తెలుగులో నాటకాలు లేవనే కాలంలో గౌరన మంచి నాటక కర్తగా గుర్తింపు పొందాడన్న విషయం తెలుసుకొన్నామని అయితే గౌరన కాలంలోనే మరొక నాటక కర్త కొలని గణపతిదేవుడు అనే కవి శివయోగ సారము అనే గ్రంథాన్ని రాసి దాని అవతారికలో చెప్పిన పద్యాన్ని ఆరుద్ర తెల్పారు. ఆ పద్యం –
‘మరియును శివపదమునయై నెరయు
కృతులు నాటకములు నేర్పు జనులం
దరు నౌనౌనని పొగడగ కరకంఠుని కరుణ
రచన గావించి తిలన్!!’
గణపతి దేవుని రచనలన్నీ దేశీ తెనుగులో ఉన్నయని ఈతని గురువు మాట. గణపతి దేవుడు రచించిన నాటకాలు, ‘పశు పాశుపతి జ్ఞానము’, ‘అశరీరభవ విజయం’ మొదలైనవి దొరకలేదు. దొరికినవి ‘శివయోగ సారము’, ‘మనో బోధలు’ మాత్రమె. ఈ రెండింటిలో శైవమత బోధ, వేదాంత ప్రభోదం తప్ప రాసానందమేమీ లేదన్నాడు ఆరుద్ర. శివయోగ సారం పీఠిక మాత్రం కాకతీయ చరిత్రలోని కొన్ని ఘట్టాలను తెల్పుతున్నాదని ఈ పీఠిక ఆధారంగానే కొమఱ్ఱాజు లక్ష్మణరావు గారు అన్నదేవుని గూర్చి రాసారన్నారు ఆరుద్ర.
పాల్కురికి సోమన శిష్యుడు ఇందులూరి అన్నయ దేవుని వంశ చరిత్ర ఈ పీఠిక వల్లనే తెలుస్తున్నదని ఆరుద్ర తెల్పారు.
ఇందులూరి అన్నయ దేవుడు ప్రతాపరుద్ర చక్రవర్తి చేత శివభక్తులకు అగ్రహారం ఇప్పించాడు. ఇతని వంశ చరిత్రను గూర్చి గణపతి దేవుడు తన పీఠికలో విపులంగా వ్రాయడానికి కారణం ఉందని దానిని గూర్చి తెల్పారు ఆరుద్ర.
కాకతీయ వంశం లోని రుద్రమదేవికి మగ సంతానం లేదు. ఇద్దరు కుమార్తెలు మాత్రమె. అందుకే రుద్రమదేవి తండ్రి గణపతి దేవుడు ఆలోచించి తన కొలువులో ఉన్న ఇందులూరు పెదగన్నయ కుమారుడైన అన్నయదేవునికిచ్చి తన రెండవ మనుమరాలిని (రుద్రమదేవి చిన్న కుమార్తె) వివాహం జరిపించాడు. ఈ అన్నయదేవుడు పరాక్రమవంతుడు. రాజ్య పాలనలో ఇతనితోడు రుద్రమదేవికి అవసరమని గణపతి దేవుని ప్రయత్నం.
ఈ ఇందులూరి వంశీయులు మూడు తరాలవారు కాకతీయ రాజ్యంలో మంత్రులుగా, దండనాథులుగా ఉన్నారు. అన్నయదేవుడు పెదతండ్రి తో కలిసి దండయాత్రలలో పాల్గొని ఓరుగల్లు నుండి సింహాచలం వరకు జయించాడు.
ఇంటిపేరు: ఇందులూరు అన్నమదేవుని పెదతండ్రి సోమన శత్రువులను జయించి కొలనువీడు జలడుర్గాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. అందువల్ల సోమన్నను గణపతి దేవ చక్రవర్తి అతన్ని కొలను సోమన్న అని పిలిచేవాడు. సోమన్నకు అందువల్ల ఇందులూరు అనే ఇంటి పేరు పోయి కొలను వారు అనేది స్థిరపడింది. నేటి ఏలూరుకు ఆనాటి పేరే కొలనువీడు.
ఈ వంశంలో ఐదవ తరం వాడు ఇప్పుడు మనం వ్రాస్తున్న శివయోగ సారం గ్రంథకర్త కొలను గణపతి దేవుడు. అందువల్లే తన గ్రంథ పీతికలో ఇందులూరి వారి వంశ చరిత్రను అంత విపులంగా వ్రాయడం జరిగింది.
కొలను గణపతి దేవుడు తనను గూర్చి ‘అన్యనారీ సహోదరుడననీ, యోగీజన పదపంకేరుహ మత్తమధుకరుడననీ, అన్యస్తుతి పరాన్ముఖుడననీ, శివస్తుతి సుముఖడననీ చెప్పుకొన్నాడు. యితడు శివ యోగులను సేవించాడు.
కావ్య రచన: శివయోగసారం సంస్కృత గ్రంథానికి అనువాదంగా ఉందని అన్నారు ఆరుద్ర (శివయోగ పీఠిక – 93-95).
శివయోగసారం శైవమత ప్రచార గ్రంథమైనప్పటికీ అందరికీ పనికివచ్చే నీతులు ఎంతో చక్కగా ఉన్నాయన్న ఆరుద్ర ఒక పద్యాన్ని ఉటంకించారు.అది,
“ప్రమదముతో నొకింతయిన బాత్రున కీని మహాఫలం బగున్
బ్రమసి యపారవిత్తము లపాత్రున కిచ్చిన గీడుపొందు హ
సము నొసగంగ దుగ్ధముల జాలగ ధేనువు లిచ్చు నట్టి దు
గ్ధము లొసగన్ వినం బొలుకుగాదె భుజంగమయూధ మిమ్మహిన్”
అంటూ వ్రాసిన ఈ పద్యంలో ఆవు గడ్డి పెట్టినా మనకు కమ్మని పాలు ఇస్తుంది. పాముకు పాలు పోసినా విషం కక్కుతుంది అంటూ చక్కని సత్యం ఈ పద్యంలో తెల్పాడు. ఈ గ్రంథాన్ని పరిశీలిస్తే ఇలాంటి పద్యాలు మరిన్ని ఉంటాయన్నాడు ఆరుద్ర.
నాటకాలు:
మానసబోధ: ఇది 459 పాదాల ద్విపద గ్రంథం గణపనారాధ్యుడనే కవి ‘స్వర శాస్త్ర మంజరి’ అనే ద్విపద కావ్యం వ్రాసాడని చెప్పిన ఆరుద్ర మరిన్ని వివరాలిచ్చి “ఇతడు కొలని గణపతి దేవుని పూర్వీకుడై ఉంటాడ”ని అన్నారు ఆరుద్ర.
ఉమామహేశ్వర సంవాదరూపమైన స్వర చింతామణి అనే 25 అధ్యాయాల గ్రంథం సంస్కృతంలో ఉంది. కొలను గణపతి దేవుడు తన ద్విపద కావ్యం రాయడానికి ముందే గణపనార్యుని ద్విపద కావ్యం చూచినట్లు శివయోగసారం లో కొన్ని భావాలు దీనితో సరిపోతున్నాయని ఆరుద్ర తెల్పారు.
గణపతి దేవుని రచనలలో వేదాంత, నీతిబోధలను వివరించిన ఆరుద్ర నాటక లక్షణాలు ఎక్కడ ఉన్నాయో తెల్పలేదు. బహుశా అవి దొరకలేదు కాబోలు.
“మాయ బంధుల నేల మరిగెదవు మనస
చుట్టాలు పక్కాలు సుతులు సోదరులు
కలిమిలో సరి, వారు కలిమి గుండినను
సిరవోయేనని తన్ను జేరంగ నీరు
కొంటెపెంపున మాన దూలపోనాడి
ఏమేడ, మీరేడ? యేమి పోరామి....” అంటూ నిత్యసత్యాలు చక్కగా ఉన్నాయని అంటూ వేమన కూడా గణపతి దేవుని మనోబోధ లోని వైరాగ్యాన్ని అనుసరించాడని చెప్తూ ‘అందులోని కొన్ని పాదాల మువ్వలు అతని (వేమన) ఆటవెలదుల పాదాల గజ్జలైనాయని’ అంటూ వేమన గారి ‘తలలు బోడులైన తలపులు బోడులా’ అన్న దానికి కొలను గణపతి దేవుని మనోబోధ లోని ‘వెంట్రుకక చీరలు విడిచి పోయిననూ మాయలు విడుచునే మనస భావింప’ అన్న ద్విపద పంక్తులతో పోలిక తెల్పారు ఆరుద్ర. (స.ఆం.సా. పేజీ 864).
“ఆవులు పలు చాయలై ...అన్న గణపతి దేవుని రచనను వేమన “...అసుల వన్నెలెన్నో పాలు నొకటే” అంటూ వ్రాసాడు.
ఆరుద్ర తన రచన చివర ఇలా అన్నారు. “జనులందరూ ఔను ఔను అని మెచ్చుకొన్న అతని నాటకాలు దొరికిన తెలుగు సాహిత్యం కూడా ఈ విషయంలో సగర్వంగా తల ఎత్తుకుని తిరిగేది. నాటకాలు దొరకక పోయినా నాటకాలు వ్రాసిన రచయిత పేరు తెలిసింది” అన్నారు. నిజమే గదా.
తెలుగులో నాటక రచన ఉన్నదన్న త్రుప్తి మనకు మిగిల్చిన కొలని గణపతి దేవునికి ధన్యవాదాలు తెలుపుకొందాం.
అయ్యలరాజు తిప్పయ్య – త్రిపురాంతకుడు
వీరశైవం వీర వైష్ణవం రెండు తమ తమ మతాలను గూర్చి చెప్పుకుంటూ వాటిపైన తమకున్న భక్తిని తెల్పుతూ అన్న మాటలను ఆరుద్ర తెల్పారు.
“శివుని కన్నా వేరే దైవం ఉన్నాడని ఎవరైనా చెప్తే వాళ్ళను తన కాలితో తంతానన్నాడు ఒక తెలుగు కవి.” అని అన్నాడు ఆరుద్ర. (స.ఆం.సా. పేజీ 867).
“ఇల నీ మీదను జాల నీ మీదను భక్తి గలవాడెట్టి వాడైన ....” అన్న పద్యంలో ఒక వీర వైష్ణవుడు వెలిబుచ్చిన అభిప్రాయాలు మతావేశానికి నిదర్శనాలు.
ఈ పద్యం వ్రాసింది అయ్యలరాజు త్రిపురాంతకుడు. యితడు రఘువీరా జానకీ నాయకా అనే మకుటంతో శతకం వ్రాశాడు. ఇది చాలా ప్రసిద్ధమైనది.