Menu Close
Kadambam Page Title
ఉనికి పాట
డి. నాగజ్యోతిశేఖర్

ఏ అర్ధరాత్రో ఓ కల గుండెల్ని బరువెక్కిస్తుంది!
వెక్కిళ్ళు పెట్టే మస్తిష్కాన్ని
అమ్మచెలిమి వద్దకు చేరిస్తే బావుండని తపిస్తుంది!

పారేసుకున్న కొన్ని గతాల నందివర్ధనపు పూలను దోసిట పట్టి
స్మృతుల పరిమళాన్ని ఆఘ్రాణిస్తుంది!
బాల్యపు నెమలీకల్ని పురివిప్పి ఆడిస్తుంది!

తడారిపోతున్న మనస్సుగొంతుని
ఊరి చెరువులో తడుపుకోవాలనుకుంటుంది!
రావిచెట్టు మొదట్లో దాచుకున్న స్నేహాలను తవ్వుకోవాలని చూస్తుంది!

కాళ్ళను చుట్టిన దూరాల లేసులను వదులు చేసి
మట్టి జ్ఞాపకాల్లో పరిగెత్తాలనుకుంటుంది!
నాటుకున్న వెనుకటికాలపు
తోట నుండి ఒక్క బంధపు మొక్కనైనా తెచ్చుకోవాలని తలుస్తుంది!

బుద్దిచెప్పిన బడి గోడలను
ఆప్యాయంగా తడిమేస్తుంది!
ఒట్టిపోయిన పొలం గడపకు ఆకుపచ్చ నవ్వొకటి పూయాలని కొట్టుకులాడుతుంది!

బతుకుకు మొలిచిన వలసరెక్కలు....
ఆవాసాన్నైతే వదిలెల్లగలవ్ గానీ....
జీవిత సావాసాన్ని ఎలా విడుచుకోగలవ్!

కన్నీళ్లు విత్తులై మొలకెత్తిందక్కడే....!
వెన్నెల్లు రాత్రుల్ని తరిగింది అక్కడే!

ఆ మాటకొస్తే....
బొడ్డుతాడు తెగిన చోటే....
బొంది విడవాలనుకోవడం
ఒక రక్త సంబంధం!

ఆ మట్టిలో ఇంకిన ఉనికిస్వేదం ....
ఆ గాలిలో నిండిన ప్రాణనాదం.....
ఏ దేశాన ఉన్నా....
సొంతూరి పాటను
గొంతెత్తి పాడకుండా ఎలా ఉండగలవ్.!

Posted in May 2021, కవితలు

3 Comments

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!