Menu Close
Shyama-Sundara-Rao
తెలుగు తేజాలు
అంబడిపూడి శ్యామసుందర రావు

కూచిపూడి నాట్యాచార్యుడు "పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ”

vedhantham-satya-narayana-sharma

భామాకలాపంలో సత్యభామగా, ఉషా పరిణయములో ఉషగా, చెలికత్తెగా, మోహినీ... దేవదేవిగా అందరినీ అందునా స్త్రీలనే మైమరిపించి, ఆమె కాదు... కాదు ... అతను, ఆడవారివలే హొయలు ఒలకబోస్తూ రంగస్థలంపై విశ్వరూపం చూపిన జగమెరిగిన నాట్యస్రష్ఠ, పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ.

భామా కలాపం నృత్యరూపకంలో సత్యభామగా వేదాంతం సత్యనారాయణ శర్మ పోషించిన పాత్ర జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంది. అలాగే ఉషాపరిణయం ఉషగా, చెలికత్తెగా ఆయన ప్రదర్శించిన ఆంగిక, వాచకాభినయం ప్రేక్షకులను సమ్మోహనపరుస్తుంది. ఓ మహిళగా... అందునా సత్యభామ పాత్రకు పరిపూర్ణత ఇవ్వడం అనేది ఆంధ్ర కూచిపూడి నాట్యాచార్యుడు వేదాంతం సత్యనారాయణ శర్మ గారికే సరిపోయింది.. సంగీత సాహిత్యాలు సమ్మిళితం చేసి...వాటిని అభినయించిన విధానం కళాభిమానులను సమ్మోహితులను చేస్తుంది. తన నటనా కౌశలాన్ని మెచ్చుకుంటూ ఎన్నో కరతాళధ్వనులు జేజేలు ఆయన అందుకున్నారు. మహిళలను సైతం మంత్రముగ్ధులను చేయగల వారి కళాప్రావీణ్యం అనన్య సామాన్యం.

సత్యనారాయణ శర్మగారు 9 సెప్టెంబరు 1935న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని ఒక చిన్న గ్రామమైన కూచిపూడిలో కూచిపూడి సంప్రదాయానికి ప్రసిద్ధి చెందిన వేదాంత కుటుంబంలో వేదాంతం వెంకటరత్నం మరియు సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. తన ఐదవ ఏటనే నృత్యం ఆరంభించాడు. కూచిపూడి ఇలవేల్పు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో సత్యనారాయణ శర్మకు 5వ ఏటనే నాట్య గురువులు వేదాంతం ప్రహ్లాద శర్మ నాట్యంలో అరంగేట్రం చేయించారు. ఇతడి తొలి గురువు వేదాంతం ప్రహ్లాద శర్మ. చింతా కృష్ణమూర్తి ద్వారా యక్షగానం, లక్ష్మీనారాయణ శాస్త్రి ద్వారా భరతనాట్యం నేర్చుకున్నాడు. ఆయన ఏలేశ్వరపు సీతారామాంజనేయులు మరియు శిష్ట బ్రహ్మయ్య శాస్త్రి వద్ద భాగవత మేళం వలె శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. తొమ్మిది సంవత్సరాల వయస్సులోనే కూచిపూడి డాన్స్‌ను అభ్యసించిన వేదాంతం సత్యనారాయణ శర్మ, తన సోదరుడు వేదాంతం ప్రహ్లాద శర్మ పర్యవేక్షణలో పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకుని పసుమర్తి కొండలరాయుడు బృందంలో మహిళా పాత్రలో నటించటం ప్రారంభించారు. కూచిపూడి సంగీతాన్ని, వయోలిన్‌ను కూడా చిన్న వయస్సులోనే ఔపోసన పట్టారు. తన 19వ ఏట మహంకాళి శ్రీరాములుతో కలిసి ఆయన మొదటి ప్రధాన ప్రదర్శన ఢిల్లీలోని సప్రూ హౌస్‌లో ప్రదర్శించబడిన ఉషా పరిణయంలో పార్వతి పాత్రను పోషించారు. అంతే వెనుతిరిగి చూడలేదు... స్త్రీ పాత్రల్లోనే వివిధ వేషాలు కడుతూ వారితో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు. క్రమముగా స్త్రీ పాత్ర పరివర్తనను పూర్తి ఆకళింపు చేసుకున్నారు. స్త్రీ ఆహార్యాన్నిపూర్తిగా అవపోసన పట్టారు.

కళాక్షేత్ర స్థాపకురాలు రుక్మిణీ దేవి అరుండేల్ ముందు సహా 10,000 స్టేజీలలో ఆయన ప్రదర్శన ఇచ్చారు. 1967లో, ఆయన ఒక డ్యాన్స్ సీక్వెన్స్‌లో పురుష నర్తకిగా నటించారు. గిరిజా కళ్యాణం, తెలుగులో వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన చిత్రం ‘రహస్యం’ లో నటించారు. తన జీవితంలోని చివరి భాగంలో, ఆయన తన స్వస్థలమైన కూచిపూడికి అంకితం చేయబడిన ఒక నృత్య పాఠశాల అయిన వెంకటరామ నాట్య మండలిలో నృత్యం బోధించడంలో ఎక్కువగా నిమగ్నమయ్యారు. ఆయన నాట్య రూపం మరియు నాట్య శాస్త్రం, అభినయ దర్పణం, తాండవ లక్షణం మరియు అలంకార శాస్త్రం లక్షణాలపై అనేక గ్రంథాలను కూడా వ్రాసారు.

సన్మానాలు అవార్డుల విషయానికి వస్తే, ఆయన 1961 లో రాష్ట్రపతి బాబూరాజేంద్రప్రసాద్ నుండి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి కూచిపూడి కళాకారుడు ఈయనే. ఆరు సంవత్సరాల తరువాత, అకాడమీ ఆయనని 1967లో సంగీత నాటక అకాడమీ రత్నతో మళ్లీ సత్కరించింది. భారత ప్రభుత్వం 1970 లో భారత ప్రభుత్వం, నృత్యానికి ఆయన చేసిన సేవలకు గానూ నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’ ని ప్రదానం చేసింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా 1988లో వారి పౌర పురస్కారం కాళిదాస్ సమ్మాన్‌తో సత్కరించింది. 2005లో తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం హంస అవార్డును అందజేసింది. సిద్ధేంద్రయోగి నర్తన అవార్డును అందుకున్నారు. మహారాష్ట్ర  ప్రభుత్వం భరతముని అవార్డుతో సత్కరించింది.

వ్యక్తిగత విషయానికి వస్తే ఆయనకు లక్ష్మీనరసమ్మ గారితో వివాహం అయింది. ఈ దంపతులకు నాగప్రసాద్ అనే కుమారుడు మరియు నాగలక్ష్మి, రాధ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన 77 సంవత్సరాల వయస్సులో 16 నవంబర్ 2012న శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. దూలం సత్యనారాయణ గారు దర్శకత్వం వహించిన "నేను సత్యభామ" అనే చిత్రంలో ఆయన జీవితం డాక్యుమెంట్ చేయబడింది.

********

Posted in June 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!