Menu Close
ఉప్పలూరి మధుపత్ర శైలజ
వారధి (కథ)
-- మధుపత్ర శైలజ --

‘బలుసుతిప్ప’ గోదావరీ పరివాహక ప్రాంతాలలోని ఓ కుగ్రామం. ఇప్పుడంటే చాలా లంకగ్రామాలకు వంతెనలు కట్టడంతో ప్రజలు గోదారమ్మని సులువుగా దాటగలుగుతున్నారు గానీ, ఓ ఇరవై సంవత్సరాల క్రితం లంకగ్రామాలను చేరాలంటే తప్పనిసరిగా నాటు పడవల ప్రయాణమే వారికి ఆధారంగా ఉండేది.

చుట్టుపక్కల గ్రామలలో జరిగే సంతలలో తాము నదిలోపట్టిన చేపలను అమ్ముకోవాలన్నా, నిత్యావసరాలు, కూరగాయలు కొనుక్కోవాలన్నా, పిల్లలను పట్టణాలకు చదువులకొరకు పంపాలన్నా, వైద్యం కొరకు పెద్దాసుపత్రికి వెళ్ళాలన్నా, ఇలా ప్రతిపనికి రేవుదాటటానికి ఈ నాటుపడవలే గతి.

చినుకు పడిందంటే ఊరివారు ఇంటికే పరిమితం కావలసి వచ్చేది. ఇక వానలొచ్చినా, వరదలొచ్చినా, తుఫాన్లొచ్చినా వారి బాధ వర్ణనాతీతమే.

పాపన్నకు రెండు నాటు పడవలుండేవి. ఒకటి చేపలు పట్టేందుకు వాడుతూ, మరొకదానిని దగ్గరి గ్రామాలకు ప్రజలను తీసుకువెళ్ళటానికి ఉపయోగించేవాడు. అతనికి కృష్ణ ఒక్కడే కొడుకు. పిల్లగాణ్ణి బాగా చదివించాలన్న కోరికున్న భార్య గంగమ్మ, పాపన్న పట్టితెచ్చిన చేపలను గ్రామాలలో అమ్ముతూ భర్తకు, చేదోడువాదోడుగా ఉంటున్న సాధారణ గృహిణి.

తన అన్నపిల్లలు అమలాపురం హైస్కూలులో జేరి చక్కగా చదువుకుంటున్నారు. తాను వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడల్లా వాళ్ళు చెప్పే స్కూలు కబుర్లు, చదువును గురించిన మాటలకు గంగమ్మ మైమరచిపోయేది. చదువుంటే ఈ లోకాన్ని జయించవచ్చుననే భావనలో ఉండేది గంగమ్మ. అందుకే తన కొడుకును ఊళ్ళోనున్న ఎలిమెంటరి స్కూలులో చదివిస్తోంది. వాడిప్పుడు 5వ తరగతికి వచ్చాడు.

పాపన్నకేమో ఈచదువులకు సంబంధించిన కబుర్లంటే విసుగు. “నేను చదువుకోకపోయినా చక్కగా సంపాదించుకోవటంలా? వాణ్ణి హాయిగా నాతోపాటు వేటకు తీసుకుపోతే, నాకు చేదోడువాదోడుగా ఉంటాడు. చేపలు పట్టటంలోని మెళకువలు, తెడ్డు వేసి నావ నడపే నైపుణ్యాన్ని నేర్పితే జీవితానికి పనికివచ్చే పనులు నేర్చుకుంటాడుకదా. ఉన్న ఒక్క పిల్లగాణ్ణి చదువుపేరుతో దూరం చేసుకోవటమెందుకు?” అన్నది పాపన్న వాదం. కానీ అతని మాటలను గంగమ్మ పట్టించుకునేది కాదు. తన కొడుకుని మంచి చదువు చదివించి, పెద్ద ఉద్యోగంలో చూసుకోవాలన్నది ఆ తల్లి కోరిక.

ఆరోజు బాగా ముసురు పట్టింది. ఉదయం నుండి చిరుజల్లులు పడటం మొదలయ్యింది. గోదాట్లో పడిన చినుకులు ఉదయపుకాంతిలో ముత్యాలవలే గోచరిస్తున్నాయి. గంతులేస్తూన్న ఆనీటి బిందువులను చిరుచేపలు పట్టుకుని బుడుంగుమంటూ నీళ్ళలోకి మునిగిపోతూ, ఆటలాడుతున్నాయి చినుకులతో. ఒడ్డునున్న చెట్లపై పిట్టలు ముసురుకి ముడుచుకుని కువకువమంటున్నాయి.

రాత్రే పాపన్న ఇంటికొచ్చిన పిల్లలు, “రేపటి నుండి మాకు పరీక్షలు జరగబోతున్నాయి. కాబట్టి కాస్త తొందరగా మమ్మల్ని స్కూలుకి తీసుకెళ్ళాలి” అని మరీమరీ చెప్పారు. అందుకే రాటకి కట్టేసిన పడవలో కూర్చున్న పాపన్న “ఈ ముసురులో పిల్లల్ని ఆ ఒడ్డునున్న హైస్కూలుకి తీసుకెళ్ళగలనో? లేదో?” అనుకుంటున్నాడు.

“అప్పుడే సమయం ఉదయం ఏడుగంటలవుతోంది. ఈ వర్షానికి తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకి పంపుతారో? లేదో? వాన ఇంకాస్త పెద్దదయితే తానే పడవను నడపలేడు. పిల్లలు ఇంకా వస్తున్న జాడ కనిపించటం లేదు” అనుకుంటూ పిల్లల కోసం ఎదురుచూస్తున్నాడు పాపన్న.

ఇంతలో సర్పంచ్‌గారి అబ్బాయి మధు, కౌలురైతు ధర్మన్న కొడుకు శ్రీను, మాస్టారి అబ్బాయి బాలు, మరో ఆరుగురితో కలసి గుంపుగా వస్తూ కనిపించారు, వీపుపై పుస్తకాల బ్యాగ్‌లు, చేతులలో గొడుగులు, భోజనం క్యారియర్‌లు తీసుకుని గబగబా నడుస్తూ వస్తున్నారు.

దగ్గరకు వచ్చిన పిల్లలతో, “ఇవాళ ముసురుగా వుంది. మనం స్కూలుకి వెళ్ళకపోతే మంచిదేమో?” అన్నాడు పాపన్న.

“అమ్మో! ఈరోజు పరీక్షుందని, తొందరగా వెళ్ళాలని నిన్న రాత్రే చెప్పాం కదా! మర్చిపోయావా. చిన్న జల్లేగా. మా దగ్గర గొడుగులున్నాయికదా” అంటూ పడవనెక్కేసారు పిల్లలు.

“మరైతే త్వరగా సగంమంది ఒకవైపు, మిగిలిన వారు మరోవైపు జాగ్రత్తగా కూర్చోండి. వాన పెరిగే లోపు మనం ఆవలి ఒడ్డుకు జేరిపోదాం. అందరూ ఎక్కారుగా?” అంటూ తెడ్డువేసి పడవను ముందుకి నడిపించాడు పాపన్న.

“ఒరే మధూ! ఇవాళ తెలుగు పరీక్షలో వచ్చే పద్యాలు బట్టీ పట్టావా? ఆ పోతనామాత్యుని భాగవతంలోని 'హరిమయం' అన్న పద్యం నాకు సరిగా గుర్తు వుండటంలేదురా. ఒకసారి నువ్వు ఆ పద్యం చదవరా” అని శ్రీను అడగటంతో మధు “హరి మయం విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సంశయం పనిలే దా, హరిమయం గాని ద్రవ్యం, పరమాణువు లేదు వంశపావన! వింటే” అంటూ ఆ పద్యాన్ని రాగయుక్తంగా పాడాడు.

“మధూ! నీకు తెలుగు పద్యాలు చాలా బాగా వస్తున్నాయిరా” అన్నారు స్నేహితులు. “చదివితే మీకూ వస్తాయి” అన్నాడు మధు.

“ఒరేయ్ మధూ! అంతా ‘విష్ణుమయం’ అని చెప్పావు కదా నువ్వు. మరి ఈ పడవలో, తెడ్డు వేసే పాపన్నలో, ఇదిగో ఈ నీళ్ళల్లో తిరుగాడే బుల్లిబుల్లి చేపల్లో విష్ణువు ఉంటాడా?” అంటూ శ్రీనుతో మొదలు పెట్టి స్నేహితులంతా పడవలో గలాటా చేయటం మొదలుపెట్టారు. వారి అల్లరి పెరిగి పడవ అటూఇటూ ఊగిపోవటం మొదలుపెట్టింది.

పాపన్న ఎంత చెపుతున్నా పిల్లలు వింటేగా! ఒక్కసారిగా వాన పెరిగిపోయింది. పిల్లలు గొడుగులు తెరిచారు. పెద్ద గాలి వచ్చి పడవ ఒకప్రక్కకు బాగా ఒరిగింది. అక్కడే కూర్చుని గొడవ చేస్తున్న శ్రీను నదిలో పడిపోయాడు.

“పాపన్నా! శ్రీను నీళ్ళలో పడిపోయాడు. వాడిని కాపాడు” అంటూ పిల్లలంతా అరవటం మొదలుపెట్టారు.

“బాబూ! ఇప్పుడు నేను తెడ్డును, పడవను వదిలి నీటిలోకి వెళితే మీ అందరి ప్రాణాలకు ముప్పు వస్తుంది. అదిగో ఒడ్డు దగ్గరకొచ్చేసాం. మీరు జాగ్రత్తగా పడవ దిగగానే, నేను శ్రీను బాబు కొరకు నదిలోకి వెడతాను” అని ఆందోళనగా అంటూ మిగిలిన పిల్లలను ఒడ్డుకు జేర్చాడు పాపన్న.

పడవను అక్కడున్న రాటకు కట్టటం కూడా చేయకుండా పాపన్న నదిలోకి ఈదుతూ వెళ్ళిపోయాడు శ్రీను బాబును కాపాడటానికి. పిల్లలంతా “అయ్యో! శ్రీను నీళ్ళలో పడిపోయాడు” అంటూ అరుస్తూ ఊళ్ళోకి పరిగెత్తికెళ్ళి, స్కూలు టీచర్లకు, పెద్దలకు చెప్పారు. వారంతా ఆఘమేఘాలమీద ఒడ్డుదగ్గరకు ఆతృతతో చేరుకున్నారు.

క్షణ్ణాల్లో విషయం ఊరిలో తెలిసింది. పిల్లల తల్లిదండ్రులందరూ రేవుదగ్గరకి చేరుకున్నారు. గ్రామ సర్పంచ్‌గారు కూడా అక్కడకు వచ్చారు. జోరున కురుస్తున్న వర్షం గ్రామస్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది.

శ్రీనుకి ఏమీ కాకూడదని అందరూ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నారు. గజయీతగాడైన పాపన్నకు సాయంగా మరో నలుగురు యువకులు రేవులో దిగి శ్రీనుని వెతకటం మొదలుపెట్టారు.

“ఉదయం నుండి వానపడుతోంది కదా, మీరు ఇలా రిస్క్ తీసుకుని ఎందుకు వచ్చారు? పరీక్షను మరొక రోజు పెట్టే వాళ్ళం కదా! ఇప్పుడు చూడండి ఎంత పని జరిగిందో? ఆ శ్రీను ఏమయ్యాడో? ఏమో?” అంటూ టీచర్లందరూ పిల్లల్ని కేకలేశారు.

తీరమంతా కోలాహలంగా మారింది. శ్రీనువాళ్ళ అమ్మానాన్నలు పిల్లాడికోసం దుఃఖంతో తల్లడిల్లిపోతున్నారు. నది వాలు తెలిసిన పాపన్న శ్రీనుని తొందరగానే పట్టుకున్నాడు. కానీ అప్పటికే జరగవలసిన ఘోరం జరిగిపోయింది. నిర్జీవమైన శ్రీను దేహంతో బయటకు వచ్చిన పాపన్న, శ్రీనుని అక్కడున్న చెట్టు క్రింద పడుకోబెట్టి, “శ్రీను బాబూ ఎంతపనైయ్యింది” అంటూ ఏడుస్తూ కూలబడిపోయాడు.

తలకొట్టుకుంటూ “నాన్నా శ్రీనూ! నీకప్పుడే నూరేళ్ళు నిండిపోయాయా!” అంటూ ఏడుస్తున్న ఆ తల్లిని చూస్తున్న ప్రతిఒక్కరి గుండే కరిగి కన్నీటి సంద్రమైపోతోంది.

శ్రీను తండ్రి ధర్మన్నకి ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుని వచ్చింది. కొడుకు మృతదేహం పక్కనే కూర్చున్న పాపన్నని చూస్తూ, “ఏరా పాపన్నా! నా కొడుకుని అన్యాయంగా చంపేశావు కదరా. మేం నీకేం ద్రోహం చేశామని, మాకు ఇంత శిక్ష వేశావు?” అంటూ పాపన్నను అనరాని మాటలతో బాధపెట్టసాగాడు.

“వూరిపెద్దలు నాకు న్యాయం చేయండి. మీ తీర్పును ఊరంతా అమలుచేస్తారుకదా. పాపన్న వల్ల నాకు జరిగిన అన్యాయానికి సరైన శిక్ష పడాలతనికి” అన్నాడు ధర్మన్న.

“అంకుల్! పాపం పాపన్న తప్పేంలేదిందులో. మేమందరం కలసి చేసిన అల్లరితో పడవ ఊగిపోవటం మొదలుపెట్టింది. అంతలో గాలివాన పెరిగిపోవటంతో శ్రీను పట్టుతప్పి నదిలో పడిపోయాడు. శ్రీను పడిపోగానే మేమంతా వాణ్ణి రక్షించమని అరుస్తూంటే, మమ్మల్ని కాపాడటానికే పడవను ఒడ్డుకు చేర్చి, మేమందరం గట్టెక్కిన తరువాతే నదిలోకి వెళ్ళాడు పాపన్న. గాలివానను కూడా లెక్కచేయకుండా నదిలో గాలించి శ్రీనుని బయటకు తీసుకొచ్చాడు” సర్పంచ్‌గారి దగ్గరకు ఏడుస్తూ వెళ్ళిన పిల్లలు పాపన్న తరుఫున మాట్లాడారు.

శ్రీను అంతిమ సంస్కారాలకు ఊరంతా కదిలి వచ్చింది. శ్రీను తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా వుంది. గోదారమ్మ వరదలా పొంగుకొస్తున్న వారి దుఃఖాన్ని పెద్దలంతా ఓదార్చారు.

“సర్పంచ్‌గారు! మాకు ఇక జీవితమేలేదు. ఒక్కగానొక్క కొడుకు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాం. ఇంతలో ఇలా ఘోరం జరిగిపోయింది. మేమిక ఎవరి కోసం బ్రతకాలి?” అంటూ ఏడుస్తున్నాడు ధర్మన్న.

“అసలు వానలో పడవనడపటం నీవు చేసిన తప్పు పాపన్నా. అందుకే నేనొక మాట చెపుతాను విను. నీ కొడుకు కృష్ణను శ్రీను వాళ్ళ తల్లిదండ్రులకిచ్చేసెయ్యి. వాళ్ళు మీకన్నా స్థితిమంతులు గాబట్టి మీ కృష్ణను బాగా ముద్దుగా చూసుకుంటారు. మంచిగా చదివిస్తారు. పిల్లవాడు ఈ ఊరిలోనే ఉంటాడు. మీరు ఎప్పుడంటే అప్పుడే మీ పిల్లవాణ్ణి చూసుకునే వీలుంటుంది.  ఏమంటావు?” అన్నారు సర్పంచ్‌గారు.

పాపన్న భార్య “ఇదెక్కడి న్యాయం సర్పంచ్‌గారు. ఇలాంటి తీర్పునిచ్చారు? జరిగిన సంఘటన నా భర్త కావాలని చేసిన తప్పు కాదుకదా. వానలో పిల్లల్ని బడికి పంపిన పెద్దవాళ్ళది తప్పుకాదా? నది దాటటానికి పడవనడిపిన నా భర్తదెలా తప్పుగా అంటారు?” అంటూ ఏడుస్తూ అంది.

తల్లి దగ్గరుండి వీరిమాటలను వింటున్న కృష్ణకు కొంచెంకొంచెంగా సర్పంచ్‌గారి మాటలు అర్థమవుతున్నాయి. “తనికనుండి శ్రీను ఇంట్లో ఉండాలి. అతని అమ్మానాన్నలనే అమ్మా, నాన్నా అని పిలవాలి కాబోలు” అనుకుంటూ ఒక్కసారిగా ఏడుపు తన్నుకురాగా అమ్మ ఒళ్ళో దూరి ఏడుపు లంఖించుకున్నాడు.

పాపన్న మౌనమునిలా ఉన్నాడు. అతని మెదడు మొద్దుబారిపోయింది. “నాన్నా! మాట్లాడు. నేను మిమ్మల్ని విడిచి శ్రీను వాళ్ళింటికి వెళ్ళిపోవాలా?” అంటూ పాపన్న కాళ్ళను పట్టుకుని రోదిస్తున్నాడు కృష్ణ. ఆ చిన్నిమనసు పడే తపనకు, అతని మాటలకు అక్కడున్న జనాలందరి కళ్ళు చెమరుస్తున్నాయి.

సర్పంచ్‌గారి అబ్బాయి మధు తండ్రి దగ్గరకొచ్చి “నాన్నగారూ! మా తెలుగు పుస్తకంలోని ఓ పద్యం ఉదయమే పడవలో చెప్పుకున్నాం. భాగవతంలోని దాని భావం నా కర్థమైనంతలో చెపుతాను. “ఈ విశ్వమంతా విష్ణుమయం. విష్ణువులేని ప్రదేశమే లేదు. ఆయన సర్వాంతర్యామి. ఎక్కడైనా తానే నిండి ఉంటాడు. ఆ విష్ణువతారమైన చిన్నికృష్ణునిలాగానే మన కృష్ణ కూడా ఇకనుండి ఇటు పాపన్న ఇంటిలోనూ, అటు మన శ్రీను వాళ్ళింట్లోనూ తిరుగుతూ ఇద్దరమ్మల ముద్దులకొడుకుగా పెరుగుతాడు.  ఏమంటారు మీరంతా? అని అడిగాడు ప్రజలను.

“బాబూ! మీ నాన్నగారిచ్చిన తీర్పును చక్కగా సవరించావు. నీ తీర్పుతో ఇరువురి ఇళ్ళల్లోనూ సంతోషం నిండుతుంది” అన్నారు.

కృష్ణ వచ్చి మధును కౌగలించుకుని “మధు అన్నా! నీవు చెప్పినట్లుగానే ఇకనుండి నేను రెండిళ్ళ బిడ్డగా పెరుగుతాను. ఏమ్మా! సరేనా?” అంటూ తల్లి చుబుకం పట్టుకుని లాలనగా అడిగాడు. శ్రీను అమ్మానాన్నలు పరమానందభరితులయ్యారు.

కృష్ణ సర్పంచ్‌గారి వైపు తిరిగి, నేను ఒక షరతుతో ఈ ఒప్పందానికి సమ్మతిస్తాను. మీరు దానికి ఒప్పుకోవాలి” అన్నాడు.

“నీ కోరిక సరైనదైతే ఎందుకు కాదంటాను?” అన్నారు సర్పంచ్‌గారు.

“మా పిల్లలందరి క్షేమం కోసం, ప్రజలందరి మేలుకొరకు మన నదిపై ఓ వారధి కట్టాలి. దానిని కూడా ఆరునెలలలోపే ప్రారంభించాలి. ఊరివారంతా చందాలు వేసుకుని కొంత సొమ్ము మీకిస్తాం. ప్రభుత్వం వారినుండి మిగిలిన సొమ్మును రాబట్టి వంతెన నిర్మాణం పూర్తిచేయించండి. వచ్చే సంవత్సరం మేం స్కూలుకు కొత్త వంతెన మీదుగానే వెళ్ళాలి. మా నాన్నపై పడ్డ అపవాదు ఇలా తొలగిపోవాలి. అలాగే శ్రీను పేరు చిరకాలం ఊరి ప్రజలకు గుర్తుండిపోవాలి. అందుకు తగిన ఏర్పాట్లను మీరు చూడండి” అన్నాడు కృష్ణ.

“మంచికోరికనే అడిగావు కృష్ణా. ఊరివారందరికి మేలు జరగటంతోపాటు, నీ స్నేహితుని జ్ఞాపకంగా ఆ వారధి నిలిచిపోవాలన్న నీ తృష్ణ అభినందించదగినది. ఇప్పుడే నేను మంత్రిగారి అపాయింట్మెంట్ కొరకు వారితో ఫోనులో మాట్లాడతాను” అన్నారు సర్పంచ్‌గారు.

తమకు తెలియకుండానే ‘తప్పుచేశారనే నింద పడి’ తమ కొడుకును శ్రీను తల్లిదండ్రులకు దత్తత పంపిన పాపన్న దంపతులకు, కొడుకును పోగొట్టుకున్న పుట్టెడు దుఃఖంలో ఉన్న ధర్మన్న దంపతులకు వూరటనిస్తూ కృష్ణ రెండిళ్ళ ‘వారధి’గా మారాడు.

ఎండాకాలం సెలవల్లో శరవేగంగా జరుగుతున్న వారధి నిర్మాణపనులను చూస్తూ చాలా ఆనందపడుతున్నారు పిల్లలు. పెద్దవాళ్ళంతా వారధి పూర్తయితే తమకున్న ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయన్న సంతోషంలో, వాళ్ళుకూడా తమకు చేతనైన పనులను చేస్తూ ఆ వారధి నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు.

అటు కృష్ణ కోరిన కోరిక నెరవేరుతుండటంతో ప్రజలందరి కళ్ళలోని ఆనందాన్ని గమనిస్తున్న పాపన్న దంపతులు సంతోషపడుతున్నారు, ఇటు “గొప్ప అభ్యుదయ భావాలున్న కొడుకుని తమకు ప్రసాదించిన ఆ విష్ణుమూర్తికి ప్రతిరోజూ భక్తితో కృతజ్ఞతలను చెప్పుకుంటూ, కృష్ణలో తమ చనిపోయిన శ్రీనుని చూసుకుంటున్నారు” ధర్మన్న దంపతులు.

మంత్రిగారి చేతుల మీదగా ఆ వారధిని ప్రారంభించారు. వారికి “తమ పిల్లల, పెద్దల కోరిక నెరవేరటానికి కారణమైన వ్యక్తి, ఈ బుడతడే” అంటూ కృష్ణను పరిచయం చేశారు సర్పంచ్‌గారు.

“చిన్నవాడివైనప్పటికి ప్రజలందరికి ఉపయోగపడే గొప్ప ఆలోచన చేసిన నీకు మంచి భవిష్యత్తు ఉంది” అంటూ కృష్ణను ఆశీర్వదించారు మంత్రిగారు.

“అంత చిన్నవయస్సులోనే ఊరిప్రజలందరి ప్రయోజనాన్ని తన కోరికగా ప్రకటించి, వారధిని పూర్తిచేయించిన కృష్ణ”ను ఓ అద్భుతాన్ని చూసినట్లుగా చూస్తున్నారు గ్రామస్థులందరు. స్కూలుకు వెళ్ళే విద్యార్ధులందరికీ నదిని దాటే అవసరాన్ని సులభతరంచేసిన కృష్ణను వారంతా అభినందిస్తున్నారు.

“సార్! ఇక నుండి ఈ వారధిని ‘పాపన్న వారధి’గా పిలుచుకుందాం. అప్పుడే నాన్న చేసిన త్యాగానికి విలువ వస్తుంది” అన్నాడు కృష్ణ. అతని మాటలను ప్రజలంతా చప్పట్లతో ఆమోదించారు.

****సమాప్తం****

Posted in January 2025, కథలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!