ఉండకూడదు
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు
నిన్ను నీవు తెలుసుకోవటానికి
ఎవరో ఏదో చెబుతారనే విషయంలో
అజ్ఞానంతోకూడిన జిజ్ఞాస ఉండకూడదు.
నీకై నీవు నిలవటానికి
ఎవరో ఏదో చేస్తారనే విషయంలో
అవివేకంతో కూడిన పేరాశ ఉండకూడదు.
నిన్ను నీకు తెలుపటానికి
ఎవరికో ఏదో తెలుసు అనుకుంటూ
అపరిపక్వతతో కూడిన నమ్మకం ఉండకూడదు.
నీగూర్చి నీకు నేర్పటానికి
ఎవరికీ ఏమీ తెలియదు అంటూ
నిర్వేదంతోకూడిన నిశ్చయం ఉండకూడదు.
నీకు తెలియనిది ఏమైనా
ఎవరికైనా తెలుసునేమో అనే విషయంలో
అనుమానంతోకూడిన విశ్వాసం ఉండకూడదు.
నిన్ను నీవు గెలవటానికి
నాకుమాత్రమే తెలుసు అనుకునే
అహంకారంతోకూడిన నిర్ణయం ఉండకూడదు.
నీవు నీవుగా నిలవటానికి
ఎవరూ ఏమీచెప్పలేరనే విషయంలో
అయోమయంతోకూడిన అసంతృప్తి ఉండకూడదు.
నీవు వెతుకుతున్న దానిగురించి
ఎవరైనా చెప్పగలరనే విషయంలో
మూడత్వంతో కూడిన భ్రమ ఉండకూడదు.
నీకు తెలుసుకోవాలనిపించే సత్యం గురించి
ఎవరుచెప్పినా ఒకటే అనే
మూర్ఖత్వంతోకూడిన అంగీకారం ఉండకూడదు.
ఏవిషయమైనా ఎవరికైనా తెలిసినదేలే
అనే ఏమరపాటుతోకూడిన స్థిరభావం ఉండకూడదు.