Menu Close
nirmalaadithya author
వలస కూలీలు (కథ)
-- నిర్మలాదిత్య --
valasa-kooleelu-katha-02

"గ్రేట్, వై నాట్. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఈ ప్రాంతం అంతా నాకు సుపరిచితమే. ఈ ఫార్మ్ హౌజ్, చుట్టూ ఉన్న పొలాలు టెడ్ హాట్ఫీల్డ్ వి. ఈ ఆస్తులు టెడ్ వాళ్ళ కుటుంబంకి తర తరాలుగా వస్తున్నది. అదిగో అలా లోయలోకి పోయినట్లు ఒక దారి ఉంది కదా, అలా కిందకి వెళ్ళితే, అక్కడ మాంసం కని హైలాండ్ స్టీర్ జాతి ఎద్దులను పెంచేవారు. అలానే ఇంటికి కావలసిన కోళ్ల మాంసం, గుడ్ల కోసం అక్కడ కట్టిన చిన్న ఇల్లు, చికెన్ కూప్. దాని పక్కనే ఉన్న షెడ్ లో కొన్ని మేకలను పెంచే వారు. వాటి పాలతోనే కొన్ని పిల్లులను కూడా సాకే వారు. మరో పక్క ఉన్న షెడ్ లో ఒక పది జెర్సీ ఆవులతో ఇంటికని డైరీ ఉండేది. ఇక ఇక్కడే ఆ బార్న్ కు వంద అడుగులు అవతల కూరగాయ చెట్లు, స్ట్రా బెర్రీ పళ్ళ లాంటి మొక్కలు పెంచేవారు. ఇంటి దారి వెంబడి, అక్కడక్కడ పిచ్చిగా పూల మొక్కలు ఉండేవి.

ఇంటికని చుట్టూ ఉన్న అడవులలో ఎండిన చెట్లు కొట్టి, చెక్క ముక్కలు చక్కగా అమర్చే వాళ్ళు. అటు దూరంగా చెట్ల దగ్గర తేనె కోసం తేనెటీగల గూళ్ళు కట్టి పెంచే వాళ్ళు. కుటుంబానికి కావాల్సిన సబ్బు దగ్గరి నుంచి, విస్కీ వరకు ఇంట్లోనే తయారు చేసుకొనే వారు. వాటి కోసం, పొలం పనులకు కోసం అవసరమైన పని ముట్లతో ఇంటి పక్కనున్న షెడ్ కిట కిట లాడి పోయేది. వేటకని, కాపలాకని పెంచిన కుక్కలు బయటనే ఆడుకొనేవి. అలానే ఇంట్లో ఆడుకోవడానికి పెంచుతున్న కొన్ని బొచ్చు కుక్కలు, ఇంట్లో వాటి ఇష్టంగా తిరిగేవి.

ఇక వీకెండ్స్ లో ఇంటికి వచ్చే కజిన్స్, వాళ్ళ పిల్లలతో ఈ ప్రాంతం అంతా కల కల లాడేది. నేనూ, నా కజిన్స్ ఇక్కడే,  ఆ చెట్లు, ఇటు జంతువుల చుట్టూ వేసిన ఫెన్సులు ఎక్కడం, ఈ ఎత్తు పల్లాల లో పరిగెత్తడం, కుక్కలతో ఇతర జంతువులతో ఆడుకోవడం, నాకు ఇంకా గుర్తు ఉంది. వీలున్నప్పుడల్లా హంటింగ్ గన్స్ తీసుకొని కుందేళ్ళను వేటాడే వాళ్ళము. కొన్ని సార్లు ఊరికే ఆ లోయలో గన్స్ కాల్చి టార్గెట్ ప్రాక్టీసు చేసే వాళ్ళం."

జిమ్ తన నాస్టాల్జియా లో మునిగిపోయాడని తెలిసిపోయింది.

"చాలా అందంగా, ఆనందంగా ఉంది నువ్వు వర్ణించిన నీ చిన్న నాటి ఈ ప్రదేశం. టెడ్ కు అన్నీ బాగానే జరుగుతున్నట్లుగా చెప్పావు. మరి అతను ఈ ఫార్మ్ హౌజ్ ఎందుకు అమ్మినట్లు?"

"దానికి కారణం ఇక్కడికి ఒక ముప్పై మైళ్ళ దూరం లో వేసిన హైవే అంటే నమ్ముతావా?"

"హైవే టెడ్ పొలాల మధ్య పోయిందా కొంపదీసి? అయినా అలా రోడ్డు వేసిన ప్రభుత్వం కంపెన్సేషన్ బాగానే ఇచ్చి ఉంటారే."

"పొలం లో రోడ్డు పోలేదు. కానీ రోడ్డు తో బాటు కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి."

"ఎలాంటి సమస్యలు?"

“రోడ్డు తో బాటు ఒక ఎక్సిట్ ఏర్పాటు చేసారు. అది టెడ్ ఇంటి మీద నుంచి పోయే కచ్చా రోడ్ మీద ఉంది. ఎక్సిట్ దగ్గరే మొదట గ్యాస్ స్టేషన్స్, కన్వీనియన్స్ కొట్లు వచ్చాయి. తరువాత ఒక మోటల్. అలా అంచెలు, అంచెలుగా ఆ హై వే పక్కనే ఒక చిన్న టౌన్ తయారైపోయింది."

"ఆ చిన్న టౌన్ కి, ఈ పొలం అమ్మడానికి సంబంధం ఎక్కడుంది?"

"ఉంది. అప్పటికి మేము లేట్ టీన్స్ కి వచ్చేశాము. పిల్లలకు ఈ టౌన్ ఒక వరం గా మారింది. ఒక్క మాకే కాదు. ఈ రోడ్డు చుట్టూ ఉన్న ఫార్మ్ హౌజ్ లలో నివసిస్తున్న రైతు కుటుంబాలన్నిటికి. సాయంత్రం బార్ లకు పోయే సౌకర్యం ఒకటి."

"టెడ్ అడ్డు పడలేదా?"

"రోజంతా పొలంలో పని చేసిన తరువాత, సాయంత్రం ఇంట్లోనే చేసిన విస్కీ ఒకటో రెండో పెగ్గులు తాగడానికి అలవాటు పడిన రైతులకు, వారి పెరిగిన పిల్లలు బార్ కి పోవడం వారికి పెద్ద అభ్యంతరకరంగా అనిపించ లేదు."

"నా కింకా సమస్య ఎక్కడుందో అర్థం కాలేదు."

"అక్కడికే వస్తున్నా. ఈ కొత్త టౌన్, బార్ లలో ఆల్కహాల్ తో బాటు, వీధులలో మాదక పదార్థాలు కూడా అందజేయడం మొదలెట్టాయి. ఈ చుట్టూ పక్కనున్న పిల్లలు, పెద్దలు చాలా మంది వీటికి అలవాటు పడ్డారు. అందులో టెడ్ పెద్ద కొడుకు ఒకడు."

"టెడ్ అడ్డుకోనుండొచ్చు కదా?"

"టెడ్ కు పిల్ల వాడు డ్రగ్ అడ్డిక్ట్ అయ్యాడని తెలియడానికి సమయం పట్టింది. తెలిసిన తరువాత ప్రయత్నించాడు. మొదట పిల్ల వాడిని ఆ డ్రగ్స్ వాడొద్దు అని మాట, చేత చెప్పి చూసాడు. పరిస్థితి విషమించాక,  పిల్ల వాడిని థెరపీ కి పంపించాడు. అటు తరువాత రిహాబ్, డీ అడిక్షన్ సెంటర్ లో చేర్చాడు. అయినా లాభం లేక పోయింది."

"టెడ్ వాళ్ళ అబ్బాయి, ఆ అడ్డిక్షన్ నుండి బయట పడ్డాడా? ఇంకా అడ్డిక్టే నా?"

"అలా అయినా బాగానే ఉండేది. ఒక రోజు టెడ్ వాళ్ళ అబ్బాయి ఇంట్లోనే ఉన్న గన్ తీసి కణత దగ్గ పెట్టుకొని కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఇదో మనం కూర్చున్న దగ్గరలోనే ఉన్న ఈ బార్న్ లో నే జరిగింది. ఆ అబ్బాయి కాల్చిన బుల్లెట్ బుర్రలో ఒక వైపు ప్రవేశించి, అవతలి వైపు ద్వారా నిష్క్రమించి, గోడకు తగిలి రికోషే అయ్యి ఆ బార్న్ పైన ఉన్న దూలం లో ఇరుక్క పోయింది. అదిగో అటు చూడు దూలం లో ఇర్రుక్కు పోయిన బుల్లెట్ ఇప్పటికీ ఎలా కనిపిస్తున్నదో.”

జిమ్ చూపించిన దూలం వైపు చూసాను. వుడ్ స్టైన్ పేయింట్ చేసిన దూలం మధ్యలో వెండి, రాగి రంగుల తో బుల్లెట్ కనిపించింది. ముప్పావు వంతు దూలం లో ఇరుక్కు పోయినా, మిగిలిన భాగం దూలం బయట స్పష్టంగా కనిపిస్తున్నది.

"సొంత పిల్లలను కళ్లెదుటే కోల్పోవడం గొప్ప శిక్ష. అంత కంటే కఠినమైన శిక్ష మరొకటి లేదు. ఇప్పుడర్దమైంది. కొడుకు చనిపోయాడన్న దుఃఖం లో ఈ ఫార్మ్ హౌజ్ అమ్మేసాడు టెడ్," కొద్ది బాధతో పాటు జవాబు దొరికిందన్న రిలీఫ్ నా గొంతులో.

"అదొక కారణం కావచ్చు. కానీ పిల్లలు కోల్పోయినా, తమ జీవితాలు మునుపటి వలనే గడిపే జనాలు ఎంత మంది లేరు? నీకు ఈ ఫార్మ్ హౌజ్ అమ్మకానికి పూర్తి కారణాలు కావాలంటే, వలసల గురించి అవగాహన ఉండాలి."

ఏదో కోర్సు ముందు తప్పక చేయవలసిన ప్రీ రెక్ క్లాసెస్ లాగా కొత్త విషయాలు ప్రతిపాదిస్తున్నాడేమి వీడు అని మనస్సులోనే ఒక్కింత విస్సుక్కున్నాను. అయినా చేతిలో ఉన్న మాస్కో మ్యుల్ ఇంకా పూర్తికాలేదు. ఈ టేబిల్ దగ్గర మాట్లాడడానికి మరో మనిషి లేడు. జిమ్ చెప్తున్న కథ ఇంటరెస్టింగ్ గానే ఉంది. దూరంగా సూటు బూటు వేసుకొన్న యువకుడు ఒక టేబిల్ తరువాత ఒక టేబిల్ దగ్గిర వెళ్ళి పరామర్శిస్తున్నాడు. అప్పుడప్పుడు మేము ఇద్దరం ఉన్న టేబిల్ వైపు, నా వైపు దృష్టి సారిస్తున్నాడు.

"వలస పోవడంలో కొత్త ఏమి ఉంది. అనాదిగా మానవుడు ఎక్కడ అవకాశాలు, వనరులు సంవృద్దిగా దొరుకుతాయో, అక్కడే పోయి స్థిరపడాలని కోరుకుంటారు. దేశాలని మన మానవులు భూమి మీద కొత్త గీతాలు వేయడంతో వలస కాన్సెప్ట్ మొదలయ్యింది అనుకుంటా. అయినా ఈ భూమి మీద ఆ గీతాలు మానవులు ఒక ఎరేసర్, పెన్సిల్ పట్టుకొని ఉన్నవి చెరుపుతూ, కొత్తవి గీస్తూనే ఉంటారు. ఇది మానవులకు ఎప్పటికీ పూర్తి కానీ డ్రాయింగ్ ప్రాజెక్ట్"

"నువ్వేదో అంత్రపాలజి, చరిత్ర ప్రొఫెసర్ లా మాట్లాడుతున్నావు. నేను అన్నది వలస వల్ల అదివరకే ఆ దేశంలో నివసిస్తున్న దేశీయుల సమస్యలను గురించి. టెడ్ తన జీవిత కాలం లోనే మధ్య తరగతి సంతోష జీవితం నుంచి బీదవాడిగా మారి పోయాడు. అతని పిల్లలు పెద్దోడు పోగా మిగిలిన వాళ్ళు కూడా హై స్కూల్ డ్రాప్ ఔట్ లు. పెద్దోడు లాగానే వీళ్లలో మరీ కొందరు డ్రగ్ అడ్డిక్ట్స్."

"టెడ్ కుటుంబం పరిస్థితికి వలసలకు ఏమిటి లింక్. ప్రతీ తరంలో కొన్ని కుటుంబాలు పైకి పోతాయి, కొన్ని కిందకు పోతాయి. కాలంతో పాటు ఓడలు బండ్లు అవ్వడం, బండ్లు ఓడలు అవ్వడం మామూలే కదా."

"ఈ హై వే పడడం తో చాలా మంది మెక్సికన్లు, ఇతర దేశస్తులు, టెడ్ ఉండే ఊరికి దగ్గరయ్యారు. వీళ్లకు ఈ దేశం ఒక ట్రెజర్ హంట్ లాగా అయిపోయింది. అలాగే రోడ్ల వల్ల దక్షిణ అమెరికా దేశాల నుంచి డ్రగ్స్ సరఫరా చేయడం సులభమై పోయింది. ఆ మెక్సికన్ లే తన అధోగతి కి కారణం అనుకున్నాడు టెడ్."

"అలా మెక్సికన్ లను మొత్తం చెడ్డ వారిగా పరిగణించడం సరి కాదు. వారి వల్లే కదా మీకు మీ పొలాలలో కూలీలుగా, ఇంట్లో ఆడ్ జాబ్స్ అతి చౌకగా పని చేయడానికి మనుష్యులు దొరికారు. నువ్వు ఇది వరకు నన్ను ప్రొఫెసర్ అన్నది నిజం. నా దగ్గర రీసెర్చ్ కని చేరిన ఒక కుర్రాడు వలస వచ్చిన జానాల వల్ల మంచి, చెడు రెండు జరుగుతాయి అన్న విషయం పై పరిశోధన చేసాడు,”

“మంచి, చెడు. అదెలా సాధ్యం?”

“ఇక్కడికి మొదట వలస వచ్చిన తెల్లవారినే తీసుకో. వారి రాకతో వారితో బాటు తెచ్చిన కొత్త ప్రొడక్ట్స్, ప్రాసెస్ లు ఈ దేశానికి చేరాయి. సైన్స్ టెక్నాలజీ లాంటి జ్ఞాన సంపద కొత్త దేశానికి అందించడం జరిగింది. అది మంచిది. కానీ గన్స్, కొత్త రోగాలు, అంత వరకు ఈ నేటివ్స్ కి తెలియని మోసాలు, వ్యాపార పద్దతులు ఇక్కడి వారికి చాలా హాని కలిగించాయి. భూమి అన్నిటికంటే ముఖ్యమైన వనరు, ఆస్తి. మొదట నేటివ్స్, అదే రెడ్ ఇండియన్స్ తమ ప్రాణాలు దక్కిచ్చుకోవడానికి వారి సొంత భూములు, ఇండ్లను వదలి పారిపోవాల్సి వచ్చింది. అంతే కాక మంచి ఆరోగ్యంగా బ్రతుకుతున్న ఆ రెడ్ ఇండియన్స్ కు వలస వచ్చిన వారు తమ రోగాలు కూడా తెచ్చి అంటించారు. కొన్ని లక్షల మంది ఈ కొత్త వ్యాధులు తట్టుకోలేక చచ్చారు. కాబట్టి, ఇప్పుడు టెడ్ మెక్సికన్ లను నిందించడం, ‘పాట్ కాలింగ్ ది కెట్టల్ బ్లాక్’ అనిపిస్తోంది,” అన్నాను నేను.

"నువ్వన్నది నిజమే. డ్రగ్స్ వ్యాపారంలో మెక్సికన్స్ తో బాటు అమెరికన్లు కూడా ఉన్నారు. టెడ్ బంధువులలో కొందరు ఈ మెక్సికన్ కార్టెల్ లకు పని చేసే వారు. ఈ మాదక ద్రవ్యాల సప్లయర్ లాగా మారి డబ్బు చేసుకున్నారని తెలిసింది. కానీ టెడ్ మనస్సులో ఈ మెక్సికన్ లే కారణం అన్న అభిప్రాయం గట్టిగా నాటుకు పోయింది."

"ఈ మెక్సికన్ ల చీప్ లేబర్ వల్లే దేశం ప్రొడక్టివిటీ పెరిగింది. వలసలు ఆ విధంగా దేశం అభివృద్ధికి తోడ్పడుతాయి. మమ్మల్నే తీసుకో, కొన్ని లక్షల ఇంజనీర్లు, ఇండియా నుండి ఇక్కడ వలస వచ్చి టెక్నాలజీ తద్వారా దేశ ప్రగతికి తోడ్పడుతున్నారు."

జిమ్ గట్టిగా నవ్వాడు. "కోవిడ్ చూసిన తరువాత ఈ మాట అంటున్నావా. వలసల వల్లే కదా ఇలా ప్రంపంచమంతా ప్రజలు తిరుగుతున్నారు. ఈ తిరుగుళ్ళు వల్లే కదా ఈ కోవిడ్ ప్రపంచమంతా పాకింది. జబ్బులే ఎందుకు. వలస జానాల వల్ల వాళ్ళ సంస్కృతితో పాటు వారు తెచ్చే నైతిక విలువలు కూడా తేడాగా ఉంటాయి. అందు వల్ల కూడా ఈ దేశంలోని నైతిక విలువలు పడిపోయాయి "

"ఇవి అనాదిగా వస్తున్న సమస్యలే కదా. ఇంతకు టెడ్ తన భూములు అమ్మడానికి కారణ మేమిటి?"

"ఇది వరకు నీవు చెప్పిన మాటల్లోనే ఉంది సమాధానం. టెడ్ కుటుంబ పతనం తో బాటు, మీ లాగా కొత్తగా వలస వచ్చిన జనం, భూములు కొనడం మొదలు పెట్టడంతో, టెడ్ లాంటి వాళ్ళు తమ భూములు అమ్మి వేయాల్సి వచ్చింది. "

"మరి టెడ్ ఇప్పుడెక్కడ ఉన్నాడు?" పరిస్థితుల ప్రభావం వల్ల అసహాయ స్థితి కి దిగజారిన టెడ్ గురించి ఆలోచిస్తే గుండె కెలికి నట్లనిపించింది.

"అతను మాంటాన వెళ్ళాడని తెలిసింది. అక్కడే ఒక ట్రేలర్ పార్క్ లో ఉండి ఏవో ఆడ్ జాబ్స్ చేస్తున్నాడని విన్నాను. అయినా టెడ్ లాంటి వారి ప్రయాణాల గురించి  స్టైన్ బెక్ గొప్ప నవల రాసేసాడు కదా. ఇది వరకే చదవక పోతే, చదువు"

"అతను రాసిన పాత్రల ప్రయాణం ఓక్లహోమా నుంచి కాలిఫోర్నియా వరకు. మరి నీ సంగతేంటి? ఇక్కడే స్థిరపడిపోయావు. నీకూ ఇంతకంటే బాగుండే ప్రదేశానికి పోవాలనిపించలేదా?”

"నాకు ఇక్కడి బంధాలు తెంపుకోవడం తెగ కష్ట మనిపించింది. ఈ ఫార్మ్ హౌజ్ లోనే స్థిర పడిపోయాను. ఇక్కడ పని చేసే వారికి చేతి నిండా పని ఇచ్చి, చేయించడం, ఈ ఫార్మ్ హౌజ్ కేర్ టేకర్ గా నా భాధ్యత."

అప్రయత్నంగా నేనూ, జిమ్ ఒకే సారి నవ్వాము.

దూరంగా అతిథులను పరామర్శిస్తూ, మా వైపు చూస్తున్న సూటు, బూటు వేసుకున్న యువకుడు, సరాసరి మా టేబిల్ దగ్గర వచ్చి పలకరించాడు. ఎడమ వైపు జిమ్ ఉన్నందు వల్ల, నేను కుడి వైపు తిరిగి నా పక్కన ఉన్న చైర్ లో కూర్చో మన్నాను.

"సార్, నా పేరు నాగేంద్ర. నేనే ఈ ఫార్మ్ హౌజ్ ని ఫన్షన్ వెన్యు గా మార్చాను. మీకు ఈ వెన్యూ, ఏర్పాట్లు నచ్చాయా? మీ ఫీడ్ బ్యాక్ మరింత గొప్పగా ఉండడానికి మార్పులు చేర్పులు చేసే అవకాశం కలిగిస్తాయి," అన్నాడు.

"నాకు బాగా నచ్చింది. ఔట్డోర్, ఇండోర్ వసతులు ఉండడం వల్ల వాతావరణ మార్పుల వల్ల ఇబ్బందులేమి ఉండవు. కాదంటే ఇక్కడికి రావడానికి రోడ్డు బాగా లేదు. పార్కింగ్ కి ప్రదేశం కూడా బాగా లేదు. అవి రెండూ సరి చేయాలి," అన్నాను నేను.

"పార్కింగ్ మార్పులు వచ్చే నెల మొదలు పెడతాము. ఇక రోడ్ల గురించి, కౌంటీ వారితో పని చేస్తున్నాను. ప్రభుత్వం పని కాబట్టి, కొంచెం సమయం తీసుకుంటుందేమో. అన్నట్టు మా కంపెనీ ఇలాంటి భూములే కొని, ఇండ్లు, ఆఫీసులు, హోటళ్ళు కట్టాలని ఈ ఆస్టిన్, డల్లాస్ రోడ్ మధ్యనున్న భూములన్నీ కొంటున్నది. మీరు రామ గోపాల్ గారి పేరు వినే ఉంటారు. ఆయన మా నాన్న గారు. ఆయన, వరహాల రావు గారు ఈ ఫార్మ్ హౌస్ మా కంపెనీ ద్వారా కొన్నారు," అన్నాడు.

రామ గోపాల్ పేరు వింటూనే, అంతవరకు నాలో ఉన్న ప్రసన్నత అంతరించిపోయింది. నాకు తెలియకుండానే నా మాటలలో ఒక వెట కారం దొర్లడం మొదలెట్టింది.

"రామ గోపాల్ తెలీక పోవడం ఏమిటి. ఆయన హైదరాబాద్, బెంగుళూర్ లలో రియల్ ఎస్టేట్ అమ్మేవాడు. నువ్వు ఈ దేశంలో మొదలెట్టావు.“

"అవును. సరిగ్గా చెప్పారు. నేనూ ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టాను. కంపెనీ మీదే రియల్ ఎస్టేట్ ఉంటుంది. మా కంపెనీలో పెట్టుబడి పెట్టే వారికి, వారి డబ్బు ఒక సంవత్సరాలలోనే రెట్టింపు చేసే బాధ్యత మాది," అన్నాడు నాగేంద్ర.

నాకు రాము చేసిన మోసం గుర్తుకు వచ్చి చిర్రెత్తుకొచ్చింది.

"ఎంత మందిని మోసం చేస్తారు. ఎందుకయ్యా, మన దేశంలో చేసే మోసాలన్ని, ఇక్కడికి తెచ్చేస్తున్నారు? మీ నాన్న ఇదే పని చేసే వాడు. డబ్బులు ఇచ్చే వాడి పేరు మీద భూములు ఉండవు. వాడి డబ్బు కొట్టేస్తారు. కంపెనీ పేరు మీదే భూములుంటాయి. ఆ కంపెనీ సొంతదార్లు మీరు,"అన్నాను.

"మీరు పొర బడుతున్నారు. మీరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీల గురించి విన్నట్లు లేదు. అలాంటి కంపెనీలు స్టాక్ ఎక్సేంజ్ లో లిస్ట్ అయ్యి ఉన్నాయి. అలాంటి కంపెనీ సముదాయాలతో కూడిన హెడ్జ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. కాదంటే మేము పెట్టిన కంపెనీలు చిన్నవి. స్టాక్ ఎక్చేంజ్ లో కనపడవు. చిన్నవి కాబట్టి ఎక్కువ రాబడి ఉంటుంది. మీ పెట్టుబడికి, స్టాక్ ఎక్సేంజ్ కి మించిన రిటర్న్స్ ఉంటాయి. ఇక మన దేశం, మా నాన్న అని ఎందుకు సంబంధం లేని విషయాలతో నన్ను, నా పనిని ముడిపెట్టి, ఇలా అభాండాలు వేస్తున్నారో అర్థం కాలేదు,," అని ప్రశాంతంగా జవాబు చెప్పాడు నాగేంద్ర.

"మీ నాన్న మా స్నేహితులకు ఇలానే చెప్పి, పెట్టుబడి పెట్టిన డబ్బులు ఇవ్వకుండా చెక్కేసాడు. కాదంటే మీ నాన్న ఇండియాలోని భూముల మీద వ్యాపారం చేసాడు. నువ్వు అదే పని ఈ దేశం భూములతో చేస్తున్నావు. ఇక్కడ ఏండ్ల కొద్ది ఉండి ఆ భూములు సాగు చేసుకొని బ్రతుకుతున్న జనాలని తరిమి వేస్తున్నారు. చరిత్రలోనూ ఇలాంటి సంఘటనలే చూసాము కదా," అన్నాను.

"మీరు చెప్పే చరిత్ర కలోనియల్స్ ది. ఐరోపా నుండి పడవల పైన ప్రయాణం చేసి, కొత్త దేశాల జనాలతో యుద్దాలు, పోరాటాలు చేసి, బలవంతంగా భూములు లాకొన్న ఉదంతాలు. ఇప్పుడు మీరు చూస్తున్నది సైన్స్ లో ఉన్న డార్విన్ సిద్దాంతం - సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. ఈ దేశం ప్రగతికి, పనులు చేయడానికి H1 వీసా మీద వచ్చిన మనం, కూలీలమే. కాదంటే, మన పని ఈ దేశానికి నచ్చి అవసరం అనుకుంటే, వాళ్ళకు సిటిజెన్ షిప్ ఇచ్చి ఈ దేశీయులు గా మారడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ భూమి అమ్మిన వాళ్ళు, నేనూ కూడా ఈ దేశ పౌరులమే. ఇక ఇక్కడి క్యాపిటలిజం అనుసరించి బిజినెస్ చేస్తున్నాము. బిజినెస్ లో ఎవడు నిలదొక్కుకుంటే, వాడిదే రాజ్యం. మమ్మల్ని కలోనియల్ వారితో ఎలా పోలుస్తారు?"

"నువ్వు నడిపేది ఒక పొంజి స్కీమ్ ఎందుకు కాకూడదు. నువ్వు మోసం చేయవని నమ్మకమేమిటి?"

"అలా ప్రతి పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించడం అవసరమే. మీకు అనుమానం వస్తే మీరు ఇన్వెస్ట్ చేయకండి. ఈ కంపెనీలు నడిపే మాకు, మా ఇబ్బందులు ఉంటాయి. ఈ ఫార్మ్ హౌజ్ చూడండి. మేమింకా బ్రేక్ ఈవెన్ కాలేదు. లాభాలకు ఇంకా బాగా మార్కెట్ చేయాలి," అని నాగేంద్ర అంటుండగానే పక్కనున్న బార్న్ కిటికీలు గట్టిగా కొట్టుకొని, ఒక కిటికీ గాజు విరిగి అడ్డంగా గీత పడింది.

"ఇదిగో ఇలానే తలుపులు, కిటికీలు కొట్టుకుంటాయి. రిపేర్ లు వస్తూనే ఉన్నాయి. ఇంకెక్కడి బ్రేక్ ఈవెన్? మా వాళ్ళు దెయ్యాలు తిరుగుతుంటాయి అంటారు. ఎవరో ఇక్కడే ఆత్మ హత్య చేసుకున్నారని విన్నాను కూడా. నేను అవేవీ నమ్మను. ఈ మధ్యలో కొన్నాం కాబట్టి ఇది లాభాలలోకి రావడానికి సమయం పడుతుంది. కానీ ఇది వరకే కొన్నవి, బొచ్చెడు లాభాలు మాకు తెచ్చి పెట్టాయి. మమ్మల్ని నమ్మి పెట్టుబడి పెట్టిన వారితో ఆ లాభాలు పంచుకున్నాము కూడా. మీకెందుకో నేను నచ్చినట్లు లేదు. వదిలేయండి. ఏదో మీలో మీరే మాట్లాడుకోవటం, నవ్వుకోవడం చూసి, మీకు కంపెనీ ఇద్దాం అనుకున్నాను. ఎంజాయ్ ది పార్టీ," అంటూ నాగేంద్ర లేచాడు.

నాకు నవ్వు వచ్చింది. నాగేంద్ర మాటల పై జిమ్ స్పందన వినాలనిపించింది.

"నువ్వేమంటావు జిమ్, ఏది కరెక్ట్? చరిత్రనా, సైన్స్ ఆ…" అన బోయాను. నా మాటలు సగంలోనే ఆగిపోయాయి. నా పక్కన జిమ్ లేడు. ఎవ్వరూ లేరు. ఇప్పుడే వచ్చిన నాగేంద్ర తప్పితే.

నా కళ్ళు అప్రయత్నంగా బార్న్ పై నున్న దూలం పైకి మళ్ళాయి. దూలం లో ఇరుక్కున్న బుల్లెట్ మెరుస్తూ కనిపించింది.

****సమాప్తం****

Posted in October 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!