Menu Close
వాగ్రూపం - భావం, స్థితులు
-- పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు

ఇప్పుడు ఇంకొక ఆసక్తికరమైన విషయం చూద్దాం:

సింధు నాగరికత గొప్ప అభివృద్ధిగాంచిన నాగరికత. ఈ నాగరికత ఎంత ప్రాచీనమో నిర్ణయించడానికి Indus Seals లేక సింధు ముద్రలు ఉపయోగపడతాయి. వీటిమీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయనే మాట మీ అందరికీ తెలిసినదే. ఆ పరిశోధన ద్వారా, Carbon Dating ద్వారా తేలినది ఈ ముద్రలు క్రీ. పూ. 3000 నించి క్రీ.పూ. 4000 సంవత్సరాల మధ్యవని. ఈ మాట ప్రమాణం అంతర్జాలం ద్వారా ఎవరైనా తెలుసుకోవచ్చు. ఈ ముద్రల మీద డా. శ్రీమతి రేఖా రావు గారు గొప్ప పరిశోధన గత 25 ఏళ్లగా చేస్తున్నారు. ఆవిడ తన పరిశోధనలని యూట్యూబు ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా వెల్లడిస్తున్నారు. ఆవిడ ఇచ్చిన ఒక ప్రసంగం ప్రమాణంగా ఈ క్రింద ఇచ్చిన సమాచారం వ్రాస్తున్నాను. ఆ ప్రసంగం లింకు కూడా కింద పొందు పరిచాను. శ్రీమతి రేఖా రావు గారి ప్రకారం ఈ ముద్రలలో సూచించిన చిహ్నాలన్నీ వైదికమైన యజ్ఞ ప్రక్రియలనే సూచిస్తాయి. రకరకాలైన యజ్ఞాల ముద్రల ఫోటోలు మనకి ఇప్పుడు లభ్యమవుతున్నాయి. ఈ యజ్ఞాలలో బ్రహ్మ, హోత, అధ్వర్యుడు, ఉద్గాత, వగయిరా యజ్ఞ నిర్వహణ కర్తలు ఉంటారు. వారంతా వేదంలో ఆ యజ్ఞానికి అవసరమైన భాగం చదువుతారు. ఆ చదవడంలో కలిగే శబ్ద ప్రక్రియ నేను పైన రాసిన పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ రూపాలలో ఉంటుంది. ఈ క్రింద చూపిన బొమ్మ చూడండి. ఒక వృషభం ఒంటి కొమ్ముతో మోర సమానంగా పెట్టి ఉన్నది. ఆ వృషభం మెడ కింద ఒక వస్తువు కనిపిస్తుంది. ఈ వస్తువు చాలా ముద్రలలో కనిపిస్తుంది. కానీ చిన్న చిన్న భేదాలు ఉంటాయి. ఆ భేదాల గురించి పరిశోధన చేసిన శ్రీమతి రేఖా రావు గారి ప్రకారం, ఈ వృషభం హోత. ఆ కింద వస్తువు వాక్కు యొక్క ప్రతీక. ఆ చిన్న వస్తువు కింద ఉన్న కర్ర లాంటి భాగం పరా అనీ, ఒక గిన్నె లాగా ఉన్న భాగం పశ్యంతీ అనీ, దాంట్లో మధ్య భాగం మధ్యమా అనీ వ్యవహరిస్తారు. ఆ పైన ఉన్న భాగం - Lamp Shade లాగ ఉన్న భాగం ఛందస్సుని సూచిస్తుంది. ఆశ్చర్యకరమేంటంటే ఈ ఛందస్సు భాగానికి రకరకాల షేపులున్నాయి. వీటి గురించి తెలుసుకోవాలంటే కింద ఉదహరించిన రేఖారావు గారి ప్రసంగం చూడండి. కింద రెండు బొమ్మల్లో రెండు రకాల వృత్త సూచనలు చూపించాను.

vagroopam-01

vagroopam-02

ఇప్పటి దాకా దాదాపు 5,000 కి పైగా ముద్రలు దొరికాయి. ఎంత చక్కగా ఉన్నాయో ఆ చెక్కడాలు! ప్రతీ ముద్రా 3 సెం.మీ. స్ 3 సెం. మీ. సరిచతుస్ర పరిమాణంలో ఉంటుంది. ఇన్ని వేల ఏళ్ల క్రితం ఇంత పనితనంతో ఇన్ని వేల ముద్రలు చెయ్యగలిగారంటే మన టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినదో ఊహించచ్చు. అలాగే వేదాలలో ఉన్న ప్రక్రియలని ఇంత పనితనంతో ఇంత అందంగా ముద్రలలో భద్ర పరిచారంటే వారి దూర చూపుని, వేదాలని ప్రచారం చేసే పద్ధతిని మనం గమనించవచ్చు. అలాగే మూడు రకాల స్వరాలూ ఈ ముద్రలలో చూపబడి ఉన్నాయి. ఉదాత్త స్వరానికి వృషభం మెడ పైకి ఉంటుంది. అనుదాత్త స్వరానికి వృషభం మెడ కిందికి ఉంటుంది. స్వరిత స్వరానికి పైన చూపబడినట్లు సమానంగా ఉంటుంది.

లింకులు:

  1. Here check from time 39:00 to 42:00 of "Religious Practices Depicted in Indus Seals" by Dr. Rekha Rao.
    YouTube video : https://www.youtube.com/watch?v=3XyZi2SE3Vo&feature=youtu.be
  2. అంతర్జాలంలో క్రింద ఇచ్చిన లింకులో డా. శ్రీమతి రేఖా రావు గారి Indus Seals విశ్లేషణం ఉన్నది. ఇది చదువ ప్రార్థన.
    http://indiafacts.org/significance-of-the-single-horned-bull-in-indus-seals/

ఇప్పుడు, మనం వాక్కు ఎలా వస్తుందో కొంత తెలుసుకున్నాం. అయితే ఈ వాక్కు ఎలా వినడం? వినేవాళ్ళకి ఈ అనుభూతి ఎలా వస్తుంది? ఒకరు మాట్లాడిన మాట ఇంకొకరికి ఎలా చేరుతుంది? చేరిన వాళ్ళకి అది ఎలా అర్థమవుతుంది? ఇలాంటి ప్రశ్నలు సహజం. దీనిమీద కొంత రిసెర్చి జరుగుతోంది. కానీ నా ప్రయత్నం మన సనాతన ధర్మ వాఙ్మయంలో ఏమున్నది? అది తెలుసుకోవాలి.

దీనికి కూడా భర్తృహరి వాక్పదీయంలో కొంత సమాధానమున్నది. ఒక మనిషి ఒక వాక్యం పలికినప్పుడు, అతనిలోని వైఖరి ద్వారా ఆ వాక్యం బయటకి వచ్చినప్పుడు, ఆ అర్థవంతమైన శబ్దం కొన్ని అణుమాత్ర పొట్లాలుగా (Sound Packets ) ప్రయాణం చేస్తుంది. వీటిని శబ్ద తరంగ పొట్లాలుగా కూడా వ్యవహరించవచ్చు. ఈ "శబ్దాణువులు" ప్రయాణంచేసి, వినేవారి చెవులలో స్థానాలకి ఒకదాని వెనుక ఒకటి తగులుతాయి. (కర్ణస్థానాలలో). ఈ శబ్దాణువు చెవికి తగలగానే చెవిలో ఒక ప్రకంపన పుడుతుంది. ఇది ఏ స్థానానికి సంబంధించిన శబ్దమో ఆ స్థానంలోనే ఆ శబ్దప్రకంపన పుడుతుంది. ఈ శబ్దాణువువల్ల కలిగే ప్రభావం వెంటనే సమసిపోయినా, దాని గుర్తు కొన్ని క్షణాలపాటు ఉంటుంది. (పెర్సిస్టెంస్ అఫ్ ఆడిషన్; ఇది కూడా పెర్సిస్టెంస్ అఫ్ విజన్ వంటిదే ). ఒక వాక్యం వినడం పూర్తవగానే ఆ వాక్యార్ధం వినేవాడికి అర్థం అయిపోతుంది. అయితే మాట్లాడేటప్పుడు లాగా, వినేటప్పుడు కూడా ఏ భాషలో వింటున్నామో ఆ భాష గురించిన అవగాహన ధారణలో ఉంటేనే అది అర్థం అవుతుంది. లేకపోతే ఉత్తి ' ధ్వని ' లాగా వినిపిస్తుంది.

వాక్కు యొక్క పుట్టుక ఎంత బాగా వివరణలో వుందో వినికిడి గురించి అంత వివరంగా నాకు కనబడలేదు. ఇంకా పరిశోధించాలి. ఇలాంటి శక్తులని ఇంత బాగా అర్థం చేసుకుని, భావి తరాలవాళ్ళకి అర్థం అయేలా చేసిన భారతీయ ఋషులకి (భారతీయ సైంటిస్ట్స్ కి) మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ ....  !

భవదీయుడు,

పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు

## సమాప్తం ##

Posted in June 2020, సాహిత్యం

1 Comment

  1. GSS Kalyani

    అద్భుతమైన వ్యాసాన్ని అందించినందుకు కృష్ణ కుమారు గారికి, ‘సిరిమల్లె’ పత్రిక వారికి ధన్యవాదాలు!

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!