
ఆధునిక వాగనుశాసనుడు “గుంటూరు శేషేంద్రశర్మ”

తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త, వక్త, సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితుడు అయిన గుంటూరు శేషేంద్ర శర్మ గారు 1927 అక్టోబర్ 20న నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం, నాగరాజుపాడులో జన్మించారు. గుంటూరు ఏసీ కాలేజీ నుండి డిగ్రీని, మద్రాస్ లా కాలేజీ నుండి లా డిగ్రీ ని పొందారు. ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో మునిసిపల్ కమిషనర్ గా పనిచేసి పదవి విరమణ చేసారు.
ఆధునిక సాహిత్యంపై తనదైన ముద్ర వేసిన గుంటూరు శేషేంద్ర శర్మ 30కి పైగా రచనలు చేసారు. ఈయన రచనలు అంతర్జాతీయ ఖ్యాతి గాంచాయి."నా దేశం-నా ప్రజలు" 2004 నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం. ఈయన సినిమా కోసం రాసిన పాట ముత్యాలముగ్గు సినిమాలోని "నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది" ముత్యాల ముగ్గు సినిమా లో ఎక్కువ భాగం ఆయన నివాసం అయిన జ్ఞానబాగ్ ప్యాలస్ లో చిత్రీకరించబడింది.
నా దేశం - నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాలరేఖ, షోడశి రామాయణ రహస్యాలు, ఆధునిక మహాభారతం, జనవంశమ్ వీరి ప్రధాన రచనలు. ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం ఉన్న వ్యక్తి శేషేంద్ర శర్మ గారు. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితులు. శేషేంద్ర శర్మ గారు సహేతుకంగా యుగ విభజన చేశారు అయన సాహితి ప్రపంచాన్ని 1. వాచ్యార్థ ప్రధానయుగం, 2. లక్షణార్థ ప్రధానయుగం, 3. ద్వితీయ వాచ్యార్థ ప్రధానయుగం, 4. ద్వితీయ లక్షణార్థ ప్రధానయుగం అని విభజించాడు. కవిత్వములో విలక్షణ ఊహాశాలిత ఆయన ప్రత్యేకత. వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు శేషేంద్ర శర్మ గారు. బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి. ఒకానొక శైలీ నిర్మాత. ఈయన కవిసేన మేనిఫెస్టో (1977) పేరుతో ఆధునిక కావ్యశాస్తాన్ని కూడా రచించి నేటి యువతరాన్ని ఆకర్షించాడు. విప్ణవభాషా విధాతగా పేరుగన్నాడు. సమకాలిక కవితారంగంలో శిఖరాయమానంగా వెలుగొందాడు. అభివ్యక్తిలో, ఆలంకారికతలో, వస్తు విన్యాసంలో కవిగా తనదైన వ్యక్తిత్వాన్ని ముద్రించుకున్నాడు.
అవార్డుల విషయానికి వస్తే 1993లో సుబ్రహ్మణ్య భారతి రాష్ట్రీయ సాహిత్య పురస్కారం, 1994 లో ఈయన రచించిన కాలరేఖ కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1994లోనే రాష్ట్రీయ సంస్కృత ఏకతా పురస్కారం, తెలుగు విశ్వ విద్యాలయం వారి గౌరవ డాక్టరేట్, కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు మొదలైనవి ఈయన ప్రతిభకు నిదర్శనాలుగా వచ్చినవి. ‘కొంగ్రొత్త ప్రయోగాలతో కావ్యభాష స్వరూపంలోమార్చుతెస్తున్న ఆధునిక వాగనుశాసనుడు శేషేంద్ర.’ అని తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్, ఆచార్య పేర్వారం జగన్నాథం, ప్రశంసించారు.
"శేషేన్ నీ పోయెమ్సు చూసేన్, పసందు చేసేన్, నీది పద్యమా, లేక ఫ్రెంచి మద్యమా?" అంటూ ఆయనను కవితాత్మకంగా పొగిడి మురిసిపోయారు శ్రీశ్రీ. శేషేంద్ర శర్మ గారి పాండిత్యము ఎంత లోతైనదో చెబుతూ, "వీరికి సాటి వచ్చే మహామేధావులు భారతదేశం మొత్తం మీద ఒకఱిద్దఱకు మించి ఉండక పోవచ్చునేమో" అని "షోడశి"కి సమీక్ష రాస్తూ ప్రశంసించారు కవి సామ్రాట్ విశ్వనాథవారు.
శేషేంద్ర శర్మ గారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు 2007 మే 30 రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన భౌతిక కాయానికి మే 31న అంబర్‌పేట శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు.