
ఈ శతకంలో సమకాలీన విషయాల కన్నా భారత భాగవతాదులోని కథల సంగతులే ఎక్కువగా ఉన్నాయన్నారు ఆరుద్ర. రెండు ఇతిహాసాల లోని కథలను ఒకే పద్యంలో తిప్పయ్య చెప్పడం చమత్కారంగా ఉందన్నాడు ఆరుద్ర.
రవి సూనున్ బరి మార్చి ఇంద్ర సుతునిన్ రక్షించినా డందునో
రవిసూనున్ గృపనేలి ఇంద్రసుతు బోరం ద్రుంచినాడందునో
యివి నీయందును రెండునుం గలవు నీ కేదిష్టమో చక్కగా
రవి వంశాగ్రణి తెల్పవయ్య! రఘువీరా! జానకీ నాయకా
ఇక్కడ భారత రామాయణాల కథలు రెండు వ్యక్తమౌతాయి. భారతంలో కర్ణుడు సూర్యుని కుమారుడు, అర్జునుడు ఇంద్రుని కుమారుడు. రామాయణంలో వాలి ఇంద్రుని కుమారుడు, సుగ్రీవుడు సూర్యుని కుమారుడు. రవి సూనుణ్ణి చంపి ఇంద్ర సూనుణ్ణి రక్షించావనా? రవిసూనుణ్ణి రక్షించి ఇంద్ర సూనుణ్ణి పరిమార్చావనేదా? ఈ రెండూ నువ్వు చేశావు. ఇందులో నీకేది ఇష్టం.
ఇదొక వైవిధ్యమైన రచన. ఇది తిక్కన గారు హరిహరనాథుణ్ణి ‘కిమన్తి మాలాంకిమకౌస్తుభం వా...’ అని అడిగిన శ్లోకాన్ని గుర్తు చేసిందని అన్నారు ఆరుద్ర.
తిప్పయ్య ఇలా పురాణ కథలు తన శతకంలో చోటు కల్పించినా తన పూర్వకవులను అనుకరించాడు అన్న ఆరుద్ర వాటిలో కొన్ని తెల్పాడు.
‘బాలత్వంబున కొంతకాలము...’ అన్న పద్యం రఘువీర శతకం లోనిది. ఇది ఆది శంకరుని భజగోవిందం లోని 7వ శ్లోకానికి అనుకరణ అని ఆరుద్ర తెల్పారు. శంకరునిది ‘బాలస్తావ క్క్రీడాసక్తా’ అన్నది ఆ శ్లోకం.
జానకీపతి శతకాలను ఇద్దరు వ్రాసారు.
౧. అణివెళ్ళ సీతారామ కవి (క్రీ.శ 1750), ౨. రామభద్ర కవి (క్రీ.శ 1800). తిప్పయ్య వ్రాసిన చిలక పద్యానికి రామభద్రుని చిలక పద్యానికి పోలికలు ఉన్నాయని చెప్పి అటు తర్వాత కూడా ఈ చిలుక ప్రశస్తి ఉన్నాదని మొల్ల రామాయణం లోని ‘వారాంగన శ్రీరాముని – పేరిడి రా చిలుక బిలిచె పెంపు వహింపన్’ అన్న పద్యాన్ని తెల్పారు ఆరుద్ర.
ఆ కాలాలలో రసవాదం బహుళ ప్రచారంలో ఉండేది. ఇనుమును బంగారం చెయ్యడం రసవాదం. వేమన పద్యాలలో చాలా చోట్ల ఉందని, ఎందఱో ఈ విద్య నేర్చుకొన్నారని ఆరుద్ర తెల్పారు. తిప్పయ్య కూడా రసవాదం గూర్చి తన శతకంలో ప్రస్తావించారని ఆ పద్యం ఆరుద్ర తెల్పారు. (స.ఆం.సా. పేజీ 870).
తిప్పయ్య రచనలో గల మరొక వైవిధ్యమైన విషయాన్ని ఆరుద్ర ఇక్కడ ప్రవేశపెట్టాడు.
తిప్పయ్య పురాణ కథలకు తన శతకంలో తన రచనలో చోటు కల్పించడం చూచాము. అలా కాకుండా పురాణ కథలకు అంటే హరివంశం మొదలైన వాటిలో ఉన్న కథలకు విరుద్ధంగా తన శతకంలో వ్రాసి ఉన్నాడని తెల్పి ఒక పద్యం తిప్పయ్యది ఉదహరించాడు. ఆ పద్యం ఘంటా కర్ణుడను హరిభక్తుని గూర్చిన పద్యం.
“చెవి నీ నామము విందునోయని కడున్ శంకించి కర్ణంబులన్
రవముల్ మీరిన ఘంట అంటనిడి ఘంటాకర్ణుడే తేరగా ....”
హరియొక్క పేరు ఎక్కడ వినబడుతుందోనని జంట ఘంటలను చెవులకు కట్టుకొని ఘంటాకర్ణుడు అనువాడు వచ్చేను అని అర్థం. కాని హరివంశాదులలో ఉన్న ఘంటా కర్ణుడు ఇతర దేవుళ్ళ శివనామం వంటిది వినబడకుండా చెవులకు గంటలు కట్టుకొని ఘంటా కర్ణుడైనాడు అని చెప్తూ ఆరుద్ర తిప్పయ్య పద్యంలో ఉన్న ఈ ఘంటాకర్ణుడు తద్విరుద్ధంగా ఉన్నాడు. పోనీ వేరే వాడున్నాడా అంటే సాహిత్య చరిత్రలో ఆ పేరు గలవాడు ఎక్కడా లేడు అని ఆరుద్ర అన్నాడు. సాహిత్య చరిత్రలో పరిశోధకులకు కనపడని ఈ విష్ణు ద్వేషి అయిన ఘంటాకర్ణుడు ఎవరో పరిశోధించాలి. (స.ఆం.సా. పేజీ 871).
శ్రీనాధుడు శివమహత్యం నిరూపిస్తూ గుణనిధి కథ వ్రాస్తే తిప్పయ్య రామ మహత్యం చెప్తూ చెప్పిన పద్యం –
గోమాంసాళిని మధ్యపాని సరగిన్ గొండీడు చండాలుడున్
హేమస్తేయుడు సోదరీరతుడు కూడేకాదశిన్ భుక్తిచే
సేమూఢాత్ముడు లోనుగాగలుగు దుశ్శీలాత్ముడైనన్ తుదిన్
రామా యన్నను ముక్తిగాచు రఘువీరా! జానకీ నాయకా! అంటూ శైవుల కన్నా మించిన పద్యం వ్రాశాడు.
తిప్పయ్య ఇతర రచనలు దొరకలేదని దొరికి ఉంటే ఇంతకన్నా కవనీయమైన రచనలు చదివి ఉండేవాళ్ళమని చెబుతూ తిప్పయ్య తన రచనలను రాజులకో ఎవరికో నరాంకితం ఇవ్వలేదని భగవంతునికీ ఇచ్చాడని చెప్పి దానికి సాక్ష్యంగా ఈ క్రింది పద్యం చూపించాడు ఆరుద్ర.
క్షితిలో నల్పుల మీద చెప్పిన కృతుల్ ఛీ ఛీ నిరర్ధంబు లో
సుతికింబాత్రము గావు మేక మెడ చన్నుల్ నేతిబీరాకులున్
వితతప్రౌఢిని నీకు జెప్పిన కృతుల్ వేదాలు శాస్త్రాలు భా
రత రామాయణంలో దలంప రఘువీరా! జానకీ నాయకా!
ఈ పద్యం వల్ల నరాంకితం పై తిప్పయ్య కున్న అభిప్రాయం తెలుస్తున్నది.
ఒంటిమిట్ట కోదండరాముని మీద చెప్పిన ఈ రఘువీర శతక కర్త తిప్పయ్యనీ, త్రిపురాంతకుడు అని పిలవడం ప్రసిద్ధిగాంచిన విషయం.
ఆంధ్రకవి రామయ్య
తెలుగు కవులందరూ ఆంధ్రులే అయినా బిరుదు చేతనో ఇంటిపేరు చేతనో ఆంధ్రకవి అనేవాడు ఒక్కడే ఉన్నాడు అతడే ఈ ఆంధ్రకవి రామయ్య అంటూ ఆరుద్ర రామయ్యను పరిచయం చేశాడు.
రామయ్య రాసింది విష్ణు కాంచీ మహత్యం. రామయ్య గ్రంథం కూడా పూర్తిగా దొరకలేదు. కేవలం 12 పద్యాలు మాత్రమె దొరికాయి. ఆంద్ర సాహిత్య పరిషత్తు వారి పద్య సంకలన గ్రంథంలో ఆ పద్యాలు ఉన్నాయని ఆరుద్ర తెల్పారు.
శ్రీనాథుని బావమరిది దగ్గుపల్లి దుగ్గన శివ కాశీ పురాణం వ్రాశాడు. అందువల్ల అతనికి సమకాలీనుడో ఆ తర్వాత వాడో కావచ్చు ఈ రామయ్య అన్నారు ఆరుద్ర.
విష్ణు కంచి కథ పురాణాలలో ఎక్కడ ఉందో తెలియదు గాని పూర్వ గాథాలహరి లో ఉంది అని కంచి పట్టణం గూర్చి తెల్పారు.
పూర్వం సత్యవ్రత క్షేత్రమని దీనిని పిల్చారు. బ్రహ్మ ఒకప్పుడు విష్ణువును గూర్చి ఆశ్వమేథ యాగం చేశాడు.అక్కడ అప్పుడు బ్రహ్మ విశ్వకర్మను అక్కడొక పట్టణం నిర్మించమన్నాడు. అప్పుడు నిర్మించినదీ విష్ణు కంచి.
మన పురాణాలలో ముగ్గురు సత్యవంతులు ఉన్నారని, అందులో ఇద్దరికి (1. వైవస్వత మనువు, 2. భారతంలో సుశర్మ సోదరుడు) ఈ క్షేత్రంతో సంబంధం ఉందేమోనని ఆరుద్ర పరిశోధన జరిపారు.
పురాణాలలో ముక్తి క్షేత్రాలైన వాటిలో కంచి పేరున్నది. శ్రీనాథుని కాశీఖండం లో శివ శర్మకు తెల్పేటప్పుడు కాంచీ ప్రసక్తి ఉందని తెల్పిన రామయ్య గరుత్మంతుని కూడా వర్ణించాడు.
రామయ్య రచనలో అక్కడక్కడా శ్రీనాథుని అనుకరించిన ఛాయలున్నాయి. చకోరాలు, చంద్రుడు వీటి వర్ణనలలో శ్రీనాథుడు గోచరిస్తాడు. విష్ణుకంచి ని గూర్చి రచించిన రామయ్య కొన్ని చోట్ల దుష్కర ప్రాసలను కూడా తీసుకొన్నాడని ఆరుద్ర తెల్పారు. శ్రీనాథుడు చూచిన అరవ వనితలను, కంచిలో రామయ్య వర్ణించిన పద్యాన్ని ఆరుద్ర తెల్పాడు. పడియలలో... అంటూ మొదలైన ఈ సీస పద్యం తమిళ భామినుల అందాలను అభివర్ణించింది. ఆంధ్రకవి రామయ్య తమిళనాడు లోని కంచి లో విష్ణువును గూర్చి స్మరించి ధన్యుడైనాడు.