Menu Close
Shyama-Sundara-Rao
తెలుగు తేజాలు
అంబడిపూడి శ్యామసుందర రావు

ఆంధ్ర రత్న "దుగ్గిరాల గోపాలకృష్ణయ్య"

Duggirala Gopalakrishnayya

స్వాతంత్ర సమరం జరిగే రోజుల్లో చీరాల పేరాల సమరం గా ప్రసిద్ధి చెందిన స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన వాడు శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. చీరాల-పేరాల ఉద్యమంతో ఈయన జాతీయ స్థాయిలోని నాయకులనాకర్షించాడు. గోపాలకృష్ణయ్య గారు ఇప్పటి తరం వారికి అంతగా తెలియని పేరు ఇది కానీ ఆ రోజుల్లో ఆయన గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, ఆంధ్ర రత్న బిరుదు పొందినవాడు. స్వాతంత్ర సమరయోధుల్లో ప్రముఖుడు.

తెలుగు నాట గొప్ప నిబద్ధత, సేవాతత్పరత కలిగిన స్వాతంత్ర్య సమరయోధులు ఇద్దరు. వారిద్దరూ నడివయసులో ఉండగానే మరణించారు. ఒకరు పొట్టి శ్రీరాములు గారు. ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం ఇంచుమించు యాభై ఏళ్ళ వయసుకే ఆత్మార్పణ చేసుకున్నారు. కాగా, మరొకరు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. వీరు నలభై ఏళ్లకు తనువు చాలించి తన ఇష్టమైన శ్రీరాముని చెంతకు చేరారు.

గోపాలకృష్ణయ్య గారు కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో సీతమ్మ, కోదండరామస్వామి దంపతులకు 1889, జూన్ 2న జన్మించాడు. ఆయన పుట్టిన మూడో రోజునే తల్లి, మూడేళ్ళ వయసులో తండ్రిని కోల్పోవడంతో పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగారు. ప్రాథమిక విద్యాభ్యాసం కూచిపూడి, గుంటూరులో పూర్తి చేశారు. చదివే రోజుల్లోనే జాతీయ నాట్య మండలి స్థాపించి సంగీత నాటక కార్యక్రమాలు నిర్వహించారు. ఒకసారి మెట్రిక్ పరీక్ష తప్పి ఆ తర్వాత బాపట్లలో చదివి మెట్రిక్ పాస్ అయినారు. 1911 లో మిత్రుడు, గుంటూరు కేసరిగా ప్రసిద్ధి చెందిన నడింపల్లి నరసింహారావు గారి ప్రోత్సాహం, మరియు సహాయంతో ఎడింబరో విశ్వవిద్యాలయం నుండి ఎమ్.ఎ. పట్టా పుచ్చుకున్నాడు. ఆనంద కుమార స్వామి తో కలిసి పనిచేస్తున్నప్పుడు నందికేశ్వరుడు రచించిన అభినవ దర్పణం అనే సంస్కృత గ్రంధాన్ని ‘ద మిర్రర్ ఆఫ్  గెస్చర్’ అనే పేరుతో ఇంగ్లిష్ లోకి అనువదించారు. ఈ గ్రంధాన్ని 1917లో కేంబ్రిడ్జ్ -హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వారు ముద్రించి ప్రచురించారు.

భారతదేశం తిరిగి వచ్చినాక రాజమండ్రి, బందరులలో ఉపాధ్యాయుడిగా పని చేసి స్వతంత్ర భావాల కారణంగా ఉద్యోగాలు వదిలివేసి స్వాతంత్ర సమరంలోకి దూకాడు. 1919 లో బ్రిటిష్ ప్రభుత్వం గుంటూరు జిల్లాలోని చీరాల - పేరాల అనే రెండు పక్క పక్క గ్రామాలను మున్సిపాలిటీ గా ప్రకటించింది. ఆ రెండు గ్రామాల జనాభా మొత్తం 15వేలు. అవి చెల్లిస్తున్న పన్ను 4వేల రూపాయలు. మునిసిపాలిటీగా ఏర్పరచడం వల్ల పన్ను ౩౩వేలకు పెరిగింది. ఈ భారాన్ని భరించలేమని ప్రజలు ప్రభుత్వానికి విన్నవించారు. గోపాలకృష్ణయ్య గొప్ప ప్రజ్ఞావంతుడు, నిర్మాణ కార్యకర్త, ఉపన్యాసకుడు. చీరాల - పేరాల ప్రజలందర్నీ ఒకే మాటకు నిలబడేలా చేసాడు. ప్రజలు పన్నులు చెల్లించ నిరాకరించారు. సహాయ నిరాకరణ ఉద్యమానికి నాయకత్వం వహించి ఆంద్ర దేశం అంతా తిరుగుతూ, ఉపన్యాసాలు ఇస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం వలన బ్రిటిష్ ప్రభుత్వం ఒక ఏడాది పాటు జైల్లో ఉంచారు. చీరాల పేరాల ఉద్యమం స్వతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. గోపాలకృష్ణయ్య బెజవాడ కాంగ్రెస్ సమావేశానికి 'రామదండు' పేర స్వచ్ఛంద సేవకులను తీసుకువెళ్ళి తన నిర్మాణ పటిమను దేశవాయకులంతా మెచ్చుకునేలా చేసాడు. గాంధీ గారి సలహా మేరకు పేరాలను వదలి బయట నివాసా లేర్పరచుకొన్నారు. 13572 మంది ఏప్రిల్ 25, 1921న అర్ధరాత్రి ఇళ్ళు వాకిళ్ళు వదిలి మహాభినిష్క్రమణం చేశారు. ఇటువంటి చర్య దేశ చరిత్రలోనే అపూర్వం. ప్రజల నివాసానికి గోపాలకృష్ణయ్య పడిన శ్రమ. ఆతని రామదండు పడిన శ్రమ చిరస్మరణీయం. మండుటెండల్లో ఎడతెగని వర్షాలకు, చాలీచాలని వసతితో 11నెలలు ప్రజలు కొత్తగా ఏర్పాటు చేసుకున్న రామనగర్ లో పాకల్లో నానా అవస్థలు పడ్డారు. ఆ పాకలు ప్రభుత్వం వారి పోరంబోకు స్థలంలో నిర్మించారని వేలాది రూపాయలు అపరాధపు పన్ను విధించారు. ఉద్యమానికి కావలసిన ఆర్థిక సహాయం పై నుండి అందకపోయినా వ్యక్తులు, సంస్థలు సహాయం అందిస్తూ వచ్చారు. కాంగ్రెసు పార్టీ 3 వేల రూపాయలు సహాయం చేసింది. గోపాల క్రిష్ణయ్య అరెస్ట్ అయినాక ఏ యితర కాంగ్రెస్ నాయకుడు చీరాల - పేరాల ఉద్యమం పట్టించుకోకపోయినా కొంతకాలం ప్రజలే నడిపారు. తర్వాత ఉద్యమం సన్నగిల్లింది. ఈ మున్సిపాలిటీ చివరకు 1938 లో కాంగ్రెసు మంత్రివర్గం రద్దు చేసింది. ఈ ఉద్యమ కాలములోనే అంటే 1921 లో గోపాలకృష్ణయ్య గారిని గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అనే బిరుదుతో సత్కరించారు.

తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపారు. ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టూ కాముడు, పిచ్చికుంట్ల వాళ్ళ కథ, సాధనా శూరులు, పల్నాటి వీర విద్యావంతులు - వగైరా. గోపాలకృష్ణయ్య రామార్చనా నియమ తత్పరుడు. 'శ్రీ రామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు. వీరు స్వయంగా లలిత గీతాలనూ, కీర్తనలనూ వ్రాసుకుని రాగం కూర్చుకుని పాడేవారు. తన చీరాల పేరాల ఉద్యమ ఫలితాన్ని చూడకుండానే జూన్ 10, 1928 లో 40 వ ఏటనే గోపాలకృష్ణయ్య గారు మరణించారు. కానీ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో చీరాల పేరాల సహాయ నిరాకరణ ఉద్యమము ఆ ఉద్యమాన్ని ప్రారంభించి నడిపించిన గోపాలకృష్ణయ్య గారు చిరస్థాయిగా నిలిచారు.

********

Posted in November 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!