Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర
బమ్మెర పోతనామాత్యుడు

ఓరుగల్లుకు (వరంగల్) ముప్పై మైళ్ళ దూరంలో ఉన్న పాలకుర్తి గ్రామంలో జన్మించిన పాల్కురికి సోమనాథుని ముందుగా స్మరిస్తూ ఆరుద్ర, బమ్మెర పోతనను గూర్చి రచన మొదలు పెట్టారు. దానికి కారణం వీర శైవ మతం, దానితో సోమనాథునికి, పోతనామాత్యునికి ఉన్న సంబంధం.

సోమనాథుని జన్మస్థలానికి రెండు మైళ్ళ దూరంలో ఉన్న బమ్మెర గ్రామంలో సోమన మరణానంతరం సుమారు 150 సంవత్సరాల తరువాత పోతన జన్మించాడని ఆరుద్ర తెల్పారు. ఇరుగు పొరుగు గ్రామాలలో వీరిరువురూ జన్మించడం, వీరశైవ భాగవత వైష్ణవాన్ని ఇద్దరూ ఉద్దరించడంలో ఒక ఔచిత్యం ఉంది అంటూ

“శివమైనా వైష్ణవమైనా ఒక్క కుదుట్లో నుంచి పుట్టినవే అని ఆశించే పరమార్థం ఒక్కటే...” అంటూ వారిద్దరి పుట్టుకకూ శైవ వైష్ణవ మతాల పరమార్థం తో పోల్చారు.

పోతన తండ్రి కేసన, శైవ శాస్త్ర మతం యొక్క లోతు ఎరిగిన వాడు. తల్లి అక్కసానమ్మ సదా శివ పాదయుగార్చనాను కంపాయన వాగ్భవాని. పోతన అన్న తిప్పయ్య ఈశ్వర సేవా కాముడు. అందువల్ల పోతన కూడా ముందు శైవమతారాధకుడే అన్నారు ఆరుద్ర.

పాలకుర్తి ప్రాంతంలో అప్పుడు ఇవటూరివారు శైవమత గురువులు. పోతన కాలం నాడు ఇవటూరి సోమనాథుడు మత బోధకుడు. తండ్రి వద్ద పోతన విద్య నేర్చుకొన్నాడు. సంస్కృత పంచకావ్యాలు పండితయ్య గారి శివతత్వ సారం మొదలైన శైవ గ్రంథాలు పోతన చిన్నతనంలోనే చదివాడని పోతన అభిప్రాయపడ్డారు. పోతన గారికి గల వీర శైవ మతాభిమానం గురించి ఆయన రచించిన “వీరభద్ర విజయం” అన్న గ్రంథంలోని ఈ పద్యం తెలుపుతున్నది.

భవి జూడక భవి డాయక – భవు పదములు గొల్చి ఘోర భవభంజనులై
భవదూరులైన పుణ్యుల – భవు నర్చనచేసి వరము వడసినవారిన్  (వీరభద్ర విజయం 1-10)

బాల పోతరాజును ఆయన గురువైన ఇవటూరి సోమనాథుడు వీరభద్ర విజయం అనే కావ్యం వ్రాయమన్నాడు. అంతేగాక, నీకు ఎక్కువ విద్యాజ్ఞానం లేకపోయినా మత్ప్రసాది దివ్య మహిమచే ఎంతైనా కవిత చెప్పే లావు నీకుంటుంది అని ఆశీర్వదించాడు.

బాల పోతరాజు తాను చదివిన సంస్కృత కావ్యాలను వాటి కర్తలైన కాళిదాస, భాణ, మాఘ, భారవి మొదలైన వారిని వ్యాస వాల్మీకులను స్తుతించిన రచన ప్రారంభించాడు. ఆ పద్యం

“బాణ సంచిత శబ్ద పారీణు నసమాన కవితాగుణావాసు కాళిదాసు .....” ఈ పద్యంలో ‘శృంగార కవినాథు’ అని ఉన్నా పోతన ఆ మాట రంగనాథునికి అన్నాడని శ్రీనాథుని కీర్తించలేదని ఆరుద్ర అభిప్రాయం. నన్నయ, తిక్కన రంగానాథులను కీర్తించాడు.

పోతన గారిపై ఎర్రన గారి నాచన సోముని ప్రభావం ఉందన్నారు ఆరుద్ర. పోతనపై ఎర్రన రచనా ప్రభావం చాలా ఉందన్నారు ఆరుద్ర.

భాగవతం లోని సప్తమస్కంధం -ప్రహ్లాద చరిత్ర లోని ఎన్నో పద్యాలకు ఎర్రన రచించిన నృసింహ పురాణం లోని గద్య పద్యాలు, ఒజ్జ బంతులు అని అన్నారు ఆరుద్ర. ఉదాహరణగా నరకాసుర వధ ఘట్టంలో సత్యభామ యుద్ధం చేస్తున్న ఘట్టాన్ని పోతన నాచన సోముని ఉత్తర హరివంశం చూచినా తర్వాత (దానిని అనుకరిస్తూ) రాశాడన్నారు. ఆ పోలికలు –

“అరి జూచున్ హరి జూచు ....” అని నాచన సోముని రచన. నృ.పు.

“పరిజూచున్ వరుజూచు...”  అని పోతన పద్యం.

వీరభద్ర విజయంలో కూడా “విలు జూచున్ వెలి జూచు జూచు సురలన్” అన్న చోట గూడా నాచన సోముని అనుకరించడం జరిగింది.

నాచన సోముని పోతన అనుకరించిన విధానం గూర్చి చెబుతూ ఆరుద్ర “ఈ ఒక్క పద్యరచనా విధానం లోనే గాక నాచన సోముణ్ణి పోత రాజు గారు బాగా అనుకరించి అతడు చేసిన భాగవతంలో చేర్చారు.

ఉదా: రుక్మిణీ సత్యభామలతో శ్రీ కృష్ణుడు జూదం ఆడుతున్నప్పుడు కాశీరాజు కృత్యను ప్రయోగిస్తే కృష్ణుడు ఆట ఆపకుండానే కాశీరాజు పై చక్రాన్ని ప్రయోగించినట్లు నాచన సోముడు మూల కథకు విరుద్దంగా వ్రాస్తే పోతన కూడా నాచన సోముని అనుకరిస్తూ అలాగే వ్రాశాడు.(దశమస్కంధం ఉత్తర భాగంలో) (స.ఆం.సా పేజీ 889).

ఎర్రనపై, సోమునిపై ఇంత అభిమానం, వారిని అనుకరించడం చేసిన పోతనామాత్యుడు తన రచనలలో కవిస్తుతులతో ఎక్కడా ఎర్రన, సోమన పేరు తెలుపలేదు.

వీరభద్ర విజయం

ఇది పోతన గారి బాల్యంలో రచించిన గ్రంథం. దీనిని గూర్చి ఆరుద్ర వివరిస్తూ,

“ఇది పోతన గారి బాల్యరచన కాబట్టి చదువుతూ ఉంటే ఉడికీ ఉడకని అన్నంతో, పండీ పండని పండు పంచుకొన్నట్లు ఉంటుంది. దుష్ట సమాసాలు, అపశబ్దాలు, వ్యర్ధ పదార్ధాలు కోకొల్లలు. అయితే ఒక మహాకవి ప్రాధమిక రచన ఎలా ఉంటుందో కూలంకుషంగా పరిశీలించడానికి తోడ్పడుతుంది.” అంటూ పోతరాజు తన వీరభద్రవిజయంలో ఆనాటి సాంఘీక విషయాలు చాలా బాగా చెప్పారు అని

‘శీతా చలేంద్రుని కూతు పార్వతి నతి మోదమున నాకు నడిగి రండు ...’

అనే పద్యం వాళ్ళ ఆనాటి పెళ్లి మాడలకు వెళ్ళే వాళ్ళు ఏ విధమైన ఆచారాలు పాటిస్తారో తెల్పాడు పోతన అని ఆరుద్ర తెల్పారు. మంగళసూత్ర వర్ణన కూడా చేశాడు పోతన.

భాగవతం

పోతన గారి తొలి జీవితం గూర్చి చెప్పిన ఆరుద్ర అటు తర్వాత కొంతమటుకు ఊహించి చెప్పడం జరిగింది.

పోతన్న గారి గ్రామంలో భుక్తి గడవడానికి ఎలాంటి ఉద్యోగం లేక ఓరుగల్లుకు రావడం జరిగి ఉండవచ్చని అక్కడ గణిత శాస్త్రం అభ్యసించి ఏ శ్రీమంతుని కొలువులో గణికుడిగా చేరి ఉండవచ్చు అని అన్నారు ఆరుద్ర. అటుపై చెప్తూ, పద్మనాయక రాజధాని రాచకొండ లో మొదట ఉన్నాడు. రాచకొండ దేవరకొండ ప్రభువులు మొదట శైవులైనా తర్వాత వేదాంత దేశికుల వారి కుమారుడు అక్కడి శైవులను ఓడించి వైష్ణవమతం స్థాపించడం వల్ల హరిహరాద్వైతం వృద్ధి చెందింది. ఎర్రన కూడా నృసింహపురాణం వ్రాశాడు.

పోతనకు కృష్ణుని గూర్చి తెలుసుకోవాలన్న తపన బయలుదేరింది. వయసులో ఉన్న పోతనను కూడా విలాసాలకు ఆవాసమైన ఓరుగల్లు పట్టణపు అందాలు ఆకర్షించాయి కాబోలు అంటూ ఆరుద్ర సర్వజ్ఞ సింగ భూపాలుని ప్రేమాయణం వివరించాడు. ఈ విషయాన్ని చెబుతూ “రాజాశ్రయం లోనూ, సానివాడ లోనూ సమానంగా ఉన్న పోతరాజు గారు ఈ సంగతులు తన దండకంలో వ్రాసారు” అని చెప్పి దానిని భోగినీ దండకం అంటారు అని తెల్పారు ఆరుద్ర. దండకంలో ఇతివృత్తం చెప్పడం శ్రీనాథునితోనే ప్రారంభమయిందన్నారు ఆరుద్ర.

పరమ భాగవతోత్తముడైన పోతన గారు భోగినీ దండకం వ్రాసి ఉండరని కొందరి మాట. అయితే వారంగనలను గూర్చి వ్రాయకూడదని నియమం పోతన గారికి లేదని దసమస్కంధం ఉత్తర భాగంలో ధర్మరాజు గారి రాజసూయాగానికి వారంగనలు వచ్చినట్లు పోతన వ్రాసాడని ఆరుద్ర తెల్పారు.

**** సశేషం ****

Posted in February 2025, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!