వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 146వ అంతర్జాల సాహితీ సభ అక్టోబర్ 18, 2024 అప్రత్యక్షమైతేనేం, అంతర్జాలమైతేనేం అత్యద్భుతంగా, అసాధారణ సాహితీసభగా, మరో 'భువనవిజయం' గా జరిగింది.
అల్లసాని వారు, ధూర్జటీ, రామకృషులు రాలేకపోయినా అంతటి మహనీయులు పాల్గొన్న గొప్ప సభ. సాహితీ స్రష్ఠ శ్రీ ఏనుగు నరసింహారెడ్డి(స్పెషల్ డిప్యూటి కలెక్టర్, తెలంగాణా) వారొకవైపు, వివిధ రాష్ట్ర యూనివర్సిటీల తెలుగు శాఖాధిపతులొకవైపు, వివిధ సాహితీ సంస్థల అధ్యక్షులు మరో వైపు, ప్రాక్ పశ్చిమ తెలుగు కవులు కొలువు దీరిన ఈ మరో భువన విజయాన్ని చూసి తీరవలసిందే! ఇక వివరాల్లోకెళ్తే ......
తొలుత డా.గీతామాధవి గారి స్వాగత వచనాలతో సభ ఆరంభమైంది. ఈనాటి ప్రధాన ప్రాసంగికులు శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారిని, ప్రత్యేక ఆహ్వానితులైన వివిధ రాష్ట్రాల విశ్వవిద్యాలయాల తెలుగు శాఖాధిపతులను, వివిధ సాహితీ సంఘాధ్యక్షులనూ వేదికపైకి ఆహ్వానించి సభకు వారిని పరిచయం చేశారు. తదనంతరం డాక్టర్ నరసింహారెడ్డి గారు "ఆధునిక కవిత్వం..అభివ్యక్తి" అనే అంశం మీద అనర్గళంగా, శివుని జటాఝూటం నుండి గంగ జాలువారినట్టు ప్రసంగించిన తీరు సభికులను ముగ్ధులను చేసింది. ప్రాచీనకవిత్వం నుండి ఆధునిక కవిత్వం, గేయ కవిత్వం, అత్యాధునిక కవిత్వం/ద్రవ కవిత్వం/వర్తమాన కవిత్వం వివిధ దశలలో ఎలా మార్పు చెందుతూ వచ్చిందో గురుజాడ గారిని, విశ్వనాథ వారిని, శ్రీశ్రీ, సినారెలను ఉటంకిస్తూ వివరించారు. కవితా వస్తు నిర్ణయం, శీర్షిక నిర్ణయం, ఎత్తుగడ, ముగింపులలో ఏయే జాగ్రత్తలు అవసరమో సోదాహరణంగా చెప్పిన తీరు అద్భుతం!
అలంకారాలైనా, ప్రాసపదాలైనా, భాషాపద విన్యాసమైనా సహజంగా అమిరి పోవాలేగాని, అందం కోసం అతికించినట్లు ఉండకూడదన్నారు. సాధ్యమైనంత వరకూ మనం నిత్యం సంభాషణలో వాడే పదాలు వాడుతూ చెప్పే విధానంలో నూతనత్వం చూపిస్తే కవితలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయన్నారు. 'ఒకపదం వాడితే సరిపోయే చోట రెండుపదాలు వాడకండి' అని సూచించారు. కవులందరూ తమ కవితలలో రెడ్డిగారు చెప్పిన ఏ కొన్ని అంశాలైనా ఉన్నాయా అని తడిమి చూసుకున్నారు. నాకైతే మాత్రం నా కవితా శైలిని మార్చుకోవలిసిన అవసరం ఉందని గుర్తించాను. ఇంతటి అద్భుతమైన ప్రసంగాన్ని ఇంతవరకూ నేను విని ఉండలేదు. వారికి నా కైమోడ్పులు.
డాక్టర్ నరసింహారెడ్డి గారి ప్రసంగాన్ని, వారి ఉదాహరణాలను అమెరికా యువకవి కమర గారు, సాలూరు కవి శ్రీ కిలపర్తి దాలినాయుడు గారు, పర్లాకిమిడి కవి ఉత్కల సాహిత్య వేదిక అధ్యక్షురాలు శ్రీమతి పండ్రంగి శారద గారు, శ్రీమతి వేలేటి శైలజ గారు కొనియాడారు.
తదుపరి శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం ప్రారంభమైంది. తొలుతగా డా.రామనాథం నాయుడు (తెలుగు శాఖాద్యక్షులు, కర్ణాటకరాష్ట్ర సార్వత్రిక విశ్వ విద్యాలయం, మైసూర్) గారు మైసూరు దసరా ఉత్సవాల రమ్యతను గురించి తన కవితలో అందంగా చెప్పారు. శ్రీ కొమర్రాజు ఉమామహేశ్వరరావుగారు (మా తెలుగుతల్లి- బెంగుళూరు) తమ సాహిత్య సేవగురించి వివరించారు. డా.కె.గీత గారు నేటి సాఫ్ట్ వేర్ ఉద్యోగులను కార్మికులంటూ వారి దుర్భర జీవితాన్ని తన కవిత 'కార్మికులారా వర్ధిల్లండి" లో వర్ణించిన వైనం ఆర్ద్రం అద్భుతం. ఆమె కవితలలో సహజ భావ విన్యాసం ప్రత్యేకం! అందరికీ అబ్బదు.
డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు "దేవతలు కూడా!" అంటూ దేవతలూ సమయానుకూలంగా మనలను ఏడిపిస్తారు, కన్నీరు పెట్టిస్తారు అంటూ చక్కని కవితను వినిపించారు. డా. మరింగంటి లక్ష్మణాచార్యులు గారు 'హరితహారం' అనే కవితలో వృక్షం యొక్క మనోభావాన్ని అద్భుతంగా చెప్పారు.
డా. పండ్రంగి శారద గారు (ఉత్కళ సాహిత్య వేదిక అధ్యక్షురాలు, పర్లాకమిడి) తన 'అజంతాసుందరి' అనే కవితలో తెలుగు భాషను అజంతా సుందరితో పోలుస్తూ కవిత చక్కగా చదివారు. శ్రీ కందుకూరి శ్రీరాములు గారు కవిత ఎలా ఉండాలో అద్భుతంగా తన కవితలో వినిపించారు. అవధానం అమృతవల్లిగారు "గెలుపుతో స్నేహం చేద్దాం" అంటూ సుందరమైన కవితను వినిపించారు. శ్రీ వసీరా గారు బియ్యపు గింజ మీద ఇందిరా గాంధీని గీచాడట! అంటూ చదివిన కవిత అందరినీ అలరించింది.
శ్రీ గంటా మనోహర్ రెడ్డి గారు ఘంటారావం అనే కవితలో మనిషి మాయమవుతున్నాడు, మరమనిషి అవుతున్నాడు అంటూ ఆందోళన వెలిబుచ్చారు. శ్రీ లగిశెట్టి రాము గారు 'కూతురు' అనే తన కవితలో అమ్మాయి పాలపీకనుండి తాళి వరకూ తండ్రి భావాలు ఎలా ఉంటాయో ఆర్ద్రంగా చిత్రీకరించారు. నాకు అందరూ ఆడపిల్లలే కనుక ఆ ఆనందాన్నీ, వేదననూ భరించిన వాడిని కనుక ఒక్కసారి వెనుకకు తిరిగి చూచుకున్నాను. శ్రీ కమర గారి 'సొంతడబ్బా' కవిత నవ్వు పుట్టించింది. సరదాగా ఉంటాయి వారి కవితలన్నీ.
శ్రీ సాధనాల వెంకటస్వామి నాయుడు గారు 'ప్రశ్న' అనే కవితలో ఒక అనుబంధం అనుమానాల మయమైనపుడు అది అనుబంధం ఎలా అవుతుంది అనంటూ ప్రశ్నల శరసంధానం చేశారు.
డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి గారు 'మూడుముళ్ల బంధం' అనే కవితలో గడియారంలోని మూడు ముళ్లను కాలంతో పోలుస్తూ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెప్పారు. కవయిత్రి శ్రీమతి అవధానం అమృతవల్లి గారు "గెలుపుతో స్నేహం చేద్దాం" అంటూ చుట్టూ ఉన్న అడ్డంకులను, అవరోధాలను అతిక్రమిద్దాం అని తమ కవితలో తెలియజేశారు.
నేను రామాయణం ప్రసాదరావును నా కవిత "అప్పుకావాలి నాకు" లో ఈనాడు మాయమవుతున్న అనురాగం, ప్రేమ సామరస్యం సౌహార్ద్రాలను ఎవరైనా నాకు అప్పు ఇస్తారా అంటూ అడిగాను. శ్రీ చిట్టాబత్తిన వీరరాఘవులు గారు 'కవిత్వం' అనే తన కవితలో కవిత్వ లక్షణాలు ఎలావుండాలో మనోహరంగా వినిపించారు.
"వాడు మారేదెప్పుడు" అని అయ్యల సోమయాజులు గారు తన కవితను చదివారు. మూర్ఖునికి మార్పు ఎలావస్తుంది? అని ప్రశ్నించారు. అట్లకాడ పై కవితను హాస్యస్ఫోరకంగా వినిపించారు శ్రీ రామకృష్ణ చంద్రమౌళి గారు. మరోకవి శ్రీ ఉప్పలపాటి వెంకటరత్నం గారు శిథిలాలు అనే గుల్జార్ గారి హిందీ కవితకు తెలుగు సేతను వినిపించారు. శ్రీమతి వేలేటి శైలజ గారు గీతమాలిక మరియు తేటగీతి పద్యాలలో తెలుగు వైభవము/ సౌందర్యమును చక్కని స్వరంతో పాడి అందరినీ అలరించారు. శ్రీమతి కొలచన శ్రీసుధ గారు "నేను అమరను" అంటూ మాటలను మూటకట్టి కాలం గురించి కాలగర్భం గురించి చక్కని కవితను వినిపించారు. శ్రీమతి అమీనా కలందర్ గారు 'కల ఎంతో మంచిది' అని సూక్ష్మకవితను బాగా చదివి వినిపించారు. చివరిగా శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు తన సహజ గంభీర కంఠంతో కవుల కవితలు మధుశర్కరాలతో పోలుస్తూ చదివిన కవిత సభకు హైలైట్!
డా.గీతామాధవి గారి వందన సమర్పణలో సమావేశం ముగిసింది. సాహితీచరిత్రలో ఈ సమావేశం ఒక రంగుల పుటగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. 146 నెలలుగా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి విరామం లేని ఈ సాహితీసభలను ఏర్పాటు చేస్తున్న గీత గారి కృషి, పట్టుదల అనన్యం, అసామాన్యం! ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.