వీక్షణం సాహితీ గవాక్షం 141వ అంతర్జాల సమావేశం మే 17వ తేదీ 2024న ఆసక్తిదాయకంగా జరిగింది. ద్వాదశ వర్షాలుగా అప్రతిహతంగా ప్రతినెలా సమావేశాలు జరపడమంటే ఎంతటి కష్టసాధ్యమో చెప్పనవసరం లేదు. డా.గీతామాధవి గారు తన అచంచల కృషి, పట్టుదలతో అది సుసాధ్యం చేసి చూపిస్తున్నారు.
ఇక ఈ నాటి 141వ సమావేశాన్ని రొటీనుకు భిన్నంగా ఇంతకు మునుపు పాల్గొనని క్రొత్త కవుల/ కవయిత్రుల గొంతుకలను ప్రపంచానికి పరిచయం చెయ్యాలనే ఉద్దేశ్యం కడు ముదావహం, ప్రశంసనీయం కూడా. పాత కవులందరమూ శ్రోతలమై పోయాము. కవిసమ్మేళనంలోని ప్రతి కవితపై కొంత చర్చ కూడా జరగడం వలన తమ, తమ కవితలను మెరుగు పరచుకునే అవకాశం రావడం ప్రాధాన్యత, ప్రయోజనం సంతరించుకుంది. ఈ వినూత్న ప్రక్రియకు జోహార్లు.
కార్యక్రమంలో ప్రథమంగా గీతగారు స్వాగత కుసుమాలను మాపై జల్లుతూ, ఈనాటి ముగ్గురు ప్రధాన వక్తలను సభకు పరిచయం చేశారు.
మొదటి వక్త రమేశ్ కార్తీక్ నాయక్(నునావత్ కార్తీక్) గోర్ బంజారాలకి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో సాహిత్య సృజన చేస్తున్న కవి, కథకుడు. అతని ఆంగ్ల రచనలు Exchanges: Journal of Literary Translation - University of IOWA మరియు Poetry at Sangam, Outlook India, Indian periodical, Live Wire, Borderless journal, Nether Quarterly లాంటి జాతీయ అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. బల్దేర్ బండి(కవిత్వ సంపుటి) లోని ఓ కవిత 'జారేర్ బాటి' (జొన్న రొట్టెలు) SR & BGNR GOVT DEGREE ARTS AND SCIENCE COLLEGE, - ఖమ్మంలో పాఠ్యాంశంగా ఉంది. తాజాగా "బల్దేర్ బండి" కవిత్వ సంపుటిని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, M.A తెలుగు రెండవ సంవత్సరం వారికి పాఠ్యాంశంగా చేర్చారు. బల్దేర్ బండి - కవిత్వం, ఢావ్లో గోర్ బంజారా కతలు : కథలు, కేసులా : గోర్ బంజారా కథల సంకలనం ఆచార్య సూర్యాధనంజయ్ గారితో కలిసి సహసంపాదకీయం, ఇద్దరు కలిసి గిరిజన ఆదివాసీ కథలు సేకరిస్తున్నారు. CHAKMAK (ఆంగ్ల కవిత్వ సంపుటి). ఇవి రమేశ్ ప్రచురించిన పుస్తకాలు. రావిశాస్త్రి కథా పురస్కారం, తెలంగాణ రాష్ట్ర స్థాయి పురస్కారం, కలహంస పురస్కారం, నవ స్వరాంజలి పురస్కారం తదితర పురస్కారాలెన్నో ఆయన గెలుచుకున్నారు. ప్రస్తుతం దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో అక్షరం అనే కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
రెండవ వక్త పుప్పాల శ్రీరామ్ సాహితీ మిత్రులకందరికీ పరిచయం ఉన్న పేరే. కవి, విశ్లేషకులు. వర్తమాన వచన కవిత్వ రచన, విమర్శ ప్రస్తావనలో శ్రీరాం గారి పేరు ఉటంకించదగినది. 2018లో అద్వంద్వం అనే వచన కవితా సంపుటి ప్రచురించారు. 2023 లో 1818 అనే దీర్ఘ కవిత ప్రచురించారు. ప్రత్యేకించి వచన కవిత్వ విమర్శ రంగంలో శ్రీరాం పేరు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే అతను రస్తా ఆన్లైన్ పత్రిక లో కొన్నాళ్ళు మలిచూపు అనే శీర్షిక నిర్వహించారు. కవిసంగమం లో అనిల్ డ్యానీతో కలసి 'కవితా ఓ కవితా' ఐదేళ్ళ పాటు కాలం నిర్వహించారు. సారంగ లో 'ఇప్పుడు వీస్తున్న గాలి' పేరిట ఒక శీర్షిక నిర్వహిస్తున్నారు. విమర్శ కవిత్వం రెండింటిలోనూ శ్రీరాం కృషి చేస్తున్నారు.
మూడవ వక్త అనిల్ డ్యాని కవి, రచయిత. పదేళ్లనుంచి కవిత్వం లో ఉన్నారు. మూడు కవితా సంపుటాలు వెలువరించారు. ఎనిమిదో రంగు, స్పెల్లింగ్ మిస్టేక్, గాంధారి వాన అనే మూడు కవితా సంపుటాలను, మిత్రులతో కలిసి ' తీరందాటిన నాలుగు కెరటాలు' అనే పుస్తకాన్ని వెలువరించారు. వందకి పైగా సాహిత్య వ్యాసాలు రాశారు. పెన్నా రచయితల సంఘం, రొట్టమాకు రేవు , అద్దేపల్లి స్మారక పురస్కారం, అరుణ్ సాగర్ యువ పురస్కారం. పల్లా కృష్ణ జాతీయ అవార్డు, వంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. రేడియో, దూరదర్శన్ లలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు, సంగీతం, సాహిత్యం రెండు చాలా చాలా ఇష్టం. సాహిత్యాన్ని పిల్లల లోకి తీసుకు వెళ్లాలని ఆకాంక్ష.
రమేష్ కార్తీక్ నాయక్ గారు గిరిజన సాహిత్యం, దాని ప్రాధాన్యత పై సమగ్రంగా ఉపన్యసించారు. అనాది నించీ గిరిజనుల పట్ల జరిగిన అన్యాయాల్ని పేర్కొంటూ, గిరిజన తెగల భాష, ఆచార వ్యవహారాల్ని అర్థం చేసుకోకుండా సినిమాలు వంటివి నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అలాగే గిరిజన సాహిత్యం అందరికీ అర్థం కాకపోవడానికి తగిన పదకోశాలు ఉండాలని ఉటంకించారు. శ్రీరామ్ పుప్పాల,అనిల్ డ్యాని గార్లు వర్తమాన కవిత్వంపై కొండలపైనుండి క్రిందికి దొర్లిన బండల్లా అనర్గళంగా ఇచ్చిన ఉపన్యాసాలు ఆసక్తిదాయకంగా సాగాయి. ఇప్పటి తరంలో బలంగా రాస్తున్న కవుల, కవయిత్రుల కవిత్వాన్ని తక్కువ చేసి చూడడం తప్పని, ప్రతి ఒక్కరూ చదవి తీరాల్సిన కవిత్వమంటూ, సోదాహరణంగా వివరించారు. ఓ చిన్న సైజు వర్తమానకవిగా నా సందేహానికి జవాబును వారి ఉపన్యాసంలో వెతుక్కున్నాను.
తదుపరి కవిసమ్మేళన కార్యక్రమానికి సీనియర్ కవులు శ్రీ వసీరా గారు, శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గార్ల సంయుక్త సారధ్యంలో రమణీయంగా జరిగింది.
- అమూల్య గారు: వీరిమాతృభాష తెలుగు కాకపోయినా భాష నేర్చుకుని "కన్నుల్లోకి వెన్నుల్లోకి గన్నుల్లా దూసుకు పోయే కవిత్వం కావాలి "అంటూ ముద్దు ముద్దు మాటలతో ఆమె చదివిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు.
- హాతీరాంగారు తన కవితలో తలిదండ్రులు తమ బిజీ జీవితంలో చిన్నారులను పట్టించుకు పోవడం వల్ల పిల్లలు పడే ఆవేదనను కన్నులు చెమర్చేలా కవిత వినిపించారు. వేడుకలన్నీ ప్రేమకు వీడ్కోలు అంటూ ముగించారు.
- ఫణిమాధవి కన్నోజు గారు మానవుడు తన అత్యాశలతో వాతావరణాన్ని ఎలా పాడు చేసాడో తన కవిత 'ఈకో..ఎలిజీ' లో చెప్పారు.
- చిన్నాదేవి గారు వయసుకు వయసు వచ్చేసింది అంటూ తన 'వయసు ఒడిలో' అనే కవితలో బాల్యం నుండి మరణించేవరకు వ్యక్తుల భావాలను కడు రమ్యంగా వివరించారు.
- కాశిరాజుగారు తన కవితలో వాడిన 'వర్ర 'అనే క్రొత్త పదాన్ని వాడారు.
- చంద్రశేఖర్ గారు "హృదయ వీణ' అనే తన కవితలో కడు రమ్యమైన భావాలు మనలో ఎప్పుడు కలుగుతాయో వివరించారు.
- రావుల మల్లేశం గారు ఈనాటి యువతయొక్క భవితను గురించి చక్కగా తన కవితలో వినిపించారు.
- శ్రీమన్నారాయణగారు "జీవితంలో తాళయుక్త రవళి "అనే కవితను రమణీయంగా వినిపించారు.
- స్త్రీ ప్రస్థానం అనే కవితలో శైలజ గారు అమ్మ విశ్రాంతిలేని లేని జీవితాన్ని ఆర్ద్రంగా వివరించారు.
- రమాదేవిగారు మణిపూర్ ఘోరకలిని తమ కవితలో వివరించారు.
- షరీఫ్ గారు ప్లాస్టిక్ భూతాన్ని తమ పద్య కవితలలో చూపారు.
- కోసూరి జయసుధ గారు కుల జాడ్యాన్ని నిర్మూలించి అందరం ఒకే కుండలో నీరమై, ఒకే పక్షి రెక్కల క్రింద ఒదిగిపోదాం అంటూ చక్కని భావుకతతో కవితాగానం చేశారు.
- ఆది మోపిదేవి గారు ఏమనిషిని చూసినా ఏముంది గర్వకారణం అంటూ వర్తమాన రుగ్మతలను ఎత్తి చూపారు. అందరినీ ఆకట్టుకున్న కవిత. (తన కలం పేరు క.మ.ర అంటే కడుపు మండిన రచయితట. అందరం నవ్వుకున్నాం.)
మొత్తంమీద ఈ వినూత్న ప్రక్రియతో సభ విజవంతంగా ముగిసింది.
ఈ సభలో డా||కె.గీతామాధవి, కందుకూరి శ్రీరాములు, వసీరా, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భవాని ముప్పల, అవధానం అమృతవల్లి, పిళ్ళా వెంకట రమణమూర్తి, ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్, రామాయణం ప్రసాదరావు, గౌరీపతి శాస్త్రి కె వి జి ఎస్, మోటూరి నారాయణరావు, డా.కె.శైలజ, జె.వి.కుమార్ చేపూరి, బిట్రవరం సత్యన్నారాయణ, గుర్రం మల్లేశం మొ.న సాహిత్యాభిలాషులు ఎందరో సభకు హాజరయ్యారు.
చివరగా గీతగారి మలిపలుకులతో సభ విజయవంతంగా ముగిసింది.
ఈ సమావేశంలో అమెరికా, భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాహిత్యాభిలాషులు అనేకులు ఆసక్తిగా పాల్గొన్నారు. అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.