Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర
వెన్నెలకంటి అన్నయ్య

వెన్నెలకంటి అన్నయ్య వ్రాసిన కావ్యం పేరు షోడశకుమార చరిత్ర అని కవి గద్యలో చెప్పాడు. కానీ చిన్నయసూరి కాలం దాకా దీనికి ‘భేతాళ పంచవింశతి’ అనే పేరు ఉండేదని ఆరుద్ర తెల్పారు. దీనికి కారణం అన్నయ తాను భేతాళ పంచవింశతి లోని కొన్ని కథలను తన రచనలో వాడుకోవడమే అని ఆరుద్ర తెల్పారు. అంతేగాక ఇందులో మరికొన్ని గ్రంథాలలోని విషయాలను అన్నయ అనుకరించినట్లు తెల్పి ఆరుద్ర వాటిని ప్రస్తావించాడు. అవి

  1. దశకుమార చరిత్రలోని కొన్ని కథల పోలికలు,
  2. విక్రమార్క చరిత్రలోని సంఘటనలు,
  3. కథాసరిత్సాగరం లోని కొన్ని కెరటాలు,
  4. మంచెన కేయూరబాహు చరిత్ర ప్రభావం.

ఇవన్నీ అన్నయ రచనపై ఉన్నాయన్నాడు ఆరుద్ర.

అలాగే శ్రీనాథుని రచనలు ప్రచారంలోకి వచ్చిన తర్వాత వ్రాసిందేమో అన్నయ కావ్యం అన్నారు ఆరుద్ర. (స.ఆం.సా. పేజీ 831)

అన్నయ కాల నిర్ణయాన్ని గూర్చి కొంత చర్చించిన ఆరుద్ర చివరగా అన్నయ గ్రంథం లోని ఆశ్వాసాంతం లోని ఒక పద్యాన్ని తెల్పారు. ఆ పద్యం –

“సరసానందనసత్క ళాగమపరీక్షాకృష్ణకందార భా
స్వర నానారస భావనిర్మథనభోజాక్ష్మావ విద్యానిరం
తర గోష్టీ జగదేకమల్ల బహుశాస్త్ర గ్రంథ సిద్ధాంత వి
స్తర విజ్ఞాన కవిత్వతత్త్వకలనా సర్వజ్ఞ సోమేశ్వరా!!”

ఇందులో కృష్ణ కందారుడు యాదవరాజు (క్రీ.శ.1250) అని ఇతని సమకాలీనుడై ఉండవచ్చు అని నిడదవోలు వెంకట్రావు గారి మాట. కానీ మల్లంపల్లి వారు ఈ పద్యంలోని కృష్ణుని రాష్ట్రకూటులలోని రాజులలో మూడవ కృష్ణునిగా గుర్తించారని ఆరుద్ర తెల్పారు.

షోడశ కుమారా చరిత్ర లోని ఆశ్వాసాంత ఆద్యంత పద్యాల వల్ల దీని కృతిపతి మంచి విద్యాధికుడని తెలుస్తున్నదని, అంతేగాక ఆశ్వ శిక్షకుడు, శైవ సిద్ధాంతాల విబేధి అని తెలుసున్నాడని తెల్పి ఇంకా ఇతను నాటక ముఖకోహళాది నాట్య రహస్యాల ఉద్ఘాటన నిపుణ ప్రజ్ఞా చాతుర్యుడు, నూతన భరతాచార్యుడు  అన్నారు ఆరుద్ర.

ఆరుద్ర ఏవైనా కథలు గల గ్రంథాలను గూర్చి చెప్పేటప్పుడు అందులోని కథలను పాఠకులకు వివరించడం వారిలోని ప్రత్యేకత. నవనాథ చరిత్ర మొదలైన వాటిని ఆరుద్ర చదువరులకు అందించారు. షోడశ కుమార చరిత్రను కూడా అలానే ఆరుద్ర వివరించారు.

కమలనాథుడు రాజకుమారుడు. సేనాని కుమారుడు భీమ భటుడు. కరుణాకరుడు మంత్రి కుమారుడు. చిత్రకరుడు కూడా మంత్రి కుమారుడే.

కథ: కమలాకరుడు ధనమేజయ మహారాజు కుమారుడు. ఇతనికి ఎనిమిది మంది మంత్రి కుమారులు, నలుగురు దండనాధుల కుమారులు, ముగ్గురు పురోహితుల కుమారులు స్నేహితులు. రాజకుమారి తో కలిపి వీరు పదహారు మంది. వీరంతా దండకారణ్యం లో ఒక సాధకునికి సహాయం చెయ్యడానికి వెళ్ళారు. అప్పుడు ఒక పన్నాగం వల్ల అందరూ చెల్లా చెదురు అయిపోయారు. కొన్నాళ్ళ తర్వాత కరుణాకరుడు బోయ పల్లెలో ఒక నెమలిని చూచాడు. దానిని అతడు నిమరగానే ఆ నెమలి తన స్నేహితుడైన భీమ భటుని గా మారి పోయాడు. ఈ కథ ఆశ్వాసం 1 నుండి 16 దాకా ఉన్నాడని ఆరుద్ర వివరించారు.

ఈ విధంగానే షోడశ కుమారులు కష్టాలు పడటం, తిరిగి అందరూ కలుసుకోవడం ఆరుద్ర ఓపికగా పూర్తి కథంతా వివరించారు.

గ్రంథ ప్రాశస్త్యం :

ఈ షోడశ కుమార చరిత్రలో కథ షష్ఠాశ్వాసంలో గాని మంచి పాకాన పడలేదు అని అన్నారు ఆరుద్ర. మొదటి ఆశ్వాసం లో కథ చెప్పడమే కనబడుతుందని, పాత్రల భావాలు, వర్ణనలు తక్కువని చెప్పిన ఆరుద్ర, కొన్ని ఆనాటి సాంఘీక విషయాలు ఉండడం గమనించదగ్గ విషయమని చెప్పి ఆనాటి వేశ్యల వైభవాన్ని గూర్చిన పద్యాలు తెల్పారు. రాజాస్థానాలలో ఉండే ప్రతీహార కాంతల వర్ణనను, శ్రీనాథుని అనుకరిస్తూ రచించినట్లు చెప్పి శారదా పీఠాన్ని వర్ణించే పద్యాలను ఆరుద్ర ఉటంకించారు.

కథానాయికను వర్ణిస్తూ పరస్పర విరోధం కల్గిన ఉపమానాలతో ఆమె అవయవాలను వర్ణించడం, కొస మెరుపుగా ఆమె నడుమును వర్ణించడం బాగుందని ఆరుద్ర తెల్పారు. ఆ పద్యం;

కరతరంబుల యొప్పు సరసిజంబులబోల నెరచందురుని బోలె నెమ్ముగంబు ....అంటూ సాగిన పద్యం తమాషాగానే ఉందనవచ్చు.

అన్నయ తండ్రి శివభక్తుడు. అన్నయ కూడా శివభక్తుడే అనవచ్చు. అందుకే తుఫాను మేఘాన్ని నటరాజుతో పోల్చాడు అన్నారు ఆరుద్ర.

‘వితత వర్ణ వితీర్ణ విద్రుమ వల్లులు పరగెడు ఘన జటాపంక్తి దొరయ....’ అనే ఈ పద్యం శ్రీనాథుని తలపిస్తున్నది. అలాగే మరో పద్యంలో ‘పూర్వగిరి పానవట్టమై పొలుపు మిగుల..’ అంటూ ఉదయచంద్రుణ్ణి శివలింగంతో పోల్చాడు. శ్రీనాథుడు బాల భానుని వర్ణిస్తూ పానవట్టం అనే మాట వాడాడు.

శివ కవులలో ప్రసిద్ధులైన పండితారాధ్యుని ప్రయోగాలను కూడా అన్నయ చేశాడని చెప్తూ ఆరుద్ర, పండితయ్య ‘కొందరు’ అనే దానిలో తుది ఉకార లోపం చేస్తాడని (కొందరు – కొందర్) అలాగే అన్నయ కూడా చేశాడని ఒక ఉదాహరణ చూపించారు ఆరుద్ర.

“....బగగొని ఖడ్గ హతి కోర్చి పైబడి కొందర్....” అన్నది ఆ ప్రయోగం.

శ్రీనాథుని హంసలాగా అన్నయ కావ్యంలో ఒక చిలుక చోటు చేసుకొంది. తెలుగు కావ్యాలలో అడుగుపెట్టిన రెండవ విహంగ పాత్ర ఈ చిలుక. ఈ శుకం కవితలు చెబుతుంది. అవధానాలు చేస్తుంది. అన్నయ కూడా అవధాని కావచ్చు అన్నాడు ఆరుద్ర. ఈ గ్రంథం పూర్తిగా దొరకలేదు.

అన్నయ కవితలో చూపిన కొన్ని మెరుపులు ‘చిలుకకు దాదియైన...” అనే పద్యంలో ఆడపిల్లల బాహుమూల దీప్తులు తర్వాత మను చరిత్రలో (2-68) వరూధునీ బాహుమూల దీప్తులుగా వర్థిల్లాయని, అంతేగాక ఇంకా మెరుపులున్నాయని ఆన్నారు ఆరుద్ర.

**** సశేషం ****

Posted in October 2024, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!