వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 147వ అంతర్జాల సాహితీ సమావేశం నవంబర్ 15, 2024న అత్యద్భుతంగా జరిగింది. ఆరోజు కార్తీక పౌర్ణమి కావడం విశేషం. ఈ కార్తీక పౌర్ణమి భవుని భక్తులకే కాదు, కవి భక్తులకు కూడా పండగే చేశారు డా.గీతామాధవి గారు. శివుని భక్తులు పుణ్యనదీ స్నానం చేస్తే, మా కవిత్వ భక్తులం సాహితీ తటాకాలలో మునిగి తేలాము.
వీక్షణం వ్యవస్థాపకురాలైన డా.కె .గీతగారు పుష్కర వత్సరాలకు పైబడి ప్రతినెలా ఈ అంతర్జాల సాహితీ సమావేశాలు అప్రతిహతంగా, నిరంతరాయంగా, శోభాయమానంగా జరుపుకోవడం అసాధ్యమే అయినా, సుసాధ్యం చేసి చూపుతున్నారు. ఆత్మశక్తి (Will power), సాహితీ ప్రియత్వం ఆమెను అకుంఠిత కార్యదీక్ష, పట్టుదలలతో అలా నడిపిస్తున్నవేమో!
ఇక ఈనాటి కార్యక్రమం గీతగారి స్వాగత వచనాలతో ప్రారంభమైంది. ముందుగా ముఖ్య అతిథి సినీ, బుల్లి తెర గేయ, మాటల రచయిత, శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారిని వేదికపైకి ఆహ్వానించి వారి ప్రతిభావిశేషాల గురించి వారందుకున్న ఎన్నో పురస్కారాలను గురించి ప్రస్తావించారు.
మౌనశ్రీ మల్లిక్ గారి పరిచయం:
మౌనశ్రీ మల్లిక్ గారు వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జన్మించారు. వరంగల్ సీకేఎం కళాశాలలో డిగ్రీ, హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పీజీ చదివారు. 1998 నుండి 2016 వరకు పాత్రికేయుడిగా పనిచేశారు. సుమారు 200 కవితల పోటీల్లో ప్రథమ బహుమతి అందుకున్నారు. దిగంబర, గరళం, తప్తస్పృహ, మంటల స్నానం వంటి కవిత సంపుటాలను ప్రచురించారు.
టెలివిజన్ గీత రచయితగా...కోయిలమ్మ, కృష్ణ తులసి, కేరాఫ్ అనసూయ, ఎదలోయల్లో ఇంద్రధనుస్సు, కలిసుందాం రా, అనుపల్లవి, అగ్నిసాక్షి, అగ్నిసాక్షి 2, బొమ్మరిల్లు వంటి అనేక సీరియళ్లలో 750 కి పైగా పాటలు రాశారు. సినీ గీత రచయితగా..నాలో తొలిసారిగా, చేతిలో చెయ్యేసి, థ్రిల్లింగ్, గుడ్ మార్నింగ్, చేతిలో చెయ్యేసి చెప్పు బావా, చెంబు చినసత్యం, పోరాటం, ఐపీసీ సెక్షన్ భార్య బంధు, బిలాల్పూర్ పోలీస్ స్టేషన్, దేవినేని, జంక్షన్లో జయమాలిని, అన్నపూర్ణమ్మ గారి మనవడు, తెలంగాణ దేవుడు, జాతీయ రహదారి, లవ్ మాక్ టెయిల్ 2, కైనీడ, మధురవాణి, బెంగుళూరు 69, శరపంజరం, మూడో కన్ను (మాటల రచయితగా), ఇండియా ఫైల్స్ వంటి అనేక సినిమాలకు పాటలు, మాటలు రాశారు.
మౌనశ్రీ మల్లిక్ గారు అందుకున్న అవార్డులు, పురస్కారాలు- రంజని కుందుర్తి అవార్డు, యువసాహితీ అవార్డు (సిఎఓయు), ఎక్స్ రే అవార్డు, రాధేయ కవితా పురస్కారం, కలర్స్ అవార్డు (ఉత్తమ సినీ గీతరచయిత..(గుడ్ మార్నింగ్ సినిమా), జీవిఆర్ ఆరాధన 5 సార్లు ప్రథమ బహుమతి, అభ్యుదయ ఫౌండేషన్ అవార్డు, షీ ఫౌండేషన్ అవార్డు, ఆసరా అవార్డు, జనరంజక సహజకవి అవార్డు, పెన్నా అవార్డు, సృజన ఉగాది అవార్డు, సృజన సాహితీ సమితి, యంవి నర్సింహారెడ్డి సాహిత్య పురస్కారం, బోవేరా అవార్డు, కిన్నెర-ద్వానా అవార్డు, అస్తిత్వం అవార్డు, ఆర్వీ రమణమూర్తి సాహిత్య పురస్కారం, దాస్యం వెంకట స్వామి సమైఖ్యసాహితీ పురస్కారం, ఘంటసాల బంగారు తెలంగాణ పురస్కారం, భారతీయ సాహిత్య పరిషత్ జాతీయ పురస్కారం - 2018, అద్దేపల్లి సృజన పురస్కారం, విజయవాడ, ప్రతిభా పురస్కారం - తెలుగు సినీ రచయితల సంఘం, సినారె కవితా పురస్కారం - సాహితీ గౌతమి, కరీంనగర్, గిడుగు రామ్మూర్తి పురస్కారం, హైదరాబాద్, కాళోజీ కవితా పురస్కారం - తెలుగు సాహిత్య పీఠం, సిద్దిపేట, కాళోజీ కవితా పురస్కారం - తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, సినారె - వంశీ ఫిలిం అవార్డు, హరివిల్లు అవార్డు - గుంటూరు, జివిఆర్ ఆరాధన టీవీ అవార్డు (ఉత్తమ గేయ రచయిత కోయిలమ్మ సీరియల్), కళా వెంకట దీక్షితులు పురస్కారం - త్యాగరాయ గాన సభ, శంకరం వేదిక సంయుక్తంగా తేజ రాష్ట్రస్థాయి పురస్కారం - ఆలేరు, ఉత్తమ కవి పురస్కారం - భారతీయ నాటక కళా సమితి- వర్ధన్నపేట, ఉత్తమకవి పురస్కారం - తెలంగాణ ప్రభుత్వం, సప్తపదిలో తోడు నీడ పురస్కారం, జివిఆర్ ఆరాధన హైదరాబాద్, రంజని కుందుర్తి అత్యుత్తమ కవితా అవార్డు, ఏ.జి. ఆఫీస్, హైదరాబాద్, ఆంధ్ర సారస్వత సమితి సాహిత్య పురస్కారం - మచిలీపట్నం, డాక్టర్ పట్టాభి కళాపీఠం సాహిత్య పురస్కారం - మచిలీపట్నం, బహుజన సాహిత్య అకాడమీ జాతీయ పురస్కారం, సృజన కళల వేదిక విశిష్ట కవి ప్రతిభా పురస్కారం -2021, నాగార్జునసాగర్, పోతుగంటి రామకృష్ణయ్య గుప్త స్మారక జాతీయ సాహిత్య సేవా పురస్కారం-2022, సినీగేయ సవ్యసాచి వెన్నెల జాతీయ పురస్కారం-2022, అక్షరదీక్ష జాతీయ విశిష్ట సేవా పురస్కారం- 2022. సినారె సాహిత్య పురస్కారం - 2022, తేజస్విని కల్చరల్ అసోసియేషన్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి. విద్యాసాగర్ చేతుల మీదుగా "బుల్లితెర-సినీ గేయ కౌముది" బిరుదు స్వీకారం, తెలుగు సాహిత్య కళా పీఠం – 2022, కళావేదిక నేషనల్ ఫిలిం అవార్డు - 2022 ( సినిమా - జాతీయ రహదారి), 'తానా' ప్రపంచ కవితల పోటీల్లో ప్రథమ బహుమతి - 2020, కొలకలూరి ఇనాక్ సాహిత్య పురస్కారం -2023, తెలుగు సాహిత్య కళా పీఠం ఉత్తమ కవి పురస్కారం - 2023, వీరశైవ సాహిత్యరత్న పురస్కార్ -2023 (ప్రగతిశీల వీరశైవ సమాజం. పార్లమెంటు సభ్యులు శ్రీ బీబీ పాటిల్ పరి చేతుల మీదుగా), ఉత్తమ బుల్లితెర సినీగేయ కవి పురస్కారం - 2024. ఆలూరి కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్, హైదరాబాద్, జివిఆర్ ఆరాధన ఆత్మీయ పురస్కారం, ఉత్తమ గేయ రచయిత (కలిసుందాం రా సీరియల్, ఈటీవీ) - 2024, కవికోవిద కొటికలపూడి కూర్మనాథం 'వంశీ - తిరుమల బ్యాంక్ ఉగాది కామధేను పురస్కారం - 2024, అశ్వం అవార్డు, వే ఫౌండేషన్, తిరుపతి -2024, తెలుగు సినీ రచయితల సంఘం త్రిదశాబ్ది గౌరవ పురస్కారం -2024, సమరసత సాహితీ ప్రప్రథమ రాష్ట్రస్థాయి పురస్కారం -2024. సామాజిక సమరసత వేదిక, నల్గొండ విభాగ్,ఆలేరు. (గుర్రం జాషువా, బోయి భీమన్న, దున్న ఇద్దాసు, చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు జయంతులు సందర్భంగా..) మొ .నవి.
అనంతరం శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారి ప్రసంగం ఒక జలపాతంలా సాగింది. 'సినిమా పాటల రచన, మెళుకువలు' అనే అంశంపై ఆయన తన సహజ గంభీరస్వరంతో, స్పష్టమైన ఉచ్చారణతో, అనర్గళంగా సుమారు 50 నిమిషాల పాటు ప్రసంగించారు. సినిమాలలో పాటలు వ్రాయాలనే ఔత్సాహికులకు వారి ప్రసంగం, సూచనలు పెద్దబాలశిక్ష అనే చెప్పాలి. ముఖ్యంగా "అవకాశాలు మనమే సృష్టించుకోవాలి, తాముగా ఎవరూ అవకాశం ఇవ్వరు" అనే మాట వేదవాక్కు. వారి సూచనలన్నీ వ్రాయాలంటే ఒక పుస్తకం అవుతుంది.
వారి ప్రసంగంపై స్పందించిన వారిలో డా.గీతామాధవి, శ్రీ సాధనాల గారూ, శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారూ, నేనూ ఉన్నాము. ఈ సందర్భంగా మౌనశ్రీ గారు గీతగారి తొలి సినిమా రచనను పాడమని అడుగగా, గీతగారు "బట్టర్ ఫ్లైస్" సినిమాలో తానే వ్రాసి, పాడిన పాటను మధుర కంఠంతో పాడి వినిపించారు. అనంతరం మౌనశ్రీ గారు స్పందిస్తూ పాటలోని సాహిత్యాన్ని ఉటంకిస్తూ, "సినిమా పాటకు కావలిసినదిదే" అని కొనియాడారు.
తరువాత వరుసగా పాటల రచయితలు తమ గీతాల్ని వినిపించారు. శ్రీ మేడిశెట్టి యోగేశ్వరరావు గారు "కుండపోత" అనే తన కవితను పాడి వినిపించారు. అవధానం అమృతవల్లిగారు మనసంటే అనే పాటను, శ్రీ చేకూరి నరసింహారావుగారు ఒక దేశభక్తి గీతాన్ని పాడి వినిపించారు. ఈ పాటల ప్రక్రియ సభకు క్రొత్త అందాన్ని తెచ్చిపెట్టింది. అనంతరం శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన కవిసమ్మేళనం ప్రారంభమైంది.
మొదటగా శ్రీవాకాటి రాంరెడ్డి గారు వీక్షణంపై, గీతగారిని ప్రస్తావిస్తూ రచించిన పాట ఆసక్తిదాయకంగా ఉండినది. ఈ కవితపై సాధనాలవారు స్పందించారు. మండ వీరాస్వామిగౌడ్ ఇంటింటా దేవతలు అనే పాటను, ఊటుకూరి మహేష్ గారు కార్తీకమాసం పై పాటనూ,శ్రీ లింగుట్ల వెంకటేశ్వర్లు ఒక పాటనూ, రాధశ్రీ గారు మనజాతి తెలుగు అంటూ పద్యాన్నీ, శ్రీ సాధనాల గారు గోదావరిపై ఒక పాటనూ పాడి సభికులను ఆనంద పరిచారు. ములుముడి నారాయణ శాస్త్రి గారు మూడు తేటగీతి పద్యాలను పాడారు.
ప్రసాదరావు రామాయణం అనే నేను "నా మనసే నాకు శత్రువు" అనే కవితను వినిపించాను (పాడలేదండీ!) శ్రీ కేవీయస్ గౌరీపతి శాస్త్రి (వీరవతి ) గారు శివ విలాసం పాట పాడారు. డా.యం ఎన్ బృంద గారు "అష్ట లక్ష్మీ" అంటూ దేవిని స్వాగతిస్తూ ఆలపించారు. చిట్టాబత్తిన వీరరాఘవులు గారు "చందా మామా" అంటూ ఒక జానపద గీతాన్ని ఆలపించారు. కమరగారు "స్వాతి చినుకు" కవితను వినిపించారు. 'వద్దురా పెళ్లొద్దురా 'అనే హాస్య గీతాన్ని శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు చదివి నవ్వించారు. చివరిగా గీతగారు ఒక వేదనాత్మకమైన స్వీయ గీతాలాపన చేసి, మలిపలుకులు పలికారు. ఈసారి ఎందరో క్రొత్తవారికి స్థానం కల్పించడం చాలా సంతోషదాయకమైన విషయం.
ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఉత్సాహంగా పాల్గొన్న ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.