
పోతన ఈ వార కాంతలను గూర్చి ఓక సీస పద్యంలో 24 పంక్తుల ‘సుదీర్ఘ వచనంలో ఇలా వర్ణించారు.
“మహిత కుచభారకంపిత మధ్యలగుచు మొలనూళ్లు మెరయ పయ్యెదలు జార ఒకరిమీద ఒకరు జల్లుకొన్న పన్నీటితో చెంగావి జిలుగుపుట్టంబులు దట్టంబులుగా దోగిలి మర్మంబులు బయటపడిన అగ్గలంబు లగు సిగ్గులకు ఒప్పిదాలైన తమ కనురెప్పలకు అడ్డంచేస్తూ ఆ వారకాంతలు పురుషులతో రాసోక్తులెనయ వసంతాలాడారని ఈ సుదీర్ఘ వర్ణనలో పోతనరాజు గారు చెప్పారని ఆరుద్ర వివరించారు.
పోతన తన యవ్వనంలో శృంగార జీవితం గడిపాడు అని అనడానికి ఆరుద్ర చాలా వివరణలు ఇచ్చాడు. తమిళంలో ఉన్న ‘ఉలా’ ప్రబంధమనే ప్రక్రియలో, రాజును సామాన్య నాయిక మోహించడం తర్వాత రాయబారానంతరం మనోరధప్రాప్తి వరుసగా జరుగుతాయని, దానిని మనసులో పెట్టుకొని పోతన భోగినీ దండకం వ్రాసాడని ఆరుద్ర తెల్పారు.
సింగ భూపాలుడు ఊరేగుతున్నప్పుడు వారకాంత చూచి మోహించడం ఇందలి కథ. ఇలా ఊరేగింపులున్న కథలు పూర్వం లేక పోలేదు. రఘువంశంలో కాళిదాసు, కుమారసంభవం లో నన్నెచోడుడు వర్ణించారని, అవి పోతన గారిపై మంచి ముద్ర వేశాయని తత్ఫలితంగా భోగినీ దండకం వ్రాయడమే గాక, భాగవతంలో కూడా కంస సంహారానికి ముందు వారకాంతలు కృష్ణుని చూసి పులకించినట్లు పోతన రాశాడన్నారు ఆరుద్ర.
పోతన భోగినీ దండకం రాయడంలో ఆయన ఉద్దేశ్యం గూర్చి చెబుతూ ఆరుద్ర, పోతన అర్థంలేని నిషేధాలను పాటించారనీ, అందుకే లాక్షణిక ధిక్కారం చేసి వేశ్యను నాయికగా చేసి తెలుగులో మొట్టమొదటి శృంగార దండకం రచించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడని తెల్పారు. తర్వాత విద్యావతీ దండకం చంద్రాననా దండకం మొదలైనవి వెలువడ్డాయి.
పోతరాజు గారు ప్రవేశపెట్టిన ‘ఉలా’ ప్రబంధ రచన, నాయక రాజుల యుగంలో దండక రూపంలో కాకపోయినా నృత్య, నాటక కావ్యాలలో కనపడుతుందని ఆరుద్ర అభిప్రాయపడ్డారు. మొత్తం మీద గడపవలసిన వయసులో, రసిక జీవితం గడిపిన పోతన ఓరుగల్లు లోని విబుధవరుల సాన్నిధ్యంలో ఎన్నో సంగతులు వింటూ వాళ్ళు చెప్పిన గ్రంథాలలో విషయాలు కంటూ సాహిత్య జీవితం గడుపుతూ ఉండేవారు.
భాగవత పఠనం పోతన మీద ప్రభావం చూపింది (సంస్కృత భాగవతం కాబోలు) అని ఆరుద్ర తెల్పారు. సత్వగుణ ప్రధానమైన భాగవత పురాణ పఠనం పోతనలో భక్తి బీజాలు నాటింది. ఆ కాలంలో శివ భక్తులు ధనవంతులు. విష్ణు భక్తులు బీదవారు అని పోతన ఒక పద్యంలో తెల్పాడు. భాగవతంలో పరిక్షిత్ మహారాజుకు శుకయోగి నోటి వెంట ఈ పద్యం చెప్పబడింది.
మునినాధోత్తమ! దేవ దానవులలో ముక్కంఠి సేవించువా
రనయంబున్ బహువస్తు సంపదల సౌఖ్యానందులైయుండ న
వ్వనజాతాక్షు రమామనోవిభుని శశ్వద్భక్తి సేవించు న
న్మునివర్యుల్ గడు బేదలౌటకు గతంబున్ నా కెరిగింపవే! (భాగవతం, 10, ఎ.ఎ 1227) (స.ఆం.సా. పేజీ 894)
ఈ పద్యం వల్ల విష్ణువు గుణాతీతుడని అందువల్ల ఆయన భక్తుల సంపదలను ఆయనే హరిస్తాడని భాగవతం వామనావతారం లో పోతన సెలవిచ్చాడు. (పోతన భాగవతం 8-659).
సంపదల వల్ల మానవుడు భక్తి సంపదను పొందలేడని తెలుసుకున్న పోతన పేదరికాన్నే వరించాడు. యౌవనం తర్వాత పోతన జీవన విధానం మారిపోయింది.
ఈ విషయం గూర్చి చెబుతూ ఆరుద్ర, ఆదిమ యుగం నుండి శివాలయాలు, శైవులు, బాగా సంపదలతో ఉన్నారని దానికి కారణం రాజులు, రాజకీయ వ్యవస్థలు అంటూ చాళుక్య రాజు నరేంద్ర వర్మ ఒక్కడే 108 శివాలయాలను కట్టించాడని చెప్పాడు. అటుపై రామానుజుల వారు కొన్ని శివాలయాలను వైష్ణవాలయాలుగా మార్చాడని క్రమేణా వైష్ణవం అభివృద్ధి చెందిందని, శైవం తన స్థితి కోల్పోయిందని ఆరుద్ర వివరించారు. అంతేగాక మరికొన్ని మత పరమైన చారిత్రిక మార్పులను గూర్చి ఆరుద్ర వివరణాత్మకంగా వివరించారు. అవసరం వచ్చినప్పుడు విషయాలను విస్తరించి చెప్పగల అపూర్వ జ్ఞాన సంపద ఆరుద్రకు భగవంతుడిచ్చిన వరం.
పోతన రచించిన వీరభద్ర విజయం, భోగినీ దండకాలను గూర్చి ఇప్పటివరకు క్లుప్తంగా తెలుసుకోవడం జరిగింది. పోతన జీవితంలో ఈ రెండు రచనలు కల్పించిన స్థానం వేరుగా అనుకోవచ్చు. యౌవనంలో సింగభూపాలుని వద్ద గడిపిన రోజులలో పోతనది శృంగార జీవితమేనని ఆరుద్ర వివరణాత్మకంగా సెలవిచ్చారు. వేశ్యల వర్ణనలు వగైరాలు అందుకు నిదర్శనాలు.
మానవుని జీవితం ఒక రకంగా మలుపుల మయం. అందుకే పోతన తన జీవితంలో యౌవ్వనం తర్వాత భక్తిభరితమైన భాగవత అనువాదంతో పరమ భక్తాగ్రేసరుడుగా ధన్యుడైనాడు. ప్రజా హృదయాలకు భక్తి మందార మకరందాన్ని అందించాడు.
భాగవత రచన – పోతన
పోతనకు భాగవత కథ అందరికీ చెప్పాలన్న కోర్కెగల్గింది. ఒక చంద్రగ్రహణం నాడు ఓరుగల్లు నుండి గోదావరి నదికి చేరి గ్రహణానంతరం స్నానం చేసి మహేశ్వర ధ్యానంలో కూర్చొన్నాడు.
అప్పుడొక దివ్యపురుషుడు సతీ సమేతుడై పోతనకు కనబడి నేను శ్రీరాముడను. నా పేర భాగవతమును తెనిగింపుము అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. అప్పుడు పోతన సంస్కృత భాగవతానువాదానికి పూనుకొంటూ
పలికెడిది భాగవతమట – పలికించెడివిభుడు రామభద్రుండట నే
పలికిన భవహరమగునట – పలికెద వేరొండు గాథ పలుకగనేలా? (భాగవతం 1-16)
కానీ భాగవతాన్ని అర్థం చేసుకుని రచించడం చాలా కష్టం. అయితే పెద్దలవల్ల తెలుసుకున్నది, తాము బోధపరుచుకున్నది విశిదం చేయవచ్చు. అందుకే పోతన ఇలా చెప్పారు అని అన్నారు ఆరుద్ర.
భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు – శూలికైన దమ్మి చూలికైన
విబుధజనుల వలన విన్నంత కన్నంత – తెలియవచ్చినంత తేటపఱతు (భాగవతం 1-17)
కొందరికి తెలుగు గుణమగు – గొందరికిని సంస్కృతంబు గుణమగు రెండున్
గొందరికి గుణములగు నే – నందరి మెప్పింతు గృతుల నయ్యై యెడలన్ (భాగవతం 1-18)
అని తన ప్రణాళిక తెలియపరిచాడు పోతన అని చెప్పారు ఆరుద్ర. అలాగే పోతనకు తానూ చేయబోయే భాగవతానువాదం గూర్చి తలచుకొన్నప్పుడు ఎంతో ఆనందం కల్గింది అప్పుడు ఇలా తలపోసాడు
ఒనరన్ నన్నయ తిక్కనాది కవులీ యుర్విం బురాణావశుల్
తెనుగుల్ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తా నెట్టిదో
తెనుగుంజేయరు మున్ను భాగవతమున్ దీనిని దెనింగించి నా
జననంబున్ సఫలంబు చేసెద బునర్జన్మంబు లేకుండగన్ (భాగవతం 1-19)
అని సంతోషించి భాగవత అనువాదానికి ఉపక్రమించాడు.
వ్యాస భాగవతం లో 12 స్కంధాలున్నాయి. పోతన అన్ని స్కంధాలు అనువదించలేదు. ఎనిమిది స్కంధాలు మాత్రమె అనువదించాడు. అవి కూడా వరుసగా కాదు. మొదట 1 2 3 4 అటుపై 7 8 9 10 స్కంధాలను పోతన అనువదించాడు. మధ్యలో ఉన్న 5 6 స్కంధాలను బొప్పరాజు గంగ, ఏల్చూరి సింగన (6) అనువదించారు. 11 12 స్కంధాలను వెలిగందల నారయ అనువదించాడు. ఇంతటితో భాగవతానువాదం పూర్తయింది. అయితే నేటి పరిశీలకులైన ఖండవల్లి లక్ష్మీ నిరంజనం గారు పోతన గారు కావాలనే ఆ స్కంధాలను శిష్యులకై వదిలేశారని అభిప్రాయపడ్డారు.
ఆనాటి రాజకీయ పరిస్థితులు స్థిమితంగా లేవు. మహమ్మదీయుల రాక, అలాగే పోతనను పోషించిన సింగమరేడు కటకం గజపతుల యుద్ధంలో తమ్మ భూపాలుని చేతిలో మరణించాడు. తనకు రాజాశ్రయం కరువైంది. భాగవత రచనతో తనలో వైరాగ్య భావాలు పాతుకొన్నాయి. అందుకే రాజులను నమ్ముకునే దానికన్నా భూమిని నమ్ముకోవడం మేలని తలంచిన పోతన తన సంసారం సాగడానికి సేద్యాన్ని చేపట్టాడు.
**** సశేషం ****
చిన్న సమాచారం
కొన్ని విషయాలు అసలువారి పేరు మరుగునపడి మరో విధంగా ప్రచారం కావడం జరుగుతుందని ఆరుద్ర గారు రచించిన సమగ్ర ఆంధ్ర సాహిత్యం ద్వారా తెలుస్తున్నది. ఉదాహరణకు;
"దేశభాషలందు తెలుగు లెస్స" అనే మాట శ్రీనాధుడు క్రీడాభిరామంలో వాడాడని ఆరుద్ర గారు శ్రీనాధుని గూర్చి చెప్తూ చెప్పడం జరిగింది. ఈ మాట కృష్ణ రాయలు అన్నట్టుగా ప్రచారంలో ఉన్నది. శ్రీనాధుని మాట కృష్ణ రాయలు మనసులో పెట్టుకొని వాడుకొన్నట్లు మనం అనుకోవాలి. పాఠకుల సౌకర్యార్థం ఆరుద్ర గారి సమగ్ర ఆంధ్ర సాహిత్యం నుండి ఆ పేజీ ఇక్కడ పెట్టడం జరిగింది.
- డాక్టర్ సి వసుంధర, చెన్నై.