బుర్రకథా పితామహుడు షేక్ నాజర్
హరికథకు ఆదిభట్ల ఎలాంటివాడో బుర్రకథకు నాజర్ అలాంటి వాడు అని ప్రశంసలు పొంది, బుర్ర కథా పితామహుడుగా పేరొందిన నాజర్ బుర్రకథా కళాకారుడు మాత్రమే కాకుండా నటుడు, ప్రజా రచయిత, గాయకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఈయన గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఓ పేద దూదేకుల ముస్లిం కుటుంబంలో 1920, ఫిబ్రవరి 20 వ తేదీన షేక్ మస్తాన్, బాబీ దంపతులకు జన్మించారు. నాజరు పూర్తి పేరు "షేక్ నాజరు వలి". తండ్రి నాజర్ ను సన్నాయి కళాకారుడిగా తీర్చిదిద్దాలని ప్రయత్నించినా పేదరికము అడ్డుపడింది. పాఠశాల స్థాయిలో ఎనిమిదేళ్ల వయస్సులో స్కూలు వార్షికోత్సవం లోనే "ద్రోణ" పాత్రకు జీవం పోశారని ప్రముఖ హార్మోనిస్టు ఖాదర్ ప్రశంసించారు. ఖాదర్ ఆయనను "మురుగుళ్ళ" వద్ద సంగీతం నేర్చుకోవాలని అప్పగించారు. పేదరికం వల్ల అచట ఉండలేకపోయారు. ఆ తరువాత 1929 లో తెనాలి లో ఉన్న బాల రత్న సభ డ్రామా ట్రూప్ లో సభ్యుడిగా చేరి నాటకాలాడి మంచిపేరు గడించారు. నాటకాలలో పాత్రలు వేయడానికి సంగీత జ్ఞానము అవసరమని కర్ణాటక సంగీతాన్ని అభ్యసించాడు. ఆ తరువాత ఎస్ రాఘవయ్య గారు, ఆర్. కోట వీరయ్యల దగ్గర బుర్ర కథా విధానాన్ని నేర్చుకున్నాడు.
చిన్నతనం లోనే తండ్రి మరణించటంతో సొంత ఊర్లో దర్జీగా మారి చిన్న పిల్లలకు సంగీత పాఠాలు చెపుతూ సంసారాన్ని నెట్టుకొచ్చేవాడు. కమ్యూనిస్ట్ పార్టీ వారు నిర్వహించిన పాటల పోటీలో పాల్గొని ప్రథమ బహుమతి పొంది పిదప కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు. ఆర్యమత సిద్ధాంతం నచ్చి మాంసాహారం మానేశారు. నాస్తికుడయ్యారు. ఆయన కృష్ణలీలలో దేవకి, శ్రీ కృష్ణ తులాభారంలో రుక్మిణి, భక్త రామదాసులో ఛాందిని వంటి ఆడవేషాలు వేసి మెప్పించారు. పాదుకా పట్టాభిషేకంలో కైకేయి, ఖిల్జీ రాజ్యపతనంలో కమలారాణి పాత్రలు పోషించారు. ఆనాటి ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు వేములపల్లి శ్రీకృష్ణ గారు నాజర్ ను గుంటూరు తీసుకువచ్చి బుర్రకథ నేర్చుకుంటే ప్రచారానికి బావుంటుందని నిర్ణయించారు. వేపూరి రామకోటి కథకుడు, నాజర్ హాస్యం, ముక్కామల పురుషోత్తం రాజకీయ వంతలుగా దళం ఏర్పర్చారు. అప్పటి నుంచి ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథకు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది, ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించారు. 1944లో బెంగాల్ లో వచ్చిన కరువు పరిస్థితులను తెలియజేసే విధముగా డొక్కల కరువు అనే బుర్రకథ ను రచించి తోటి మనిషికి సహాయపడవలసిందిగా తన వంతు ప్రచారము కొనసాగించాడు.
"ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు" అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడు, మహానుభావుడు నాజర్. తెనాలి లోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్ కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు సాగింది. కమ్యూనిస్టు పార్టీలోచేరి ప్రజానాట్యమండలి వేదిక ద్వారా పార్టీ సిద్ధాంతాలను కార్యక్రమాలను బుర్రకథల ద్వారా ప్రచారం చేశాడు. వీరిని 1940వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ నెల జీతంమీద కథలు చెప్పించి పల్లెలలో తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకున్నది. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామ రాజు, ప్రహ్లాద, క్రీస్తు, బెంగాల్ కరువు మొదలగు ఇతివృత్తాలలో నమకాలీన రాజకీయాలు జోడించి బుర్రకథలు రూపొందించాడు. కొంతకాలం విరసం సభ్యుడు ఆ తరువాత కొన్ని విభేదాలు తలెత్తడముతో సిపిఎం పార్టీని, విరసమును వదలి నాజర్ దళము అనే సొంత బుర్ర కథా దళాన్నిఏర్పరచుకొని కళాసేవ చేసాడు. కాషాయరంగు పైజామా, కుర్తా, నడుముకు ఎర్రని బెల్టు లాంటి వస్త్రము అనే ప్రత్యేక ఆహార్యాన్ని బుర్రకథా కళాకారుడికి సూచించింది నాజర్. ఈ వస్త్రపు రంగుల గురించి ప్రస్తావిస్తూ కాషాయ రంగు శాంతికి, ఎరుపు విప్లవానికి గుర్తుగా భావించాలని అయన అంటాడు. స్వాతంత్ర్యోద్యమము లో పాల్గొని నాజర్ ఏడుసార్లు జైలు జీవితాన్ని అనుభవించారు.
ప్రజా కళాకారుడుగా, బుర్రకథ పితామహుడుగా ఎదిగిన వాడు. అంగాంగ విన్యాసాల ద్వారా ఆటపాట ద్వారా జాతిని మేల్కొలిపి ఉత్తేజపరిచిన మహనీయుడు షేక్ నాజర్. నాజర్ కథ చెప్పుతుంటే శృంగారం రసరంజకంగా గిలిగింతలు పెడుతుంది. హాస్యం నవ్వుల పువ్వులను పూయిస్తుంది. వీరం మహోద్రేకంగా పరవళ్ళు తొక్కుతుంది. కరుణ కన్నీళ్లను ధారగా కురిపిస్తుంది. అగ్గిరాముడు, బలేబావ, నిలువు దోపిడి, పెత్తందార్లు, మనుషులంతా ఒక్కటే - సినిమాల్లో నాజర్ బుర్రకథలు కన్పిస్తాయి. పూలరంగడు సినిమాలో అక్కినేనికి నేర్పించారు. చాలా మందికి ఈ గాంధర్వ విద్య నేర్పాడు. ఆయన గళ గాంభీర్యాన్ని, మాధుర్యాన్ని గమనించి, వివశులైన సినీ సంగీత దర్శకులు ఎస్. రాజేశ్వరరావు సినీరంగంలో స్థిరపడమని కోరినా, ఆ లోకం తన లోకం కాదని సవినయంగా చెప్పి, జనపదమే తన పథమని బుర్రకథలు చెప్పుకుంటూ జనంతో మమేకమై, జీవితాంతం ప్రజా కళాకారుడిగా తన ప్రయాణం సాగించాడు. "ఆసామీ" నాటకాన్ని రచించాడు. 18వ ఆంధ్రనాటక కళాపరిషత్తు పోటీల్లో ఆసామి నాటకం ప్రథమ బహుమతి పొందింది.
నాజర్ జీవిత చరిత్రను అంగడాల వెంకట రమణమూర్తి అనే ఆయన "పింజారీ" అనే పుస్తకంగా ప్రచురించాడు. నాజర్ ఆత్మకథ పింజారి చిన్న గ్రంథమే అయినా, తన పుట్టుపూర్వోత్తరాలు, కుటుంబం, బంధువర్గం, వాతావరణం తాను అక్షరం ముక్క కోసం ఎన్ని కష్టాలు పడిందీ, ఆటపాట నేర్వడానికి ఎన్ని గడపలు తొక్కిందీ, అన్నం ముద్ద కోసం ఎన్ని తిప్పలు పడిందీ, చివరికి కమ్యూనిస్టు పార్టీ తన దిశ ఎలా మార్చిందీ, అవగాహనా క్షేత్రం ఎంతగా విశాలం చేసిందీ వివరంగా చెప్పాడు. ఎవరు తనను మొదట్లో చేరదీసిందీ, అన్నం పెట్టిందీ, విద్య నేర్పిందీ, మహా పండితుల నుండి, తనకంటే విద్యలో చిన్నవారైన వంతల నుండి తానేం నేర్చుకున్నదీ, పేరు పేరునా సవినయంగా చెప్పుకున్నాడు. జాతి జీవితం, కళా పరిణామం. చరిత్ర, మావన పరిణామ క్రమం, సాంస్కృతిక చరిత్రల వెనక దాగి వున్న విషయాలను ఈ గ్రంధము లో వివరిస్తాడు.
రంగస్థల మహానటుడు బళ్లారి రాఘవాచార్యులు నాజరు బుర్రకథ విని అమితానందంతో బళ్లారికి ఆహ్వానించడం, మద్రాసులో ప్రదర్శన చూచిన డా: గోవిందరాజుల సుబ్బారావు నాజరుని అభినందిస్తూ కౌగిలించుకోవడం, ప్రముఖ పాత్రికేయుడు కె. అబ్బాస్ నాజరును ఆంధ్ర అమరషేక్ అని అభివర్ణించడం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య నాజరు ప్రజాభాషకు ముగ్ధుడై 'నా బిడ్డడు ఎంత ఎదిగిపోయాడో' అని ఆలింగనం చేసుకోవడం, నాజరు సాధించిన కళాప్రతిభకు తిరుగులేని నిదర్శనాలు. నాటకాల్లో బుర్రకథ బ్రహ్మ నాజర్ దగ్గర శిక్షణ తీసుకోవటం నా నట జీవితానికి పట్టం కట్టింది అని నటి జమున చెపుతుంది. అలాగే ఎన్.టి రామారావు గారు ,"నేను మీ అభిమానిని" అని నాజర్ తో అని అందరిని ఆశ్చర్యపరిచారు. ఆంధ్ర నాటక అకాడమీ 1981లో ఉత్తమ కళా కారుడు అవార్డుతో సత్కరించింది. 1986 లో భారతప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో నాజరును సత్కరించింది. కళాకారుడిగా బుర్రకథ పితామహుడిగా ఎంతో కీర్తి ప్రతిష్టలు గడిచినప్పటికీ మరణించేవరకు కటిక పేదరికాన్ని అనుభవిస్తూ 1997, ఫిబ్రవరి 22 న అంగలూరులో నాజర్ మరణించారు.