసభలో 12 గంటల పాటు నిర్విరామ హాస్యావధానం చేశారు. 2003 జులై 20, 21వ తేదీల్లో 25 గంటలపాటు నిర్విరామ ప్రజా హాస్యావధానం చేశారు.
ప్రత్యేకగౌరవాలు : (1). అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ (అమెరికా) వారి గౌరవ డాక్టరేట్.
(2). యునైటెడ్ థియొలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారి గౌరవ డాక్టరేట్.
(3). 14.1.2005 కువైట్‌లో తెలుగు కళాసమితివారిచే ‘దీనారాభిషేకం’
(4). అవధూత శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ వారి చేతుల మీదుగా స్వర్ణకంకణం
(5). శ్రీరస్తు సాంస్కృతిక సంస్థ వారిచేత స్వర్ణకంకణం
(6). రాగసప్తస్వరం, విసుకన్సల్టెన్సీ వారిచేత స్వర్ణపతకం
గౌరవ పురస్కారాలు:
(1). ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం (2). ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గిడుగు రామమూర్తి సాహితీ పురస్కారం (3). పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (4). కమలాకర ట్రస్టు జీవిత సాఫల్య పురస్కారం (5). టాన్‌టెక్స్ (డల్లాస్ - అమెరికా) అవార్డు (6). చైతన్య ఆర్ట్ థియేటర్ అకాడెమీ (7). వైష్ణవ (9). నవసమాజ దర్పణ్ అవార్డు (10). ఢిల్లీ తెలుగు అకాడెమీ అవార్డు (రాష్ట్రీయ వికాస శిరోమణి) (11). యూరోపియన్ తెలుగు అసోసియేషన్ అవార్డు (ఇంగ్లండ్) (12). హ్యూస్టన్ తెలుగు అసోసియేషన్ అవార్డు (యు.ఎస్.ఏ) (13). శ్రీరస్తు అవార్డు (14). వంశీ ఆర్ట్స్ ఇంటర్నేషనల్ అవార్డు (15). విజయవాడ లయన్స్ క్లబ్ అవార్డు (16). ఖుర్దా రోడ్ జంక్షన్ (ఒరిస్సా) ఉగాది పురస్కార్ (17). సిలికానాంధ్ర (యు.ఎస్.ఏ) అవార్డు (18). పి.ఎస్.ఆర్.ఆంజనేయ శాస్త్రి మెమోరియల్ అవార్డు (19). అల్లు రామలింగయ్య మెమోరియల్ అవార్డు (20). అభినవ తెనాలి రామకృష్ణ అవార్డు మొ.న 114 పురస్కారాలు.
డా.శంకర నారాయణ గారు తన ప్రసంగంలోని ప్రత్యక్షరము హర్షధ్వానాల నడుమ సభికుల కుక్షుల, బుగ్గల శక్తిని పరీక్షించింది. "హ్యాపీ చిరాయువు" అంటూ మొదలు పెట్టి, చరిత్రలో హాస్య కవిత్వాన్ని పరిచయం చేస్తూ, ఛలోక్తులతో సుమారు 45 ని.ల ప్రసంగం అనితరం, అద్భుతం! అందులో ముఖ్యంగా "ఉగ్గేల తాగుబోతుకు/ ముగ్గేలా తాజమహలు ముని వాకిటనన్ / విగ్గేల కృష్ణశాస్త్రికి/ సిగ్గేలభావకవికి సిరిసిరిమువ్వా!" అంటూ సాగిన శ్రీశ్రీ రచించిన సిరిసిరి మువ్వ పద్యాలను, జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి "కేసరి కేసరి కేసరి" మొ.న వెన్నో ఉదహరించారు.
పిదప శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు హాస్య కవిసమ్మేళనాన్ని ప్రారంభించారు. తొలిగా డా.గీతామాధవి గారు "వేయి వెలుగుల టెలుగు" అనే శీర్షికన మన తెలుగు ఎలా ఆంగ్లంతో కలగాపులగమై తన రూపం మార్చుకుందో సెటైరికల్ గా, హాస్యాన్ని విరబూస్తూ తమ కవితను చదివి నవ్వించారు.
సినీ టీవీ గీతరచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు తన 'టీ' అనే కవితలో అతిగా టీ త్రాగడంవలన తన భార్య తో జగడాన్ని చదివి నవ్వించారు.
శ్రీ క మ ర గారు కొడుకులు కాదు దొంగనా కొడుకులు అంటూ హాస్యాన్ని పండించారు. శ్రీ సూర్య ప్రకాశరావుగారు మిస్టర్ రోజ్ అనే కవితను చదివారు. శ్రీ కొత్తూరు వెంకట్ గారు రెండు ఆటవెలది పద్యరత్నాలను ఆలపించారు. ప్రముఖ కవి శ్రీ బిల్లా శ్రీధర్ రెడ్దిగారు "అప్పు” అనే శీర్షికన అంత్యప్రాస సౌందర్యాన్ని గుప్పిస్తూ అద్భుతమైన కవితతో నవ్వించారు. శ్రీ మోటూరి నారాయణ రావు గారు 'శ్వాసా విలాపం' అనే కవితలో పొగత్రాగడంతో ఇబ్బందులను చమత్కారం గా చదివారు. డా. కోదాటి అరుణ గారు 'మరువలేని బంధం' అనే కవితను వినిపించగా, శ్రీ అయ్యలరాజు సోమయాజులు ప్రసాద్ గారు 'అనుభవం' అనే కవితలో జీవితంలో సర్దుకు పోవడం ఎంత అవసరమో తెలిపారు. శ్రీమతి పరాంకుశం కృష్ణవేణి గారు 'జీవితం' అనే కవితనూ, చిన్నాదేవిగారు 'ఎండమావులు' అనే కవితనూ చదివి సభికులను ఆకట్టుకున్నారు.
బుక్కపట్నం రమాదేవి గారు 'అందమైన సుమమా' అంటూ భర్త తన భార్యతో సరసాన్ని సరసంగా వినిపించారు. శ్రీమతి అవధానం అమృత వల్లిగారు' అల్లుడిని పండుగకు ఆహ్వానిస్తూ చక్కని జానపద గీతాన్ని శ్రావ్యంగా గానించి వీనులవిందు చేశారు. సుజాత కోకిల గారు 'ఇదేందండీ ఈ మాయ' అని భార్యా భర్తల నడుమ సంభాషణాన్ని చదివి నవ్వించారు. శ్రీ మేడిశెట్టి యోగేశ్వరరావు గారు 'చక్కని చుక్కండి' అంటూ తన భార్యపైన హాస్య కవితను వినిపించారు. ప్రసాదరావు రామాయణం అనే నేను భార్యాబాధితులకు తిరిగి మంచి కాలం వస్తుంది అంటూ అభయమిస్తూ' బాధా సర్ప ద్రష్టులు 'అనే కవితను చదివాను. శ్రీ జె.వి కుమార్ గారు తన 'పనిమనిషి' అనే కవితలో పనిమనిషితో జాగ్రత్త అంటూ హాస్యాన్ని చిందించారు.
శ్రీమతి చీదేళ్ల సీతాలక్ష్మిగారు 'తోలు తీసి కప్పుకున్న ఛాయ' అనే తన కవితలో నిజమైన మిత్రుడు తమ నీడేనంటూ చెప్పారు. శ్రీ ఉప్పలపాటి వెంకటరత్నం గారు 'అప్పుచేయక ఎవరికీ తప్పదంటూ' సరదా కవిత చదివారు. చివరిగా శ్రీ రాజేంద్రప్రసాద్ గారు 'కడుపు కాలుతూంది నక నక 'అంటూ పక పక, చక చకా, టకటకా అని అద్భుతమైన అంత్యప్రాసలతో వినిపించిన కవిత సభకు ఓ హైలైట్.
అత్యంత ఆసక్తిదాయకంగా సుమారు మూడు గంటల పాటు జరిగిన సభ గీతగారి తుది పలుకులతో ముగిసింది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఉత్సాహంగా పాల్గొన్న ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.