బాల వ్యాకరణ సృష్టి కర్త "పరవస్తు చిన్నయ సూరి"
తెలుగు సాహిత్యం తో పరిచయం ఉన్న ప్రతి వారికి ముఖ్యంగా వ్యాకరణం గురించి తెలిసిన వారికి సుపరిచితమైన పేరు పరవస్తు చిన్నయ సూరి. ఆయన 19 వ శతాబ్దానికి చెందిన మహా పండితుడు, ప్రసిద్ధ తెలుగు రచయిత తన జీవితాంతము తెలుగు భాషా అభ్యుదయానికి తెలుగు సాహిత్యానికి పాటు పడ్డ వ్యక్తి చిన్నయ సూరి పద్యమునకు నన్నయ గద్యమునకు చిన్నయ అనే లోకోక్తి ఉంది. ఈయన తమిళనాడు లోని చెంగల్ పట్టు జిల్లా పెరంబూరు లో జన్మించాడు. ఈయన పూర్వికులు చాలా తరాలకు క్రిందే మద్రాసు వలస వెళ్లారు. వీరిది వైష్ణవ కుటుంబం వీరి పూర్వీకులు పరవస్తు మఠం శిష్యులు వీరు సాతాని కులానికి చెందిన బ్రాహ్మణ ఆచార వ్యవహారాలను పాటించేవారు. తాము ఆపస్తంబ సూత్రానికి, గార్గేయ గోత్రానికి చెందిన యజుశ్శాఖాధ్యాయులమని చెప్పుకున్నారు. ఈయన పుట్టిన సంవత్సరం గురించి భిన్న కథనాలు ఉన్నాయి. కొందరు పండితులు చిన్నయ 1809 లో పుట్టినాడని మరికొంత మంది పండితులు 1806 లో జన్మించాడని అంటారు. చిన్నయ సూరి తండ్రి వెంకట రంగ రామానుజాచార్యులు ట్రిప్లికేన్ లోని రామానుజ మఠంలో మతాధికారి. ఈయన సంస్కృత, ప్రాకృత తెలుగు,తమిళ భాషలలో మంచి పండితుడు. ఈయన ప్రతిభను గుర్తించిన శ్రీనివాసాచార్యులు అనే వైష్ణవ పండితుడు వీరిని రామానుజాచార్యుల జన్మ స్థలం అయినా శ్రీ పెరంబుదూరు లోని ఆలయములో వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేసేందుకు ఆహ్వానించాడు.
చిన్నయ్యను గారాబముగా పెంచడం వల్ల 16 ఏళ్ల వయస్సు వరకు చదువు సంధ్యలు పట్టించుకోలేదు. సూరి అనేది ఈయనకు ఇచ్చిన బిరుదు. సూరి అనగా పండితుడని అర్ధము. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కాలములో వారికి తెలుగు నేర్పటానికి ట్యూటర్ కావలసి వచ్చింది. ఆ ట్యూటర్ కు ఇంగ్లిష్ కూడా వచ్చి ఉండాలి. చిన్నయ ఆ పోస్ట్ కు అప్లై చేస్తే అప్పటి విశ్వవిద్యాలయ కార్యదర్శి ఎ. జె. ఆర్బత్నాట్ తర్క మీమాంస పండితులను కాశీ నుంచి తెప్పించి చిన్నయను పరీక్షించి సమర్థుడని గుర్తించి ఆ పోస్ట్ లో నియమించి ఇంగ్లాండ్ నుంచి తెప్పించిన స్వర్ణ కంకణం పై "చిన్నయ సూరి" అనే అక్షరాలను చెక్కించి బహుమతిగా ఇచ్చారు. ఆ విధంగా చిన్నయ్యకు "చిన్నయ సూరి" అనే పేరు వచ్చింది. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు బోధకుడిగా పని చేస్తూ జీవితాంతము తెలుగు భాష అభ్యుదయానికి తెలుగు సాహిత్యానికి పాటు పడ్డారు. అందువల్ల ఆయన పేరు తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్న ప్రతి వారికి సుపరిచితమైన పేరు అయింది. చిన్నయ సూరి గారు సరళమైన భాషలో సులభ గ్రాహ్యంగా ఉండేలా "బాలవ్యాకరణము" ను రచించారు. తెలుగు భాషను పరిశోధించి ఆంధ్ర శబ్ద చింతామణిని పరిశీలించి వినూత్న రీతిలో వ్రాసినదే బాలవ్యాకరణము. ఈ గ్రంధము తెలుగు వారికి ఒక వరప్రసాదం. బాలవ్యాకరణము తో పాటు ఈయన రాసిన నీతి చంద్రిక కూడా బాగా ప్రసిద్ధి చెందింది. సంస్కృతం లో నున్న పంచతంత్ర కథలలోని మిత్రలాభం, మిత్రభేదం లను నీతి చంద్రిక పేరుతొ తెలుగులోకి అనువదించారు. నీతి కథలను పిల్లలకు తెలియజెప్పడానికి ఇంతకన్నా మంచి గ్రంధము మరొకటి లేదు. ఇతర గ్రంథాలలో సూత్రాన్ధ్ర వ్యాకరణము, ఆంధ్ర ధాతు మూల,నీతి సంగ్రహము మొదలైనవి.
చిన్నయసూరి గారి రచనా శైలి అత్యత్భుతమైనది. ఆయన శైలిని అనుకరించాలని చాలామంది ప్రయత్నించినా ఎవరు సఫలీకృతులు కాలేదు. నీతి చంద్రికను తెలుగులోకి అనువదించడానికి నీతి కథలు చెప్పటమే ఒక కారణం కాదు. తెలుగు భాషలోని మాధుర్యాన్ని తెలుగు వారికి అందించటమే ఆయన ప్రధాన ఉద్దేశ్యం. బాలనాగయ్య శెట్టి గారు ఈ నీతి చంద్రికను ప్రచురించి మనకు చదువుకునే అదృష్టాన్ని కలుగజేశారు. చిన్నయసూరి గారి భాషా సేవ వెనుక బ్రౌన్ దొర, గాజుల లక్ష్మి నరసింహ శ్రేష్టి, జస్టిస్ రంగనాథ శాస్త్రి వంటి ప్రముఖుల ప్రోత్సాహం ఉంది. ప్రస్తుతం చిన్నయసూరి గారి ఐదవ తరం మనువడు పరవస్తు ఫణిశయన సూరి గారు విశాఖపట్నం లో ఉంటున్నారు. ఈయన తాను చక్కగా పద్యాలను ఆలపించటమే కాకుండా పిల్లలకు శతక, ప్రబంధ పౌరాణిక పద్యాలు నేర్పుతూ బాగా పాడుతున్న పిల్లలకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తూ ఇప్పటికే తన సొంత డబ్బును సుమారు 5 లక్షలు దాకా ఖర్చు చేశారు. ఆయన ఈ మధ్యే పరవస్తు పద్య పీఠం అనే సంస్థను ప్రారంభించారు. చిన్నయ సూరి గారికి శబ్దరత్నాకర కర్త, ప్రౌఢవ్యాకర్తయైన బహుజనపల్లి సీతారామాచార్యులు, ఆంధ్ర విశ్వగుణాదర్శ కర్త పంచాంగం తేవెప్పెరు మాళ్లయ్య వంటి ప్రముఖులు ఎందరో శిష్యులు ఉన్నారు. శ్రీ చిన్నయ సూరి గారు 1862 సం. నిర్యాణం చెందారు.