ప్రముఖ నవలా రచయిత్రి “యద్దనపూడి సులోచనారాణి”
తెలుగు నవలా ప్రపంచంలో ఒక విన్నూతన రచనా శైలితో పాఠకులను కట్టిపడేసే విశిష్టమైన రచయిత్రి యుద్ధనపూడి సులోచనారాణి గారు. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన ఆమె రచనలు అనేకం. ఈమె కథలు పలు సినిమాలుగా వచ్చాయి.
యుద్ధనపూడి సులోచనారాణి గారి నవలలో కథానాయకుడు బాగా ధనవంతుడు. ఆరడుగుల అందగాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా హీరోలను ఊహించుకొని నవల రచించారా అని అనిపిస్తుంది. వారి రచనా శైలి పాఠకులను నవల ఆశాంతం చదివే వరకు లేవనివ్వదు. నవలలో హీరోయిన్ మధ్యతరగతి కుటుంబం లోని అమ్మాయి. ఆత్మాభిమానం మెండు. హీరోలను ప్రశ్నించగల, నిలదీయగల, సమస్యలను ఎదురించే ఆత్మ విశ్వాసం గల చదువుకున్న నేటి చాలా మంది మహిళలను ఆనాడే తన నవలలో హీరోయిన్లుగా రూపకల్పన చేశారు. ఆనాటి నవలలు ఇప్పుడు చదివితే, ఈ నాటి మహిళలే గుర్తుకు వస్తారు. ఈమె రచనలు కేవలం సినిమాలు గానే కాక అనేక టీ.వీ. ధారావాహికలుగా రూపొందించబడ్డాయి. నవలలో గ్లామర్ తీసుకొని వచ్చి పబ్లిషర్ లకు కాసుల పంట పండించారు.
సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలములోని కాజ గ్రామంలో జన్మించారు. 1964లో సెక్రటరీతో మొదలుపెట్టి డెబ్బై కి పైగా నవలలు రాశారు. కానీ ఎక్కువ పేరు తెచ్చిపెట్టినవి, ఆమె పేరు చెప్పగానే గుర్తుకొచ్చేవి, సీరియల్స్ గా వచ్చినప్పుడు పాఠకులను మంత్రముగ్ధులను చేసినవి కొన్నే. సెక్రటరీ, జీవనతరంగాలు, మీనా. ఇంకా చెప్పుకోదగ్గవి విజేత, ఆరాధన, కీర్తి కిరీటాలు, ప్రేమలేఖలు, గిరిజా కళ్యాణం, పార్థు, ఈ తరం కథ, ఆత్మీయులు, బంగారు కలలు, ఈ మధ్య వచ్చిన “అ ఆ” సినిమా కి మాతృక వారు రచించిన మీనా నవలే. కథల్లో బహుమతి, ఐ లవ్ యూ... ఇంకా ఎన్నో ఆమె అభిమానులు మెచ్చినవి ఉన్నాయి.
ఎన్ని సార్లు ప్రచురించినా, అన్ని ప్రతులూ అతి వేగంగా అమ్ముడుపోయే ఏకైక రచయిత్రి ఆమె. నిజానికి వీరి నవలలు చదివి, ఆ సినిమా చూసిన తర్వాత వారి నవల లోని హీరో హీరోయిన్ల భావాలను చూపెట్టడం లో దర్శకులు రచయిత్రి స్థాయి అందుకోలేక పోయారు అనిపిస్తుంది. ఆ సినిమాలలో కన్న నవలల్లో హీరో హీరోయిన్ల భావాలను అంతరంగాన్ని రచయిత్రి పాఠకులకు బాగా వివరించారు అనిపిస్తుంది. సినిమాలు దృశ్య మాధ్యమం అయినా, రచయితల మనో భావాలకు అక్షర రూపం కాక ఇంకేదీ సాటిరాదు. వీరి నవలలు చదివిన తర్వాత సినిమాలలో దర్శకుడు చూడలేని, చూపలేని విషయమిది. ఆమె. రాయడం తప్ప, వాటిని ఎవరు ఎంత మెచ్చుకుంటున్నారో, ఎవరు ఎంత విమర్శిస్తున్నారు పెద్దగా పట్టించుకోలేదు. తక్కిన రచయిత్రులు అడ పిల్లలను బాధితులుగా (విక్టిమ్స్) చూపించి ఉంటే ఆమెకు విమర్శకుల మన్ననలు కూడా లభించేవేమో? కానీ ఆమె ఏ రోజూ ఆడపిల్లల్ని బాధితులుగా చూడలేదు. చూపలేదు. ఆడపిల్లని కొత్తరకంగా, మనం కూడా అలా ఉండగలిగితే బాగుండు అనే రకంగా చూపించింది.
1991 April 5న ‘స్వాతి’ వీక్లీ వాళ్ళు ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ లో ఆవిడను అడిగిన ప్రశ్న,
"ఎంతో జీవితాన్ని చూసిన మీరు, రచయిత్రిగా, ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా, తోటివారికి మీ అనుభవం నుంచి ఇచ్చే సలహా ఏమిటి?" ఆ ప్రశ్నకు ఆవిడ ఇచ్చిన జవాబులో గొప్ప ఫిలాసఫి కనిపిస్తుంది. యద్ధనపూడి గారేంటి? తత్వ బోధ చేయడమేమిటి? ఏమయ్యాడు ఆ కలల ఆరడుగుల అందమైన ఆజానుబాహుడు? ఏమైంది ఆత్మాభిమానం, పెంకితనం, స్త్రీ స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం కల నాయకీ మణి? అనిపిస్తుంది.
“మనిషికి భగవంతుడు ఇచ్చిన ప్రసాదం ఈ జీవితం! వంద సంవత్సరాల వెనక మనం లేము! వంద సంవత్సరాల ముందు వుండం. యోగ నిద్రలో క్షణంలో వెయ్యోవంతు, కళ్ళు తెరిచి ఈ అద్భుతమైన సృష్టిని చూడటానికి మనకు దక్కిన ఈ అపురూపమైన అవకాశాన్ని, ఈర్ష్యాసూయలు, వ్యర్థ పంతాలతో చేయి జార్చుకోవద్దు! అని హితబోధ చేస్తారు. జీవితంలో ప్రతి సెకను మన చేతిలో నుంచి జారిపోయేదే ఆఖరికి మనది అనుకున్న మన శరీరం కూడా మనది కాదు. అలాంటప్పుడు మనకెందుకు ఈ కొట్లాటలు! మనకెందుకు ఈ పరస్పర ద్వేషాలు! వాటిని వదిలేసి, మనం సుఖంగా బతకడానికి ప్రయత్నం చేసి, ఎదుటి వారిని సుఖంగా బ్రతకనిద్దాం. మనశ్శాంతిగా, ఉన్నంతలో బ్రతకటమే ధ్యేయం చేసుకుంటే మీకు, మీ ఇంట్లో వారికి, మీ పక్కింటి వారికి, మీ సాటి సంఘంలో అందరికీ సుఖశాంతులు, సంతోషం లభిస్తాయి. ఈ ప్రపంచంలో మనము అనుభవించేవి ఏవి మనవి కావు. ఆ విషయం తెలుసుకుంటే చాలు” అని కొన్ని జీవిత సత్యాలను సులోచన రాణి గారు చెబుతారు. తన రచనల్లో ఈ రకమైన ఫిలాసఫీ ని ఎక్కడ వ్యక్తపరచకపోయిన జీవిత సత్యాలను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నది ఆ ఇంటర్వ్యూ లో తెలియజేసారు. వీరు 2018, మే లో కాలిఫోర్నియాలో గుండెపోటుతో తుదిశ్వాస తీసుకున్నారు.
సులోచనారాణి మీద వచ్చిన విమర్శల్లో ప్రధానమైనది, ఆమె చేసిందల్లా మిల్స్ అండ్ బూన్స్ ని తెలుగులోకి తర్జుమా చేయడమేనని, వాటిలో మళ్లీ డెన్నిస్ రాబిన్స్ నవలల్ని కాపీ కొట్టడం అని చాలామంది విమర్శిస్తూ ఉంటారు. నిజంగా మిల్స్ అండ్ బూన్స్ నవలలు చదివితే, వాటిలోని నాయికా నాయకులకూ, సులోచనారాణి నాయికానాయకులకు చాలా తేడా ఉందని ఏ కాస్త విషయపరిజ్ఞానం ఉన్న పాఠకుడైనా గుర్తిస్తాడు. సులోచనారాణి నాయికల్లో రోషం, తెలివి, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పుష్కలంగా ఉన్నట్టే, ఆమె నాయకుల్లోనూ హుందాతనం, దయ, స్త్రీల పట్ల గౌరవం కనిపిస్తాయి (మిల్స్ అండ్ బూన్ నవలా పాత్రల్లో ఇవేవీ ఉండవు -ఫక్తు మోహం, శృంగారం తప్ప). ప్రచురణ కర్తలకు ఆవిడ నవలలు మంచి లాభసాటివి అలాగే ఎంతో మంది మహిళా పాఠకులను రచయిత్రులుగా మార్చిన ఘనత కూడా ఆవిడదే. ఆడపిల్లలు స్వతంత్రంగా ఆలోచించాలనీ, వారికి ఆర్థిక స్వేచ్ఛ తో పాటు, మానసిక స్వేచ్ఛ కూడా ఉండాలనేది ఆవిడ కోరిక. తన నవలల ద్వారా ఇవన్నీ చెప్పగలిగిందా లేదా అంటే కనీసం డెభ్భై అయిదు శాతం అందులో సఫలమైందని చెప్పాలి. తను శైలి పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునే అలవాటు ఆమెకు లేదు. సహజంగానే ఆమె కలానికి ఆ 'చదివించే గుణం' ఒంటబట్టిందని, ఆమె సహజ కథకురాలనీ అనిపిస్తుంది. ఆమె తను గొప్ప ఉదాత్తమైన రచనలు చేస్తున్నాననీ, సమాజాన్ని మార్చడం రచయితగా తన విద్యుక్త ధర్మమనీ, పాఠకులకు సందేశం ఇవ్వాలని భావించిన రచయిత్రి కాదు అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
VOKO WRITER KI VOKO RACHANALU CHEYADAMLO PRATEYEKATA VUNTUNDI.
VAARILO YADDANAPOODI VOKARU!