ఈ పెళ్లికి రాక పోవాల్సింది.
పెళ్లి అంటే మొత్తం పెళ్లి సంబరాలు అనుకునేరు. అలా గోరింటాకు, పసుపు స్నానాలు, సంగీతం, పెళ్లి అంటూ వారం రోజుల పాటు జరిగే తంతులలో పాల్గొనడానికి నేనేమీ ఈ పెళ్లి వారికి మరీ సన్నిహితుడు కాదు. అలా అని రిసెప్షన్ కి కూడా పిలవకుండా వదిలేసే మిత్రుణ్ణి కాదు. అందుకే రిసెప్షన్ కు రావలసి వచ్చింది.
ఒక రిసెప్షన్ చూస్తే అన్నీ చూసినట్లే కదా. తాగుడు, చిరు తిండ్ల తరువాత, పెళ్లి వారికి మనమెంత దగ్గరో, దూరమో తెలిపే టేబుల్ సంఖ్యను వెదికి, కూర్చోవడం, ఆటు తరువాత ఆడ పెళ్లి వారు, మగ పెళ్ళి వారు, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు జంటలు, జంటలుగా డీ జే వేస్తున్న హుషారైన పాటలకు కుప్పి గంతులు వేస్తూ సభా ప్రవేశం చేయడం, చమత్కార టోస్ట్ ప్రసంగాల తరువాత వంతులు వారీగా భోజనం తెచ్చుకొని తిని, పెళ్లి వారి జంటల డాన్స్ ల తరువాత సామూహిక డాన్సులు చేయడం. దాదాపు కొద్దో గొప్పో మార్పులతో ఇదే ఫ్యూజన్ ఫార్మాట్ మన వాళ్ళ పెళ్లి రిసెప్షన్ పార్టీలు. దాదాపు పాతికేళ్ళ లో ఎన్ని రిసెప్షన్ల ను చూడ లేదు.
కానీ అలా బోర్ కొడుతుందన్న రీజన్ కూడా కాదు. నేను రాకూడదు అనుకోవడానికి కారణం, నా మీద నాకే ఒక కొరుకుబడని అసహ్యం లాంటి భావం కలిగించిన మా ఆవిడ. రావడానికి కారణం ఆ అసహ్యం ఏంటో కొరుకుబడకపోవడం.
“మరో పెళ్లి పిలుపు వచ్చిందోచ్,” క్రింది ఫ్లోర్ వంట గదిలో ఉన్న మా ఆవిడకి వినపడేలా కేక వేసాను.
నిశ్శబ్ధం.
బహుశా వంట గదిలో లేదేమో. ఈ లంకంత కొంపలో ఏదో ఒక రూము క్లీన్ చేస్తూ ఉంటుంది. అదేంటో, అన్ని అలుకులు మా ఆవిడ కంటికే కనిపిస్తాయి.
వినపడి ఉండదు. ఫోన్ తీసి అదే కూత వేసాను.
“అలా అరవకండి. కింద మీ డెన్ రూం లో ఉన్నాను. అన్నీ వస్తువులు ఎక్కడంటే అక్కడ పడేశారు. సర్ది వాక్యూమ్ చేస్తున్నాను. ఈ మెషీన్ చప్పుడులో వినపడ లేదు. పెళ్లి పిలుపు వచ్చిందా? ఎదురు చూస్తున్నదే కదా. రిసెప్షన్ కు ఎలానూ పిలుస్తారు. ఎక్కడ పెట్టుకుంటున్నారు రిసెప్షన్?”
రిసెప్షన్ ఎక్కడ అని చూసాను, “ ఏదో ఫార్మ్ హౌస్ అని ఉందే.”
“ఫార్మ్ హౌస్ అంటే కొంపదీసి ఆ వరహాల రావుది కాదు కదా. ఈ మధ్య మన వాళ్ళు పొలోమని అన్నీ పెళ్ళిలు అక్కడే చెయ్యడం మొదలెట్టారు.”
అడ్రస్ గూగుల్ చేస్తే బాగా ఊరు బయట పొలాలు, అడవుల మధ్యలో ఉందని తెలిసింది. గూగుల్ మహాశయుడు అలానే ఆ ఫార్మ్ హౌస్ వరహాల రావు పేరు మీద ఉందని చల్లగా చెప్పాడు.
“అవును వరహాల రావు ఫార్మ్ హౌసే.”
“అంటే, ఆ ఫార్మ్ హౌస్ రామ్ గోపాల్ దే నని మనకు తెలుసు కదండి. నేనైతే రాను. రావడం లేదని ఆర్ ఎస్ వి పి చేసేయండి.”
మా ఆవిడన్నది నిజమే. వరహాల రావు పేరు మీదున్న రామ్ గోపాల్ బినామీ ఆస్తి ఇది. రామ గోపాల్ అంటే అగ్గి మీద గుగ్గిలం వేసినట్లు చిర్రెత్తుకొస్తుంది మా ఆవిడకు.
రామ గోపాల్ ను అందరూ, రాము అని పిలుస్తారు. అలా పిలవమని రామ్ గోపాల్ మొదటి పరిచయంలోనే చెప్పడం ఒక కారణం కావచ్చు. అలా మంచి బాలుడు రాముగ నాకు పరిచయం అయ్యాడు. రాము నాకు బాగా సన్నిహితులైన ఇద్దరు మిత్రులు పనిచేసే ఆఫీస్ లోనే పనిచేసే వాడు. మంచి మాటకారి, కలుపుగోలు మనిషి కావడంతో రాము అతి త్వరలోనే అందరి తలలలోను నాలుకల లాగా బాగా పాపులర్ అయిపోయాడు. దానికి తోడు ప్రతీ వారాంతం ఇంట్లో పార్టీలు, బయట హైకింగ్, సైక్లింగ్ అంటూ పలు కార్యక్రమాలు పెట్టి, రాము కనపడక పోతే కాళ్ళు కాలిన పిల్లుల లాగా అయ్యి పోయారు మా మిత్రులు. నన్నూ ఈ పార్టీలకి అప్పుడప్పుడు పిలిచే వాడు రాము, మా మిత్రుల పుణ్యమానని. తరచూ అందరూ నోరెళ్ళబెట్టేలా ఇండియాలో తనకుండే ఆస్తుల గురించి, వ్యాపార లావా దేవిల గురించి చిలువలు పలువలుగా చెప్పేవాడు.
అలాంటి రాము మీద మా మిత్రులు ఇద్దరు కోర్టులో కేసు వేసారని విని ఆశ్చర్యపోయాను. ఆ మధ్యనే రాముతో వారు కొంత దూరం పాటించడం చూసాను కానీ పెద్దగా దానికి కారణాలు వెదక లేదు. ఈ బిజీ లైఫ్ లలో దగ్గరవ్వడాలు, దూరం అవ్వడం మామూలే. కాని ఆ దూరం, కోర్టు కేసు దాకా పోవడం, నాకు తెలిసి అదే మొదటి సారి. మిత్రులను కలిసినప్పుడు కారణం అడగాలనుకున్నాను. అడగకుండా వాళ్ళే కారణం చెప్పారు.
రాము ‘మీ పెట్టుబడి ఒక సంవత్సరంలోనే రెట్టింపు చేస్తాను అంటే’ మా మిత్రులు చెరో అర్ధ మిలియన్ డాలర్లు రాము కు ఇండియాలో భూమి కొనడానికి అప్పగించారట.
డబ్బు అంది మూడు నెలలు అయినా, భూమి కొన్న దానికి రిజిస్ట్రేషన్ జరుగక పోవడం, మా మిత్రుల పేర్లు ఉన్న కాగితాలు చేతికి అందక పోవడంతో, మా మిత్రులకు మోసపోయామని తెలిసిపోయింది. చివరికి గత్యంతరం లేక రాము మీద కోర్టు కేసు వేసారు.
కోర్టు తీర్పు మా మిత్రులకి అనుగుణంగానే వచ్చింది. కానీ కోర్టు ఉత్తర్వు అమలు పరిచే వీలు లేకుండా, మేమందరం 'అయ్యారే ఎంత తెలివైన మోసగాడు' అని ముక్కు మీద వేలు వేసుకునేలా, తన పేరు మీదున్న ఆస్తులన్నీ అమ్మివేయడమో, వేరే వారి పేర్ల పైన మార్చి వేయడమో చేసి, ఒక రోజు మా ఊరి నుంచే తుర్రు పీకాడు. మా మిత్రులు కోర్టు ద్వారా తమ డబ్బులు వసూలు చేసుకోవడానికి చాలానే ఖర్చు పెట్టారు. రాము చెప్పినట్లు మా మిత్రుల పెట్టుబడి సంవత్సరంలోనే రెట్టింపు అయ్యింది. కాదంటే, ఆ రెట్టింపు, డబ్బు వచ్చే బదులు పోయింది.
మా మిత్రులు లాగా నేనూ మోసపోలేదని ఒక్కింత ఊరట కలిగినా, అది నా వల్ల కాదని తెలుసు. రాము నన్ను టార్గెట్ చేసి ఉంటే నేనూ అలానే మోసపోయే వాడిని. రాము ఈజ్ సచ్ ఎ చార్మర్.
ఆ మోసం తరువాత రాము అంటేనే మా అవిడకు చెప్పలేనంత కోపం, ఏవగింపు. నా మోసపోయిన స్నేహితుల భార్యలు, తన ఇష్ట సఖులు కావడంతో రామ గోపాల్ మాటెత్తితే మండి పడుతుంది, ఇదిగో ఇప్పటిలా.
“రాంగోపాల్ ఫార్మ్ హౌస్ లో ఫంక్షన్ జరిగితే మనకు తెలిసిన ఆ మిత్రుడి కొడుకు రిసెప్షన్ కు పోకుండా ఉండడం బాలేదు.” మా ఆవిడకు నచ్చ జెప్ప చూసాను.
“ఎలా వెళ్ళ గలమండి. వెళ్తే మోసపోయిన మీ స్నేహితులు, నా స్నేహితులు ఏమనుకుంటారు. అయినా ఈ రిసెప్షన్కు మాత్రం పిలిచిన మిత్రుడు, మనమెంత ముఖ్యమో చెప్పకుండానే చెప్పేశాడు. రామంటే రెండు ప్లేట్లు ఆర్డర్ లో తగ్గించు కుంటాడు. మీరంతగా బాధ పడనవసరం లేదు.”
“మనల్ని పిలిచినతనికి, రాముకు సంబంధం ఏమి లేదు. తెలుగు వారందరూ ఈ ఫార్మ్ హౌజ్ నే తమ ఈవెంట్స్ కు ఎన్నుకుంటున్నారని తెలిసింది. మనం పోకపోవడం, అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లే.”
“నేను మాత్రం రాదలచుకోలేదు.” మా ఆవిడ కోపం కంఠం లో స్పష్టంగా వినపడుతోంది.
“ఏంటి నీవు లేకుండా నేను ఏదైనా పెళ్లికి వెళ్ళానా? ఎప్పుడు ఒక ఓ సి డీ లా ఆ రూములు శుభ్రం చేస్తూ కూర్చోకుండా, రిసెప్షన్ కు పోవచ్చు కదా. ఇదో ఆటవిడుపు అనుకో,” చెప్పిన వెంటనే నాలుక కొరుక్కున్నాను.
“అవును నాకు ఓ సీ డీ నే ఉంది. కానీ మీకు మీ రూము లో ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టుకోవాలని, రెస్ట్ రూంకు వెళ్తే ఫ్లష్ చేయాలని మాత్రం తోచదు. నాదో పని మనిషి బ్రతుకై పోయింది.”
“మళ్లీ ఆ టాపిక్ ఎత్తావా. అవును మనం ఈ దేశం వలస వచ్చిన తరువాత ఇక్కడి పద్ధతులకు అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. మన పని మనమే చేసుకోవాలి. కానీ వలస రావడం వల్ల మన జీవితాలు ఎలా మారి పోయాయో చూస్తూనే ఉన్నావు కదా. ఇంత డబ్బు, ఇంత పెద్ద బంగళా, రెండు లగ్జరీ కార్లు…”
“మీకు బాగానే ఉండొచ్చు. నాకు మాత్రం పని పెరిగింది. మీతో బాటు, మీ లాగానే నేనూ ఒక సీనియర్ పొజిషన్ లో మల్టి నేషనల్ కు పని చేస్తున్నాను కదా. కానీ నాకు దానితో బాటు ఈ ఇంటి పని కూడా నా నెత్తిన పడింది. ఇది వరకైనా పిల్లలు ఉండే వారు. ఆ సందడి లో అన్నీ మరిచిపోయే దాన్ని. ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు. మీరు నేను మాత్రం. ఒక బూత్ బంగ్లా లాగా ఉంది. అందులో ఒక పని మనిషిని నేను. మీరొక వాచ్ మాన్.”
“అలా ఎలా అనుకుంటావు బంగారం,” అనునయించబోయాను.
“ఇంకెలా అనుకొంటాను. మీరే విధంగా నైన సమర్దించు కోవచ్చునేమో గానీ, నా పరిస్థితి నాకు బాగా అర్థం అయ్యింది. నేను మన దేశంలో ఇద్దరు ముగ్గురు పని వాళ్ళ సాయంతో బ్రతికిన దాన్ని. అంట్లు తోమడానికి, ఇల్లు తుడవడానికి, బయట పనులు చేయడానికి మనుష్యులు ఉండే వారు. ఇక్కడికి వచ్చిన తరువాత నాది ఒక కూలి బ్రతుకు అయ్యి పోయింది. మీరు ఆ మల్టి నేషనల్ కు పని చేస్తూ, అదో గొప్ప పని అని సరిపుచ్చు కోవచ్చు. నా పని ఆఫీసులో, ఇంట్లో కూడా కూలి పనినే. ఆ క్లారిటీ ఉంది నాకు”
“నువ్వంతా నెగటివ్ గా ఆలోచిస్తున్నావు. ఆ సత్యం, పిచ్చయ్య లు ను చూసి కూడా, ఆ మాటలు ఎలా అనగలుగుతున్నావు?”
“ఆ పిచ్చయ్య ఉదాహరణ పట్టుకొని వ్రేలాడడం మన పిచ్చి. అందులో సత్యం ఎంత మాత్రం లేదు. మనం చేస్తున్నది మెదడు ఉపయోగించనవసరం లేని రొటీన్ ఉద్యోగాలే. ఇంట్లో నేను చేస్తున్న ఊడిగం లాంటివే.”
“పోనీ వంటలు చేయడం ఆపేయి. రెస్టారెంట్ లో నుంచి తెప్పించుకొని తిందాం.”
“అదిగో, అలా బయట రెస్టారంట్ లో తినొచ్చు అంటారు. వారానికి ఒక సారి క్లీనింగ్ సర్వీసెస్ వస్తున్నాయి కదా అంటారు. నేనెంత చెప్పినా మీకు అంతు పట్టదు. మానవమాత్రులెవరు చెప్పినా మీకు అర్దం కాదు.”
ఇక తరవాత ఏమైందో చెప్పనవసరం లేదనుకుంటా. సంభాషణ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. మొదటి సారిగా నా అంతట నేనే ఒక రిసెప్షన్ కి ఒంటరిగా బయలు దేరాను.
ఫార్మ్ హౌస్ పోవడానికి, నగరం దాటి ఒక ఇరవై మైళ్ళు కంట్రీ రోడ్ల పై ప్రయాణం చేయాలి. ఆఖరి ఐదు మైళ్ళు ఒక వాహనం మాత్రం ప్రయాణం చేయ గలిగె కచ్చా రోడ్డు. ఒకప్పుడు, గుర్రాలు, ఎద్దులు, ట్రాక్టర్ లు నడిచిన కంకరు రాళ్ల బాట. ఎస్ యూ వి తేవడం మంచిదయ్యింది. సునాసయం గానే ఫార్మ్ హౌస్ చేరి నా కారు అక్కడ ఎగుడు దిగుడు గా ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్క్ చేసాను.
టిపికల్ రైతు నివాసం. ఒక పక్కగా పెద్ద ఇల్లు. మరో రెండు కొనలలో బార్న్స్ . పెద్ద ఇల్లు ను ఫంక్షన్ హాల్ గా మార్చారు. రెండు బార్న లలో ఒక దానిని బార్ లాగా, మరో దాన్ని భోజనాల శాలగా మార్చారు. మధ్యలో చాలా ఖాళీగా ఉన్న ప్రదేశము లో సమావేశాలు, పెళ్ళిళ్ళ కని కొత్తగా సిమెంట్ ఫ్లోర్ వేసారు. ఇప్పుడు జరుగుతున్న రిసెప్షన్ అక్కడే. వర్షం లేదు కాబట్టి, సాయంకాలం, ఆరు బయట, ఆకాశం రంగులు మారుతుంటే, అక్కడ రిసెప్షన్ కని ఏర్పాటు చేసిన బంగారు వన్నె కుర్చీలు, అందంగా పూలతో సర్థిన టేబుల్స్, డ్యాన్స్ కని నవ దంపతుల పేర్లతో డిజైన్ చేసిన వేదిక అన్నీ చూడ ముచ్చట గా ఉన్నాయి.
మంచి పని చేసారు. వేదిక దగ్గర ఒక మూడు టేబుల్స్ తప్పితే, అతిథులు ఎక్కడైనా కూర్చో వచ్చు అన్నారు. నేను డ్రింక్స్ వైపు వెళ్ళి, ఒక మాస్కో మ్యూల్, కొన్ని మిర్చి బజ్జీలు, మిరియాలతో వేయించిన రొయ్యల ప్లేట్ తీసుకొని, కూర్చోవడానికి స్థలం వెదికాను. డ్రింక్స్ దగ్గిరే ఒక టేబుల్ కనిపించింది. ఇంకా జనాలు వస్తున్నారు కాబట్టి, టేబుల్స్ ఖాళీగానే కనిపిస్తున్నాయి. వేదికకు దూరంగా, డ్రింక్స్ కు దగ్గరగా ఈ టేబిల్ బాగానే ఉందని అక్కడే కూల బడ్డాను.
వచ్చిన జనం అందరూ వేదిక దగ్గరున్న టేబుల్స్ కే ఎగబడడంతో, నా టేబిల్ దగ్గర, నేను తప్పితే మరెవరూ లేరు. అది నా పరిస్థితికి బాగానే సరిపోయింది. మా ఆవిడ ఎక్కడ అని అడిగే జనాల వేదన నుండి తప్పించుకోవచ్చు. అసుర సంధ్య. సూర్యుడు అస్తమించడంతో అక్కడ వేసిన రంగు రంగుల ఎలక్ట్రిక్ దీపాలు తమ పని ప్రారంభించాయి. బార్టెండర్ కాక్ టెయిల్ బాగానే చేసాడు. మరోటి తాగొచ్చు. రొయ్యలు కూడా రుచిగా ఉన్నాయి. ఈ మధ్య బాగా పాపులర్ అయ్యిన "రాయల సీమ రుచులు" కాటరర్స్. వచ్చే పోయే జనాలను చూస్తూ, అలా నా ఆలోచనల అంబరంలో ఎగరడం మొదలెట్టాను.
నా ఆలోచనలను, వంటరితనాన్ని భంగ పరుస్తూ, ఒక పొడవైన వ్యక్తి నా దగ్గర వచ్చి, "కేన్ ఐ టేక్ ఎ సీట్?" అని నా పక్కనే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. కొద్దిగా బురద అంటిన వర్కర్ బూట్లు, బాగా వయస్సైన జీన్స్ ప్యాంట్, గళ్ళ చొక్కా. ముఖంలో బాగా మొటిమలు వచ్చినట్లు మచ్చలు. కణతల దగ్గర ఆ మచ్చలు మరింత పెద్దగా ఉన్నాయి. చక్కగా, అందంగా ఉన్న నవ్వు కు దిష్టి చుక్కలుగా, అక్కడక్కడ రాలిపోయిన పళ్ళ వల్ల ఏర్పడిన తొర్రి రంధ్రాలు. ఒక నిమిషం గేట్ క్రాషర్ అని అనుమానం వచ్చింది. కానీ అతని మాట తీరు చూస్తే మర్యాదస్తుడే అనిపించింది. వయస్సు ముప్పై లలో ఉంటుందేమో.
"గో ఎహెడ్," అని నన్ను నేను పరిచయం చేసుకున్నాను.
"జిమ్," అని చేయి చాచి నా చేతులతో కలిపాడు. చేతులు చల్లగా అనిపించాయి.
నా ముఖంలో ఆశ్చర్యాన్ని పసి కట్టినట్లు, "నేను ఇక్కడే ఈ ప్రాపర్టీ ని చూసుకుంటుంటాను. నేను ఈ ప్రాంతంలోనే పుట్టి పెరగడం వల్ల నాకు ఈ ఫార్మ్ హౌజ్, ఈ చుట్టూ పక్కల ఉన్న పొలాలు, ఇతర రైతుల ఇళ్ళు కూడా నాకు బాగా తెలుసు. నాకు తగిన పనే దొరికి పుచ్చుకున్నాను," అన్నాడు నవ్వుతూ. అతడి అరిగిపోయిన పళ్ళు, ఎర్రటి చిగుళ్ళు, పంటి తోర్రలు ఈ సారి అంతగా కలవర పెట్టలేదు.
"అలా అంటే ఇక్కడ జరిగే ప్రతీ ఫంక్షన్ లో మీరు కూడా పాల్గొనవచ్చన్న మాట," అన్నాను నేను.
"అవును. కానీ అది నాకు పనే. ఫంక్షన్ పర్యవేక్షించడం వల్ల ఈ ప్రదేశాన్ని మరింత సురక్షణంగా ఉంచొచ్చు," అన్నాడు జిమ్.
"అంటే మీరు సెక్యూరిటీ మనుష్యులు అన్న మాట."
"అలానే అనుకోండి," అన్నాడు జిమ్.
"మీరేమి డ్రింక్స్, స్నాక్స్ తెచ్చు కోలేదు."
"పని మీదున్నాను కదా. నేను మీలా గెస్ట్ కాదు. ఇక్కడనే ఉండే వాడిని. డ్రింక్స్, స్నాక్స్ నాకు అవుట్ ఆఫ్ బౌండ్స్," అన్నాడు జిమ్.
"ఇప్పుడు మీరు చేసే పని ఏముంటుంది?"
"ఇదిగో మీలా వచ్చిన అథితులను పలుకరించి వారి దగ్గర నుంచి ఈ ప్రదేశం, ఏర్పాట్ల గురించి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం. అన్నట్టు మీకు ఈ వెన్యూ నచ్చిందా?"
"వెన్యూ బాగానే ఉంది. కానీ పెళ్లి విడిది లాగా అనిపించలేదు. ఒక ఫార్మ్ హౌజ్ లాగానే ఉంది. ఇక్కడికి రావడానికి మార్గం కూడా బాగా లేదు. నాకు లాగానే, ఇక్కడికి వచ్చే అతిథులకు నచ్చదు అని నా అభిప్రాయం. అయినా మీరు ఈ ఫీడ్బాక్ కోసం ఇంత మందిలో నన్నే ఎలా ఎన్నుకున్నారు?"
"మీరు వంటరిగా కనిపించారు. జనాలు చేస్తున్న రణ గణ ధ్యనులకు దూరంగా ఉన్నారు. ఫ్రెండ్లీ గా కనిపించారు. ఇంతకన్నా ఏమి కారణాలు కావాలి?"
"నా ఫీడ్ బ్యాక్ మీకిచ్చేసాను. మీ పని అయ్యిపోయిందనుకుంటాను. మీకు ఈ ఫార్మ్ హౌజ్ ముందే తెలుసు అన్నారు. ఫంక్షన్ మొదలవ్వడానికి మరో పావు గంట ఉంది. ఎలా వచ్చారు కాబట్టి, ఈ లోపల మీకు ఈ ఫార్మ్ హౌజ్ గురించి తెలిసిన విషయాలు తెలపండి," అన్నాను నేను.
-- తరువాయి భాగం (ముగింపు) వచ్చే సంచికలో...... --