పంచతంత్రం కథలు
- దినవహి సత్యవతి
తీరిన సమస్య
అనగనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు విలాస జీవితానికి దూరంగా ఒక విరాగిలా జీవిస్తుండేవాడు. తినడానికి తిండి కూడా లేకపోవడం ఆ పైన కఠిన ఉపవాసాలతో అతడి శరీరం క్షీణించింది.
ఆ బ్రాహ్మణుడంటే అత్యంత గురుభావం కలిగిన ఒక శిష్యుడు ఆయన స్థితికి బాధపడి రెండు లేగ దూడలను కానుకగా ఇచ్చాడు. ఆ లేగదూడలని చూసి ఎంతో ముచ్చట పడిన బ్రాహ్మణుడు వాటిని ప్రాణంగా చూసుకుంటూ అక్కడా ఇక్కడా అడిగి వాటికి మేత తెచ్చి ఎంతో ప్రేమగా సాకడంతో కొద్దిరోజులకే అవి బాగా బలం పుంజుకున్నాయి.
ఒకనాడు ఒక దొంగ , బ్రాహ్మణుడి దగ్గర లేగదూడలని చూసి ఆశపడి ఎలాగైనా వాటిని తనవి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అంతే వెంటనే ఒక పలుపుతాడు (జంతువుల మెడకి కట్టే తాడు) ఒకటి తీసుకుని బ్రాహ్మణుడి ఇంటివైపు బయలుదేరాడు.
దారిలో ఆ దొంగకి పెద్ద పెద్ద కోరల్లాంటి పళ్ళు, మిడిగుడ్లు, వికారం కలిగించే ఆకారంతో భయంకరంగా ఉన్న ఒకడు ఎదురై ‘ఓరీ! ఆగు’ అని హుంకరించాడు.
దొంగ ఎక్కడివాడక్కడ నిలబడిపోయి వణుకుతూ ‘ఎ...ఎ....ఎవరు నువ్వు?’ అన్నాడు అతి కష్టం మీద భయంతో పిడచ కట్టుకుపోయిన నోరుపెగల్చుకుని.
‘నేను ఒక రాక్షసుడిని, మరి నువ్వెవరో కూడా చెప్పు’
‘నేను ఒక దొంగని. ఒక బ్రాహ్మణుడి ఇంట్లో బాగా బలిసిన లేగదూడలని దొంగిలిద్దామని వెళుతున్నాను’ అన్నాడు.
ఇద్దరికీ ఒకరి మాటలపై మరొకరికి నమ్మకం కుదిరింది.
‘ఓహో అలాగా! సరే అయితే పద నేను కూడా నీతో వస్తాను. నాకు మహ చెడ్డ ఆకలిగా ఉంది. నేను ఆ బ్రాహ్మణుడ్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను, నువ్వు అతగాడి లేగదూడలని దొంగిలించుకు పో!’ అన్నాడు.
ఇద్దరూ కూడబలుక్కుని బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి అతడు నిద్రపోయేదాకా చాటుగా నక్కి కూర్చున్నారు.
బ్రాహ్మణుడు గాఢనిద్రలోకి జారుకోగానే మరింక ఆకలి తట్టుకోలేని రాక్షసుడు బ్రాహ్మణుడిని తినబోతుండగా ‘అయ్యా! కొంచం ఆగు. నువ్వు తినబోయేలోగా బ్రాహ్మణుడు మెలకువ వచ్చి కేకలు వేసాడంటే నేను దూడలని తీసుకెళ్ళలేను. అప్పుడు నాకు నష్టం కదా? అందుచేత నేను దూడలని తీసుకుని వెళ్ళాక నువ్వు నీ ఆకలి తీర్చుకో’ అన్నాడు.
‘అదెలా కుదురుతుంది? నువ్వు ముందు దూడలని తీసుకెళ్ళేటప్పుడు అవి అరిచాయంటే బ్రాహ్మణుడు లేచేస్తాడు. అప్పుడు నేను అతడిని తినలేను. నాకసలే చాలా ఆకలిగా ఉంది. కనుక ముందు నేను ఆకలి తీర్చుకున్నాకే నువ్వు దూడలని తీసుకెళ్ళాలి అంతే’ అన్నాడు కోపంగా.
అలా ఇద్దరూ, తమ సమస్యకి పరిష్కారం ఆలోచించుకోకుండా, నేను ముందంటే నేను ముందని, పోట్లాడుకుంటూండగా బ్రాహ్మణుడికి మెలకువ వచ్చింది.
దొంగని, రాక్షసుడిని చూసిన బ్రాహ్మణుడికి తానెంత ప్రమాదంలో ఉన్నాడో అర్థమైంది.
ఈ చిక్కు సమస్య నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించాడు.
ముందుగా తన ఇష్ట దైవాన్ని ప్రార్థించడం మొదలు పెట్టగానే రాక్షసుడు అక్కడనుంచి పలాయనం చిత్తగించాడు.
ఆ వెనువెంటనే ఒక పెద్ద కర్ర తీసుకుని దొంగని చితకబాది అక్కడనుంచి తరిమేసాడు బ్రాహ్మణుడు.
దాంతో బ్రాహ్మణుడి ప్రాణాలూ నిలిచాయి, లేగదూడలూ బ్రతికాయి.
అలా సమయానికి కలిసివచ్చిన అవకాశం ఉపయోగించుకుని తన సమస్యనుంచి బయటపడ్డాడు ఆ బ్రాహ్మణుడు.