ఆ సాయంత్రం కను చీకటిలో సునంద మేడ మీద బాల్కనీలో కూర్చొని ఆకాశంవైపు చూస్తూ దూరాన ఉన్న భర్తను తలుచుకొని దీర్ఘoగా నిట్టూర్చింది.
ఇంతలో అక్కడికి రవి వచ్చాడు.
"ఏంటి వదినా ఇలా ఒక్కదానివే చీకట్లో కూర్చున్నావు ఒంటరిగా. నన్ను రమ్మంటే తోడు వచ్చేవాడ్నిగా" అన్నాడు కాస్త దూరంలో ఉన్న కుర్చీని ఆమె ప్రక్కకు లాక్కొని కూర్చుంటూ. మరిది రాకకు ఉలిక్కిపడి చూసింది సునంద.
"నిన్నెందుకుపిలుస్తాను నీతో నాకేం పని?" విసుగ్గా అంది సునంద.
"పనుంటేనే పిలవాలా? నీకు తోడుగా రమ్మంటే రానూ, అన్నయ్యతో కలిసి ఎంజాయ్ చేసే అదృష్టం ఎలాగూ నీకు ఇప్పట్లో రాదు మరో పది నెలలు పోవాలి" అన్నాడు రవి.
"అయితే ఏమిటటా?"
"అహ ఏమి కాదు అన్నయ్యదా ఆర్మీలో ఉద్యోగం. ఏడాదికి ఒక్కసారి వచ్చి ఓ నెల రోజులు మాత్రమే ఉండి వెళ్తున్నాడు, నువ్వా వెళ్లి అన్నయ్యతో ఉండే వీలులేదు, అంతవరకూ నువ్విలా బాధపడటం నేను చూడలేకపోతున్నాను. నువ్వు 'ఊ' అంటే నేను తోడుగా ఉంటాను కదా!" అన్నాడు రవి ఆమె చేతిని తాకుతూ.
"ఏయ్..రవీ అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? మీ అన్నయ్య దూరంగా ఉన్నంత మాత్రాన నేను నీ తోడును కోరుకుంటానని ఎలా అనుకుంటున్నావు. నాదంత చీప్ క్యారెక్టరనుకున్నావా? నీ హద్దుల్లో నువ్వుండు. నువ్విలా అట్టే విసిగిస్తే మీ అమ్మగార్కి కంప్లైంట్ చేయవలసి వస్తుంది మైండిట్" బెదిరించింది సునంద.
"అంతపని చేయకు. నీ ఇష్టం నీకు ఎప్పుడే సహాయం కావాలన్నా నన్ను అడుగు చేసి పెడతాను. అంతేగానీ ఈ విషయం ఎవరికీ చెప్పకు" అన్నాడు రవి అక్కడ నుంచి నిష్క్రమిస్తూ.
ఓ పది నిమిషాల తరువాత అక్కడకు వచ్చింది అన్నపూర్ణమ్మ.
"సునందా ఏమిటిలా ఒక్కదానివే కూర్చున్నావు వంటయింది భోజనానికి రామ్మా" అంది ఆప్యాయంగా.
"మీరు వెళ్లండత్తయ్యా నేను ఓ పదినిమిషాలు పోయాక వస్తాను" అంది సునంద.
"అయితే సరేనమ్మా! రవి ఆకలి అంటూ ఒకటే గోల పెడుతున్నాడు. వాడు పెళ్లీడు కొచ్చినా ఇంకా చిన్న పిల్లాడి మనస్తత్వం పోలేదు. వాడికన్నీ వాళ్ళ నాన్న పోలికలే. ఆయన బ్రతికి ఉంటే కొడుకును చూసుకొని ఎంత పొంగిపోయేవారో? పెద్దోడు ఆర్మీలో ఉగ్యోగమని వెళ్లిపోవడంతో ఇంటినంతా నా చిన్న కొడుకు రవి చేతుల మీదే చాకచక్యంతో నడుపుకు వస్తున్నాడు. మనకున్న పాతిక ఎకరాల మాగాణీని ఒంటిచేతితో మనుషుల్ని పెట్టి పండిస్తున్నాడు. మంచి సంబంధం చూసి వాడినీ ఓఇంటివాడ్ని చేసెయ్యాల. మీ మామగారే బ్రతికుంటే నాకీ మనస్తాపం ఉండేది కాదమ్మా" అంది అన్నపూర్ణమ్మ చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ.
"సరే అత్తయ్య గారు గతాన్ని తవ్వుకొని బాధ పడకండి. మీకు మేమంతా ఉన్నాం కదా. మీరిద్దరూ భోజనం చేసేయండి. నేను తర్వాత పెట్టుకు తింటాను" అంది సునంద.
"సరే త్వరగా రామ్మా. ఈ చల్లగాలిలో ఎక్కువసేపు ఉన్నాఆరోగ్యానికి అంత మంచిది కాదు" అంటూనే చీర కొంగు తో కళ్ళొత్తుకుంటూ అక్కడ నుంచి వెళ్ళి పోయింది అన్నపూర్ణమ్మ. అత్తగారు వెళ్ళాక ఆమె దీర్ఘoగానిట్టూర్చింది. అసలేంటి తన జీవితం? తను తల్లిదండ్రుల సంతానంలో నాలుగో ఆడపిల్లగా పుట్టడమే తను చేసుకున్న నేరమా? తాను ముప్పతిప్పలు పడి ఇంటర్ వరకూ చదువుకోగలిగింది. ముగ్గురాడపిల్లలకు అతి కష్టంతో పెళ్లిళ్లు చేయగలిగిన తండ్రి నా వరకూ వచ్చేసరికి అలిసిపోయాడు. వీళ్ళు వరకట్నం తీసుకోమన్నారని, అబ్బాయికి ఆర్మీలో ఉద్యోగముందని తలూపి తనను ఈ ఇంటికి కోడలిగా పంపించాడు.
కానీ ఇక్కడ చూస్తే తన పరిస్థితి మరీ దారుణంగా ఉన్నట్టు కనిపిస్తోంది. తన పెళ్లయి ఇప్పటికి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. తన భర్త ఏడాదికి ఒకసారి మాత్రమే వచ్చి ఓ నెల రోజులు ఉండి వెళ్తున్నాడు. తనను కూడా తీసుకెళ్లమని తాను గోలపెట్టడంతో వీలుకాదని అక్కడ తానెప్పుడూ డ్యూటీ లోనే ఉండాల్సి వస్తుందని ఇంటికి వెళ్లే అవకాశం ఉండదని అక్కడికంటే నీకిక్కడే అందరూ తోడుంటారని అనడంతో ఆమె ఇంకేమీ మాటాడలేక పోయింది. ఇక్కడ పరిస్థితి చూస్తే మరిదిగారితో సమస్యగా ఉంది. అయినా ఈ గతుకుల బాటను చూసి నేను భయపడను.
మగవాళ్ళల్లో రెండు రకాలున్నారు. ఒకటి-స్త్రీలకి లొంగిపోయే వాళ్ళు. రెండు-స్త్రీలని లొంగదీసుకోవాలని తపనపడే వాళ్ళు. రవి ఆ రెండో కోణానికి చెందుతాడు. ఈ ప్రపపంచంలో అంతరాత్మకు మించిన ప్రియనేస్తo ఇంకెవరూ ఉండరు. జీవితాన్నిప్రేమించే వాళ్ళని చూసి మృత్యువు ఒణికిస్తుంది. జీవితాన్ని లక్ష్యపెట్టని వాళ్ళముందు మృత్యువు ఆటలు సాగవు, ఏ పురాణ గ్రంధం చదివినా ఏముంది సారాంశం? చెడ్డవాళ్ళు మంచివాళ్లని దోపిడీ చేయడం, హింసించడం, మంచివాళ్ళు కష్టాలు పడి పడి చివరికి ఎదురు తిరిగి వారికి బుద్ధి చెప్పడం. తన పరిస్థితీ ఈ కోవకు చెందినదే, కొన్నాళ్ళు చూసాక రవి తీరుమారక పోతే భర్త నాగేంద్రకు ఫోన్ ద్వారా ఇక్కడ తన పరిస్థితిని తెలియజేయాలని అనుకుంది సునంద.
నాలుగు రోజుల అనంతరం భర్త దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
"హలో..హలో..సునందా" భర్త గొంతు విని తెగ మురిసిపోతోంది సునంద.
" హలో బాగున్నారా నేనింత కాలానికి గుర్తుకొచ్చానా, కనీసం వారంలో రెండుసార్లయినా ఫోన్ చేయొచ్చుగా" అంది కన్నీళ్లు పెట్టుకుంటూ బొంగురు గొంతుతో.
"ఛ..బాధపడుతున్నావా ఫోన్ చేసినందుకు సంతోషించాలి గానీ. నువ్వన్నట్లు రోజూ ఫోన్ చేద్దామని నాకూ ఉంటుంది కానీ ఇక్కడ అస్సలు వీలుపడదు. ఖాళీ సమయమన్నదే ఉండదు. రోజూ ఏదో ఓ ప్రాంతానికి వెళ్ళాల్సి వస్తోంది. నీకు తెలియని దేముంది, నాది ఆర్మీ జాబ్ కదా నీ ఆరోగ్యం ఎలా ఉంది?"
"బాగానే ఉంది కానీ గత నెల మీరు వచ్చి వెళ్లినది మొదలు నాకెలానో ఉంది, కడుపులోతిప్పుతున్నట్టుగా మరియూ వికారంగా ఉంటోంది, ఈనెల మెన్సస్..కూడా అవలేదు, మిమ్మల్ని తెగచూడాలనిపిస్తోంది" అంది సునంద.
"అలాగా అయితే నీ హెల్త్ ప్రాబ్లమ్ నాకు అర్ధమయింది. విషయం అమ్మకు తెలియజేయి, ఆమెతో కలిసి నువ్వు హాస్పిటల్ కు వెళ్లి ప్రెగ్నన్సీ పరీక్ష చేయించుకో" అన్నాడు నాగేంద్ర.
"అలాగే మీరు కంగారు పడకండి. నేను అత్తయ్య గార్కి చెప్పి హాస్పిటల్ కు వెళ్లి టెస్టులన్నీచేయించుకుంటాను. వచ్చాక ఆ విషయo మీకు తెలియజేస్తాను సరేనా" అంది సునంద హుషారుగా.
"ఓ..కే మేడం అయితే నేనిక ఉండనా?"
"అలాగే శ్రీవారు" అంది అంతే హుషారుగా సునంద.
ఆమెకు ఆ రోజంతా చాలా సంతోషమని పించింది. భర్త రోజూ ఫోన్ చేస్తే బాగుండుననిపించింది సునందకు.
మర్నాడు సునంద అత్తగార్కి తన హెల్త్ ప్రాబ్లమ్ గురించి తెలియజేసింది.
"అలాగా అయితే ఈ విషయం ఇప్పుడా చెప్పేది పద ఇప్పుడే హాస్పిటల్ కు వెల్దాo" అంటూనే ఇంటికి తాళం పెట్టి కోడల్ని ఆటోలో తీసుకెళ్లి అన్ని పరీక్ష లు చేయించింది. అందులో సునంద గర్భిణీ అని తెలిసింది. దానితో అన్నపూర్ణమ్మ అలవికాని ఆనందంలో మునిగిపోయింది. అబ్బాయికి ఫోన్ చేసి చెప్పమని కోడలికి సలహా ఇచ్చింది.
ఇంటికి వచ్చిన మరు క్షణం సునంద భర్తకు ఫోన్ చేసి "హలో శ్రీవారూ ఇప్పుడే హాస్పిటల్ కు అత్తగారితో వెళ్లి వచ్చాను" అంది సునంద అసలు విషయం చెప్పకుండా.
"అలాగా అన్నిపరీక్షలూ చేయించుకున్నావా? రిజల్ట్ ఏమిటి ప్లీజ్ త్వరగా చెప్పు ఈ టెoక్షన్ భరించలేక పోతున్నాను" అన్నాడు నాగేంద్ర ఆతృతగా.
"అంత టెంక్షన్ పడకండి మహాశయా మీకు శ్రీవారి పోస్ట్ నుంచి తండ్రి పోస్ట్ లోకి ప్రమోషన్..వచ్చింది" అంది సునంద భర్తను ఆట పట్టిస్తూ.
"ఓ గాడ్ నిజమా! ఐ. యాం.వెరీ. హేపీ సునందా. నిన్ను ఎత్తుకొని గిర గిరా తిప్పాలనుంది. ఎంత మంచివార్త చెప్పావు. ఇదిగో మై.వైఫ్ నువ్విక నుంచి టైంకు తిని కావలసినంత రెస్ట్..తీసుకోవాలి. మన బేబీ చక్కగా ఉండాలి అంటే అంతా నీ చేతుల్లోనే ఉందిమరి" సలహా ఇచ్చాడు సంతోషంతో నాగేంద్ర.
"అలాగేనండీ శ్రీవారు ఇక నుంచి అంతా మీరు చెప్పినట్లే చేస్తాను. కానీ మీరు మాత్రం దగ్గర దగ్గరగా ఫోన్లు చేయండి" అంది సునంద ముద్దు ముద్దుగా.
"ఓ కే శ్రీమతిగారు మీ ఆజ్ఞను పాటిస్తాను నువ్వు జాగ్రత్త" అన్నాడు నాగేంద్ర.
మర్నాడు కోడలు సునంద నెల తప్పిన విషయం మాటల సందర్భంలో చిన్న కొడుకు రవితో అంది అన్నపూర్ణమ్మ.
"ఓ అలాగా భలే తీపి కబురు చెప్పావమ్మా అయితే అందరి నోళ్లు తీపి చేయాల్సిందే" అంటూ రవి బయటకు తుర్రుమన్నాడు. ఆ సాయంత్రం చీకటి పడ్డాక చేతినిండా స్వీట్ పేకట్లుతో ఇంటికి వచ్చాడు రవి. తల్లి చేతికి ఒక స్వీట్ పేకెట్ ఇచ్చి మరో పేకెట్..పట్టుకొని సునంద గదిలోకి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి ఆమె మంచంమీద విశ్రాంతిగా వాలి ఉంది. తలుపు చప్పుడవటంతో పైకి లేచి కూర్చుంది.
"ఏంటి రెస్ట్ తీసుకుంటున్నవా ఇందా ఈ స్వీట్ తీసుకో తీపికబురు అమ్మ చెప్పింది. నువ్వు తల్లివి కాబోతున్నావట కదా" అన్నాడు రవి సునంద చేతిలో స్వీట్ పేకెట్ పెడుతూ.
"నువ్వు నాకిచ్చేదేంటి? మరీ ఎక్కువగా చొరవ తీసుకోకు" అంది అతనిచ్చిన స్వీట్ పేకెట్ ను విసిరి కొడుతూ
"అయ్యో తినే స్వీట్ ఏంటిలా విసిరికొట్టావు?" అంటూ వెళ్లి దాన్ని తీసుకొని పేకెట్ ఓపెన్ చేసి అందులో ఒక స్వీట్ ముక్క తీసుకొని ఆమె నోటికిఅందించబోయాడు రవి
"ఏంటి తమాషా చేస్తున్నావా?" అతని చేతిని విసిరి కొట్టింది సునంద.
"ఏం నేను నీకు తినిపించకూడదా నీ అందమంతా ఇలా అడవి కాచిన వెన్నెల్లా చేసుకుంటే ఎలా? ఇప్పుడు అన్నయ్య కూడా ఇక్కడ లేడుగా నన్నేఅన్నయ్య అనుకోవచ్చుగా ఇలా ఎన్నాళ్ళని మధనపడతావు? మన విషయం నేనెవరికీ తెలియనివ్వను అర్ధం చేసుకో" ఆమెను పొదివి పట్టుకొని ఆమె నోటిలో స్వీట్ కుక్కేసాడు రవి బలవంతంగా.
"యూ రాస్కెల్ నువ్వు చేసే పనేంటి? నీకెన్ని గుండెలు నా నోట్లో స్వీట్ పెట్టడానికి?" అతని చెంప ఛెళ్ళుమనిపించ బోయింది సునంద.
అప్పటికే ఆమెను గట్టిగా అల్లుకుపోయి తన గుండెలకు హత్తుకున్నాడు రవి.
"అత్తయ్యా..అత్తయ్య" గట్టిగా పిల్చింది సునంద.
మంచి నిద్రలో ఉన్న అన్నపూర్ణమ్మకు కోడలి పిలుపు వినపడలేదు. తన తల్లి మంచి నిద్రలో ఉందని తెలుసుకున్న రవి సునందను మంచం పైకి నెట్టి ఆమెను ఆక్రమించుకోబోయాడు. కానీ ఆమె అతన్ని తన శాయశక్తులా నెట్టి మంచందిగి నిలబడి అతని చెంప ఛెళ్లుమనిపించింది.
ఇంతలో అటుగా వాష్ రూమ్ కెళ్లి వస్తున్న అత్తగారు లోపలికి రావడంతో రవి బయటకు తప్పుకున్నాడు.
"ఇంకాపడుకోలేదామ్మా అసలే వట్టి మనిషివి కూడా కాదు వెళ్లి పడుకో" అంటూనే ఆమె వెళ్ళి తన మంచంపై వాలిపోయింది.
అత్తగారు వెళ్లడంతో సునంద తన గది తలుపులకు లోపల గడియ పెట్టి మంచంపై వాలిపోయి భోరున విలపించింది.
ఈ ప్రపంచంలో తనలాంటి ఆడపిల్లలు వేలమంది, లక్షల మంది నాలాగే కాందిశీకుల్లా మూగగా ఈ జీవితపు ఎడారిలో నడకను సాగిస్తున్నారు. వారి నిట్టూర్పుల సెగతో ఈ భూమి వేడెక్కిపోతోంది. ఎక్కడో ఒక తిరుగుబాటు కేకవినిపిస్తుంది. కానీ ఎవ్వరూ ఆ కేకను పట్టించుకోరు. పట్టించుకుంటే ఆగి చూడాలని, ఆగిచూస్తే అడ్డుకోవాలని, అడ్డుకుంటే ఆలోచించాలని దానికి ప్రత్యుమ్నాయం వెతకాలని, వెతికితే అది తమ మరణ శాసనం అవుతుందని వారి భయం, ఎవరిజీవితం గురించి వారే ఆలోచించుకోవాలి, ఎవరూ తోడుగా నిలవరు.
భర్త నాగేంద్రకు ఫోన్ చేసి తన సమస్యను చెప్పాలనుకుంది. నెంబర్ డయల్ చేసింది.
"హలో సునందా ఇంత రాత్రిపూట ఫోన్..చేసావేంటి నిద్రరావటం లేదా భోజనం చేసావా?" అట్నుంచి అతను అన్నీ ప్రశ్నలే గుప్పించాడు.
భర్త గొంతు విన్న ఆమె మరిక ఆగలేకపోయింది.
"సునందా ఏంటలా ఏడుస్తున్నావు? ప్లీజ్ చెప్పవా ఒంట్లో ఎలా ఉంది?" బుజ్జగించి అడిగాడు నాగేంద్ర.
భర్త ప్రేమకు కరిగిపోయిన ఆమె జరిగింది మొత్తం భర్తకు చెప్పేసింది. భార్య చెప్పింది అంతా విన్న నాగేంద్ర అవాక్కయ్యాడు. ఆ విషయం గురించి తీవ్రంగా ఆలోచించసాగాడు.
"సరే నేను మళ్ళీ రేపు తెల్లారాక చేస్తాను. నువ్విక పడుకో నాకు చెప్పావు కదా నేనిక ఈ విషయం గురించి చూసుకుంటానులే" అంటూ ఫోన్ పెట్టేసాడు నాగేంద్ర.
అర్ధరాత్రి మంచి గాఢ నిద్రలో ఉన్న రవికి తన ఫోన్..రింగవడంతో మెలకువ వచ్చిన అతను కళ్ళు నులుముతూ లేచి కూర్చొని ఫోన్ ఆన్ చేసి "హలో" అన్నాడు ఆవలిస్తూ.
"హలో నేనురా నాగేంద్రను"
"అన్నయ్యా నువ్వా ఇంత రాత్రిప్పుడు ఫోన్ చేసావేంటి అక్కడంతా బాగానే ఉంది కదా?" అడిగాడు రవి ఆతృతగా.
"ఆ ఇక్కడoతా బాగానే ఉంది అక్కడ అందరూ ఎలా ఉన్నారు?"
"ఇక్కడ కూడా అందరూ బాగానే ఉన్నారు అన్నయ్యా నువ్వెప్పుడు వస్తున్నావు?" అడిగాడు రవి.
"నేను ఈనెలలో రావాలనుకుంటున్నాను కానీ నువ్వేoటిరా ఈ మధ్య విలన్ పోర్షన్లు చేస్తున్నావట డ్రామాలు అవి చూస్తున్నవా?" అడిగాడు నాగేంద్ర.
అన్నయ్య మాటలతో అతనికి సీన్ మొత్తం అర్థమైపోయింది. తన గురించి వదిన అన్నయ్యతో మొత్తం చెప్పేసిందని అర్ధమై ఏమీఎరగనట్లు మాట మార్చాలనుకున్నాడు.
"డ్రామాలా? ఇక్కడ ఫ్రెండ్స్ కొంత మంది డ్రామాల్లోయాక్ట్ చేయమన్నారు గానీ నేను చేయనని చెప్పేసానన్నయ్యా అయితే అది నీ వరకూవచ్చిందన్నమాట నువ్వేమి వాళ్లకు మాట ఇవ్వకు అన్నయ్యా" అన్నాడు రవి అతికష్టం మీద తనను తాను సంబాళించుకుంటూ.
"నువ్వు స్టేజీ మీద వేసే డ్రామాల్లోనే కాదు ఇంట్లో కూడా ఆరితేరిపోతున్నావటగా"
"ఛ అదేం లేదన్నయ్యా నా ముఖం నేను డ్రామాలు వేయడమేంటి నా బొంద అయినా నాకెక్కడ ఖాళీ మన మాగాణీ పనులుతోనే నాకు సరిపోతోంది, నువ్వు త్వరగా వచ్చేయి అన్నయ్యా"
"ఆ వస్తాను గానీ వచ్చే ముందు చిన్న మాట"
"చెప్పన్నయ్యా"
"నా భార్య నీకే మవుతుందిరా?"
"వదిన"
"వదినంటే తల్లి తరువాత తల్లే కదరా మరి నువ్వు ఆమెలో తల్లిని చూడలేకపోతున్నావా?"
"అదేంటన్నయ్యా అంత మాటనేసావు నువ్వు నన్నుఅపార్ధంచేసుకుంటున్నావు, నేనెప్పుడూ వదినపట్ల తప్పుగా ప్రవర్తించ లేదన్నయ్యా ప్రామిస్" అన్నాడు రవి వణికే గొంతుతో.
"అచ్ఛా.. అయితే మీ వదినే నిన్ను తప్పుగా అర్ధంచేసుకుందంటావు. సరే అలానే అనుకుందాము. ఆమె నోట్లో నిన్ను స్వీట్ పెట్టమని అడిగిందా ఆమెను మంచం మీదకు తోసి నిన్ను ఆమె మీద పడుకోమని చెప్పిందా? ఒరేయ్ తల్లిలాంటి వదిన మీద అఘాయిత్యానికి పాల్పడతావురా పాపిష్టి వెధవా, నేనిక్కడున్నా అక్కడేం జరుగుతున్నదీ నాకు తెలుస్తూనే ఉందిరా"
"అదేం లేదన్నయ్యా వదిన తల్లి కాబోతుందన్న సంతోషంలో ఆమె నోట్లో స్వీట్ పెట్టబోయాను, అంతే అన్నయ్యా నన్ను అపార్ధం చేసుకోకు" అన్నాడు రవి.
"ఒరేయ్ దొంగోడ్ని నువ్వు దొంగవిరా అంటే ఒప్పుకుంటాడ్రా, అమ్మతో ఈ విషయం చెప్పమంటావా?" అన్నాడు నాగేంద్ర.
"వద్దన్నయ్యా అమ్మకు చెప్పొద్దు ప్లీజ్" రమారమి ఏడ్చేసాడు రవి.
"సరే అమ్మకు చెప్పను కానీ నేనో నాలుగురోజుల్లో ఇంటికి వస్తున్నాను. అప్పటికి నువ్వు ఇంట్లో ఉండకూడదు"
"అలాగే అన్నయ్యా"
"ఒరే ఇంట్లో అన్నాను కదా అని ఏ ఊరు వెళ్లడం కాదు. అసలు నువ్వీ లోకంలోనే ఉండకూడదు. ఉన్నావంటే నేనే నిన్ను రివాల్వర్ తో పేల్చేస్తాను. నాకా అవకాశం ఇవ్వొద్దు. నేను వచ్చేసరికి నువ్వు ఇంట్లో ఎవరికీ ఈ విషయం చెప్పకుండా నీప్రాణం నువ్వు తీసుకోవాలి" అన్నాడు దృఢంగా నాగేంద్ర.
"అన్నయ్యా నాకు అంతటి శిక్షను విధిస్తావా అన్నయ్యా. నిన్ను, అమ్మను చూడకుండా నేనుండగలనా?" ఏడ్చేసాడు రవి.
"అయితే సరే నేనే పోతానులే మీరంతా ఉట్టు కట్టుకొని ఊరేగండి" అన్నాడు నాగేంద్ర.
"వద్దన్నయ్యా అంత పని చేయకు. నువ్వు చెప్పినట్లే చేస్తానులే. నువ్వు అమ్మను కంటికిరెప్పలా చూసుకో" అంటూ ఫోన్ పెట్టేసాడు రవి మంచంమీద పడి భోరున విలపిస్తూ.
మర్నాడు తన స్నేహితులను కడసారిగా చూడాలని బయలుదేరిన రవి చుట్టు ప్రక్కల ఊళ్ళల్లో ఉన్న ఫ్రెండ్స్ ను కూడా చూసి ఆఖరి వీడ్కోలుగా వారిని ఆలింగనంచేసుకుంటూ మూడు రోజుల్లో ఇల్లు చేరాడు.
కొడుకును చూసిన అన్నపూర్ణమ్మ "ఏరా రవీ ఈ మూడు రోజులబట్టీ ఎక్కడికెళ్లావురా? అన్నయ్య రేపు వస్తున్నానంటూ ఫోన్.. చేసాడు నిన్నడిగాడు కూడా" అంది సంతోషపడిపోతూ.
"అలాగా చాలా మంచి వార్త చెప్పావమ్మా. కొంచం ఒంట్లో నలతగా ఉందని హాస్పిటల్ కు చూపించుకోవడానికి వెళ్ళాను. అన్నయ్యను నాకూ చూడాలనుందమ్మా. రేపు అన్నయ్య వస్తున్నశుభసందర్భంలో మినప వడలు చెయ్యమ్మా నాకూ తినాలని ఉంది. అలాగే పాయసంకూడా" అన్నాడు రవి సంతోషపడిపోతూ.
"అలాగేలేరా అందరికీ చేసి పెడతాను గానీ అన్నయ్య సాయంత్రం నాలుగు గంటలకు వస్తాడు కాబట్టీ రేపు నువ్వెక్కడికీ వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండు నీకు ఒంట్లో నలతగా ఉందంటున్నావు ఏంటిడాక్టర్ గారేమన్నారు?" అంది అన్నపూర్ణమ్మ ఆతృతగా.
"ఏం లేదమ్మా అప్పుడప్పుడూ గుండెల్లో చిన్న నొప్పివస్తోంది. మందులు రాసారు"
"అలాగా జాగ్రత్త నాయనా మాగాణీ అంతా నువ్వే చేసుకోవాల్సి వస్తోంది. టైంప్రకారంగా భోజనం చేయకపోతే ఇలానే వస్తుంటాయి లేనిపోని జబ్బులు. సరే రేపు అన్నయ్య వచ్చేసరికి ఎక్కడికీ వెళ్లకు"
"అలాగే అమ్మా తప్పకుండా ఇంట్లోనే ఉంటాను" తల్లి చేతిలో చేయివేసి చెప్పాడు రవి.
సునందకు ఆ రాత్రoతా నిద్ర పట్టనే లేదు. రేపటి రోజున వస్తున్న తన భర్త రాత్రంతా ఆమె కళ్ళల్లోనే కాపురమున్నాడు. నునుసిగ్గుల ఊహల ఒరవడిలో ఆమె మది పరవశించిపోయింది.
మర్నాడు భళ్ళున తెల్లారింది. తెల్లారింది మొదలు రవి చాలా ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఇల్లంతా తిరగసాగాడు. తల్లి చెప్పిన అంగడి సరుకులన్నీ తీసుకొచ్చి వంట గదిలో పెట్టాడు. స్నానపానాదులు గావించిన రవి శివాలయానికి వెళ్లి తన పేరున శివుడికి అభిషేకం చేయించాడు. మధ్యాహ్నం ప్లేటులో పెట్టి తల్లి ఇచ్చిన మినప గారెలను తన గదిలోకి పట్టుకెళ్లి తలుపులు మూసుకున్నాడు రవి.
అన్నపూర్ణమ్మభోజనాలు వడ్డించి కోడలు సునందను పిలిచింది. రవిని కేక వేసింది. కానీ అతను పలక్కపోవడంతో వాడప్పుడే బయటకు వెళ్లిపోయినట్లుందమ్మా. వాడే వచ్చితింటాడులే మనం కానిచ్చేద్దాము" అంది అన్నపూర్ణమ్మ.
"అలాగే అత్తయ్యగారు" అంది సునంద. అనుకున్నసమయానికి ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు రానే వచ్చాడు నాగేంద్ర.
"అమ్మా బాగున్నావా తమ్ముడు ఎక్కడ?" రావడం తోటే గలగలా మాట్లాడేసాడు నాగేంద్ర.
"ఏమోరా ఇందాక గారెలు ప్లేటు పట్టుకొని తన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు. భోజనానికి పిలిస్తే పలకలేదు బయటకు వెళ్లిపోయుంటాడు" అంది అన్నపూర్ణమ్మ.
"సునందా ఎట్టాగున్నావు? నీకడుపులోనున్న మన చిట్టి తల్లి ఎట్టా ఉంది?" అన్నాడు నాగేంద్ర.
"నాన్న ఎప్పుడు వస్తాడంటూ అడుగుతున్నాడు నా చిట్టి తండ్రి" అంది సునంద.
కోడలి సమాధానం విన్న అన్నపూర్ణమ్మ చిరునవ్వులు చిందిస్తూ తన పెద్ద కొడుక్కి అన్నం వడ్డించింది.
"నేను తినేసి వచ్చానమ్మా. తమ్ముడి గది తలుపులు ఇంకా మూసే ఉన్నాయి. అంటే వాడు నిద్రపోతున్నాడేమో ఉండు చూస్తాను" అంటూనే నాగేంద్ర వెళ్లి రవి తలుపులు తట్టాడు. అది లోపల గడియ వేయకపోవడంతో చేత్తో తట్టగానే తలుపులు తెరుచుకున్నాయి.
ముగ్గురూ లోపలికి వెళ్లారు. కానీ అప్పటికే మంచానికి అడ్డంగా బోర్లా పడుకున్నరవిని తట్టి పిలిచాడు నాగేంద్ర.
కానీ అతను పలక్కపోవడంతో నాగేంద్ర తమ్ముడ్ని తన రెండు చేతులతో తిన్నగా తిప్పి పడుకోబెట్టాడు. కానీ అప్పటికే రవి నోట్లో నుంచి వచ్చిన నురగలు ముఖమంతా పాకిపోయాయి.
అది చూసిన నాగేంద్రకు విషయం అర్ధమై, తన చేతి రుమాలతో రవి మూతిని, ముఖాన్ని తల్లి చూడకుండా తుడిచేసాడు.
"రవీ లేరా ఇంత గాఢ నిద్రేoటిరా" అన్నాడు నాగేంద్ర. తల్లి చూడకుండా మంచం ప్రక్కన పడి ఉన్న పురుగుల మందుసీసాను తీసి బీరువావెనక్కి నెట్టేసాడు.
"నాగేంద్రా ఏంటిరా వీడు ఇందాకే గుండెలో నొప్పిగా ఉందని హాస్పిటల్ కు వెళ్లి వచ్చానని చెప్పాడు" అంది అన్నపూర్ణమ్మ.
"అలాగా మరి చెప్పవేమమ్మా అందుకే ఇంత ఘోరం జరిగిపోయింది"
"ఏంటిరా రవికేమైంది?" ఆతృతగా అంది అన్నపూర్ణమ్మ.
"ఇంకెక్కడ తమ్ముడమ్మా వాడు మనల్ని వదిలి వెళ్లిపోయి చాలా సేపయింది. ఒళ్ళంతా చల్లబడి మంచుముద్దలా అయిపోయింది. నాకు తమ్ముడి చివరిచూపు కూడా దక్కలేదమ్మా" అన్నాడు నాగేంద్ర కన్నీళ్ళతో గుండెలుబాదుకొని విలపిస్తూ.
"అయ్యోరవీ నా కొడుకా నేనేం పాపం చేసానురా ఈ అమ్మకు ఇంత గుండె కోత పెట్టావేంరా?" అంటూనే అన్నపూర్ణమ్మ గుండెలవిసేలా విలపించింది. రవి మృతదేహాన్ని బయట వాకిట్లో పరుండ బెట్టేసరికి తమచుట్టు ప్రక్కల వారoతా వచ్చి గుమిగూడి తలోమాట అనసాగారు.
"అయ్యో నేనుపొద్దున్న రవిని చూసానే" అని ఒకరు అంటే
"నేనూ ఇందాక చూసాను ఏ రోగము రొష్టి లేకుండా ఎలా మరణించాడబ్బా?" అని మరొకరు అనడంతో
"నేనూ నా తమ్ముడ్ని చూడలేకపోయాను. నేనంటే వాడికి పిచ్చి ప్రేమ. గతoలో నాకు ఫోన్లో చెప్పాడు తనకు గుండెజబ్బు వచ్చే సూచనలు ఉన్నాయని డాక్టర్ పరీక్షల్లో తేలిందని ఈ విషయం అమ్మకు చెప్పవద్దని నాతో అన్నాడు కానీ ఇవాళ హాస్పిటల్ కెళ్లి వచ్చి అమ్మతో కూడా చెప్పాడట. ఎలాగూ నేను వస్తున్నాను కదా సిటీలో పెద్ద డాక్టర్ కు చూపిస్తానని కూడా చెప్పాను. కానీ ఇంతలోనే నా తమ్ముడ్ని ఇలా మృత్యువు మింగేస్తుందనుకోలేదు" గుండెలు బాదుకొని విలపించాడు నాగేంద్ర.
"అవును. ఇందాక నాకు గుండెల్లో నొప్పిగా ఉందని హాస్పిటల్ కు వెళ్లి వచ్చానమ్మా అని నా చిన్న కొడుకు నాతో కూడా చెప్పాడు కానీ ఇంతలోనే ఇలా నాకు కడుపు కోత పెడతాడనుకోలేదు" అంది అన్నపూర్ణమ్మ గుండెలు బాదుకొని విలపిస్తూ.
"అదిగో నర్రారవికి గుండె పోటు ఉందట అయినా తెగించి కలివిడిగానే పొలం పనులు చేయించేవాడు. హుషారుగానే తిరిగేసేవాడు" అన్నారు చుట్టూ మూగిన చూపరులు. పొద్దుపోతోందని చీకటి పడితే దహన సంస్కారాలు చేయకూడదని అందరూ అనడంతో దహన సంస్కారానికి జరపవలసిన కార్యక్రమాలన్నీ సిద్ధం చేసి చీకటి పడకముందే అందరి సహాయంతో నాగేంద్ర తమ్ముడి మృతదేహాన్ని స్మశానవాటికకు తీసుకెళ్లి దహన సంస్కారాలు చేసి ఇంటికి వచ్చాడు. నాగేంద్ర పుట్టెడు దుఃఖంతో. పెద్ద కొడుకును చూసిన అన్నపూర్ణమ్మ "నాగేంద్రా తమ్ముడు ఎక్కడ్రా వాడికి పెళ్లి చేయాలని తెగ కలలు కన్నానురా వాడే నన్నొదిలి మీ నాన్నదగ్గరకి వెళ్లిపోయాడురా" అంటూ నాగేంద్రను చుట్టుకొని గుండెలవిసేలా విలపించింది అన్నపూర్ణమ్మ
ఆ ఇల్లు పెద్ద కార్యం వరకూ దుఃఖ సాగరంలో మునిగిపోయింది.
పెద్ద కార్యం ముగియడంతో నాగేంద్ర తిరిగి ఆర్మీకి వెళ్ళడానికి తయారవసాగాడు. కానీ అతని తల్లి అతన్ని వెళ్లవద్దని ఉద్యోగం మానేసి ఇక్కడ మాగాణీ పనులు చూసుకొమ్మని ప్రాధేయపడింది. భార్య సునంద కూడా అత్తగారికి వంతపాడటంతో నాగేంద్రకు ఉండిపోక తప్పలేదు. తన తమ్ముడి వక్రబుద్ధే తనకు తాను ప్రాణం తీసుకునేలా చేసింది. లోకంలో ఇలాంటివారు కోకొల్లలుగా ఉండబట్టే ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది.
అలనాటి సీత మొదలు నేటి నిర్భయ్ వరకు 'స్త్రీ'కి అన్యాయం జరుగుతూనే ఉంది. ఆడదాన్ని చెరపట్టాలని చూసిన ఏమగాడూ చరిత్రలో సుఖపడింది లేదు. తన తమ్ముడి మరణంతో తనకెలాంటి సంబంధం లేదు. వాడి వక్ర నడతే వాడి చావుకు కారణమైంది. ప్రతి ఒక్కరి లోనూస్వార్ధముంటుంది. అది భారతీయుడినైన నాలోనూ కొలువై ఉంది. నాది, నాభార్య, నాపిల్లలు అనే స్వార్ధమమకారాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి, ఉండితీరాలి కూడా. వాటిని విచ్ఛిన్నం చేయాలనుకున్న వారు వారి పతనానికి వారే కారకులవుతారు. కానీ 'తమ్ముడు' అన్న రక్త సంబంధం వలన తన గుండెల్లో ఏమూలో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది. అది ఒక్కక్షణం మాత్రమే సుమా! ఇందులో తనకు గానీ తన భార్యకు గానీ ఎలాంటి కళంకం అంటదు. అది కేవలం రవి తనకు తాను చేసుకున్న స్వయంకృపరాధం మాత్రమే. నాగేంద్ర కళ్ళ నుండి కన్నీటిధారలు కురిసాయి అవిరామంగా.
నాగేంద్ర తన భార్యను కంటికిరెప్పలా చూసుకోసాగాడు. మరో వైపు మాగాణీ పనులతో క్షణం తీరికలేక సతమతమవుతున్నాడు. కాలం ఎవరి కోసమూ ఆగదు. అది నిరంతరం ముందుకు సాగి పోయి కాల గర్భంలోకలిసిపోతోంది. కాలగమనంలోక్షణాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి.
సునంద నెలలు నిండి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను చూసిన అన్నపూర్ణమ్మ కళ్ళల్లో ఆనందభాష్పాలు వెల్లి విరిసాయి,
"నాగేంద్రా నా చిన్న కొడుకు రవి ఎక్కడికీ పోలేదురా. మళ్లీ మనింటిలోనే పుట్టాడురా ఇక మనతోనే ఉంటాడు" అంటూ మనవడ్ని చూసి మురిసిపోతున్న తల్లిని పొదివిపట్టుకున్న నాగేంద్ర
"అవునమ్మా నువ్వు చెప్పింది నూటికి నూరుపాళ్లూ నిజం. మన రవి మనతోనే ఉంటాడు" అన్నాడు.
తల్లి మనసులో పేరుకుపోయిన బాధను తాను కొంతైనా తీర్చగలిగాడు అనుకున్నాడు నాగేంద్ర. ఇరవై ఒకటో రోజున మనవడి బారసాలను ఏర్పాటు చేసింది అన్నపూర్ణమ్మ.
చుట్టాలు, హితులు, స్నేహితులతో ఇల్లంతా కళ కళలాడుతోంది. అన్నపూర్ణమ్మ తన మనవడికి 'రవీంద్ర' అని నామకరణం చేసింది. అందుకు నాగేంద్ర గానీ సునంద గానీ ఎలాంటి అభ్యంతరంచెప్పలేదు.
ఆమె మనసు కొంతైనా చల్లబడిందని ఆనందించారు. ఇదంతా తమతో 'విధి ఆడించిన వింత నాటకమనీ, తామంతా విధి చేతిలో కీలుబొమ్మలమని' అనుకున్నాడు నాగేంద్ర.
వచ్చిన ఆహ్వానితులoతా పుట్టిన బిడ్డకు చిన్న కొడుకు పేరు పెట్టి చాలా మంచి పని చేసింది అన్నపూర్ణమ్మ అనుకుంటూ నిష్క్రమించారు.