ఆంధ్రదేశంలో కొన్ని కథలు ప్రజలకు కంఠోపాఠమని చెప్తూ ఆ కథలు ఎవరు వ్రాసింది మాత్రం చాలామందికి తెలియదంటూ ఆరుద్ర తెల్పుతూ ఆవు-పులి కథ అంతా చెప్పారు.
ఆకలిగా ఉన్న ఆ పులి ఆవును తినబోగా ఆవు నేను ఇంటికి వెళ్లి నా బిడ్డకు పాలు ఇచ్చి వస్తాను. నీకు ఆహారమౌతాను అని వెళ్లి తిరిగి వచ్చినందుకు పులి దానికి మెచ్చుకొని వదిలి పెట్టడం మనకందరికీ తెలిసిన కథ. అయితే ఈ కథ రచించినది అనంతామాత్యుడు.
అనంతామాత్యుడు కృష్ణా జిల్లా వాడు. క్రీ.శ. 1435 ప్రాంతం వాడు. ఇతని ముత్తాత పేరు బయ్యన. ఇతను మంచి కవి. తిక్కన గారు బయ్యనను మెచ్చుకొని “భవ్యభారతి” అనే బిరుదు ఇచ్చారు. బయ్యన కవేగాక దండనాథుడు కూడా. అనంతామాత్యుడు తన తాతగారిని గూర్చి వ్రాసిన విషయాలను ఆరుద్ర తెలిపారు. అవి – ‘బయ్య చమూపతి, గదా నిపుణుడు, ఆరాతి భయద బాహాఢ్యుడు’ అని అక్షరాతి విద్యలందు చతురుడై రాజ సభలలో పూజలందుకొన్నాడని అనంతామాత్యుడు చెప్పాడని ఆరుద్ర తెల్పారు. (స.ఆం.సా. 841)
తిక్కనచే బిరుదునందుకున్న బయ్యన తన మనుమడికి తిక్కన అని పేరు పెట్టుకున్నాడు. అనంతామాత్యుని తండ్రి నివసించిన ఊరు పెరుమగూరు. అలాగే అనంతామాత్యుడు నివసించిన ఊరు ప్రవపట్టణం. ఈ రెండు ఊరులు ఎక్కడున్నాయో సరిగా తెలియదని ఆరుద్ర చెప్తూ చాగంటి శేషయ్య గారు, నిడదవోలు వెంకటరావు గారు ఇచ్చిన వివరణనలను తన రచనలో పొందుపరిచారు.
అనంతామాత్యుడు అహోబిల నారసింహుని భక్తుడు. నారసింహుడు ముచ్చటపడి “నాకు అంకితమివ్వు” అని అడిగితే అనంతాత్యుడు తన మొదటి రచనను అంకితమిచ్చాడు. అనంతుని గురువు గారు తిరుమల నల్లార్ నారసింహునితో కూడా అనంతామాత్యుని కలలో కనపడి ‘ఆ దేవునికే అంకితమివ్వు నీ కృతిని’ అని చెప్పగా అనంతామాత్యుడు పులకించి ఆ స్వామికి అంకితమిచ్చాడు. తన తొలికావ్యమైన ‘భోజరాజీయము’ అన్న పేరు గల కావ్యమును ‘ముద్దులీనే కవిత్వంతో’ కవితార్పితం చేశాడు.
అనంతామాత్యుడు పాత కథలను తీసుకోలేదు. విక్రమార్కుని సింహాసనం పైన ఎక్కదలచిన భోజుని కథలు ఆంధ్రదేశంలో ప్రసిద్ధంలో ఉన్ననూ, భోజుని కథలు గానీ, కాళిదాసు కథలను గానీ అనంతుడు తాకలేదు. బహుశా ఆ కథలు ఇంకా అప్పటికి ప్రచారంలో లేవేమో అని ఆరుద్ర అన్నారు. అందుకే అనంతుడు మరీ పలుచని కథను ఒకదానిని తీసుకుని దానికి చేర్పులు, మార్పులు ఎన్నో చేసి తన ప్రణాలికను ఇలా చెప్పాడు.
సూత్రకథ భోజరాజ చరిత్రమయా నడుమ ధర్మరీతులు నీతుల్
చిత్రకథలై తలిర్పగ శ్రోత్రసుఖముగా నొనర్ప జొప్పడి యుండున్ (భోజ 1-86) (స.ఆం.సా. పేజీ 843)
అనంతామాత్యుడు తానూ తెల్పిన కథలన్నీ కొత్తవైనా పురాతన కథలను ప్రతిబింబిస్తున్నాయని, కథలన్నీ ప్రశస్త ధర్మోపదేశాలనీ చెప్పాడు. ఇందులోని కథలను ఆరుద్ర సవిస్తరంగా వివరించాడు. ప్రారంభంలో మహుడు అనే కాంభోజ రాజుకు కుష్ఠురోగం వస్తుంది. అప్పుడు ఆ రాజు గౌతమీ నదిలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకొన్నప్పుడు గౌతమీ నది ఒక స్త్రీ రూపంలో వచ్చి అతన్ని వారించి హిమకూట పర్వతం పై ఉన్న దత్తాత్రేయ మహర్షి వద్దకు వెళ్ళు. నీ వ్యాధి నయమౌతుంది అని చెప్పగా కాంభోజ రాజు హిమకూటానికి వెళ్ళడం జరిగింది.
హిమకూటం పై నున్న దత్తాత్రేయుడు మద్య మాంసములు సేవిస్తుండడం చూచి అది నిజం కాదని తెలుసుకున్న కాంభోజి రాజు ఎనిమిది పద్యాలలో దత్తాత్రేయుని స్తుతించాడు. అప్పుడు స్వామి కరుణించి ఇలా చెప్పాడు. నేను ప్రొద్దున ప్రయాగలో, మధ్యాహ్నం హిమకూటంలో రాత్రికి శ్రీరంగం లో ఉంటాను. అందువల్ల నేను రేపు వచ్చి నీ వ్యాధి పోగొడతాను అని చెప్పి అన్నట్లుగానే మరునాడు తెల్లవారునే వచ్చి ఆ రాజుని కుష్ఠురోగం నుండి విముక్తుణ్ణి చేశాడు. అప్పుడారాజు దత్తాత్రేయుని ప్రయాగ, హిమాకూట, శ్రీరంగ క్షేత్రాల మహత్యాన్ని గూర్చి అడగగా దత్తాత్రేయ ముని దాని కథను చెప్పడంతో కథ సాగుతుంది.
దత్తాత్రేయుడు 24 గద్యపద్యాలలో శ్రీరంగం గూర్చి, 5 పద్యాలలో ప్రయాగాను గూర్చి వర్ణించి వాటి మహత్యాన్ని తెల్పాడు. ప్రయాగలో చనిపోతే వచ్చే ఫలితం గురించి కూడా వివరించాడు.
ఒక బ్రాహ్మణుడు ప్రయాగలో చనిపోతూ ఏది కోరుకుంటామో అది తదుపరి జన్మలో అది జరుగుతుందని తెలుసుకొని అక్కడికి వెళ్లి చనిపోబోగా అతని వలె నలుగురు స్త్రీలు కూడా ఒక్కొక్కరు ఒక్కో కోర్కెను కోరుకుని ప్రయాగలో చనిపోతారు. అది చూసి ఆ బ్రాహ్మణుడు ఆ నలుగురు స్త్రీలకూ భర్తగా పుడితే తన అదృష్టానికి తిరుగులేదని వారి భర్తగా పుట్టాలని కోరుకుని చనిపోతాడు. అతడే భోజరాజు. లాట దేశంలో ధారానగారానికి అధీశ్వరుడై అనేక సంవత్సరాలు పాలించాడు. ఇది అనంతామాత్యుడు చెప్పిన కథ. ఇది కల్పితం అన్నాడు ఆరుద్ర. అసలైన చరిత్రలో ఉన్న భోజ మహారాజును గూర్చి ఆరుద్ర వివరించారు. సాహిత్య చరిత్రతో పాటు వాస్తవ చరిత్ర విషయాలు గూడా వివరించడం వల్లే ఆరుద్ర రచనకు ఎంతో విలువ ఏర్పడింది.
భోజుడు 23 గ్రంధాలు వ్రాసినట్లు చెప్తారని ఆరుద్ర తెల్పారు. నామమాలిక, సరస్వతీ కంఠాభరణం (అలంకార శాస్త్రం), యుక్తి కల్పతరువు (న్యాయ శాస్త్రం) రచించాడు. ధారా నగరంలో వాగ్దేవీ విగ్రహస్థాపన మొదలైనవి చారిత్రిక విషయాలు. వీటిని అనంతామాత్యుడు చెప్పలేదు అని ఆరుద్ర తెల్పారు. (స.ఆం.సా. పేజీ 845). భోజుడు నిర్మింపజేసిన సరస్వతీ విగ్రహంలో పరమార శిల్పకళ పరమావధికి చేరిందని ప్రతీతి అని ఆరుద్ర మాట.
అనంతామాత్యుడు, భోజుని ముఖం చూస్తేనే కవిత్వం పుట్టుకొస్తుందన్న మాటకు సరిపోయేటట్లు రాసిన పద్యాన్ని ఆరుద్ర తెల్పారు. భోజుడు ఎరిగిన మహా విద్య ఏ లోహాన్ని అయినా బంగారంగా మార్చే విద్య. ఈ విద్య భోజుడు ఎలా నేర్చుకొన్నాడో కాంభోజ రాజుకు దత్తాత్రేయుని చేత చెప్పించాడు అనంతామాత్యుడు.