Menu Close
వీక్షణం-142 వ సాహితీ సమావేశం
-- ప్రసాదరావు రామాయణం --
vikshanam-142

వీక్షణం సాహితీ గవాక్షం 142వ అంతర్జాల సమావేశం జూన్,14 2024న ఆసక్తిదాయకంగా జరిగింది. వీక్షణం సాహితీ గవాక్షం రథసారథి డా.గీతామాధవి గారి ఆధ్వర్యాన ఈసారి శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా గారి 'ఆవలివైపు' కవితా సంపుటి ఆవిష్కరణ జరపడం నూతనత్వాన్ని సంతరించుకుంది. తరువాత ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనం జరిగింది.

ముందుగా గీతగారు వీక్షణం మిత్రులు, ప్రముఖ విద్యావేత్త, సాహిత్యకారులు, వక్త శ్రీ టి.పి.యన్ ఆచార్యులు గారికి నివాళులు అర్పిస్తూ, వారితో వీక్షణానికున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తరువాత వారి మృతికి సంతాపం తెలుపుతూ సభ ఓ నిమిషం మౌనం వహించింది.

తర్వాత గీతగారి స్వాగత వచనాలతో పుస్తక రచయిత శ్రీధర్ రెడ్డిగారినీ, ఆ కవితా సంపుటి ఆవిష్కరణ చేయవలసిందిగా శ్రీ దాలి వైశ్యరాజు గారినీ, పుస్తక సమీక్షకై శ్రీమతి స్వాతి శ్రీపాద గారినీ, ఆత్మీయ వాక్యాలు పలుకవలసిందిగా రామాయణం ప్రసాదరావు గారినీ వేదికపైకి ఆహ్వానించారు.

ముందుగా దాలి వైశ్యరాజు గారు ఆవిష్కరణ చేస్తూ శ్రీధర్ రెడ్డిగారితో తనకున్న ఆత్మీయతను వెలిబుచ్చారు. తామిద్దరూ కవిత్వాన్ని గురించి ప్రతిరోజూ చర్చించుకుంటూ, నేర్చుకుంటూ ముందుకు వెళ్లే సన్మిత్రులమని అన్నారు. శ్రీధర్ రెడ్డిగారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసారు.

తరువాత స్వాతి శ్రీపాదగారు 'ఆవలివైపు' కవితా సంపుటిలోని ప్రతి ఒక్క కవితను ఉటంకిస్తూ దానిలోని వైశిష్ట్యాన్ని తమ మధురమైన కంఠంతో వివరిస్తుంటే అందరూ మంత్రముగ్ధులై విన్నారు.

రామాయణం ప్రసాదరావు గారు మాట్లాడుతూ, తనకు మిత్రులూ, అత్యంత ఆత్మీయులూ అయిన శ్రీధర్ రెడ్డిగారి విశిష్ట గుణ గుణాలను వివరించారు. వారి రచనలు తపస్యాశ్రమంలోని మునికన్యకలా ఏ అలంకారాలూ, ఆభరణాలూ లేక సహజ సౌందర్యంతో ఉంటాయి. అలతి పదాలతో భావగంభీరతను కప్పుకుని ఎలా ఉంటాయో వివరించారు. కొన్ని అందమైన కోట్స్ ని చదివి వినిపించారు.

తదుపరి శ్రీ శ్రీధర్ రెడ్డిగారు తన ధన్యవాదపలుకులలో తన గ్రామీణ నేపథ్యాన్ని వివరిస్తూ అటు దక్షిణవాదాన్నీ, ఇటు వామ వాదాన్నీ తార్కికంగా ఆలోచించి తనదైన దృక్పథాన్ని తన కవితలలో చూపానని తన గంభీరమైన స్వరంతో ప్రసంగిస్తుంటే శ్రోతలు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన కవితాభ్యున్నతికి కారణమైన గీతగారికి, వీక్షణం వేదికకి కృతజ్ఞతలు తెలియజేసారు.

గీతగారు మాట్లాడుతూ శ్రీధర్ రెడ్డి తనకు “వీక్షణం” ప్రసాదించిన సహోదరుడని అంటూ, "గత దశాబ్ది కాలంగా కాలిఫోర్నియాలో కవిత్వ వ్యవసాయం చేస్తున్నవాడు, పాఠకుల మనస్సుల్లో ఆలోచనల విత్తనాలు జల్లి, అద్భుతమైన కవిత్వాన్ని పండిస్తున్నవాడు, అది వచనకవితైనా, పద్యమైనా అలవోకగా రాయడం అతనికి పరిపాటి." అన్నారు. శ్రీధర్ వీక్షణం ద్వారా కవిత్వానికి పరిచయమై కవిగా రెండు పుస్తకాలు వెలువరించడం ఎంతో ఆనందదాయకమని ఆనందాన్ని వెలిబుస్తూ, అభినందనలు తెలియజేసారు. శ్రీధర్ కవిత "రంగు రంగుల చిలక" ను సభకు చదివి వినిపించారు.

ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి కవితలు కొన్ని ఇక్కడ చూద్దాం.

"నీకు సిరినిచ్చు కొను స్థాయి నాకు లేదు
నీ భుజబలము రూపింప నిమడలేను
కొంత కొఱతయో ‘వాణి’ నీ చెంతలేక,
పొత్త మిచ్చుచుంటిని తాత! పుచ్చుకొనుడు"

"పుడమిని చీల్చు కుంటూ
పాపాల మూట పైకి లేచింది
పశ్చాత్తాపదగ్ధ ఒక్క కన్నీటిబొట్టు
ఆ బరువును సమం చేసింది! "

“భళ్ళుమంటూ పగిలింది నీటికుండ
కనుల లోపల నున్న నీటికుండ!”

"ఏ రెక్కలూ లేకున్నా
ఏడేడు సాగరాలు ఎగిరెళ్ళి
ఊరిస్తున్న జ్ఞాపకాలతో
ఊరిలో వాలిపోయా”

“అగ్గిపెట్టుందా?
సిగరెట్టుందా ?
అలాగే ఓ తుపాకీ!”
...........
“ఈ తుపాకీ సంస్కృ తి
తన దేహన్నే దహించి వేస్తున్న క్యాన్సర్ కణితి”

“మనిషి?
ఉన్ననాడు క్యాపిటలిస్టు
లేనినాడు కమ్యూనిస్టు!”

“ఎన్ని ఘోరాలు విన్నా
నేనెన్నడూ ఏడవలేదు
సున్నితత్వం నశించిన
పాషాణ హృదయుడను కదా !
అందుకేనేమో.. నా బదులు
నా కలం సిరా కరిగి
వలవలా కన్నీరు కారుస్తోంది”

తదుపరి శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీమతి రాధాకుసుమ గార్ల ఆధ్వర్యంలో కవిసమ్మేళనం ప్రారంభమై ఉద్దండులైన కవులతో ఉత్కంఠభరితంగా కొనసాగింది.

మొదట డా||కె.గీతగారు తన కవిత 'కలల కరపత్రం' తో ప్రారంభించారు. యుద్ధ రాజకీయ నేపథ్యంలో రాసిన వాడి, వేడైన కవిత ఇది. తరువాత శ్రీధర్ రెడ్డి గారు వాసన, కమురు వాసన, గంజాయి వాసన, కడుపులో బిడ్డ రాగలదా వచ్చి మనగలదా అంటూ అద్భుతమైన కవిత వినిపించారు. శ్రీ వసీరా గారు ప్రపంచాన్ని ఓ విత్తనంతో పోలుస్తూ అద్భుతమైన కవితను వినిపించారు.

రాణీ ప్రసాద్ గారు 'నమ్మకద్రోహి' అనే కవితను వినిపించగా దాలి వైశ్యరాజుగారు ఒక పేరడీ గీతాన్ని పాడి అలరించారు. మోటూరు నారాయణ రావు గారు ఆశల మొలక అమ్మంటూ పాడగా, అరుణ కోదాటిగారు పుస్తకం యొక్క ప్రాధాన్యతను వివరించారు. శ్రీ గుళ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు 'కలాలు కదిలితేనే' అంటూ తన శ్రావ్యమైన కంఠంతో కవితల ప్రాముఖ్యతను వినిపించారు. దేవీ గాయత్రి గారు నిరుద్యోగ గీతం బాధగా పాడగా డా.రాధాకుసుమ గారు తన 'దినచర్య' కవితలో ఆరోగ్య సూత్రాలు ఇంపుగా తన తీయని గాత్రంలో సొంపుగా చెప్పారు.

శ్రీ ఆళ్ల నాగేశ్వరరావు 'మా నాన్న' కవితలో తనకూ వారి నాన్నగారికి ఉన్న అనుబంధాన్ని కనులు చెమర్చేలా వినిపించారు. 'కవితా నా కవితా' అంటూ గుర్రం మల్లేశం గారు చక్కని సీసపద్యం పాడారు. కోసూరి జయసుధ గారు పెంపకం అనే తన కవితలో చక్కని అలంకారాలతో, కమ్మని భావుకతతో, అందమైన పదవిన్యాసంతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రసాదరావు రామాయణం అనే నేను 'అమ్మలూ నాన్నలూ జరజాగ్రత్త' అంటూ ఈనాటి యువత వక్రమార్గాలు పట్టడానికి తలిదంద్రుల బాధ్యత కూడా ఉన్నదంటూ కాస్త జాగ్రత్త అని హెచ్చరించాను.

శ్రీ ఆది మోపిదేవి 'నువ్వు చెయ్యలేని మోసం' అనే కవితలో భార్యచే మోసగించబడిన భర్త ఆవేదనను కాస్త ఆగ్రహాన్ని మిళితం చేసి వినిపించారు. ఇది అందరినీ ఆకట్టుకున్న కవిత.

ఆచార్య అయ్యలరాజు సోమయాజులు గారు ఓ మాతృమూర్తి ఆవేదనను వినిపించగా శ్రోతల కళ్ళు చెమరించాయి. పరిమి సత్యమూర్తి గారు దేశంలో లౌకిక వాదం ఎంత అవసరమో వివరించగా, డా. చీదెళ్ల సీతాలక్ష్మి గారు మెత్తని దిండు అవసరాన్ని హాస్యస్ఫోరకంగా తనకవితలో చదివి అందరినీ నవ్వించారు. శ్రీ పిళ్ళా వెంకట రమణ మూర్తిగారు తన 'రంగస్థల విషాదం' కవితలో జీవిత సత్యాలను చెప్పారు. దేవులపల్లి పద్మజగారు 'నాన్న’ అనే అంశంపై చక్కని పద్యాలను చదివారు. అదే అంశంపై లలితా వర్మ గారు కూడా మంచి కవితను గానించారు. రేపాక రఘునందన్ గారు 'వృద్ధాశ్రమ గీతం' అంటూ చదివిన కవితలోని పదబంధం, భావుకత అందరినీ ఆకట్టుకున్నాయి. బ్రతుకు కమురు వాసన, జ్ఞాపకాలు తడిసిన మట్టి వాసన అనడం గొప్పగా అనిపించింది. వైరాగ్యం ప్రభాకర్ గారు 'ఇప్పటికీ నాకింకా గుర్తుంది', చిత్తాబత్తిన వీర రాఘవులు గారి 'ప్రశ్న' కవితలు బావున్నాయి. ఆలపాటి సత్యవతి గారి 'అక్షరాలు' కవితతో అలరించగా చెన్నోజ్వల గారి స్వరాంబుధి వీనుల విందుగావుండినది. భారతి రామచంద్రుని గారు జయము జయము అంటూ మన దేశ సౌందర్యాన్ని చక్కని భాషావిన్యాసంతో అందంగా వివరించారు. అద్భుతమైన కవిత. విశాలాక్షిగారు వర్తమాన సామాజిక పరిస్థితులను ఉటంకిస్తూ తస్మాత్ జాగ్రత అంటూ సూచనా కవితను వినిపించారు.

మేడిశెట్టి యోగేశ్వరరావుగారు మావూర్లో వాన వచ్చింది అనే అందమైన కవితను వినిపించగా, రాధాకుసుమ గారు మావూళ్లోనూ వాన వచ్చింది మమ్ము భ్రష్ఠు పట్టించిందీ అని నవ్వించారు.

మొండ్రెడ్డి సత్యవీణగారు తన 'అపార్ట్ మెంట్' కవితలో దేశాన్ని ఒక అపార్టుమెంటుతో పోలుస్తూ భిన్నత్వంలో ఏకత్వపు అవసరాన్ని నొక్కి చెప్పారు.

గతనెలలోని కవితలలో ఉత్తమ కవితగా మధు జెల్లా గారి 'నా పయనం' బహుమతి పొందింది. వారికి అభినందనలు. సుమారు మూడున్నర గంటల పాటు రసానుభూతి కలిగించిన ఈ సమావేశం గీతగారి తుది పలుకులతో ముగిసింది. ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

Posted in July 2024, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!