
తింటానిక్కూడు చాలదే జాంగిరీ, ఉంటానికిల్లు చాలదే
బస్తీకి పోదాం పైసా తెద్దామే రావే నా రంగసానీ!!
టౌను పక్కకెల్లొద్దురా డింగరీ! డాంబికాలు పోవొద్దురా
టౌను పక్కెకెళ్ళేవు డౌనైపోతావోరబ్బీ బంగారు సామి!
రెక్కలన్నీ ఇరుసుకుంట రిక్షాలు లాక్కుంట
చిల్లరంత చేర్చుకుంట సినిమాలు చూసుకుంట
షికార్లు కొడదామే - పిల్లా జలసా చేద్దామే ||బస్తీకి||
కూలి దొరకదూ నాలిదొరకదూ
గొంతు తడుపుకొన నీరు దొరకదూ
రేయింబగలూ రిక్షా లాగిన
అద్దెకు పోనూ అణా మిగలదు
గడప గడపకు కడుపు పట్టుకుని ఆకలాకలని అంగలార్చితే
గేటు బిగించీ కొట్టొస్తారు!
కుక్కలనే ఉసి కొల్పిస్తారు ||టౌను పక్క||
ఫ్యాక్టరీలలో పని సులువంట
గంటయిపోతే ఇంట్లో ఉంట
వారం వారం బట్వాడంట
ఒరే అరే అన వీల్లేదంట
కాఫీ తోటే గడపొచ్చంట కబుర్లు చెప్పుక బతకొచ్చంట
అట్టాగా....
చూడ చిత్రమంట పిల్లా! చోద్యమౌతదంట ||బస్తీకి||
పిప్పయి పోయే పిచ్చి ఖర్చులు
పోకిరి మూకల సావాసాలు
చీట్ల పేకలు సిగసిగ పట్లు
తాగుడు వాగుడు తన్నులాటలు
ఇంటి చుట్టునా ఈగలు దోమలు
ఇరుకు సందులు మురుగు వాసనలు
అంటురోగములు తగిలి చచ్చినా
అవతల కీడ్చే దిక్కు ఉండదు
అయ్యబాబోయ్.... ||టౌను||
ఏలికేస్తేను కాలికేస్తవు
ఎనక్కి రమ్మని గోల జేస్తవు
ఏ దారంటే గోదారంటవు
ఇరుకున బెట్టి కొరుక్కుతింటవ్
దిక్కు దోచనీయవే పిల్లా! తికమక జేసేవే
బస్తీకి నే పోను నీతో ఉంటానే రాణీ... నా రంగసానీ
గొడ్డూ గోదా మేపుకుందాం! కోళ్ళూ మేకలు పెంచుకుందాం
కూరానారా జరుపుకుందాం! పాలూ పెరుగు అమ్ముకుందాం
పిల్లా జెల్లను సూసుకుందాం! కలో గంజియో తాగి పడుందాం
టౌను పకక్కెళ్ళద్దండోయ్ బాబూ
డాంబికాలు పోవద్దండోయ్
టౌను పక్కకెళ్ళేరు డౌనైపోతారు!
తానే తందన్న తాన, తందన్న తాన,,, తందన్న తాన,,, తందన్న తాన!