Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర
తొలి రాయల యుగం

కాకతీయ సామ్రాజ్య పతనం తరువాత తెలుగు దేశంలో మూడు రాజ్యాలు వెలిసాయి.

1. తెలంగాణలో పద్మనాయకులు, 2. తీరాంధ్రలో రెడ్డి రాజులు, 3. రాయలసీమలో విజయనగర రాజ్యం. వీరంతా గొప్ప వెలుగు వెలిగారు.

ప్రస్తుతం మనకు కావలసిన విషయం చెప్పడం ముఖ్యం. కాకతీయ సామ్రాజ్యంలో ప్రతాపరుద్రుని వద్ద హరిహరరాయలు, బుక్కరాయలు అనే సోదరులు దండనాధులుగా ఉండేవారు. కాకతీయ పతనానంతరం ఆ అన్నదమ్ములు ఆనగొందిని పాలించే కంపిలి రాజుల వద్ద చేరారు. క్రీ.శ. 1327-28 లో ఢిల్లీ సుల్తాను మహమ్మద్ తుగ్లక్ ఆనెగొంది రాజును వధించి హరిహర బుక్క రాయలను పట్టుకొని ఢిల్లీకి తీసుకొని పోయి వారిచేత ఇస్లాం మతాన్ని స్వీకరింపజేసి వారిద్దరినీ తన ప్రతినిధులుగా కంపిలి రాజ్యంలో ఉంచాడు. కానీ హరిహర బుక్కరాయలిద్దరూ మాతృదేశానికి రాగానే ముస్లిం మతాన్ని వదిలేసారు. మాధవాచార్యుడు అనే మహనీయుని బోధతో తిగిరి వైదిక మతాన్ని స్వీకరించి ఆనెగొందిని పాలించసాగారు. ఈ మాధవాచార్యులే సన్యసించి విద్యారణ్యస్వామి గా పేరుగాంచారు.

హరిహర బుక్కరాయలిద్దరూ తమ గురువు ఆదేశానుసారం విద్యానగరం అనే రాజధానిని నిర్మించారు. అదే ఉత్తరోత్తరా 14 మైళ్ళ పొడవు, పది మైళ్ళ వెడల్పు గల మహానగరంగా విరాజిల్లింది. ఏడు ప్రాకారాలు గలిగి శత్రు దుర్భేధ్యమై ఉన్న ఆ నగరం నిజంగా విద్యానగరమే అయింది అని అన్నారు ఆరుద్ర.

విద్యారణ్యుల వారికి సాయణాచార్యులు, భోగనాధుడు అనే సోదరులున్నారు. సాయణాచార్యుల వారిచేత నాలుగు వేదాలకు భాష్యం వ్రాయించడం జరిగింది. వేద భాష్యానికి సాయణ భాష్యం అనే పేరు రూఢమయింది.

విద్యారణ్యుల వారు సంయసించడానికి ముందు కొన్ని గ్రంథాలు వ్రాశారు. పరాశర స్మృతికి ‘పరాశర మాధవీయం’ అన్న పేరుతో వ్రాశారు. ‘కాల మాధవీయం’ అనే ధర్మ శాస్త్రం రచించారు. సన్యసించిన తరువాత శృంగేరి పీఠానికి ఆధిపత్యం వహించి ౧. పంచదశి ౨. జీవన్ముక్తి వేవేకం, ౩. అనుభూతి ప్రకాశం,౪. వివరణప్రమేయ సంగ్రహం, ౫. అపరోక్షానుభూతి – టీక, ౬. బృహదారణ్యక వార్తికసారం వంటి ఎన్నో వేదాంత గ్రంథాలు వ్రాశారు. (స.ఆం.సా. పేజీ 822).

తొలి రాయల యుగం లోని కొన్ని విషయాలను శ్రీనాథుని గూర్చి చెబుతూ చెప్పడం జరిగిందని ఆరుద్ర వాటిని క్లుప్తీకరించి చెప్పడం జరిగింది.

కృష్ణదేవరాయల కాలానికి ముందు ఒకటిన్నర శతాబ్దాలకు పైగా సంగమ, సాళువ వంశాల వారు ఈ రాజ్యాన్ని పరిపాలించారు అని ఆరుద్ర తెలిపారు.

విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన మొత్తం రాజవంశాలు నాలుగు. అవి

  1. సంగమ వంశం, సాళువ వంశం, 3. తుళువ వంశం మరియు 4. అరవీటి వంశం
  2. సంగమ వంశం : ఆరుద్ర వేసిన సంగమ వంశ పటాన్ని అనుసరించి మొదటి హరిహరరాయలు (క్రీ.శ 1335-1506) మొదలు ఇమ్మడి దేవరాయల వరకు పదిమంది రాజులు రాజ్యమేలినట్లు తెలుస్తున్నది. పట్టికలో 13వ నెంబరు వరకు ఉన్నప్పటికీ వారి పేర్లు మాత్రం లేవు. (స.ఆం.సా. పేజీ 813).
  3. సాళువ వంశం: సాళువ వారిని గూర్చి చెప్తూ ఆరుద్ర “ఈ పట్టిక చూస్తే సాళువ గుండరాజు రెండవ హరిహరరాయల కొలువులో కనిపిస్తున్నాడు. ఈ తిమ్మరాజు కుమారుడే నరసింహరాజు. ఇతడే సంగమ వంశంలోని కడపటి రాజుల వద్ద దండనాయకుడిగా ఉంది రాయ గద్దెను చేతబట్టాడు” అని చెప్పి దానికి కారణాలు కూడా ఆరుద్ర వివరించాడు. (స.ఆం.సా. పేజీ 813).

మొత్తం మీద పరుల దండయాత్రల నుండి కాపాడడానికి సంగమ వంశ పాలనలో ఉన్న రాయ రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని, సాళువ నరసింహ రాయలు పట్టాభిషేకం చేసుకొన్నాడు. ఇతని మూర్దాభిషేకాన్ని పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు జైమిని భారతంలో వర్ణించిన ఒక పద్యాన్ని ఆరుద్ర తెల్పారు. జైమిని భారతాన్ని పిన వీరభద్రుడు సాళువ నరసింహ రాయలుకు అంకితమిచ్చాడు. ఈ ప్రభువు తెలుగును పోషించాడు. అన్నమయ్యకు బాల్యసఖుడు.

సాళువ నరసింహ రాయలు కేవలం అయిదు సంవత్సరాలు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించాడు. అటు తర్వాత తుళువ వంశపు దండనాయకులు గద్దెనెక్కారు. అయితే తుళువ నరసనాయకుడు ప్రతక్షంగా సింహాసనం ఎక్కకుండా సాళువ ప్రభువులను కీలుబొమ్మలను చేసి తానూ పాలన చేసాడని ఆరుద్ర తెలిపారు.

క్రీ.శ. 1506 లో తుళువ నరసింహ రాయలు మరణించాడు. ఇతని కుమారుడు తుళువ వీర నరసింహ రాయలు గద్దెనెక్కాడు. దీనితో రాయరాజ్యంలో ఒక కొత్త యుగం ప్రారంభమైందని ఆరుద్ర తెల్పారు.

ఈ తొలి రాయల యుగంలోని కవితా విశేషాలు, కవిత్వంలో మార్పులను గూర్చి ఆరుద్ర చర్చించారు.

నన్నెచోడుడి కాలంలో ఆయన ప్రారంభించిన అష్టాదశ వర్ణనలు, ముద్రాలంకారాలు, చిత్రబంధ కవిత్వాలు ఈ యుగంలో పూర్తిగా వికసించాయి. అష్ట ఘంటావధానులు, ఇతర చిత్ర కవితా ప్రక్రియలు కోకొల్లలుగా ఈ యుగంలో తలలెత్తాయి.

తిక్కన పెట్టిన పరవళ్ళు మానేసి ఈ యుగంలో జాత్యముగాని సంస్కృత పదాలు చొప్పించడం ప్రారంభించారు. ఒక వంక పండితులకు కూడా అర్థం కాని పద్యాలు, మరో వంక యక్షగానాలు, కీర్తనలు మొదలైన వాటికి శ్రీకారం చుట్టబడింది.

తొలి రాయల యుగంలో మహా కవుల రచనలలో కూడా విరుద్ధమైన ప్రయోగాలు కనిపిస్తాయని ఆరుద్ర తెల్పారు. కవిత్వం మారుతూ ఉండడం మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాము కదా!

**** సశేషం ****

Posted in July 2024, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!