
భారత తొలి టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ “సి కె నాయుడు”
ప్రస్తుతం భారత దేశములో అత్యధిక ఆదరణ ఉన్న ఆట క్రికెట్. అలాగే ఆటగాళ్లకు కాసులు కురిపించే ఆట కూడా క్రికెట్. గవాస్కర్, టెండూల్కర్, కోహ్లీ వంటి ఆటగాళ్ల పేర్లు ఈ రోజుల్లో స్కూల్లో చదివే పిల్లలకు కూడా పరిచయమే. క్రికెట్ ఆటగాళ్లు సినిమా యాక్టర్ ల తర్వాత బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తులు. కానీ బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు ఇంగ్లీషు వారి ఆధిపత్యం ఉన్న క్రికెట్ ఆటలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి, రెండు దశాబ్దాల పాటు (1916-1936) క్రికెట్ లో రాణించి ఆ కాలాన్ని నాయుడు యుగం గా ప్రసిద్ధి చెందేటట్లు చేశాడు. ఆయనే సి.కె. నాయుడు గా సుపరిచితుడైన కొఠారి కనకయ్య నాయుడు. ఒన్ డే మ్యాచ్ లు, లిమిటెడ్ ఓవర్లు మ్యాచెస్ లేని రోజుల్లో క్రికెట్ మ్యాచ్ అంటే టెస్ట్ మ్యాచులే ఉండేవి. అటువంటి రోజుల్లో భారత జట్టుకు ఎక్కువ మంది ఇంగ్లీషు వాళ్ళు ఉన్న రోజుల్లోనే టీమ్ కు కెప్టెన్ గా తొలి భారతీయుడు సి కె నాయుడు కెప్టెన్ గా వ్యవహరించటమే కాకుండా భారత దేశపు క్రికెట్ టీమ్ కు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టాడు. సి కె నాయుడు సాధించిన విజయాలను బట్టి ఆ కాలాన్ని నాయుడు యుగం గా క్రికెట్ ప్రపంచంలో వ్యవహరించే వారు. ఈ రోజుల్లో క్రికెటర్ల లాగా డబ్బుల కోసం కాకుండా దేశం కోసం ఆడిన ఆటగాడు నాయుడు.
సి కె నాయుడు 1895, అక్టోబర్ 31న మహారాష్ట్రలోని నాగపూర్ లో ఒక తెలుగు కుటుంబంలో జన్మించాడు. ఆయన పూర్వీకులు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సుప్రసిద్ద తెలగ నాయుడు వర్గంవారు. అయితే, ఆయన తాతగారైన కొఠారి నారాయణస్వామి నాయుడు గారికి రెండు తరాలకి ముందే వాళ్ళ కుటుంబం హైదరాబాద్ తరలిపోయింది. నారాయణస్వామి నాయుడు గారి తాతగారు నిజాం నవాబు వద్ద దుబాసీగా పనిచేసారు. తరువాత వారి మకాం ఔరంగాబాదుకు మారింది. చివరికి సి.కె.నాయుడి తండ్రి సూర్యప్రకాశరావు నాయుడు హోల్కర్ సంస్థానంలో న్యాయమూర్తిగా ఉంటూ, నాగపూరులో స్థిరపడ్డారు. సి.కె.నాయుడు అక్కడే పుట్టి పెరిగాడు. సి.కె. ప్రతిభను గౌరవిస్తూ, హోల్కర్ సంస్థానాధీశుడు 1923లో ఆయనకి తన సైన్యంలో అత్యున్నత పదవినిచ్చి, ఇండోర్ రావలసిందిగా ఆహ్వానించాడు. తన ఆఖరి రోజుల వరకూ సి.కె. అక్కడే స్థిరనివాసం ఏర్పర్చుకున్నాడు. రాష్ట్రానికి ఆవలనున్నా సి.కె. ఇంట్లో తెలుగు వాతావరణమే ఉండేదని ఆయన పిల్లలు ఆయన గురించి రాసిన పుస్తకాలలో రాశారు. తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ, తెలుగు పత్రికలు చదవడం, తెలుగు వస్త్రధారణలో ఉండటం నాయుడి గారి కుటుంబంలో కొనసాగాయి. ఆయన పాఠశాలలో చదువుకునేటప్పుడే క్రికెట్ ఆటలో విశేషమైన ప్రతిభ కనపరిచేవాడు. మొదటిసారిగా ప్రధమ శ్రేణి క్రికెట్ ఆటలో 1916 లో హిందూ జట్టు లో చేరి యూరోపియన్ జట్టుకు వ్యతిరేకంగా ఆడాడు. ఆ మ్యాచ్ లో తమ జట్టు 79 పరుగులకు 7 వికెట్లు పడి జట్టు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు 9 వ ఆటగాడిగా దిగి మొదటి మూడు బంతులను అడ్డుకొని నాలుగవ బంతిని సిక్సర్ కొట్టాడు. అలా సిక్సర్ తో మొదలైన ఆయన క్రికెట్ కెరీర్ చివరి దాకా చెక్కు చెదరలేదు.
ఆరు దశాబ్దాల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన కొద్దిమంది క్రీడాకారులలో సి. కె. నాయుడు ఒకరు. 1956-57 రంజీ ట్రోఫీలో తన 62 వ యేట అతను చివరిసారి ఆడాడు. ఆ మ్యాచ్‌లో 52 పరుగులు చేశాడు. రిటైర్ అయ్యాక కొన్నాళ్ళు జట్టు సెలెక్టర్ గా, రేడియో వ్యాఖ్యాతగా ఆటతో తన అనుబంధం కొనసాగించాడు. నలభై ఎనిమిదేళ్ళ సుదీర్ఘ ఫస్ట్ క్లాసు కెరీర్ లో సి.కె, ముంబై క్వాడ్రాంగులర్స్, పెంటాంగులర్స్, రంజీట్రోఫీ, మద్రాసు ప్రెసిడెన్సీ మ్యాచ్ లు, నాగపూర్ క్వాడ్రాంగులర్స్, సూరత్ క్వాడ్రాంగులర్స్, అమృతసర్ ట్రయాంగులర్స్, రోషనారా టోర్నమెంటు, మొయినుద్దౌలా గోల్డ్ కప్ ఇలా అనేక టోర్నమెంట్లలో ఆడేవాడు. ఇవి కాక, వివిధ రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్ ఎలెవెన్, గవర్నర్ ఎలెవెన్ జట్లకి కూడా ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 344 మ్యాచ్ లు ఆడి 11825 పరుగులు చేశాడు, 411 వికెట్లు తీసుకున్నాడు. విశేషం ఏమిటంటే సి.కె. కెరీర్ లో ఆడిన మ్యాచ్ లలో సగానికి పైగా ఆయనకి నలభై ఏళ్ళు దాటాక ఆడినవే. ఏడు అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ లు ఆడిన సి.కె. 350 పరుగులు చేశాడు, తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు. ఫస్ట్ క్లాసు క్రికెట్లో యాభై ఏళ్ళ వయసు దాటాక కూడా డబుల్ సెంచురీ చేసిన అతి కొద్ది మంది ఆటగాళ్ళలో సి.కె. ఒకరు. భారత జట్టుకి ఆడిన వారిలో "విజ్డెన్" పత్రిక "క్రికెటర్ ఆఫ్ ది ఇయర్" గా 1933లో ఎంపికైన మొదటి వ్యక్తి ఈయనే.
1955 లో భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు సి.కె. నాయుడు సోదరుడు సి.ఎస్. నాయుడు కూడా ప్రముఖ క్రికెటర్. సి.కె. కుమార్తె చంద్ర నాయుడు భారతదేశంలోని తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత. సి.కె మరణానంతరం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మచిలీపట్నంలో ఒక వీధికి ఆయన పేరు పెట్టారు. ఈయన 1967 నవంబరు 14న, 72 ఏళ్ల వయస్సులో ఇండోర్‌లో మరణించాడు. నేటికీ భారతీయ క్రికెట్ దిగ్గజాలతో ఆయన పేరు ప్రముఖంగా ముందు చెప్పుకుంటారు.