వాన వెలిసిన దృశ్యాలు
అక్కడ అల్లుకున్న
చీకట్లని చీల్చి చూడలేను.
అద్వితీయంగా వెలుగుతున్న
నాలో ఆత్మవిశ్వాసపు దీపాల్ని తప్పా.
సంపాదనకైనా ఆనందానికైనా
హద్దులుంటాయా
నాలో నేను మనలో మనం
ఆనందాన్ని ఆవిష్కరించటం కంటే
గొప్పది ఏముంటుంది.
ఇప్పుడు ఎవర్ని నిందించలేను
ఇప్పుడు ఈ ఏకాంత సమయంలో
ఎవర్నీ ఆహ్వానించలేను.
కళ్ళలోంచి మనో నేత్రాలపై నుంచి జారే
ప్రకృతి దృశ్యాలు తప్పా
ఏవీ హృదయాల్ని రంజింప చేయలేవు.
వాన వెలిసిన దృశ్యాలతో
కొంత దూరం నడిచి
యోగ ముద్ర లో కూచుని
నాతో నాలో నిండిన క్షణాల్ని
మౌనంగా ఆస్వాదిస్తున్నాను.