పదిహేడవ మంత్రం
వాయురనిలమమృతమథేదం భస్మాంతం శరీరమ్
ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర
భావం: ఈ శరీరం కాలి బూడిద అయిపోతుంది. ఈ శరీరం నుండి వెలువడే ప్రాణం సర్వ వ్యాపి అయిన మొత్తం వాయువులో కలిసిపోతుంది. ఓ మనసా నీవు చేసిన వాటిని ఆలోచించి చూడు. చేసిన వాటిని ఒకసారి స్మరించుకో.
భాష్యం: ఈ ఉపనిషత్తు ఋషి చరమస్థితి అనుభూతిని పొందిన తరువాత కారుణ్య దృక్కులతో ఈ లోకాన్ని వీక్షిస్తాడు. ఈ లోకమనే మాయా వలలో చిక్కుకొని, మానవులు అనుభవించే బాధలు ఆయన కళ్ళకు కనిపిస్తున్నాయి. అందువలన వారందరినీ ఆహ్వానించి జీవితం గురించి ఒక్కసారి గతాన్ని చింతన చేయమని చెబుతారు. అజ్ఞానమనే బురద నుండి విడివడి జ్ఞాన ప్రకాశాన్ని పొంది, ఆ ప్రకాశానికి కూడా ఆవలి ఉంటున్న సత్యాన్ని గ్రహించడానికి భగవంతుని ప్రార్థించడం తప్ప, మరో మార్గం లేదు. అందువలన ఆ ప్రార్ధనలో తన గురించి తాను చెప్పుకుంటున్నాడు.
ఆధ్యాత్మిక భావన కలవారు గానీ లేక సామాన్య మానవులు గాని ఎవరైనా సరే జీవితంలో ప్రతినిత్యం తాను తరచుగా మనసును హెచ్చరిస్తూ ఉండాలి. గతంలో ఏ పనులు చేసాము. వాటి ఫలితాలు ఏమిటో ఒకసారి బేరీజు వేసుకోవాలి. అందువలన గతంలో మన కర్మల వలన ఏదైనా చెడు జరిగి ఉన్నట్లయితే, వాటిని తెలుసుకొని భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలి.
పేదవాడైనా ధనికుడైన సరే అందరి శరీరాలు చివరకు బూడిద లేదా మట్టిలో కలిసిపోతాయి. ఇంతవరకు శరీరాన్ని మనసును అంటిపెట్టుకున్న ప్రాణం శరీరము నుండి బయటకు వచ్చి వాయువులో కలిసిపోతుంది. ఇంతవరకు గడిపిన జీవితం మన నుండి వేరు కాబోతున్నది. ఈ సత్యాన్ని అనునిత్యం కాసేపు చింతన చేస్తే, జీవితానికి ఒక నూతన దృక్పథం ఏర్పడుతుంది. ఇంతవరకు మంచి చేయకపోయినా, ఇక మీద చేయాలని, ఇంతదాకా భగవంతుడిని స్మరించకపోయినా, ఇకనైనా స్మరించాలి అంటూ, ఒక ఉన్నత జీవితానికి ఇలాంటి చింతన ప్రేరణ కలిగిస్తుంది .అందుకే ఈ ప్రార్థనను ఒక స్వయం ప్రేరణగా మనం తీసుకోవాలి.
పద్దెనిమిదవ మంత్రం (చివరి మంత్రం)
అగ్నే నయ సుపథా రాయే అస్మాన్
విశ్వాని దేవ వయునాని విద్వాన్
యుయోధ్యస్మజ్జుహురాణమేనో
భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ
భావం: ఓ అగ్ని దేవా, తేజోస్వరూపుడా, మా సకల కార్యాలు నీకు తెలుసు. కర్మ ఫలితాలను అనుభవించడానికి మమ్ము సరైన మార్గంలో తోడుకొని వెళ్ళు. మమ్ములను ఘోరమైన తప్పుల నుండి వైదొలగేటట్లు చేయి. నీకు పదే పదే మా నమస్కారాలు.
వ్యాఖ్యానం: నిప్పును కనుగొనడం వలన మానవ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు ఏర్పడినది. అగ్నిని చూసి ఆశ్చర్యపోయిన మానవుడు క్రమక్రమంగా దానిని ఆరాధించడం మొదలుపెట్టాడు. చివరకు దానిని సర్వ వ్యాప్తి అయిన శక్తివంతమైన భగవంతునిగా భావించి ఆరాధించడం మనకు వేదాలలో కానవస్తుంది. ఈ విధంగా అగ్నిదేవుని భగవంతునిగా భావించి ప్రార్థించే మంత్రం ఇది.
తేజస్సుకు ఆవల ఉంటున్న సత్యాన్ని దర్శించిన ముని, ఆ సత్యాన్ని మనం కూడా చేరుకోవాలనే తపనతో, పరమ కారుణ్యమూర్తిని ఇలా ప్రార్థన చేయమని మనకు ఉపదేశిస్తున్నాడు. తమను అనుభవ మార్గంలో తోడుకొని వెళ్ళమని ప్రార్థిస్తున్నాడు.
అంటే, పనులు ఫలితాలను ఇస్తాయి. మంచి పనులు మంచి ఫలితాన్ని, చెడ్డ పనులు చెడు ఫలితాన్ని ఇస్తాయి. అలా వచ్చిన ఫలితాలను అనుభవించి తీర వలసిందే. "ఇంతవరకు చేసిన పనుల గురించి ఎరిగిన భగవంతుడా! ఇక కొత్త పనులు చేసి ఫలితాలు రాకుండా చేసి, గత వాటికి మాత్రం ఫలితాన్ని అనుభవించేటట్టు చేయి" అన్నది దీని భావం.
ఈ విధంగా భగవంతుని కృపాకటాక్షాన్ని అర్ధిస్తూ ప్రార్ధనాపూర్వకమైన జీవితాన్ని గడపాలని సూచనతో ఈశా వాషోపనిషత్తు సంపూర్ణమవుతుంది.