Menu Close
Shyama-Sundara-Rao
తెలుగు తేజాలు
అంబడిపూడి శ్యామసుందర రావు

శాస్త్రీయ, లలిత సంగీత గాయకురాలు "కుమారి శ్రీరంగం గోపాలరత్నం" గారు

Srirangam Gopalarathnam
Photo Credit: Wikipedia

"వాణీ! శర్వాణీ! వీణాపాణి! పుస్తక ధారిణి!"అనే డా.వక్కలంక లక్ష్మీపతిరావు గారి పాటకు జీవం పోయడమే కాదు, ఆ సంగీత సరస్వతే తానైన ధన్యురాలు శ్రీరంగం గోపాలరత్నం గారు. ఆమె జీవించిన కాలం 53 సంవత్సరాలే! అయితేనేం? ఆవిడ తన జీవితకాలంలో అధిరోహించిన కీర్తి శిఖరాలు అనితర సాధ్యాలు. బెజవాడ ఆకాశవాణి లో పనిచేసేరోజుల్లో ఆవిడ సమర్పించిన కూచిపూడి యక్షగానాలు, భక్తిరంజని, దేశభక్తి గీతాలు, సంగీత రూపకాలు, సంగీత శిక్షణ, శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు, నాటకాలు, లలితగీతాలు, సంగీత నిర్వహణలు.. ఒకటేమిటి?.. ఆకాశవాణికే వన్నె తెచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆవిడ! విద్వాన్ కవి రాయని జోగారావు గారి వద్ద వీణ వాద్యాన్ని తొలుత అభ్యసించి, కొన్ని వీణ కచేరీలూ నిర్వహించారావిడ. తరువాత గురువు గారి సలహా మేరకు, గాత్రంలో స్థిరపడి, డా.శ్రీపాద పినాకపాణి గారి వద్ద మెళుకువలు నేర్చుకున్నారు.

ఈమె 1939 సంవత్సరంలో విజయనగరం జిల్లా పుష్పగిరి లో వరదాచార్యులు, సుభద్రమ్మ దంపతులకు జన్మించారు. తల్లికి మేనమామ అయిన అప్ప కొండమాచార్యులు రాసిన రెండు హరికథలను పాలకొల్లు సభలో తొమ్మిదేళ్ళ వయసులో గానం చేయడమే వీరి తొలి ప్రదర్శన. కవిరాయని జోగారావు గారు వీరి ప్రధాన సంగీత గురువు. ద్వారం వెంకటస్వామి నాయుడు, శ్రీపాద పినాకపాణి వద్ద కూడా సంగీతాన్ని అభ్యసించారు. తొలిసారిగా విజయవాడ ఆకాశవాణిలో 1957 సంవత్సరం నిలయ విద్వాంసురాలిగా చేరారు. అప్పటినుండి రెండు దశాబ్దాల పాటు శాస్త్రీయ, లలిత సంగీత బాణీలతో శ్రోతలకు విందు చేశారు. బెజవాడ ఆకాశవాణిలో 1957 నుండి నిలయ కళాకారిణిగా ఆవిడ పనిచేసిన ఇరవై సంవత్సరాలు, ఆవిడ జీవితంలో మరపురానివి.. ఆమె రజని, బాలమురళి, ఓలేటి, వింజమూరి లక్ష్మి, నల్లాన్ చక్రవర్తుల, ప్రయాగ, జలసూత్రం, పింగళి మల్లిక్, బందా గార్ల వంటి ఉద్దండులతో కలిసి, ఎన్నో అపురూపమైన, వైవిధ్య కార్యక్రమాలను సమర్పించారు.

1977 నుండి విజయనగరం, హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రభుత్వ సంగీత కళాశాలల్లో ప్రిన్సిపాల్ గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. 1988 లో తెలుగు విశ్వవిద్యాలయంలో లలితకళా పీఠానికి తొలి ప్రొఫెసర్ డీన్ గా పనిచేసి, పదవీ విరమణానంతరం భాగ్యనగరంలో స్థిరపడిపోయారు.

అన్నమయ్య పదాలు, క్షేత్రయ్య పదాలు, మీరా భజన గీతాలు ఆమె కంఠం నుంచి జాలువారిన మధుర రస పారిజాతాలు. భామా కలాపం యక్షగానం, నౌకా చరితం ఆమె ప్రతిభకు గీటురాళ్ళు. ఈమెకు అత్యంత కీర్తిని తెచ్చినది సంగీత ప్రధానమైన రేడియో నాటకం ‘మీరాబాయి’. శ్రీ వెంకటేశ్వర వైభవం చిత్రంలో "ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట" పాట ఆంధ్ర దేశం అంతా వ్యాపించింది. తమిళ, కన్నడ, సంస్కృత, హిందీ భాషల్లో కూడా పాడారావిడ! తెలుగులో వేలాది పాటలు పాడారు. అన్నమయ్య కీర్తనలు అద్భుతంగా స్వరపరచి, గానం చేశారు. కొన్ని సినిమాలకు నేపధ్య గానం చేశారు. బికారి రాముడు చిత్రంలో ఈమె పాడిన “నిదురమ్మా నిదురమ్మా” గీతం బహుళ ప్రాచుర్యం పొందింది.

గోపాలరత్నం గారికి 'పద్మశ్రీ' వచ్చిన సందర్భంగా ఆకాశవాణికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, 'ఈ కాలపు పిల్లలు, తమకు సంగీతం నేర్చుకొనేందుకు, వినేందుకు సమయం ఉండట్లేదని అంటుంటారు. దీనికి మీ స్పందన ఏమిటి?' అనే ప్రశ్నకు సమాధానంగా "అప్పుడూ, ఇప్పుడూ కూడా రోజులో ఉండేది ఇరవై నాలుగు గంటల సమయమే! అప్పటికన్నా ఇప్పుడు సాంకేతికంగా దేశం ఎంతో పురోగమించింది కనుక, మేము పడ్డ శ్రమ కూడా ఈతరం పిల్లలు సంగీతం కోసం పడనక్కరలేదు. ఎటొచ్చీ గురువును త్రికరణ శుద్ధిగా నమ్మి, సంగీతాన్ని సాధన చేస్తే, తప్పక ఫలితముంటుంది" అని చెప్పారు. ఆ విధంగా గురువు ప్రాశస్త్యాన్ని సంగీత సాధనలో వివరించారు. అయితే, మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోయారావిడ! డబ్బు, పేరు వచ్చాయి కానీ, మానసిక ప్రశాంతతకు దూరమయ్యారు! ఆవిడ మాటల్లోనే..'బెజవాడలో నా సంగీత తపస్సు నిర్విఘ్నంగా సాగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక గాయనిగా నేను మరణించాను' అని బాధపడ్డారు.

ఒకరోజు ఏదో పనిమీద ఆకాశవాణి మాజీ సంచాలకులు శ్రీనివాసన్ గారింటికి వెళ్లిన గోపాలరత్నం గారికి, వారి ఇంట తన చిన్నతనంలో రేడియోలో పాడిన పాట వినటం తటస్థించింది. ఎంతో అమాయకంగా,'నేనే పాడాను ఈ పాట! అప్పుడు బాలమురళి గారు నాకు వైలిన్ వాయించారు. ఎక్కడివి మీకీ పాటలు?' అని ఆశ్చర్యంగా అడిగారు. అప్పుడు శ్రీనివాసన్ గారి భార్య శారద గారు, 'నేను మీ అభిమానిని. మీ పాటలన్నీ సేకరించాను." అన్నారు. రత్నం గారు వెంటనే, ‘నా దగ్గర ఒక్కటీ లేదు. నాకు ఒక కేసెట్లో అన్నీ రికార్డ్ చేసివ్వరూ' అంటూ బ్రతిమాలారు. ఎంత ఆశ్చర్యము చూడండి అన్ని వేల పాటలు పాడిన ఆవిడ దగ్గర ఏ పాటల క్యాసెట్లు లేకపోవడం. 'పదిరోజుల్లో అందజేస్తానని' మాటిచ్చారు శారద గారు. అయితే, ఆ పది రోజులు చూడకుండానే, 1993 మార్చి 16న, మ్రోగుతున్న వీణకు తీగ తెగినట్లు గోపాలరత్నం గారు తుది శ్వాస విడిచారు.

1992 లో ఈమెకు భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆవిడ పార్థివ దేహాన్ని హైదరాబాద్ కు తరలిస్తూ, దారిలో ఆవిడకు ప్రాణప్రదమైన బెజవాడ రేడియో స్టేషన్ ముందు కొంతసేపు అభిమానుల సందర్శనార్థం ఉంచారు. సంగీత అభిమానులు కడసారిగా ఆవిడ పార్థివ దేహానికి నివాళులు అర్పించుకొన్నారు. దురదృష్టము ఏమిటి అంటే మన తెలుగునాట ఎం ఎస్ సుబ్బలక్ష్మి, ఎం ఎల్ వసంతకుమారి లాంటి పొరుగు రాష్ట్రాల గాయని మణులకు వర్ధంతులు జరుపుతూ విగ్రహాలు పెట్టి వారిని స్మరించుకుంటున్నాం తప్ప మన తెలుగు జాతి ఖ్యాతిని నలు దిశలా వ్యాప్తి చేసిన మన కళారత్నాన్ని మన తెలుగు ప్రజలు ఏనాడో మరచిపోయారు. పాత తరం శ్రోతలు ఎప్పుడైనా విజయవాడ ఆల్ ఇండియా రేడియో వారు ఆవిడ పాటలను వినిపిస్తే విని గుర్తు తెచ్చుకుంటారు.

********

Posted in July 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!