Menu Close
తేనెలొలుకు
- రాఘవ మాష్టారు కేదారి -
ఈశావ్యాస్యోపనిషత్తు

గత సంచిక తరువాయి... »

పద్నాలుగవ మంత్రం

సంభూతిం చ వినాశం చ యస్తద్ వేదోభయగ్ం సహ
వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే

భావం: సాకారోపాసన, నిరాకారోపాసన రెండింటిని మేళవించి గ్రహించినవాడు సాకారోపాసన వలన మరణాన్ని అతిక్రమించి, నిరాకార ఉపాసన వలన అమరత్వ స్థితికి చేరుకుంటాడు.

భాష్యం: ఈశోపనిషత్తులోని ఈ మంత్రం మానవుడు, దేవుని సంభూతిని అంటే పరమేశ్వరుని రూపసహితంగా, రూపరహితంగా, ఏకకాలంలో సంపూర్ణంగా తెలుసుకోవాలని బోధిస్తుంది.

భగవంతున్ని ముఖాముఖి దర్శించడం వలన ఒనగూరే సాటిలేని ఫలితం ఏమిటో తెలుసా! మనిషి తన స్వస్వరూపమైన ఆనందమయ ఆత్మ స్థితిలో నెలకొంటాడు. ఆ తరువాతే భగవంతుని నిరాకార స్థితిలో ఆరాధించడానికి అర్హతను, ఆయన కృపాకటాక్షo పొందుతాడు. ఇలాంటి అర్హతతో ఆ ఉన్నతమైన ఆరాధనలో పాల్గొని అమరత్వస్థితిని పొందుతాడు.

పదిహేనవ మంత్రం

హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖమ్
తత్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే

భావం: సత్యం యొక్క ముఖం స్వర్ణమయమైన తెరతో కప్పబడి ఉంది. ఓ సూర్య దేవా సత్యనిష్ఠుడైన నేను ఆ సత్యాన్ని దర్శించడానికి ఆ తెరను తొలగించు.

భాష్యం: చీకటి నుండి నన్ను వెలుగులోనికి తోడ్కోని వెళ్ళు... ఇటువంటి ప్రార్థనలు మనకు తెలుసు. ఇది భగవంతుని కాంక్షిస్తూ వెళ్లే వ్యక్తి మొదటి ప్రార్ధన. అతడు అజ్ఞానంలో ఉంటున్నాడు. అందువల్ల ఆ చీకటి నుండి వెలుగులోనికి తోడ్కోని వెళ్ళమని అతడు భగవంతుని ప్రార్థిస్తాడు. ప్రార్ధన, జపం, ధ్యానం లాంటి పలు సాధనల మూలంగా ఆ తేజస్సును దర్శిస్తాడు. ఆ తేజసు యొక్క కోమలత్వాన్ని, ఆకర్షణను గ్రహింప చేయడానికి, సువర్ణమయమైన తెర అడ్డు ఉన్నదంటూ ఈ మంత్రం సూచిస్తుంది. ఆ కోమలతంలోనూ, ఆకర్షణలోనూ అతను మైమరిచి అక్కడ ఆగిపోతాడు.

కానీ సత్యం అనేది చీకటి వెలుగుల, సుఖం దుఃఖముల లాంటి బంధాలకతీతమైనది. అందువలన సత్యాన్ని, సత్య వస్తువును, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవాలంటే, అతడు తేజస్సును దాటి వెళ్లి తీరాలి. ఆ తేజస్సు అతనికి ఎంతగా ఆనందాన్ని ఇచ్చేదిగా ఉన్నప్పటికీ, దానినే అతడు దాటి వెళ్లి తీరవలసిందే. ఆ తేజస్సును దాటితేనే, ఆ తేజస్సు ఆవల ఉండే భగవంతుడు మనకు ప్రత్యక్షమవుతాడు.

అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న ఒక వ్యక్తి, జపం, తపస్సు, ఆరాధనలాంటి సాధనల మూలంగా తేజోవంతుడు, స్వర్ణమయుడు అయిన భగవంతుని దర్శనం పొందవచ్చు. కానీ సగుణ, సాకార జ్యోతిర్మయ రూపాన్ని దాటి, అఖండ జ్యోతి రూపమైన, నిర్గుణ, నిరాకారాన్ని చేరుకోవడానికి మన సుప్రయత్నాలు నిష్ప్రయోజనం. అక్కడ భగవత్కృప మాత్రమే పనిచేస్తుంది. ఆ కృప పొందిన వారు మాత్రమే ఆయన ప్రార్థనల ద్వారా, మనం ఆయనను దర్శించగలుగుతాం. ఇది ఉన్నత స్థితి సాధన, అంటే తేజస్సు ఆవల వైపుకు వెళ్లడానికి చేసే ప్రార్థన ఇది అని ఉపనిషత్తుల పూర్తి సారాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు.

**** సశేషం ****

Posted in June 2024, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!