బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు,"యామిజాల పద్మనాభస్వామి”
ప్రస్తుతం టీవీ చానళ్లు ఎక్కువగా ఉండటం వలన పురాణ ప్రవచనాలు ఎక్కువగా ప్రజలు చూస్తున్నారు. ఉత్తరాంధ్రలో కవుల సంఖ్య ఎక్కువ చాలా కారణాల వల్ల వీరిలో చాలామంది ప్రజానీకానికి చేరువ కాలేక పోయినారు. పాత రోజుల్లోఅంటే రేడియో ఒక్కటే ప్రసార మాధ్యమంగా ఉన్నప్పుడు బహు కొద్దిమంది పురాణ ప్రవచనకారులు ఉండేవారు. వారు ఎక్కువగా పౌరాణిక గ్రంధాలూ వ్రాస్తూ ఆ గ్రంధాల వల్ల పాపులర్ అయ్యేవారు. ఏది ఏమైనా, ఈ రోజుల్లో ఉన్నట్లుగా ఆరోజుల్లో వారికి పబ్లిసిటీ లేదా పాపులారిటీ ఉండేది కాదు. అటువంటి విషయాల పట్ల ఆసక్తి ఉన్నవారికి మాత్రమే ఆ పేర్లు తెలిసేవి. శ్రీరామ నవమి లేదా దసరా, వినాయక చవితి పండుగల పందిళ్ళలో పండితులు, కవులు వారి ప్రవచనాలను వినిపించేవారు. అటువంటి పండితులలో పురాణ గ్రంధాల రచయిత మరియు ప్రవచన కర్త అయిన సంస్కృతాంధ్ర పండితుడు స్వాతంత్ర సమరయోధుడు అయిన యామిజాల పద్మ నాభ స్వామి గారు ఒకరు.
వీరు విజయనగరం జిల్లా, గరుగుబిల్లి మండలం, శివరాంపురం గ్రామంలో 1915, జూన్ 12వ తేదీన కామేశ్వరి, లక్ష్మీనరసింహ శాస్త్రి దంపతులకు జన్మించారు. వీరి తండ్రి లక్ష్మీనరసింహశాస్త్రి గారు నిరతాన్నదాతగా ఆ ప్రాంతంలో ప్రసిద్ధుడు. యామిజాల పద్మనాభస్వామి చాలా చిన్నవయసులోనే ఇంటివద్ద ఉండి దేవులపల్లి సీతారామశాస్త్రి వద్ద కాళిదాసత్రయం అభ్యసించాడు. తన స్వగ్రామానికి సమీపంలో ఉన్న జామిలో మోతికుర్తి సత్యనారాయణ శాస్త్రి వద్ద కౌముది నేర్చుకున్నాడు. 1930లో కడియం వెళ్లి చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి వద్ద రెండు సంవత్సరాలు శిష్యరికం చేసి కవిత్వ రహస్యాలు తెలుసుకున్నాడు. 1933లో విజయనగరం ప్రాచ్యకళాశాల చేరి 1938వరకు అక్కడే చదివి ప్రాచ్యభాషా పట్టాను పొందారు. ఆ సమయంలోనే ఆదిభట్ల నారాయణ దాసును సేవించి జ్యోతిష శాస్త్ర పట్టులెన్నో గ్రహించాడు. ఆదిభట్ల నారాయణదాసు ఇతడిని కావ్యకంఠ గణపతి మునికి పరిచయం చేయగా అతనికి శుశ్రూష చేసి మంత్ర శాస్త్రం నేర్చుకున్నాడు.
స్వతంత్ర ఉద్యమం జోరుగా సాగుతున్న రోజులు అవడం వల్ల గాంధీజీ, తెన్నేటి విశ్వనాథం లాంటి నాయకుల ప్రభావం వల్ల వీరి దృష్టి స్వాతంత్ర సమరం వైపు మళ్ళింది. స్వయంగా రచించిన దేశభక్తి గీతాలను, పద్యాలనూ పాడుతూ ప్రజలను ఉత్తేజపరిచారు. ఫలితంగా ఈయనను ప్రాచ్యకళాశాల నుంచి తొలగించారు ఆ తర్వాత పద్మనాభ స్వామి లాంటి ప్రతిభావంతుడిని వదులుకోవడం ఇష్టం లేక తిరిగి అదే ప్రాచ్య కళాశాల యాజమాన్యం తిరిగి చేర్చుకున్నారు. ఆ రోజుల్లో కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు ఈయనకు నెల నెలా విద్యార్థి వేతనం (స్కాలర్ షిప్) ఇచ్చేవారు. అలాగే ఈయన కవితా శక్తి గురించి విన్న జయపురం మహారాజా గారు ఆహ్వానించి తన సంస్థానంలో ఆస్థాన కవిగా నియమించారు. రాజకీయాల్లో పొట్టి శ్రీరాములు గారి వెంట తిరిగి హరిజనోద్ధరణకు నిధులు సేకరించారు.
1948లో మద్రాసులోని శ్రీరామకృష్ణ విద్యాసంస్థలలో ఆంధ్రోపాధ్యాయుడిగా ప్రవేశించి 1974లో పదవీ విరమణ చేశాడు. ఆ విధంగా 1948 నుండి 1997 వరకు మద్రాసులోనే ఉన్నారు. ఇతని సంపాదకత్వంలో మద్రాసు నుండి అమృతవాణి అనే సాహిత్య మాసపత్రిక కొన్నాళ్లు వెలువడింది. ఆంధ్రప్రభ డైలీ న్యూస్ పేపర్ లో ఆంధ్ర మహాభాగవతం అనే పేరుతో వ్యాస భారతాన్ని తెలుగులో తెలుగు పాఠకులకు నిత్యం అందించేవారు. ఆ రకంగా జర్నలిస్ట్ గా కూడా పాపులర్ అయినారు. మహాభాగవతం(సరళ వచనం) దేవి భాగవతం,(సరళ వచనం) వాల్మీకి రామాయణం (సరళ వచనం) కుమార సంభవం (వచనమ్) లాంటి ఎన్నో పౌరాణిక రచనలను చేశారు. ఆ సమయము లోనే ఆంధ్ర ప్రభ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లలో పనిచేస్తున్న ప్రముఖ జర్నలిస్ట్ గండూరి కృష్ణ గారి తో స్నేహం ఏర్పడి వారి ఇద్దరు కూతుళ్లను తన ఇద్దరు కుమారులకు ఇచ్చి వివాహం జరిపించి స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకున్నారు. ఆయన రచనలలో పూర్ణ పురుషుడు (ఆదిభట్ల నారాయణ దాసు జీవిత చరిత్ర), నాయనా (గణపతి ముని జీవిత చరిత్ర), అన్నమాచార్య (నృత్య నాటకం), అర్ధనారీశ్వరం (నృత్య నాటకం) మరియు కామాక్షి పరిపక్వత (సంగీత నాటకం) వంటి పుస్తకాలు మరియు అనేక ఆధ్యాత్మిక మరియు పౌరాణిక గ్రంధాలు ఉన్నాయి. టిటిడి వారి కోరిక మీద కాశీ ఖండము, ఏకాదశి మహత్యం, విశ్వ గుణాదర్శము రచించారు. వీటిని టిటిడి వారు ముద్రించారు. వీరికి కవిరత్న, కవికులతిలక అభినవ వాల్మీకి అనే బిరుదులు కలవు. ఒకే చేతి మీదుగా ఒకే శైలిలో తెలుగు వచన రచనలను అనువదించిన మరో వ్యాస మహర్షి శ్రీ పద్మనాభ స్వామి గారు. ఒక పక్క సాహిత్య అనువాదం మరొక పక్క స్వీయ రచనలు మరో పక్క బాల సాహిత్యం ఇలా ఎన్నో రకాల ప్రక్రియలలో రచనలు చేస్తూ ఆబాల గోపాలాన్ని ఆకట్టుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి పద్మనాభ స్వామి గారు. ఆంధ్ర కేసరి, పట్టాభి, రాజాజీ వంటి ప్రముఖుల జీవిత చరిత్రలు రచించారు. ఆ విధంగా అయన సరస్వతి పుత్రులే.
అటు ఆకాశవాణి ఆంధ్ర ప్రభ, పత్రిక, భారతి చిత్ర గుప్త వంటి పత్రికలు వారి రచనల కోసం ఎదురుచూసేవి. ఆ విధంగా 1933లో పట్టిన కలాన్ని1998 వరకు విడువకుండా రచనా వ్యాసంగం చేశారు. నిష్టాగరిష్టంగా నిరాడంబర జీవితము, నిర్మోహమాటమైన వాగ్విలాసము వీరి ప్రత్యేకతలు. ఇంటి నిండా, అటక నిండా పుస్తకాలే. పుస్థకాలే వారి సహచరులు. ప్రతి రోజూ నిత్య అనుష్ఠానము తర్వాత రచనా వ్యాసంగము యామిజాల పద్మనాభ స్వామి గారు చేసేవారు. సాహిత్యము లో చేసిన కృషికి గుర్తింపుగా వారికి కవి కులతిలక, ఆధునిక వాల్మీకి, కవిరత్న, అనే బిరుదులతో సత్కరించారు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర సరస్వతి స్వాముల వారు వీరికి కుమార సరస్వతి బిరుదును ప్రధానం చేసారు. యామిజాల పద్మనాభ స్వామి 1998 మార్చి 25న దీర్ఘకాలిక అనారోగ్యం తో మద్రాసులో మరణించారు.