Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర
పోతన

పోతన వ్యవసాయ ఆధార జీవనాన్ని గడిపాడు అనడానికి సాక్ష్యం – “ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి...” అన్న పోతన పద్యం చెప్పుకుంటాము. ఇది ప్రక్షిప్తమని కొందరు పండితుల మాట. కానీ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు పరిశీలించిన అన్ని ప్రతులలోని సారాంశం ప్రకారం ఈ పద్యం మరొక పద్యం కూడా పోతనదే అని తేలినట్లు ఆరుద్ర తెల్పారు.

పోతన భాగవత రచన

పోతన భాగవత రచన గూర్చి మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి మాటలను ఆరుద్ర తెల్పారు – అవి

‘పోతన ఏకాదశ, ద్వాదశ స్కందములు వ్రాయకుండానే స్వర్గస్థులైయుండవచ్చు. అందుకే ఆయనకు ప్రియశిష్యుడయిన వెలిగందల నారయ రచించి యుండును.’

ఏకాదశ, ద్వాదశ స్కందములు అని చెప్పిన శర్మ గారు మిగిలిన ఆంద్ర మహాభాగవతం పోతన గారే రచించి యుండవచ్చునని అన్నారు. అటు తర్వాత అందులో పంచమ షష్ఠ స్కందములు ఉత్పన్నములగుటకు ఆనాటి రాజకీయ విషయములే కారణమని నేను ఊహిస్తున్నాను అని మల్లంపల్లి వారు చెప్పిన విషయం ఆరుద్ర ప్రస్తావించారు. మునులకు సూతుడు విన్పించిన భాగవతం (సంస్కృతం), పోతన తెలుగు వారికి వినిపించాడు.

పాషాండుల వల్ల త్రిలింగ భాగవతం నష్టమైనదని ఉన్న వాదనకు జవాబుగా ఆరుద్ర ఇలా అన్నారు. ఒకవేళ అలా జరిగి ఉంటె షష్ఠ స్కందాన్ని పూరించిన ఏల్చూరి సింగన ఆ విషయం చెప్పి ఉంటాడు కదా అని ఆరుద్ర అభిప్రాయపడ్డారు.

భాగవతం వాస్తవానికి నాస్తిక దర్శనాలలోని మంచిని సొంతం చేసుకొని ఆ మతాలను నిర్మూలం చేయడానికి ప్రయత్నించిన రచన అని ఆరుద్ర అభిప్రాయ పడ్డారు.

విను, వినుము

ఆరుద్ర ఒక కవిని గాని పుస్తకాన్ని గానీ పరిశీలించడం ప్రారంభిస్తే అందులోని సారం పూర్తిగా వెలికి తీసి పఠితలకు అందించడమే ఆయన ముఖ్య కర్తవ్యంగా భావిస్తారు. అది ఆయనకు భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం.

పోతన గారికి గల ఒక ఊతపదం (అంటే చాలామంది మాట్లాడినా, వ్రాసినా అనుకోకుండా ఒక పదం మాటిమాటికి వస్తుంది. దానినే ఊతపదం అని అంటారు) గూర్చి పరిశోధించి ఆరుద్ర అందించారు. అది విను మీ సృష్టి, విను మీ సంసారం. ఇలాంటివి ఆరుద్ర చాలా సేకరించి ఒక లిస్టు తయారు చేసి అందించారు.

పోతన గారి భాగవతం ఛాలా మందికి పారాయణ గ్రంథమని, ఏ పద్యాలు ప్రక్షిప్తములో తేల్చడం కూడా చాలా కష్టమని పరిశీలకులు, పరిశోధకులు అభిప్రాయ పడినట్లు ఆరుద్ర తెల్పారు.

పోతన కవిత్వంలోని లోపాలు

కొందరు పరిశీలకులు పోతన భాగవతంలో నున్న కొన్ని లోపాలను గూర్చి చర్చించారు. కానీ ఆ లోపాలు పోతన వల్ల జరిగినవి కావని, సింగ భూపాలుడు భాగవతాన్ని పోతన తనకు అంకితం ఇవ్వలేదన్న కోపంతో దానిని భూమిలో పూడ్చిపెట్టినందున అది అక్కడక్కడ శిధిలమై పోగా దానిని తర్వాత పూరించిన వారివల్ల ఆ పొరపాట్లు జరిగి ఉంటాయని రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు అభిప్రాయ పడినట్లు ఆరుద్ర తెల్పారు.

పోతన గారు రచించిన భాగవతం తరచి చూస్తే, ఎర్రన హరివంశపు ఛాయలు కనిపిస్తాయన్నారు ఆరుద్ర. దీన్ని గూర్చి చెప్తూ ఎర్రన రచన దృశ్యమానంగా ఉంటుందని పోతన రచన పాట కచేరీలా ఉంటుందన్నారు ఆరుద్ర.

పోతన గారి వ్యక్తిత్వాన్ని ప్రతిఫలింపజేసే పద్యం ‘నీపాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును...’ అన్న పద్యమని, కంసుని సంహరింప మధురకు బోయినప్పుడు అక్కడ బలరామ కృష్ణులకు పూలమాలలు సమర్పించిన మాలకుణ్ణి నీకేమి వరం కావాలో కోరుకోమంటే అతడు చెప్పిన పద్యమిది. అందులో పోతన వ్యక్తిత్వం ప్రస్ఫుటమౌతున్నదని ఆరుద్ర వివరించారు.

పోతన నారాయణ శతకం రాసాడని కొందరి మాట కానీ ఆరుద్ర రెండు పద్యాలు చూపి వాటిద్వారా ఆ శతకం పోతనది కాదన్నారు.

అలాగే వీరభద్ర విజయం గూర్చి కూడా ఖండవల్లి లక్ష్మీ నిరంజనం గారు పోతన అనే పేరు గల సవతి తమ్ముడు ఉన్నట్టు అతడు వీరభద్ర విజయం రాసినట్లు అభిప్రాయ పడ్డారు. ఇలాంటి వాదనకు ఆద్యులు గురజాడ శ్రీరామ మూర్తి గారని చెప్తూ ఈయన వీరభద్ర విజయం మీద విస్తృత పరిశోధన చేశారు అని అన్నారు ఆరుద్ర.

పండితుల అభిప్రాయంలో రసవత్తరమైన భాగవతం రచించిన పోతన అటు తర్వాత వీరభద్ర విజయం వంటి కావ్యం రాయడం జరిగి ఉండదు. అందుకే అది పోతనది కాదు అని అనుకోవడం జరిగింది. కానీ పోతన వీరభద్ర విజయాన్ని తన చిన్నతనం లోనే రచించడం జరిగి కొన్ని దోషాలతో ఉండడం జరిగి ఉండవచ్చని ఆరుద్ర అభిప్రాయం. ఇది పోతన గారి రచనే అనుకోవడానికి ఆరుద్ర పోతన గారి భాగవత పద్యాలకు వీరభద్ర విజయం లోని పద్యాలకు పోలికలు (లాటానుప్రాసాదులు) చూపించారు. (స.ఆం.సా. పేజీ 913)

రచనా విధానానికి వస్తే పోతరాజు గారు అంత్యానుప్రాసను భాస్కర రామాయణం నుండి అలవరచుకొన్నారని, అర్దాలంకారాలు ఎర్రన నుండి అలవరచుకొన్నారని చెప్తూ శబ్దాలపైన పోతనకున్న మక్కువ గూర్చి పుట్టపర్తి నారాయణాచార్యుల వారి మాటలు ఉటంకించారు ఆరుద్ర.

“ఈ శబ్ద దృష్టి పోతన్నలో కొంత చాపల్యమునకు దారితీసినదనవచ్చు.ఒక్కొక్కసారి నీతడు శబ్దములను శబ్దము కొరకే వాడును. బ్రహ్మయన్నచో అతనికి చాలదు.... ‘తలవాకిట వాణిగల పోడిమిచే వాడిమికెక్కిన నలుమొగంబులు తక్కరిగొంటు’ అని బ్రహ్మాండముగా విస్తరించి చెప్పిననే యీతనికి తృప్తి’ అని నారాయణాచార్యులు గారు చెప్పిన మాటలు నిజం అన్నారు ఆరుద్ర. (స.ఆం.సా. పేజీ 914)

అయితే ఆంధ్ర దేశంలో పోతన భాగవతం అత్యంత ప్రచారం పొందడానికి ముఖ్యకారణం ఆయన యొక్క మధురాతి మధురమైన శైలి. భాగవతం లోని భక్తి భావము కన్నా పోతన గారి మంద్రగంభీర గమనము గల శైలి వలన ఆయన రచనకు అంత ప్రాముఖ్యము కల్గినది. అది సహజధారా విలసితము. ఓజఃప్రసాదగుణోజ్జ్వలితము. బిగువైన ఆ పదబంధములు సంస్కృతములు, తెలుంగులు చెరిసగముగా గుప్పిన మల్లెలు జాజులై పరిమళించును – అని శ్రీ గడియారం శేష శాస్త్రి గారు చెప్పిన మాటలు వాస్తవాన్ని వ్యాఖ్యానం చేస్తాయి అని ఆరుద్ర పోతన గారిని గూర్చి చెప్పిన మాటలు అక్షర సత్యాలు.

పోతన గారి రచనను గూర్చి ఆరుద్ర వివరిస్తూ, ‘ప్రతి పద్యము పతనీయము, స్మరణీయము. భాగవతం లలితస్కందముతో నున్న కల్పవృక్షం అయితే ఆ వృక్ష శాఖలపై కూర్చుని గానం చేసే మత్తకోకిల వంటి వాడు పోతన’ అంటూ తన్మయత్వంతో వివరించారు. చంధస్సులలో ఆయనకు మత్తకోకిల అంటే ఇష్టం. ఏ ఏ వృత్తాలు, జాతులు ఎన్నెన్ని వ్రాసారో వివరిస్తూ అకాడమీ వారి ననుసరించి పోతన గారి గద్యపద్యాల పట్టిక ఇచ్చారు ఆరుద్ర.

పోతన భాగవతంలో 899 సీస పద్యాలు, 677 తేటగీతులు, 326 ఆటవెలదులు రాసారని ఆరుద్ర వివరించారు. అన్ని ఆటవెలదులు ఉన్నా సీసం వెనుక ఆటవెలది వాడిన సందర్భం ఒక్కసారే కనిపిస్తుంది. మిగిలిన సీసాలాన్నీ తేటగీతి అనుసంధానమైనవే. భాగవతంలో అతి చిన్న వచనం ఒక్క మాటగా ఉంటే (మరియును,వెండియును) అతి దీర్ఘమైనది 112 పంక్తులు దాటింది. ఇది ఆంధ్ర ఛందః పరిణామంలో ఒక ముఖ్య మార్పు అని అన్నారు ఆరుద్ర.

పోతన భక్తి నిరాడంబరతకు నిదర్శనాలయిన పద్యాలు కోకొల్లలు. ఉదాహరణకు,

ఫలరసాదుల గురియవే పాదపములు – సాధుజలముల నుండవే సకల నదులు?
పొసగ బిక్షము పెట్టరే పుణ్యసతులు – ధనమదాంధుల కొలువేలతాపసులకు?

భాగవతంలో ఎక్కడబడితే అక్కడ ఇటువంటి భావాలు సాక్షాత్కరించడం వల్ల పోతరాజు గారి పదాలని కొన్ని ప్రక్షిప్తాలను లోకులు నమ్ముతారు.

పోతరాజు గారి సంతానం గూర్చి సరిగా తెలియదని వారి వంశంలో మనుమడు ఎవరో రాసిన కృతుల వల్ల వారి వారసుల గురించి కొంత తెలుస్తున్నదని అన్నారు ఆరుద్ర.

పోతనకు పునర్జన్మ లేదు. అసలు ఆయన మరణిస్తే గదా. తెలుగు సాహిత్యం జీవించి ఉన్నంతకాలం ఆయన బ్రతికే ఉంటారు.

**** సశేషం ****

Posted in April 2025, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!