

వేంకటేశ్వరదర్శనము
చం. తళతళలాడు భూషణయుతాసితమూలవిరాట్స్వరూపమే లలితసుదర్శనం బిడఁ బలాయనమౌ దురితాంధకార, మా కలియుగదైవ మొక్క క్షణకాలము గన్పడఁ గల్గు మోదమున్ దెలుపఁగఁ జాల వే కృతులు(1), దివ్యము నవ్యము తత్కటాక్షమే (1) కావ్యాలు/కీర్తనలు/క్రియలు కం. కర్తవు, కర్మవు, క్రియవున్ హర్తవు భర్తవును ధర్త వఖిలజగత్సం స్కర్తవు విహర్త వావి ష్కర్తవు నే స్మర్త నౌదు సర్వము నీవే భావము- ఏ వాక్యానికైనా మూలము అయినవాడవు, (పాపములను)హరించు వాడవు, (లక్ష్మికి, భూమికి) భర్తవు, (కొండను) ధరించినవాడవు, ప్రపంచ మంతటిని సంస్కరించేవాడవు, (భక్తుల హృదయాలలో) విహరించేవాడవు, (ప్రేమను) ప్రకటించేవాడవు, అన్నీ నీవే అయి నప్పుడు ఏమని స్మరించువాడను? కం. వరువాత(1)దర్శనముతోఁ గరువా తరువాత పనుల ఘనశుభములకున్? బరువా తనయుని రక్షణ? పరు(2) వాతపవారణముగఁ బట్టిన స్వామీ! (1) ప్రాతఃకాలము (2) పరువు(సంస్కృతమూలము పరుః)=పర్వతము భావము- ప్రాతఃకాలమున నీ దర్శనము చేయగా, దాని తర్వాత చేసే పనుల వలన కలిగే దిట్టమైన శుభములకు కరువు ఉండదు. నీ పుత్రుని రక్షణ నీకు భారమా? (గోగోపాలుర రక్షణ కొఱకు) పర్వతమును గొడుగుగా ఎత్తి పట్టుకొనిన ఏలికవు నీవే కదా.