Menu Close
Shyama-Sundara-Rao
తెలుగు తేజాలు
అంబడిపూడి శ్యామసుందర రావు

ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య

Vaddadi Papaiah

పాత రోజుల్లో అంటే యువ, చందమామ వంటి మాస పత్రికలలో అందమైన ఆడపిల్లల, దేవుళ్ళ , రాకుమారుల బొమ్మలు, వాటి క్రింద "వపా" అనే సంతకం చూసే ఉంటారు. తెలుగు చిత్రకళా రంగంలో అందాల హరివిల్లులా మెరిసి, మెరుపులా కనుమరుగైన చిత్ర కళాభిమానులకు వపా గా పరిచయమైన కళాబ్రహ్మ శ్రీ వడ్డాది పాపయ్య గారు. ఆయన చిత్రాలు చూడని వారు బహుశా అరుదు అని చెప్పవచ్చు. కళాభిమానులు ఆ రోజుల్లో ఆయన చిత్రాలను ఫ్రేం కట్టించుకుని ఇళ్లలో దాచుకునేవారు. సాదాసీదా తెల్ల పంచె, తెల్ల లాల్చీ తో సిసలైన తెలుగుతనం ఉట్టిపడే వ్యక్తి వడ్డాది పాపయ్య గారు. నిశీధిని సైతం నిశితంగా పరిశీలించ కలిగే కళ్ళు ఆయన ప్రత్యేకత.

పవిత్ర నాగావళి నది తీరాన గల శ్రీకాకుళం లో 1921 లో ఓ మధ్య తరగతి కుటుంబీకుడైన శ్రీరామ్మూర్తి, మహాలక్ష్మి దంపతులకు వపా జన్మించారు. తండ్రి శ్రీరామ్ మూర్తి గారు వ్యాయమ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ తీరిక సమయాల్లో నలుపు తెలుపు రంగుల్లో చిత్రాలు గీసేవాడు. ఆ విధంగా వపా కు చిన్నతనం నుండి చిత్రలేఖనం పట్ల ప్రత్యేక అభిరుచి కలిగి తండ్రి వద్ద చిత్రకళలో మెళకువలు నేర్చుకున్నాడు. తండ్రి బొమ్మలు గీచే పద్ధతిని చాలా శ్రద్ధతో పరిశీలించేవారు. క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నారు. పట్టుదలతో సాధన చేశారు. రంగులు కలపడం, వాటిని ఉపయోగించే పద్ధతిని తండ్రి వద్దనే నేర్చుకున్నారు. తండ్రి బొమ్మలు వేస్తున్నంతసేపూ ఆయనకంటే దీక్షగా పరిశీలించుతూ కచ్చితమైన పెర్‌ఫెక్టివ్‌నెస్ జాడలను తెలుసుకొనేవారు. రంగులు కలపడం, బ్రష్ లు ఎప్పటి కప్పుడు శుభ్రం చేయడం వంటి పనులన్నీ వినయ విధేయలతో నెరవేరుస్తూ తండ్రి వద్ద శిష్యుడి పాత్రను అద్వితీయంగా నిర్వహించారు. ఆ విధంగా ఐదవ ఏటనే మొదటిసారిగా హనుమంతుని చిత్రం గీశాడు. ఆ తరువాత  ప్రముఖ పౌరాణిక చిత్రకారుడు రాజా రవివర్మను గురుతుల్యునిగానూ, ప్రముఖ ఆంధ్రచిత్రకారుడు దామెర్ల రామారావును గురువుగానూ భావించి చిత్రకళలో ముందడుగు వేశారు. మహారాష్ట్రకు చెందిన దురంధర్ చిత్రాలు కూడా వీరిలో ప్రేరణ కల్గించాయి. ప్రతి కళాకారుడికి వ్యక్తిత్వమూ, సొంత బాణి ఉండాలని, అప్పుడే ప్రత్యేకత ఏదో ఒకటి వారిలో కన్పిస్తుందని ప్రగాఢంగా నమ్మి, ఆ ప్రకారంగానే తనను తాను మలుచుకున్నారు. అప్పట్లో వీరు భారతిలో గీచిన ‘నాగేశ్వరుడు’, ఆంధ్రజ్యోతిలో వేసిన ‘రతీమన్మథ’ చిత్రాలు సంచలనం సృష్టించాయి. మంజూష, రేరాణి, అభిసారిక, అవినీతి, నవ్వులు పువ్వులు పత్రికల్లో వీరి చిత్రాలు చూసిన స్వర్గీయ చక్రపాణి చందమామ చిత్రకారునిగా మద్రాసుకు ఆహ్వానించారు. ఒక్క "చందమామ" పత్రికలోనే దాదాపు మూడు దశాబ్దాల పర్యంతం తన సహజ శైలిలో బొమ్మలు చిత్రిస్తూ, ఒకే పత్రికలో కొనసాగటం తెలుగు పత్రికా రంగంలో ఒక పెద్ద రికార్డు!

అప్పటి నుండి పాతికేళ్ళు మద్రాసులో ఉండి అయన జీవిత చరమాంకంలో కశింకోట లో ఉండిపోయినారు. ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయనకు నూక రాజమ్మ , లక్ష్మి రాజ్యమ్మ అనే ఇద్దరు భార్యలు, రవిరాం, వసంతరాం, పావనరాం అనే ముగ్గురు కుమారులు, అనూరాధ అనే ఒక్క కుమార్తె వున్నారు. కూతురు అనూరాధ మీది మమకారంతో కశింకోటలో 'పావన కుటీరం' నిర్మించుకొని స్థిర నివాసులయ్యారు. ఈయనకు శ్రీరాముడు అంటే ప్రత్యేకమైన అభిమానం. అందువల్లే రవివర్మ గీసిన శ్రీరామ పట్టాభిషేకం చిత్రాన్ని ఫ్రేమ్ కట్టించుకొని తన గదిలో ఉంచుకున్నారు. తీరిక సమయాల్లో రామ నామ స్మరణ చేస్తూ ఉండేవారు. వడ్డాది పాపయ్య గారు గీసిన చిత్రాల క్రింద 'వ.పా.' అనే పొడి అక్షారాల సంతకం వారి ప్రత్యేకత. వీరి బొమ్మలకు గల మరొక కుంచె గుర్తు '0|0' అని వుండడం. ఇందు గురించి ఆయన చెప్పిన భాష్యం - "గతం శూన్యం, వర్తమానం శూన్యం, భవిష్యత్తులో నిలుచున్నాను".

చిత్రకళ నేర్చుకొంటున్న తొలినాళ్ళలో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు పాపయ్య చిత్రాలు పత్రికలలో ప్రచురించి ప్రోత్సహించాడు. తెలుగు నాట చిత్రకళలో ఈయన శైలికి, బొమ్మలలోని సంతకానికి అందినంత గుర్తింపు గౌరవ ప్రతిష్టలు మరెవరికీ అందలేదనే చెప్పాలి. 17 వ యేట ప్రారంభించిన ఈ చిత్ర కళా తపస్సు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లకు గురైనా రాణించే వరకు ఆగలేదు.

ప్రశాంత నిశీధి సమయాల్లో ఆయన చిత్రరచన చేసేవారు. అనుకరణ లేని, అనుసరించ వీలులేని, అనితర సాధ్యం కాని రీతిలో ఆయన చిత్రసృష్టి చేశారు. “ఫోటోగ్రఫీకి, రియలిజానికి అందని వస్తువుగా చూపించడమే నా అభిమాన చిత్రణ, రంగుల్లో ఏమీ లేదు, రంగుల గురించి పట్టించుకోను, రంగులే అయితే ఇప్పటి ‘కలర్ ఫోటోగ్రఫీ’ అన్నిటికంటే గొప్పద”ని ఆయన అభిప్రాయం. వ.పా. కేవలం చిత్రకారుడే కాదు. రచయిత కూడా. చందమామలో కొడవటిగంటి కుటుంబరావు మొదలు పెట్టిన 'దేవీభాగవతం' కథలను పూర్తి చేసింది ఆయనే. 'విష్ణు కథ' పౌరాణిక సీరియల్ కూడా ఆయన వ్రాసిందే. సంగీతం పట్ల కూడా ఆయనకు ప్రత్యేక అభిమానం వుంది.

రాగాలతో రోగాలు నయమవుతాయి నమ్మే ‘వపా’, శివరంజని, హిందోళ, కన్నడ, శహన, జయజయవంతి, అహిర భైరవి రాగాలకు భావ యుక్తమైన చిత్రాలు గీశారు. ‘వపా’ ఎప్పుడు ఏ చిత్రకళా పోటీల్లోనూ పాల్గొనలేదు. చిత్రాలు గీయడంలో ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. తన ఇంటి గోడ పై పరిసర ప్రాంతాల్లో దొరికే మట్టి, సున్నం, బొగ్గు వాడి అతి తక్కువ వ్యయంతో కుడ్య చిత్రాలు గీశారు. చిత్రాలు గీసే పేపర్ ని నలిపి వుండ చేసి, విడదీసి, నలిగిన పేపరుపై బొగ్గుతో ఎన్నో చిత్రాలు గీశారు. కొండ అద్దమందు కొంచెమై వున్నట్టు ఆయన చిత్రాల్ని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది! టీ.వీ. యూనిట్ వారు ‘కశింకోట’ వచ్చి ఇంటర్వ్యూ చేయబోతే నిరాకరించిన నిరాడంబర జీవి ఆయన. అస్వస్థతగా ఉన్నప్పుడు వైద్యం చేయించుకోమన్నా వద్దని వారించి తన మరణం బయట ప్రపంచానికి తెలియనీయవద్దని కోరిన ఆదర్శవాది. తన మరణం ముందుగా ఊహించి, అంతిమ చిత్రం తన అనంతరం వెయ్యడం కోసం కాకుండా, ఉన్నప్పుడు చూసు కొనేందుకు ‘చరమ చిత్రం’ చిత్రించుకున్న మహా చిత్రకారుడు ‘వపా. అది స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది. పాపయ్య గారు 1992, డిసెంబర్ 30 న దివ్యలోకాలకు పయనమై వెళ్ళిపోయాడు. ఆయన మరణంతో కళా ప్రపంచంలో చీకట్లు కమ్మాయి. కళామతల్లి కంట నీరు ఒలికించింది. రంగులు వన్నె తగ్గాయి. సృజనాత్మకత చిన్నబోయింది. కల్పన కలగా మారింది.

********

Posted in August 2024, వ్యాసాలు

1 Comment

  1. Srilakshmi

    ఎంతో చక్కటి విధానంగా శ్రీ వడ్డాది పాపయ్య గారి గురించిన కథనం ,రచయిత చెప్పారు . ఆయన వివరించే విధానము చాలా సరళమయిన రీతిలో ఉంది .

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!