Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

ఆడిదము కవులు – పూసపాటి రాజులు -దూబగుంట నారాయణ కవి

కలాన్ని నడిపిస్తూ కత్తిని ఝళిపించిన వంశాలలో ఆడిదం వారిదొకటి. క్రీ.శ/ 1720-1785 ప్రాంతం వాడు ఆడిదం సూరకవి. ఇతని వంశంలో సూరకవి కాలానికి 23 పురుషాంతరాల నుంచి అందరూ కవులే. వీరిలో 14 వ తరం వారి నుండి రాజాశ్రయం దొరికింది. ఈ విషయం సూరకవి ఒక పద్యంలో చెప్పాడు. సూరకవి వంశం లోని నీలాద్రి కవి వల్ల ఆడిదం ఇంటి పేరయింది. ఆడిదం అంటే కత్తి. తనకు ఆశ్రయమిచ్చిన రాజుతో పాటు యుద్ధాలలో పాల్గొని కత్తి తిప్పే ప్రావీణ్యం కలిగి యుండి యుద్ధాలలో పాల్గొనడం వల్ల నీలాద్రి కవికి ఆడిదం నీలాద్రి కవి అని ఇంటి పేరు మారింది. దీనికి ముందు వీరి ఇంటిపేరు గ్రంధ వారణం వారు. వీరి వంశంలో ప్రతి తరంతో కలిపి 23 మంది కవులు ఉండడం వల్ల వాళ్ళు వ్రాసిన కావ్యాలను వారు ఏనుగు మీద పెట్టి తీసుకొని పోతుండేవారు. అందుకు వారికి మొదట గ్రంధ వారణం వారనే పేరు స్థిరపడింది. దీనికి ముందు వీరి ఇంటిపేరు మోదుకూరి వారు. చివర ఆడిదం వారని స్థిరమైంది.

ఈ వంశం వారికి ఆశ్రయం ఇచ్చినవాడు కళింగరాజు. పేరు పూసపాటి ఇమ్మడి తమ్మిరాజు. యితడు కపిలేశ్వర గజపతి వద్ద సేనానిగా ఉండేవాడు. ఇతని తండ్రి ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ఉండేవాడు.

తమ్మిరాజు చాలా పరాక్రమవంతుడు. కటకం గజపతులతో పాటు అనేక యుద్ధాలలో పాల్గొని, ఆశ్వపతులను, నరపతులను, పద్మనాయకులను జయించాడు. ఈ తమ్మిరాజు విజయాలను 4వ తమ్మిరాజు క్రీ.శ. 1640 ప్రాంతం వాడు) తన కృష్ణ విజయం అనే గ్రంథంలో వివరించాడు.

అరి బలంబుల నందపురశైలమునొద్ద మర్దించి గజపతి మాన్యుడయ్యె
భూరి సైన్యములతో బొదివి బెల్లముకొండ సాధించె నిశ్శంక సాహసమున
దట్టించి లగ్గలు పట్టించి చెకొనె బ్రబలుడై శ్రీరంగరాజుకొండ
బల్లిదుడై యోడపల్లి గైకొనియె వివక్షులందరు పటాపంచలుగను
త్రిభువనీరాయ బిరుదప్రదీప్తు రావు–సింగన జయించి బెదవీటి చెంద బొదవి
కలన శరణన్న బాహాదిఖాను గాచె–రాచభూపాలు తమ్మిధరావరుండు.
(శ్రీకృష్ణవిజయం 1–117)

అలాగే పూసపాటి వంశీయులైన వేంకటపతి రాజు, విజయరామ రాజు కూడా తమ గ్రంథాలలో వర్ణించారు. ఈ విజయాలన్నీ నీలాద్రి కవి ఒక కావ్యం గా వ్రాసినట్లు కొందరి భావన. దాని పేరు రణరంగ విజయము. తమ్మిరాజు తో పాటు తానూ యుద్ధాలలో పాల్గొన్న నీలాద్రి కవి ఈ విజయాలను చక్కగా వివరించి ఉంటాడు ఈ గ్రంథంలో.

నిండు కొలువులో ఈ గ్రంథాన్ని చదివి వినిపిస్తే ఆనందించి తమ్మిరాజు నీలాద్రి కవికి ఒక ఆడిదం (ఖడ్గం) బహూకరించాడు. అప్పటినుండి నీలాద్రి కవి ఇంటిపేరు గ్రంథ వారణం వారు అన్నది పోయి ఆడిదం వారనే ఇంటిపేరు కలిగింది. కానీ దురదృష్టవశాత్తూ ఆ గ్రంథం లభించలేదు. దీనిని గూర్చి చెబుతూ ఆరుద్ర ఇలా అన్నారు. “దొరికితే ఆంధ్ర సాహిత్యంలో తొలి చారిత్రిక గ్రంథం గా అది నిలబడిపోయేది”

**** సశేషం ****

Posted in October 2025, సమీక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *