పంచతంత్రం కథలు
- దినవహి సత్యవతి
తెలివిగల ఎండ్రకాయ
అనగనగా ఒక అడవి. అందులో ఒక చెరువు. ఆ చెరువులో చాలా చేపలు ఉండేవి.
అన్ని చేపలు చూసి ఒక కొంగకి నోరు ఊరి ఎలాగైనా వాటిని తినాలనుకుని చెరువులో వ్రాలింది.
కొంగని చూడగానే తమని తినడానికి ఏదో పెద్ద పక్షి వచ్చిందని భయపడి చేపలన్నీ నీళ్ళ అడుగుకి వెళ్ళిపోయాయి.
చేపలని పట్టించుకోనట్లే కొంగ కళ్ళు మూసుకుని తలవంచి జపం చేసుకుంటున్నట్లుగా నటించసాగింది. కొంగ ప్రవర్తనకి చేపలన్నీ ఆశ్చర్యపోయాయి.
అదే చెరువులోఒక ఎండ్రకాయ కూడా నివసిస్తోంది. కొంగ వింత ప్రవర్తనకి అది కూడా అయోమయానికి లోనై ‘కొంగా..కొంగా..ఇదేమిటీ నువ్వు చేపలను తినకుండా ఇలా జపం చేసుకుంటున్నావు?’ అని అడిగింది నెమ్మదిగా ప్రక్కన చేరి.
‘నేను ఇప్పటిదాకా ఎన్నో పాపాలు చేశాను ఎండ్రకాయ మిత్రమా! అందుకే వాటన్నిటికీ ఇప్పుడు పరిహారంగా మిగిలిన జీవితం ఇలా జపం చేసుకుంటూ గడుపుదామని నిశ్చయించుకున్నాను’ అని కొంగ బదులు పలికింది.
కొంగ మాటలని నీటమునిగిన చేపలు, ప్రక్కన ఉన్న ఎండ్రకాయ నమ్మాయి. ఆనాటి నుండీ అవి కొంగ చుట్టూ స్వేచ్ఛగా తిరగ సాగాయి. కొంగ, చేపలు, ఎండ్రకాయ మంచి స్నేహితులయ్యాయి.
ఇలా కొన్నాళ్ళు గడిచింది.
ఒకనాడు కొంగ దిగులుగా ఉండడం గమనించిన చేపలు ‘ఏమైంది మిత్రమా?’ అని అడిగాయి.
‘నిన్న కొంతమంది జాలరులు ఈ చెరువులోని నీళ్ళు తగ్గాయి కనుక నాలుగు రోజులలో వచ్చి వలపన్ని చేపలను పట్టుకుందామని అనుకుంటూ ఉంటే నేను విన్నాను. నాదేముంది నేను ఏ క్షణాన ఆపద వస్తే ఆ క్షణంలో ఎగిరిపోగలను. నా దిగులంతా మీ గురించే!’ అంటూ కొంగ మొసలి కన్నీళ్ళు కార్చింది.
‘అయ్యో ఇప్పుడెలాగా?’ అని చేపలన్నీ కలవరపడ్డాయి.
అప్పుడు కొంగ ‘భయపడకండి, ఈ విషయమై నేను ఎంతో ఆలోచించాను. ఈ దగ్గరలోనే ఒక సరస్సు ఉంది. మిమ్మల్ని అక్కడికి చేరిస్తే చాలు మీకు ఆపద తప్పుతుంది. మీరు అంగీకరిస్తే మిమ్మల్ని నా ముక్కున కరచుకొని తీసుకెళ్ళి ఆ సరస్సులో విడుస్తాను. మీరు హాయిగా బ్రతకవచ్చు. ఇదే నేను మీకు చేయగలిగే సహాయం’ అని సెలవిచ్చింది.
అప్పటికే కొంగని పూర్తిగా నమ్మిన చేపలు తమ అంగీకారం తెలిపాయి.
ఆనాటి నుండి కొంగ ఒకసారికి నాలుగైదు చేపల చొప్పున నోట కరచుకొని దగ్గరలో ఉన్న కొండపైన బండరాయిపై కూర్చుని వాటిని తినేసి తిరిగి చెరువుకి వెళ్ళి మీ స్నేహితులందరూ క్షేమంగా ఉన్నారని మిగిలిన చేపలను నమ్మించసాగింది.
ఒకనాడు ఎండ్రకాయ కొంగతో ‘మిత్రమా ఇవాళ చేపలతో బాటు నన్ను కూడా ఆ సరస్సు వద్దకు చేర్చు’ అని అడిగింది.
‘సరే అలాగయితే నేను చేపలను నోట కరుచుకుంటాను, నువ్వు నా మెడను గట్టిగా పట్టుకో’ అంది మనసులో ఎండ్రకాయను కూడా తినవచ్చని ఉవ్విళ్ళూరుతూ.
యథాప్రకారం కొంగ ఎగిరి వచ్చి బండపై వ్రాలింది. కొంగ మెడ పట్టుకుని వచ్చిన ఎండ్రకాయకు ఆ ప్రదేశం చూడగానే ఏదో అనుమానం వచ్చింది......ఆ చుట్టుప్రక్కల కనుచూపు మేరలో ఏ సరస్సులేదు సరికదా ఆ బండపై బోలెడన్ని చేపల పొలుసులూ, ఎముకలూ గుట్టలు గుట్టలుగా కనిపించాయి.
అవన్నీ చూడగానే కొంగ చేసిన మోసం అర్థమైన ఎండ్రకాయ ‘నేను కనుక ఇప్పుడు కొంగ మెడ పట్టు వదిలానంటే ఇది నన్ను కూడా ఈ చేపలని చంపి తిన్నట్లే తినేస్తుంది. అంతకు ముందే నేను దీని బారినుండి తప్పించుకోవాలి’ అనుకుని కొంగ మెడ గట్టిగా కొరికేసింది.
ఎండ్రకాయ మెడ కొరకడంతో బాధతో గిల గిలా కొట్టుకుని కొంగ నేల కూలింది.
‘అమ్మయ్య బ్రతికిపోయాను’ అనుకుని కొంగ పీడ వదిలించుకున్న ఎండ్రకాయ నెమ్మదిగ ప్రాకుతూ తిరిగి చెరువు చేరింది.