నూతన కవి సూరన, వెలిగందల నారయ్య
నూతన కవి సూరన తిక్కన వంశీయుడనని చెప్పుకొన్నాడు. ఇతని కావ్యం ధనాభిరామం. రత్నపరిక్ష కావ్యం వ్రాసిన భైరవకవికి ఇతను సమకాలికుడు. ఇతనిని గూర్చి ఆరుద్ర ఇంతకన్నా వివరాలు ఇవ్వలేదు.
వెలిగందల నారయ్య
బమ్మెర పోతనార్యునికి ప్రియశిష్యుడను అని చెప్పుకొన్నాడు వెలిగందల నారయ్య. ఇతడు ఆంద్ర భాగవతంలో ఏకాదశ, ద్వాదశ స్కందాలను అనువదించాడు. అంతేగాక పోతనగారి రచనగా చెబుతున్న ద్వితీయ స్కందం లో 82 వ పద్యం నుంచి నారయ్య రచన అనే వివాదం కూడా ఉన్నది అన్నారు ఆరుద్ర. అంటే ద్వితీయ స్కందంలో ఉన 289 గద్య పద్యాలలో 81 మాత్రమే పోతన రచన అని చెప్పడం జరిగింది.
అలాగే దశమ స్కందంలో ఉత్తర భాగంలో ఉన్న 1337 గద్య పద్యాలలో నారయ్య 1100 వ్రాసి గురువు గారి పేరు పెట్టాడు అనుకోవాలి అన్నారు ఆరుద్ర.
నారయ్య సొంత అనువాదానికీ, పోతన రాయగా మిగిలిన వాటిని పూరించిన రచనకు చాలా తేడా కనపడుతుంది అని అన్నారు ఆరుద్ర. (స.ఆం.సా. పేజీ 935).
‘నారయ్య వ్రాసిన ఏకాదశ, ద్వాదశ స్కందాలలో అక్కడక్కడా ఒకటో, అరో మంచి పద్యాలు కనపడతాయి’ అని అన్నారు ఆరుద్ర. అయితే అవి కూడా హరిభట్టు వ్రాసిన 11,12 స్కందాల లోని పద్యాలని చాగంటి శేషయ్య గారు పరిశోధించి తేల్చారని ఆరుద్ర వ్రాశారు.
“వాలాయము యదుకుల నిర్మూలనకరం బయినయట్టి ...” అన్న హరిభట్టు పద్యంతో నారయ్య పద్యాన్ని సరిచూచి చెప్పారు శేషయ్య గారు అని ఆరుద్ర తేల్చారు.
అలాగే కృతిపతి వర్ణన తరువాత ద్వాదశ స్కందం లో 8 పంక్తుల వచనం ఉంది ఆ తరువాత ఈ క్రింది పద్యం ఉంది
నరవర ఈ ప్రశ్నమునకు – సరిచెప్పగ రాదు నాదు సామర్ధ్యముచే
బరికించి నీకు చెప్పెద – గరమొప్పగ భావికాలగతులన్ వరుసన్
ఈ పద్యం తరువాత 37 పంక్తుల సుదీర్ఘ వచనం ఉంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆరుద్ర, “ఆ రెండు వచనాలకు వంతెన లాంటి ఈ పద్యాన్ని హరిభట్టు నుండి తెచ్చి లేఖకులు కలిపారు” అని అన్నారు.
నారయ్య ఎక్కువ వచన రూపంలోనే అనువాదం సాగించారని రసవత్తర కవిత వ్రాయలేక పోయారని, ఒకచోట గారడి కవిత్వాన్ని ప్రదర్శించాడని ఆరుద్ర తెల్పారు.
పోతన అష్టమ స్కందంలో మూడుచోట్ల సర్వలఘు కందాలు వ్రాసారు. (8-146, 526). గురువుగారి లాగే నారయ్య కూడా సర్వలఘు సీసాన్ని వ్రాశాడు. కాని పోతన్న గారి లాగా యమకాలు, ఛేకాలు నారయ్య సాధించలేకపోయాడు అని అన్నారు ఆరుద్ర.
మతం విషయానికి వస్తే పోతన అద్వైతులు, నారయ్య విశిష్టాద్వైతులు. నారయ్య అనువదించిన 11,12 స్కందాలలో విశిష్టాద్వైత ఛాయలు కనపడతాయని నిడదవోలు వెంకటరావు గారు సోదాహరణంగా ఋజువు చేశారన్నారు ఆరుద్ర.
శేషాద్రి వెంకటరమణ కవులు నారయ్య అనువాదాన్ని గూర్చి చెప్పిన అభిప్రాయం ఏవిటంటే నారయ్య ప్రౌఢకవి కాడు. వ్యాకరణ దోషములతో నారయ్య రచన నిండి ఉన్నది. అంతేగాక 2,3,4 స్కందాలలో దశమ స్కంద ఉత్తరభాగం లో కూడా ఇట్టి దోషాలు కనపడడం వల్ల ఇవన్నియు నారయ్య కవియే సంస్కరించాడని నిర్ధారించ వచ్చు. అని చెప్పి కొన్ని దోషాలను చూపించారని వాటిని ఆరుద్ర తన రచనలో వివరించారు. వచనం ఎక్కువగా ఉండి కవితా ప్రాగల్భ్యము గలవాడు గాదని తోచుచున్నట్లు ఉన్నదని అన్న శేషాద్రి కవుల మాటలకు ఆరుద్ర పోతన, నారయ్య ఇద్దరూ వ్రాసిన కృష్ణుని నిర్యాణ ఘట్టాన్ని ఉదాహరణగా ఆరుద్ర చూపారు.
పోతన గారి పద్యం – అర్జునుడు ధర్మరాజుతో చెప్పే సందర్భంలోని పర్వమిది.
మన సారధి మన సచివుడు
మన నెయ్యము మన సఖుండు మన బాంధవుడున్
మాన్ విభుడు గురువు దేవర
మనలను దిగనాడి చనియె మనుజాధీశా! (భాగ -1- 355)
దీనికి నారయ్య ఏకాదశ స్కందంలో ఎలా వ్రాశాడో ఆయన రాసిన వచనం ఆరుద్ర తెల్పారు.
“అప్పరమేశ్వరుని సన్నిధానంబునకు వచ్చి, జగన్నాధుంగా దెలిసి భయంబున, మహాపరాధుండను, బాపచిత్తుండను, కుటిల పచారుండనని అనేకవిధ దీనాలాపంబులం బలుకుచు బాష్ప జలధారాసిక్త వదనుండైన సరోజనేత్రుండు వానింగరునించి యిట్లనియె – నీ వేల జాలిమబడెదు? పూర్వజన్మ కర్మంబు లెంతవారికినైనా నను భావ్యంబులుగాని యూరకపోవనేరవు. నీవు నిమిత్తమాత్రుండవింతియ.” (భాగ -11- 118)
ఇలా ఒక నీరసమైన వచనంతో కృష్ణ నిర్యాణ ఘట్టాన్ని నారయ్య అనువాదంలో చూపించాడని ఆరుద్ర చూపిస్తూ నారయ్య రచనలలోని మరికొన్ని అలాంటి ఘట్టాలని వివరించారు.
ఆంధ్ర మహాభాగవతాన్ని తెలుగులోకి అనువదించిన నారయ్య రచనలో లోపాలు ఉన్నప్పటికీ, నారయ్య పుణ్యాత్ముడు. పోతన వంటి మహానుభావునికి ఆయన శిష్యుడై భగవంతుని కథ తెనిగించిన వాడు ధన్యుడే కదా.
చంద్రమౌళి – దేవరాజ భట్టు
ఇతడు శ్రీనాథునికి సమకాలికుడు (క్రీ.శ. 1385 – 1445) హరిశ్చంద్రుని కథను గౌరన ద్విపద కావ్యంగా రచించాడు. దానిని చంద్రమౌళి పద్యకావ్యంగా వ్రాశాడు. ఇది దొరకలేదు. కానీ ఇతని అనంతర కవులు ఇతనిని స్తుతించారు. తురగా రాజకవి, అయ్యంకి బాల సరస్వతీ ప్రసిద్ధులైన పూర్వకవులతో పాటు చంద్రమౌళి ని కూడా స్తుతించారు. తిక్కన నన్నయ లతో పాటు చంద్రమౌళి ని స్తుతించారు. వీరికంటే పెద్దవాడు పెదపాటి జగ్గన్న కూడా చంద్రమౌళి కావ్యాన్ని చదివి ఆనందించిన వాడే. ఈ జగ్గన్న తన ప్రబంధ రాత్నాకరంలో తెల్పిన ఒకే ఒక పద్యం హరిశ్చంద్రోపాఖ్యానం లోనిదని తెలుస్తున్నది. ఇది రాజదోషాలను తెలిపే పద్యం.
“అలసట బొంకు నాస్థికత..” అనే ఈ పద్యం 14 రాజదోషాలను పట్టికగా ఇచ్చింది. ఇలాంటిదే వేరొక పద్యం కూడా దొరికనట్లు ఆరుద్ర తెల్పారు. చంద్రమౌళి కవిత్వం రసస్ఫూర్తి తో ఉన్నది కాబట్టే తర్వాత కవులు మెచ్చుకొన్నారు.
చంద్రమౌళి రచనా విశిష్టత ను గూర్చి చెప్తూ ఆరుద్ర ఒక విషయం ప్రస్తావించారు.
“అకటా! చేరెడు నేలకుం దగడె సప్తాంభోదివేష్టీభవ....” అనే ఈ పద్యం ఆఖరి పాదంలో ‘రాజకుమారుడు’ అని ఉండవలసిన చోట ‘రాజుకుమారుడు’ అని యతిస్థానంలో ఒక ప్రయోగం ఉంది. దీనిని గణపవరపు వేంకటకవి అనే లాక్షిణికుడు తన ‘ఆంధ్రకౌముది’ అనే గ్రంధంలో తన వ్యాకరణ సీసమాలికలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
రేచనగారి శంకరకవి అనే కవి రచించిన హరిశ్చంద్రలో వేంకటకవి ఉదహరించిన ఒక ఉత్పలమాల కనబడుతున్నట్లు తెలుస్తున్నదని ఆరుద్ర తెల్పారు.
ద్విపదలో గౌరన వ్రాసిన దానిని చంద్రమౌళి, శంకరకవిని అనుసరించినట్లున్నప్పటికీ చంద్రమౌళి తన సొంత ప్రతిభను ప్రదర్శించాడు.
చంద్రమౌళికి పూర్వం దేవరాజభట్టు అనే కవి కూడా హరిశ్చంద్రుని కథ పద్యకావ్యంగా వ్రాశాడు. వీరందరూ చక్కని ధారతో కథను నడిపారని చెప్పి మరొకకవి, వీరశరభకవి వ్రాసిన మరొక హరిశ్చంద్రుని కథ పూర్తిగా దొరికిందని, అయితే కృత్యవతరణ లేదు కాబట్టి రచన, రచయితా వివరాలు తెలియలేదన్నారు ఆరుద్ర.