Menu Close
వీక్షణం-143 వ సాహితీ సమావేశం
-- వరూధిని --
vikshanam-143

వీక్షణం సాహితీ గవాక్షం 143వ అంతర్జాల సమావేశం జూలై 12, 2024న అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశానికి శ్రీ మృత్యుంజయుడు తాటిపాముల గారు అధ్యక్షత వహించగా, వీక్షణం అధ్యక్షులు  డా.గీతామాధవి గారి కథాపఠనం జరిగింది. తరువాత ప్రపంచ తెలుగు కవుల కవి సమ్మేళనం జరిగింది. అలాగే ఈ సమావేశంలో ఆత్మీయ ప్రసంగం చెయ్యడానికి శ్రీ కొప్పర్తి రాంబాబు ప్రత్యేకంగా విచ్చేసారు. ముందుగా సభాధ్యక్షులు మృత్యుంజయుడు గారు గీతగారిని, రాంబాబు గారిని సభకు పరిచయం చేసి, ఈవేళ గీతగారు చదవబోతున్న కథ గురించి తనకు తెలిసిన విశేషాలు తెలియజేసారు. ముఖ్యంగా "ఊరి గ్రంథాలయంలోకి వెళ్లాలంటే పెరట్లో జామచెట్టెక్కి దుమకాలి" అనేది తనకు బాగా నచ్చిన అంశమని పేర్కొన్నారు. పుస్తకాలకు అంత దగ్గరగా గడపడం వల్లనే గీతగారు అద్భుతంగా రచనలు చెయ్యగలుగుతారని అన్నారు.

ముందుగా అతిథుల్ని సభకు పరిచయం చేసారు.

గీతగారు అందరికీ తెలిసిన వ్యక్తి. అయినా సంక్షిప్త పరిచయం. అంటూ "గీతగారు కవయిత్రి, రచయిత్రి, గాయని, భాషా నిపుణులు. “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపక సంపాదకులు. కాలిఫోర్నియాలో నివాసం ఉంటూ, అమెరికాలో సాఫ్ట్ వేర్ ఫీల్డులో "తెలుగు భాషా నిపుణురాలి" గా పనిచేస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషాశాస్త్రంలో పిహెచ్.డి, అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో ఎం.ఎస్ చేశారు. పది సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. 2006లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి "ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు" పొందారు. ద్రవ భాష (2001), శీత సుమాలు (2006), శతాబ్ది వెన్నెల (2013) , సెలయేటి దివిటీ (2017), అసింట (2022)  కవితా సంపుటాలు, సిలికాన్ లోయ సాక్షిగా (2018) కథా సంపుటి, వెనుతిరగని వెన్నెల (2021) నవల, At The Heart of Silicon Valley -Short stories (2023), Centenary Moonlight and Other Poems (2023) ప్రచురింపబడ్డాయి. "అపరాజిత"- గత ముప్ఫైయ్యేళ్ళ స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకత్వం వహించి ప్రచురించారు. కవిత్వంలో అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం మొ.న అవార్డులు, నవలకు తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ సాహితీ పురస్కారాల్ని పొందారు." అన్నారు.

ఇక కొప్పర్తి రాంబాబు గారు పుట్టింది గుంటూరు జిల్లా తెనాలి తాలూకా దుగ్గిరాల గ్రామంలో. పెరిగింది చదువుకున్నది ఆంధ్రా ప్యారిస్ తెనాలి. విద్యాభ్యాసం తెనాలి, కొల్లూరు గ్రామాల్లో. తెనాలిలో చలం, కొడవటి గంటి వంటి ప్రముఖ రచయితలు తిరుగాడిన వీథుల్లో తిరుగుతూ పెరిగారు. సాహిత్య సాంస్కృతిక కేంద్రమైన తెనాలిలోని వారి ఇంట్లో వారి నాన్నగారి ప్రోత్సాహం వల్ల, ఆయనకు గల సాహిత్య నేపథ్యం వల్ల రాంబాబు గారికి సాహిత్యం పట్ల ఆసక్తి మరింత పెరిగింది. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు. నాలుగు దశాబ్దాల పాటు ఉద్యోగ జీవితంలో  ఎప్పుడూ పుస్తక పఠనం వదిలిపెట్టలేదు. "కొప్పర్తి కథావాహిని" వీరి ఆడియో కథల ఛానెల్. యూ ట్యూబ్ లో వీరి ప్రసంగాలు వినవచ్చు." అని పరిచయాలు ముగించి గీతగారిని కథాపఠనానికి ఆహ్వానించారు.

తరువాత గీత గారి కథపఠనం జరిగింది. ఇది లేఖా రూపంలో రాసిన కథ అని పేర్కొంటూ కథని ప్రారంభించారు గీత. కథ పేరు "మా ఊరు చూడాలని ఉందా?". కథలో అడుగడుగునా తమ ఊళ్ళో తన చిన్ననాటి ఊరిని కళ్ళకు కట్టినట్టు రాసారు. సభలోని వారు కథ యావత్తూ ఆసక్తిదాయకంగా విని ఆస్వాదించారు.

ఆ తరువాత ఈ కథలో పలు భాషా, సాహిత్య అంశాలను, విశేషాంశాలను ప్రస్తావిస్తూ రాంబాబు గారు చక్కని విశ్లేషణ చేసారు. "ఇందులో రచయిత్రి తన ఊరి సంగతులు చెప్తున్నట్లుగా అనిపించినా, ఈ కథ చదివి తమ ఊరిని గుర్తు తెచ్చుకొని వారుండరు" అంటూ "ఉదాహరణకి ఇక్కడ ఇస్తున్న వాక్యాల్ని చూడండి-

"నాకు తెలిసిన నా చిన్ననాటి అందమైన ఊరు ఇప్పుడు లేదు. అయినా నేను వెళ్లినపుడు చూడాలనుకునేవి నా చిన్నప్పుడు మేం నివసించిన ఇళ్ళు, వీథులు."

"బయటి నించి ఇట్టే తీసెయ్యగల చెక్క గెడ ద్వారం దాటి ఆవరణలో అడుగుపెడ్తే ఒక పక్కగా కాకులు, పిచుకలు సావాసం చేసే పెద్ద వేపచెట్టు. చెట్టు కింద వేప పళ్ళు విరగరాలి ఉండేవి. పిల్లలమైన మేం ఏవీ తోచనప్పుడు వాటిని కూడా వదిలేవాళ్ళం కాదు. గింజ తగలకుండా ఒక్క జుర్రుతో చప్పున జుమికి ఊసేస్తే చేదు మాయమై తియ్యగానే ఉండేవి."

"కార్తీక మాసం లో తప్ప పెద్దగా శోభ లేని, శ్రీ కాళముల నిలయమైన శివాలయం, వేదమంత్రాల ఘోష, వెలిగి పోతున్న రథం, పరుగెత్తే పూజారి గారితో బాటూ ఊరంతా గంటలో తిరిగొచ్చే దేవుడి పల్లకీ. ఎత్తైన ధ్వజస్తంభం, అభయమిచ్చే గరుత్మంతుడు, రాముడితో బాటూ మనకీ నమస్కరిస్తున్నట్టున్న ఆంజనేయుడూ.. సీతమ్మ వారి వైపు అందరిలో చూస్తే బావుండదని తనలో తాను మందస్మితం చేసే రాముల వారు…పూజారి గారి భార్య చివర్లో చేతిన వేసే చిట్టి చిట్టి బియ్యపు అప్పాల ప్రసాదం."

"నంది వీధిలో మా అమ్మమ్మ గారింట్లో ఉప్పునీటి బావి పళ్లాన్ని ఆనుకుని ఎర్ర జాంచెట్టు, ఇంటినల్లుకుని బ్రహాండమైన సువాసన వెదజల్లే రాధాకృష్ణ తీగె దాటితే, చిన్నవయసులో శివైక్యం చెందినా చెక్కుచెదరని మా తాతయ్య వెంకట రమణ గారి పందిరి మంచం, అమ్మమ్మకిష్టమైన రంగం పెట్టె, ఎప్పుడెళ్ళినా భోజనం సిద్ధంగా ఉండే వేణమ్మ అత్తయ్యగారిల్లు."

"ఒకే నీటికి నాలుగు రేవులెందుకో అర్థం కాని చెరువు గట్టున బుర్ర మీసాల చెరువు కాపరి. మాలపేట రేవు, శూద్రుల రేవు, బ్రాహ్మల రేవు, బ్రహ్మం గారి మఠం రేవు."

"మా పెరటి గోడనానుకుని ఉన్న ఊరి గ్రంథాలయంలోకి వెళ్లాలంటే మా దొడ్లో జామచెట్టెక్కి దుమికితే సరి!"

"దాటితే మూలకి సాంబ్రాణి పొగ ఎగజిమ్మే గాజులమ్మ ఇల్లు. ఆవిడ భర్త బస్టాండులో ఎర్ర దుస్తుల కూలీ అయినా, పిల్లలందరం మొదటగా ఆమె గాజులకి దణ్ణం పెట్టుకుంటేనే పరీక్షల్లో ఫస్టు మార్కులొచ్చేది."

"ఈ పక్కన అయ్యరు గారి శాకాహార భోజనం హోటల్, నాలుగడుగుల్లో మాంసాహార మిలట్రీ హోటలు, ఎదురుగా ఎన్నాళ్లుగానో మేం ఎప్పుడెప్పుడు చదివి పెద్దవుదామా అని ఎదురు చూసే హైస్కూలు. గేటు బయట అమ్మే బఠానీలు, తేగలు, ఉప్పూ, కారం పెట్టిన పుల్ల నారింజ  చిప్పలు అమ్మే బుట్టల వాళ్ళు. "

"సరుకుల కోసం చిట్టీ పట్టుకొచ్చి గంటల తరబడి వేచి చూడాల్సిన కిరాణా దుకాణం. ఎంతసేపైతే ఏం? చివర్లో పిల్లకాయల చేతిన పుట్నాల పప్పో, బెల్లం ముక్కో కొసరుగా విసురుతారుగా మరి!"

"దార్లో కొనుక్కోమని ఇచ్చిన పావలాతో సేమ్యా, సబ్జా గింజల రంగుల నీళ్ల పాయసం కొనుక్కు తినాల్సిందే. ఇప్పట్లా దుమ్మూ, ధూళీ ఉంటాయని ఆరోగ్యసూత్రాలు ఏవీ ఉండేవీ కావు, ఉన్నా ఎవరి బుర్రలకీ ఎక్కేవీ కావు."

"ఊరంతా తిరగడానికి బయలుదేరే సంక్రాంతి సంబరాల బండ్ల కోలాహలాలు ఇక్కడే మొదలయ్యేవి. సంబరాల్లో తొలిగా వచ్చే గరగలకి దణ్ణం పెట్టుకుంటేనే అప్పట్లో ఊరంతా అలుముకునే ఆటలమ్మ, మశూచి వ్యాథులు తగ్గేది. తరువాత వరసగా పులివేషం, శక్తి వేషం, ఏసుక్రీస్తు, రామలక్ష్మణులు, హరిదాసు, ఎరుకుల సానులు, తప్పెటగుళ్లు, కోలాటం, చివరగా మొగుడూ, పెళ్ళాల హాస్యపు కీచులాట. "

"సెంటరులోకి నడిచొచ్చి హైవే దాటి ఇటొస్తే కొత్త ఊరు. ఒకప్పటి పంట పొలాల్ని ప్లాట్లు చేస్తే మొలిచిన శ్రీ రామ్ నగర్. మొదటి వీథిలో ఉన్న పోస్టాఫీసు, కొత్త సినిమా హాలుకి వెనకగా, రెండో వీథిలో చివర ఇల్లుగా,  అందంగా కనబడుతున్న తెల్ల సున్నపు కొత్త డాబాయే మా ఇల్లు.

సెంటర్లో తాజాగా తాపేశ్వరం కాజా దుకాణం, దేవరపల్లి వారి బెల్లం మిఠాయి, కొత్తగా పెట్టి ఊరిని ఊపేస్తున్న సేటు మిఠాయికొట్టు, పక్కనే రుచి చూసి తీరాల్సిన వల్లీబాబు గారి ద్రాక్ష జ్యూసు దుకాణం."

"డాబా మీదికి పాకిన సన్నజాజి పందిరి దాపున గూడు చేసుకుని ఎప్పుడు చూసినా తెల్ల కాగితాన్ని నలుపు చేసే బక్క పలుచని పదహారేళ్ల అమ్మాయినే నేను. గోధూళి వేళ వీథి చివర నించి మేకపిల్లల్ని మలుపు తిరిగే వరకూ చూస్తే అందమైన గులాబీలు పూయించే చిట్టచివరి ఇల్లు డ్రాయింగ్ మేష్టారి ఇల్లు. దాటితే చెరుకు తోటలు. ఆకతాయి కుర్ర ప్రేమ జంటలకి మేష్టారి కంటబడకుండా కాపలా కాసేది ఆ గట్టునే." అంటూ వాక్యాల్లో భావ గర్భితంగా దాక్కున్న అనేక స్థానిక అంశాల్ని తెలియజేసారు.

సభలో వున్న వారిలో గీతగారిని చిన్నప్పటి నించి ఎరిగున్న వారు, ఇతరులు ప్రశంసలు కురిపించారు. సాధనాల వెంకట స్వామి నాయుడు గారు అప్పటి జ్ఞాపకాల్ని కళ్ళ ముందుంచుతూ, ఈ కథ ఆనందభాష్పాలు తెప్పించిందని ఉద్వేగంగా మాట్లాడారు. కందుకూరి శ్రీరాములు గారు, ప్రసాదరావు గోగినేని గారు మున్నగువారు కథలోని అనేక అంశాలను ప్రశంసించారు.

తరువాత గీతగారు జూన్ మాసపు ఫేస్బుక్ కవితా విజేతని ప్రకటించి అభినందించారు. నాగిశెట్టి నాయుడు తమ నాగిశెట్టి నానీలకు గాను ఈ నెల విజేతగా నిలిచారు.

తరువాత శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీమతి రాధాకుసుమ గార్ల ఆధ్వర్యంలో కవిసమ్మేళనం ఉత్కంఠభరితంగా కొనసాగింది. మొదట డా||కె.గీతగారు తమ ఊరి విశేషాలతోనే తన కవిత్వ యాత్ర ప్రారంభమైందని గుర్తు చేసుకుంటూ తన మొదటి కవిత "ఓ రోజంతా" తో ప్రారంభించారు. ఆ తర్వాత దాలి వైశ్యరాజుగారు ఒక పేరడీ గీతాన్ని పాడి అలరించారు. ఆ తరువాత మోటూరు నారాయణ రావు, అరుణ కోదాటి, రాజేంద్రప్రసాద్, డా.రాధాకుసుమ, ప్రసాదరావు రామాయణం, పిళ్ళా వెంకట రమణ మూర్తి మల్కని విజయలక్ష్మి, అమృతవల్లి, రాధికాసూరి, శ్రీసుధ కొలచన, పద్మజ చెన్నోజ్వల, దామరాజు విశాలాక్షి, మేడిశెట్టి యోగేశ్వరరావు, మహా, మల్లాముల కనకయ్య, దేవులపల్లి పద్మజ, కృష్ణదాసు, తూముల శ్రీనివాస్, ఉప్పలపాటి వెంకట రత్నం గార్లు మొదలైన వారు తమ కవితాగానాన్ని వినిపించారు.

సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశం గీతగారి వందన సమర్పణతో ముగిసింది. ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

Posted in August 2024, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!