Menu Close
వీక్షణం-144 వ సాహితీ సమావేశం
-- ప్రసాదరావు రామాయణం --
vikshanam-144

వీక్షణం సాహితీ గవాక్షం 144వ అంతర్జాల సమావేశం ఆగస్టు20, 2024న ఆలస్యంగానైనా ఆసక్తిదాయకంగా జరిగింది. సుమారు పుష్కర కాలంగా ప్రతి నెలా నిరంతరాయంగా, నిర్విరామంగా జరుగుతున్న ఈ ప్రపంచ కవిసమ్మేళనం కోసం కవులందరూ ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. సాధారణంగా ప్రతినెలా రెండవ వారంలో జరగవలసిన ఈ సమావేశం రథసారథి డా.గీతామాధవి గారు భారత దేశ పర్యటనలో ఉండటం వలన మూడవ వారానికి వాయిదా పడ్డది.

ఈ సమావేశానికి డా.గీతామాధవి గారు అధ్యక్షత వహించగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు ప్రధాన వక్తగా విచ్చేసి "వచనకవిత్వ రచనలో గుర్తించవలసిన అంశాలు" అనే అంశంపై అద్భుతంగా ప్రసంగించారు.

సేనాధిపతి గారు కరీంనగరవాసి. వివిధ సాహితీ ప్రక్రియలలో నిష్ణాతులు. కళాశాలలకు పర్యవేక్షణ అధికారిగా పనిచేసారు. వీరి విద్యార్హతలు: ఎం.కాం.,బి.ఇడీ. వృత్తి: ⁠రిటైర్డ్ అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్, శాతవాహన విశ్వ విద్యాలయం-కరీంనగర్, రిటైర్డ్ కామర్స్ విభాగాధిపతి, ప్రభుత్వ మహిళా డిగ్రీ,పి.జి. కళాశాల-కరీంనగర్, పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కళాశాల విద్యా కమీషనరేట్, అకడమిక్ అడ్వయిజర్, రిటైర్డ్ కో-ఆర్డినేటర్-ఇగ్నో, రిటైర్డ్ N.S.S. ప్రోగ్రాం అధికారి, పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల FAC ప్రిన్సిపల్ గా, NAAC కమిటీ కో-ఆర్డినేటర్ గా, పూర్వ రాష్ట్ర ప్రధాన పర్యవేక్షణ అధికారి, శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆం.ప్ర. గా వివిధ రంగాల్లో పనిచేసారు.

రచనా వ్యాసంగం: వెలువరించిన గ్రంథాలు:16(వివిధ ప్రక్రియల్లో). చిటికెలు(నానీలు), సంవీక్ష(గ్రంథ సమీక్ష వ్యాసాలు), అక్షరం సాక్షిగా(కవిత్వం), శబ్దలయ(కవిత్వం), దర్శనం(గ్రంథ సమీక్షలు), వీక్షణ(గ్రంథ సమీక్షలు), ప్రతిభాస్వరాలు(గ్రంథ సమీక్షలు), సుహృల్లేఖ(లేఖా సంపుటి), పరిష్కారం(కథాసంపుటి), నానీ కవుల డైరెక్టరీ, అవలోకనం(గ్రంథ సమీక్షలు), మధురాక్షరి (వ్యాస సంపుటి), అంతర్వాహిని( సాహితీవేత్తల మనోగతాలు), వివేచనం(సాహిత్య విమర్శ), దిక్సూచి( వచన కవిత్వ కరదీపిక), ఇప్పుడిప్పుడే( కవితా సంపుటి). వీరికి  సాహితీ చంద్ర అనే బిరుదు లభించింది.

ఒక వేయికి పైగా సామాజిక అంశాలపై సంపాదక లేఖలు, పన్నెండు వందలకు పైగా గ్రంథ సమీక్షా వ్యాసాలు, యాభై వరకు కథలు, వందలాదికవితలు, వ్యాసాలు వివిధ ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి.
ఎనిమిది పత్రికలలో కాలమిస్ట్ గా కాలమ్స్ రాసారు. 100 కు పైగా గ్రంథాలకు పీఠికలు రాసారు. 20వరకు గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. దాస్యం సమీక్షలపై గతంలో శాతవాహన విశ్వవిద్యాలయంలో యం.ఎ. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యాంశంగా నిర్ణయించారు.

సాహితీ సంస్థలతో అనుబంధం: తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర కోశాధికారి, తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పూర్వ అధ్యక్షులు( కరీంనగర్ జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య) సాహితీ గౌతమి, పలు సాహితీ సంస్థలకు సలహాదారునిగా పనిచేసారు.

పురస్కారాలు: అమృతలత జీవన సాఫల్య పురస్కారం, ప్రజాభారతి విశిష్ట సాహితీ పురస్కారం, డాక్టర్ బొద్దుల వెంకటేశం అత్యున్నత విశిష్ట సాహితీ పురస్కారంతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఓ యాభై వరకు పురస్కారాలు, ప్రభుత్వం ద్వారా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంతో పాటు సాహితీ, విద్యారంగాలలో ఓ యాభై వరకు పురస్కారాలు అందుకోవడం జరిగింది.

వీరి నాన్న గారి పేరున దాస్యం వెంకటస్వామి స్మారక రాష్ట్ర స్థాయి సాహితీ పురస్కారం ప్రతి ఏటా పదేళ్ళుగా ఇవ్వడం జరుగుతోంది. సి.నా.రే. వాగ్భూషణ పురస్కారం గత నాలుగేళ్ళుగా ఇవ్వడం జరుగుతున్నది.
నేటి కవిత వాట్సాప్ సమూహంలో వేయికి పైగా కవితల సమీక్షలు చేయడం జరిగింది.

ఇక ఇవేళ్టి సభకు వస్తే, 'వచనకవిత్వ రచనలో గుర్తించవలసిన అంశాలు' అనే అంశంపై తీయని గొంతుకతో, స్పష్టమైన పద ఉచ్చారణతో, సెలయేటి గమనంలా ప్రసంగించి శ్రోతలను మెస్మరైజ్ చేశారు. వారు కవిత్వ పరిణామ క్రమాన్ని వివరిస్తూ త్రిపురనేని శ్రీనివాస్ గారి 'కవిత్వం కావాలి 'అనే కవితను చదివి వినిపించారు. కవిత్వం సామాజిక అవసరం అంటారు. ఎంచుకునే వస్తువు పాఠకుల హృదయాలను కదిలించేదిగా వుండాలంటారు. రసం, ధ్వని అలంకారాలూ మాత్రమే సరిపోవనీ, సామాజిక ప్రయోజనం వుండి తీరాలంటారు. కవితకు ముఖ్య ద్వారం శీర్షిక కనుక అది నాటకీయంగా ఉండాలి అంటారు. మీరు వ్రాసే కవిత ఒకరిద్దరినైనా మార్చ గలిగితే కవితాప్రయోజనం సిద్ధించినట్టేనని ఉద్ఘాటించారు. మొత్తానికి వర్తమాన కవులందరికీ వారి ప్రసంగం ఓ విలువైన పాఠం.

తరువాత గీత గారూ, మనోహరరెడ్డి గారూ వారి ప్రసంగాన్ని సమీక్షించి ధన్యవాదాలు సమర్పించారు. శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు సేనాపతి గారి గురించి ప్రసంగిస్తూ వారు లేఖలతో ప్రారంభించి, తదుపరి సమీక్షలూ, కథలూ, కవితలూ వ్రాస్తూ అత్యున్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. తదుపరి శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారి ఆధ్వర్యంలో కవిసమ్మేళనం ప్రారంభమైంది. ఈసారి విశేషమేమంటే ప్రతి ఒక్కరి కవితనూ ఒకరిద్దరు సమీక్షించడం! కవిసమ్మేళన ప్రయోజనం సార్ధకతను సంతరించుకుంది.

తొలిగా గీతగారు తన 'వాన స్వాగతం' కవితలో వర్షమొచ్చేటప్పుడు ప్రకృతి వర్ణన దేవులపల్లి వారిని జ్ఞాపకం చేసింది. తడిసిన మట్టి ముద్దలను మనసు పరిమళంతో పోల్చడం ఎంత అందంగా వుందో!

గతనెలలోని కవితలలో ఉత్తమమైనదిగా పద్మశ్రీ చెన్నోజ్వల గారి 'వెనుకంజ ' ఉత్తమమైనదిగా గీతామాధవి గారు ప్రకటించి పద్మశ్రీ గారికి అభినందనలు తెలియజేసారు.

శ్రీ గంటా మనోహర్ రెడ్డిగారు 'వెంకన్న స్వామిపై స్వామి ఇబ్బందులను హాస్యస్ఫోరకంగా, భక్తి భావం చిప్పిలేలా చదివారు. ఈ కవితను అయ్యల సోమయాజులు గారు సమీక్ష చెందారు. శ్రీ మోటూరి నారాయణరావు గారు 'బలిపీఠం 'అనే కవితలో కలకత్తా అత్యాచార ఉదంతాన్ని ఆర్ద్రం గా వివరించారు ఈ కవితను గీతగారూ, వెంకటరత్నం గారూ సమీక్షించారు. శ్రీ వెంకటరత్నం గారు 'తన సీతాయి బొట్టు ' అనే కవితలో తల్లి తనబిడ్డ పెంపకాన్ని గురించి వివరించారు. దిష్టి బొట్టుకూ సీతాయి బొట్టు అని కనుమరుగౌతున్న సాంప్రదాయ పదాన్ని తిరిగి వినిపించడం సంతోషం! ఈ కవితను శ్రీ గౌరీపతి శాస్త్రి గారు సమీక్షించారు. శ్రీ చిత్తాబత్తిన వీర రాఘవులు గారు 'ఎక్కడ నీ చిరునామా' అని మానవత్వాన్ని ప్రశ్నించగా, శ్రీ గౌరీపతి శాస్త్రి గారు 'భారతమ్మా చెప్పమ్మా'అంటూ అందంగా చెప్పారు వారణాసి భానుమూర్తిగారు సమీక్షించారు. శ్రీ అయ్యాలరాజు సోమయాజుల ప్రసాద్ గారూ,లగిశెట్టి రాము గారూ భానుమూర్తిగారూ కలకత్తా అత్యాచారాన్ని హృదయ విదారకంగా వివరిస్తూ మగాడి బాధ్యతలను గుర్తు చేశారు ఈ కవితలపై వారుసగా గీతగారు, సాధనాలగారూ సమీక్షించారు. శ్రీమతి దేశ్పాండే గారు ' చీపురు ' అనే తమ కవితలో చీపురును స్త్రీ తోనూ లక్ష్మీ దేవితోనూ పోలుస్తూ అది చేసే సేవను వర్ణిస్తూ హాస్యాన్ని పండించారు, గీత గారూ, నేనూ ఆ కవితను సమీక్షించాము. శ్రీమతి అవధానం అమృతవల్లిగారు స్టీ ఔన్నత్యాన్ని అందంగా చెప్పగా గీతగారు,శ్రీ సేనాపతి గారూ సమీక్షించారు. శ్రీ దాస్యం సేనాపతి గారు "లేడీ టీచర్ 'అనే తమ కవితలో టీచర్ యొక్క బాధ్యత, అవిశ్రాంత సేవ, వారి అంకితభావం గురించి విశిష్టమైన రీతిలో గానం చేశారు. గీతగారు సమీక్ష చేశారు. శ్రీ సాధనాల వెంకటస్వామి నాయుడు గారు 'బాధ్యత లేని బాంధవ్యం’ అనే శీర్షికలో ఈనాటి యువత బాధ్యతా రాహిత్యం ఎలా విడాకులకు దారి తీస్తున్నదో బాధగా వివరించారు. శ్రీ శ్రీనివాస్ గారు మన 78 ఏళ్ల స్వాతంత్య్రం గురించి ఘంటసాలవారి కంచుకంఠంతో శ్రావ్యంగా పాడి వినిపించారు. శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు తెలుగుతల్లికి వందనం అంటూ భారతమాతకు కాళ్ళు కడిగి నెత్తిపై చల్లుకుని వారి భక్తిని ప్రకటించగా నేను సమీక్షించాను. శ్రీ అంబటి నారాయణ గారు 'ఆదిమానవులం' అంటూ మానవత్వం నశించిన మానవుడికన్న వారే మేలు అన్నారు. ప్రసాదరావు రామాయణం అనే నేను మనసమాజంలోని రుగ్మతలను చీపురుతో చిమ్మేస్తాను అంటూ 'నాకో చీపురు కావాలి' ఇస్తావా నేస్తం అంటూ విమర్శనాత్మక కవితను గానించాను. గీత గారు సమీక్షించారు. శ్రీ రఘునందన్ గారు 'నా బాల్యం నాకు కావాలిప్పుడు' అంటూ బాల్యంలోని మధురిమను చెబుతూ ఈనాటి వ్యవస్థలో బాల్యం కూడా అంగడి సరుకై అమ్మబడుతున్నదని విచారం వ్యక్తం చేశారు.గీత గారు సమీక్షించారు. శ్రీమతి సి.రమాదేవిగారూ,రాధికా శ్యామగారు కూడా తమ కవితలను వినిపించారు.

డా.గీతామాధవి గారు తమ ముగింపు ప్రసంగంలో వచ్చే సమావేశం వార్షిక సమావేశంగా అత్యంత సుందరంగా ఉండబోతుంది అంటూ తీయని కబురుని తెలిపారు. వచ్చేనెల సమావేశంలో విడుదల కానున్న వీక్షణం 12వ వార్షిక సంచిక కోసం రచనలకు ఆహ్వానం పలుకుతూ రచనలను వీక్షణం వాట్సాపు గ్రూపులో పోస్తూ చేయవలసినదిగా విజ్జప్తి చేశారు. రచనలు చేరవలసిన చివరి తేదీ సెప్టెంబరు 5, 2024.

మొత్తం మీద ఉద్దండులైన కవులతో ఆద్యంతం రసవత్తరంగా సాగింది ఈనాటి సభ. సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశం గీతగారి వందన సమర్పణతో ముగిసింది. ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

Posted in September 2024, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!