పన్నెండవ మంత్రం
అంధం తమః ప్రవిశన్తి యేసంభూతిముపాసతే
తతో భూయ ఇవ తే తమో య ఉ సంభూత్యాగ్ం రతాః
భావం: భగవంతుణ్ణి నిరాకారునిగా ఉపాశించేవారు కటిక చీకట్లో మునిగిపోతారు. సాకారంగా భగవంతుణ్ణి ఉపాసించేవారు అంతకన్నా ఘోరమైన గాఢాంధకారంలో ప్రవేశిస్తారు.
పదమూడవ మంత్రం
అన్యదేవాహుః సంభవాదన్యదాహురసంభవాత్
ఇతి శుశృమ ధీరాణాం యే నస్తద్ విచచక్షిరే
భావం: సాకార ఆరాధన వలన లభించేది ఒక రకమైన ఫలితం. నిరాకార ఉపాసన వలన లభించేది వేరొక ఫలితం అంటున్నారు మాకు దానిని వివరించిన మహాత్ములు.
భాష్యం: ఈ రెండు మంత్రాలకు వివరణ అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. భగవంతున్ని సాకారునిగా ఆరాధించవచ్చు. నిరాకారునుగాను ఆరాధించవచ్చు. రెండింటినీ కలిపి ఆచరిస్తేనే అత్యంత ఉన్నతమైన ఫలితం లభిస్తుందనే నిజాన్ని తెలియజేస్తుంది ఈ ఉపనిషత్తు.
అసంభూతి అనే పదం స్వతంత్రమైన జీవితం లేని వారిని సూచిస్తుంది. సంభూతి అనే పదం సర్వ స్వతంత్రుడైన పరమ పురుషుని సూచిస్తుంది. మన కష్టాల నుండి తాత్కాలిక ఉపశమనం కోసం ఉపదేవతలను పూజించకూడదు. వారు కేవలం తాత్కాలిక లాభాలను మాత్రమే ఇవ్వగలరు. అలా కాకుండా సర్వేశ్వరుడు దేవాది దేవుడైన పరమాత్మను పూజించినట్లయితే, అతడు మనలను తన భగవద్ధామానికి చేర్చుకోవడం ద్వారా మనకు భౌతిక బంధనముల నుండి సంపూర్ణ విముక్తిని కలిగించగలడు. ఎవరైనా దేవతలను ఆరాధించి భౌతికమైన వారి లోకాలను పొందగలిగినను, మిక్కిలి చీకటితో నిండిన ప్రదేశాన్ని పొందుతారని ఈ మంత్రం తెలియజేస్తుంది.
(సంభూతి )అంటే రూపుదిద్దుకున్న స్థితి. భగవంతుడు పలురూపాలలో కనిపించే సాకార స్థితి. (అసంభూతి) అంటే రూపానికి రాని స్థితి. ఎలాంటి గుణము రూపము లేని చరమ స్థితి. ఈ రెండు స్థితులలోను భగవంతుని మన ఉపాశించవచ్చు. ఒకటి సాకార ఉపాసన, రూప నామాలు గల ఒక స్వరూపంగా ఆయనని దర్శించడమే ఇది. మన మనసుతో గ్రహించగలిగిన వ్యక్తిగా బహిర్గత స్థితిలో భగవంతున్ని మనం ఇక్కడ ఆరాధిస్తున్నాం. శివుడు, విష్ణువు, శక్తిదేవి, అంటూ సాకార స్థితిలో భగవంతుని ఆరాధించడం సాకారోపాసన.
రెండవది నిరాకార ఉపాసన, రూప నామాలు లేకుండా, గుణగణాల అతీతమైన స్థితిలో భగవంతుని సమీపించే ప్రయత్నం ఈ ఉపాసన. రూపము గుణము లేని దానిని మనసుతో ఊహించుకోవడం సాధ్యం కాదు. అందువలన ఈ ఉపాసన ఉన్నతోన్నత స్థితిలో నెలకొని ఉన్న వారికి మాత్రమే చెందుతుందని చెప్పక చెబుతుంది. అర్హత లేకుండా ఈ ఉపాసనలో పాల్గొనేవారు ఆత్మవంచన చేసుకుంటారు, అందుకే వారు కటిక చీకట్లో మునిగి ఉన్నట్లు చెప్పబడినది.