Menu Close
Shyama-Sundara-Rao
తెలుగు తేజాలు
అంబడిపూడి శ్యామసుందర రావు

సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి (సీనియర్)

Susarla Dakshina Murthy Sastry

సద్గురు సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రిగారు ప్రముఖ శాస్త్రీయ కర్ణాటక సంగీత  విద్వాంసుడు, వాగ్గేయకారుడు. వీరు పెద్ద కళ్లేపల్లి అగ్రహారంలో 1 జులై 1860 సంవత్సరములో జన్మించారు. చిన్నపాటి నుంచి వీరికి సంగీతం అంటే ఆరో ప్రాణం. వీరి తాతగారు రామమూర్తి శాస్త్రి గారు గొప్ప వేదం మరియు సంస్కృత పండితులు. కానీ, లక్ష్మి కటాక్షం లేకపోవడం వల్ల పేదరికంతో బాధపడేవారు. అట్టి స్థితిలో అయన నైజాం నవాబు గారిని ఆశ్రయించగా అయన వీరి ప్రతిభకు ముగ్దుడై అయిదు గ్రామాలను బహుమానంగా ఇచ్చాడు. వాటిలో ఒకటైన పెద్దకళ్ళేపల్లి లోనే దక్షిణామూర్తి గారు జన్మించారు. చిన్నతనంలో శాస్త్రి గారు ఒకసారి బందరులో ఒక తమిళ అయ్యరు గారి కచేరి వినడం జరిగింది. శ్రోతలు అందరు అయ్యరు గారిని శభాష్ అంటూ మెచ్చుకుంటూ ఉంటే శాస్త్రిగారికి మటుకు అయ్యరు గారి పాటలో సంగీతపరంగా దోషాలు కనబడ్డాయి కానీ చిన్నతనం అవ్వడం వలన ఆ దోషాలను విశ్లేషించ లేకపోయినారు శాస్త్రిగారు. ఆ క్షణానే ఎలాగైనా సంగీత శాస్త్రం అభ్యసించాలని దృఢ నిశ్చయానికొచ్చారు.

అయితే..ఆనాడు తెలుగునాట, సంప్రదాయ సంగీతం చెప్పే గురువులు లేరు. మొక్కవోని పట్టుదలతో, కాలినడకన, వందల మైళ్ళు ప్రయాణం చేసి, తంజావూరు చేరుకున్నారు. అక్కడ త్యాగయ్య గారి మేనల్లుడు, ప్రియశిష్యుడు ఆకుమడుల (మానంపూచావడి) వెంకటసుబ్బయ్య గారి గురుకులంలో ప్రవేశించారు. అనేక విధాల పరీక్షించిన పిమ్మట, శాస్త్రి గారికి సంగీత శిక్షణను ప్రారంభించారు సుబ్బయ్యగారు. తెలుగునాట నుండి విద్యార్థియై వచ్చిన అంధులైన ఫ్లూటు శరభ శాస్త్రి గారితో కలిపి రోజూ పాఠం జరిగేది. వీరు ఆ విధంగా ..సాక్షాత్తూ త్యాగయ్య గారి ప్రశిష్యులు.

కొంతకాలం గడిచింది...సుబ్బయ్యగారు వయోవృద్ధులైనారు. ఒకనాడు వీరిద్దరినీ పిలిచి, “నాయనా! మీ ఊరిని, కన్న వాళ్ళనూ వదలి, ఇంత దూరం సంగీతం కోసం వచ్చిన మిమ్మల్ని చూస్తే నాకెంతో ఆనందం కలుగుతుంది. మీ మీద నాకు అపారమైన నమ్మకముంది. నాకు ఇక ఏ క్షణానైనా భగవంతుడి నుండి పిలుపురావచ్చు. నాకు మీరు ఇరువురూ ఒక ప్రమాణం చేయాలి. నాకు ఎవరూ లేరు. నా తదనంతరం, మీ గురుపత్ని బాధ్యత మీరు తీసుకోవాలి. మీకు నా సంగీత గ్రంథం అప్పగిస్తాను. శ్రద్ధాభక్తులతో నేను చెప్పినట్లు చేయండి. శాస్త్రీ! నీవు ఏకసంథాగ్రాహివి కనుక, పాఠాన్ని వ్రాసుకుంటూ నోటితో వల్లించు. నీకు కంఠస్థమౌతుంది. మరొకసారి వ్రాసిన పాఠం ఇరువురూ కలసి పాడండి. అంధుడు, ద్విసంథాగ్రాహి అయిన శరభశాస్త్రికి అప్పుడది పట్టుపడుతుంది. ఈ విధంగా ప్రతిరోజూ చేయండి. నా ఆశీస్సులు సదా మీకుంటాయి" అలాగే అని శిష్యులిద్దరు గురువుగారికి ప్రమాణం చేసారు. సుబ్బయ్యగారు స్వర్గారోహణం చేశారు. దక్షిణామూర్తిగారు, శరభశాస్త్రిగారు, తమ గురుపత్నిని కన్నతల్లి కన్న మిన్నగా చూసుకుంటూ గురువు కటాక్షంతో ప్రాప్తించిన గ్రంథాన్ని త్రికరణశుద్ధిగా అధ్యయనం చేశారు. సంగీత విద్యలో పరిపూర్ణులయ్యారు.

కొంతకాలానికి గురుపత్ని కాలంచేశారు. ఇక, దక్షిణామూర్తి, శరభశాస్త్రులిరువురూ కావేరీతీరాన తాము నేర్చిన 'త్యాగరాజ సంప్రదాయ సంగీతం' తో స్వస్థలమైన కృష్ణాతీరానికి తిరిగి వచ్చారు. శరభశాస్త్రిగారు వేణుగాన ప్రదర్శనలు చేసి, గొప్ప విద్వాంసునిగా కీర్తి సంపాదించారు. దక్షిణామూర్తి శాస్త్రి గారు తెలుగునాట సత్సంప్రదాయ సంగీత ప్రచార రథసారథి అయ్యారు. అగ్రహారీకులైన ఆయన, కులమత వివక్ష చూపక, భోజనం పెట్టి, విద్యార్థులెందరికో గురుకుల పద్ధతిలో విద్యాదానం చేశారు. వాగ్గేయకారులు, నైష్ఠికులైన ఆయన ఏనాడూ తన విద్యను వేదికపై ప్రదర్శించలేదు! ధనం ఆశించలేదు.

తెలుగునాట శాస్త్రీయ సంగీతం పరిఢవిల్లటానికి దక్షిణామూర్తి శాస్త్రులవారే ప్రధాన కారకులు. 'గాయకసార్వభౌమ' పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, వారి శిష్యులలో ముఖ్యులు. గురువుగారి మరణానంతరం, వారి అడుగుజాడలలో నడచి, బెజవాడ కేంద్రంగా గురుకులం స్థాపించి, బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి, ఎన్.సి.హెచ్.కృష్ణమాచార్యులు గార్ల వంటి విద్వాంసులను లోకానికందించారాయన. పంతులుగారు, త్యాగరాజ ఆరాధనోత్సవాలను, తమ గురువుగారితో కలసి నిర్వహించేవారు.1917,జులై 7న  లో గురువుగారు అస్తమించడంతో, సుసర్ల వారి వర్ధంత్యుత్సవాలను కూడా త్యాగరాజ ఉత్సవాలతో జతచేసి, వారి శిష్యులు నిర్వహించేవారు. ఆ మహానుభావుడు గతించి నూట ఎనిమిది సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఆయన పరమపదించిన 1917 వ సంవత్సరం నుండి ఈనాటి వరకూ ఆయన శిష్యవర్గం, ప్రతి ఏడూ క్రమం తప్పక, వారి వర్ధంత్యుత్సవాలు జరుపుతూనే ఉన్నారు. నిజానికి త్యాగరాజస్వామికే దక్కని అదృష్టాన్ని స్వంతం చేసుకొన్నాడు సుసర్ల దక్షిణ మూర్తి శాస్త్రి గారు. సుసర్ల వారి 108వ, మరియు పారుపల్లివారి 74వ వర్ధంత్యుత్సవాలు బెజవాడలో అన్నవరపు రామస్వామి గురువుగారు నిర్వహిస్తున్నారు. మరి ఆ గురుపరంపరతో 84 సంవత్సరాల అనుబంధం వారిది సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారి మనమడు సుసర్ల దక్షిణా మూర్తి జూనియర్ (1921-2012) అయన తెలుగు చలన చిత్ర రంగములో ప్రముఖ సంగీత దర్శకుడిగా పేరు గడించి తాతకు తగ్గ మనుమడు అనిపించుకున్నాడు. శాస్త్రీయ బాణీలను ప్రజా రంజకముగా ప్రజలకు అందించిన మేటి సంగీత దర్శకుడు జూనియర్ సుసర్ల దక్షిణా మూర్తి గారు.

********

Posted in February 2026, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *