మన్మథా... నవ మన్మథా...
- డా. రావి రంగారావు
“త్రి”విక్రముడు
నా మనవడు ఉదయం
నిద్ర లేవగానే
ఇల్లు
ఒక చైతన్య ప్రపంచం అవుతుంది...
ఇంట్లోని వస్తువు లన్నీ బొమ్మ లవుతాయి...
నా మనవడు బ్రహ్మదేవుడు-
కదల లేని బొమ్మలకు
ప్రాణాలు పోస్తాడు...
నా మనవడు విష్ణుమూర్తి-
ఎప్పుడు ఏ బొమ్మకు
ఏ అందమైన రంగులు పూసి
ఎలా ఆడుకుంటాడో తెలియదు...
నా మనవడు శివుడు-
బొమ్మల్ని కాసేపు పైకెక్కించుకుంటాడు,
కాసేపటిలోనే పాతవై పోతాయేమో-
మళ్ళీ వాటిని చెత్తబుట్టలోకి నెట్టేస్తాడు...
అమ్మో-
నా మనవడు సామాన్యుడు కాడు
వాడిలో బ్రహ్మవిష్ణుపరమేశ్వరు లున్నారు.