Menu Close
Shyama-Sundara-Rao
తెలుగు తేజాలు
అంబడిపూడి శ్యామసుందర రావు

తెలుగు సినిమా లెజెండ్ "చక్రపాణి"

chakrapani-film-director
Photo Credit: Wikimedia Commons

చక్రపాణి’ అనే కలం పేరుతొ ప్రసిద్ధి చెందిన వ్యక్తి అసలు పేరు ఆలూరు వెంకట సుబ్బారావు. అసలు పేరు చెబితే ఎవరికీ తెలియదు గాని ‘చక్రపాణి’ అంటే తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులు లేరు అని చెప్పడం అతిశయోక్తి కాదు. చక్రపాణి బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత, దర్శకుడు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయన ఒక లెజెండ్. విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకడు. తెలుగు సినిమాల్లో చెప్పుకోదగ్గవీ, నేటికీ ప్రజాదరణ పొందుతున్న సినిమాలు, క్లాసిక్ అంటే విజయా ప్రొడక్షన్స్ వారి మాయాబజార్, పాతాళభైరవి, మిస్సమ్మ, గుండమ్మ కధ సినిమాలే. ఆ సినిమాల వెనుక వ్యక్తులు నాగిరెడ్డి, చక్రపాణి. వీరిద్దరూ కలిసి 1949లో విజయా ప్రొడక్షన్స్ స్థాపించి, సినిమాలు తీయాలని నిర్ణయించడం జరిగింది. తొలి ప్రయత్నంగా ‘షావుకారు’ (1950) చిత్రాన్ని ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించారు.

చక్రపాణి గారు గుంటూరు జిల్లా తెనాలి లో 1908, ఆగస్టు 5 న ఒక మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో గురవయ్య, వెంకమ్మ దంపతులకు జన్మించారు. జాతీయోద్యమ ప్రభావానికి లోనై ఉన్నత పాఠశాల విద్యకు స్వస్తి చెప్పి యలమంచిలి వెంకటప్పయ్య వద్ద హిందీ భాషను అభ్యసించాడు. ఆ సమయంలో హిందీ భాషా వ్యాప్తికి గాఢ కృషి సాగిస్తున్న వ్రజనందన వర్మ దగ్గర హిందీ భాషలో చక్కని పాండిత్యాన్ని గడించాడు. 'చక్రపాణి' అనే కలం పేరును ఈయనకు అతనే ప్రసాదించాడు. స్వయం కృషితో చక్రపాణి గారు సంస్కృతం ఇంగ్లీష్ లలో అభిమానాన్ని పెంచుకొని ఘాడ పరిచయాన్ని పొందారు. 1932 లో క్షయ వ్యాధి గ్రస్తుడు అవడం వల్ల మదనపల్లె టీబీ శానిటోరియం లో వైద్యం నిమిత్తం కొన్ని నెలలు ఉండవలసి వచ్చింది. ఆ సందర్భములో సాటి రోగి ద్వారా బెంగాలీ భాష నేర్చుకొని బెంగాలీ నవలలను తెలుగులోకి అనువదించి తెలుగు పాఠకులకు శరత్ బాబు లాంటి ప్రముఖ బెంగాలీ నవలా రచయితలను పరిచయం చేసాడు. చక్రపాణి తెలుగు అనువాదాలు ముఖ్యంగా శరత్ బాబు నవలలు చదివిన పాఠకులు శరత్ బాబు తెలుగు వాడే అన్న అభిప్రాయం ఏర్పడేది. వాగ్దత్త, సుభద, పల్లీయులు, చంద్రనాథ్, దేవదాస్, పరిణీత, నవ విధాన్, బడా దీది, పతివ్రత, హేమంగి, నిష్కృతి, మా వారు, వంటి శరత్ రచనలను తెలుగులో అనువదించారు. క్రమముగా తెలుగులో చిన్న చిన్న కథలు నవలలు రాయడం మొదలు పెట్టాడు.

మంచి రచయితగా, అనువాదకుడిగా పేరు సంపాదించిన చక్రపాణికి సినిమా అవకాశాలు వచ్చాయి.1934-1935 లో కొడవటిగంటి కుటుంబరావు తో కలిసి తెనాలిలో యువ మాసపత్రికను మంచి అభిరుచిగల తెలుగు పాఠకుల కోసం ప్రారంభించారు. ఈ పత్రికను చక్రపాణి 28 సంవత్సరాలు నడపగా కుటుంబరావు దానికి సంపాదకుడుగా వ్యవహరించారు. 1960 లో దీనిని హైదరాబాదుకు తరలించారు. సుమారు నాలుగు దశాబ్దాల కాలం తెలుగులో కాల్పనిక సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో ఈ మాస పత్రిక గురుతరమైన పాత్ర పోషించింది. బెంగాలీ నవలలు వడ్డాది పాపయ్య గారి చిత్రాలతో యువ తెలుగు పాఠకులకు బాగా దగ్గర అయి పాపులారిటీ సంపాదించింది. ఆ విధముగా చక్రపాణి గారు బెంగాలీ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేసిన వ్యక్తి అయినారు.

చక్రపాణి సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది అంటే 1940 లో ముంబైలోని ఫేమస్ ఫిలింస్ వారి ధర్మపత్ని కోసం ఈయన మాటలు రాయడం ద్వారా జరిగింది. బి.ఎన్.రెడ్డి రూపొందిస్తున్న స్వర్గసీమకు మాటలు రాయడానికి చెన్నై వెళ్ళాడు. ఘంటసాల గాయకుడు గా వెండితెరకు పరిచయమైన చిత్రం స్వర్గసీమ. ఈ సినిమా బహుళ జనాదరణ పొందింది.1949 లో చక్రపాణి, బెంగాలీ రచయిత శరత్ నవలలను అనువదించి ప్రింటింగ్ కోసం బి ఎన్ కె ప్రెస్ కు (బి నాగిరెడ్డి గారి ప్రెస్) వెళ్ళినప్పుడు ఆయనకు నాగి రెడ్డి గారితో స్నేహం ఏర్పడి ఆ స్నేహ బంధం వారిద్దరి జీవితాల్లో చాలా అపూర్వ సంఘటనగా ఏర్పడింది. ఆ రకంగా విజయ ప్రొడక్షన్స్ అనే సంస్థ ఏర్పడి తెలుగు చిత్ర రాజాలు అనబడే సినిమాల ప్రొడక్షన్స్ కు పునాది పడింది. 1951 లో పాతాళ భైరవి సాధించిన ఘన విజయంతో వాహిని స్టూడియో లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 35 చలనచిత్రాలను రూపొందించారు.

చిత్ర నిర్మాణంలో చక్రపాణి గారిదొక ప్రత్యేకమైన బాణి, విభిన్న శైలి సినిమా రంగంలో ఆయనకు పరిచయం లేని శాఖ లేదు “మనం తీసేది జనం చూడడం కాదు జనం కోరేది మనం తీయాలి” అనే ధోరణి ఆయనది. చిత్ర విజయానికి ఆయనకు కొన్ని కొలమానాలు ఉండేవి. చిన్న పిల్లలకు సినిమా నచ్చితే పెద్దవాళ్ళకు తప్పకుండా నచ్చుతుంది అని ఆయన విశ్వాసం. గుండెలు బాదుకొని ఏడ్చే ఏడుపు మీద గానీ, సినిమా పరిభాష లోని మెలోడ్రామా మీద గానీ ఆయనకు నమ్మకం లేదు. తీవ్రమైన సంఘటనల్లో కూడా సునిశితమైన హాస్యం లేకుండా ఆయన కల్పన ఉండేది కాదు.విజయ వారి సినిమాల్లో పాటల విషయంలో చక్రపాణి గారు ప్రత్యేక శ్రద్ద తీసుకొనే వారు. సంగీత దర్శకుడితో, పాటల రచయిత తో చర్చించి సూచనలిచ్చి పాటల చిత్రీకరణ చేసేవారు. అందుచేత నేటికీ విజయ వారి సినిమాలోని పాటలు సంగీత ప్రియులు ఇష్టంగా విని ఆనందిస్తారు.

చక్రపాణి గారి మరో అద్భుత సృష్టి 1947 లో నాగిరెడ్డి గారితో కలిసి పిల్లల కోసం చందమామ కథల పుస్తకం ప్రారంభించారు. చందమామ స్థాపించాలనే ఆలోచన పూర్తిగా చక్రపాణి గారిదే. క్రమంగా అన్ని భారతీయ భాషలలో చందమామ ప్రచురించబడింది. హిందీ లో ప్రచురించే చందమామ సంపాదకీయ భాద్యతలను తన అన్న కుమారుడు, ప్రముఖ రచయిత అయిన ఆలూరి బైరాగి కి అప్పగించారు. చక్కటి కథలతో, బొమ్మలతో ఆబాలగోపాలాన్ని అలరించిన చందమామ పత్రికకు 1975లో వారు చనిపోయే వరకూ సంపాదకుడిగా కొనసాగారు.1939 లో సి పుల్లయ్య గారు ధర్మపత్ని సినిమాకు కథ సమకూర్చారు. ఆ సినిమా పూర్తి అవుతుండగా చక్రపాణి గారి భార్య రంగమ్మ గారు మరణించారు. శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ చిత్రానికి కథ చక్రపాణి గారు సమకూర్చారు. ఆ సినిమా విడుదల కాకుండానే సెప్టెంబర్ 24, 1975 న చక్రపాణి గారు స్వర్గస్తులైనారు. అందువల్లే ఆ సినిమాను చక్రపాణి గారికి అంకితం ఇచ్చారు. ఆయన మరణించినప్పటికీ ఆయన సినిమాల ద్వారా ప్రేక్షకుల మదిలో శాశ్వత స్థానాన్ని సంపాదించారు.

********

Posted in December 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!