Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర
గజపతుల పాలన – దేవాలయ నిర్మాణ రీతులు

క్రీ.శ 1420-25 మధ్య గజపతుల సంపర్కం తెలుగు దేశానికి కలిగింది. ఆ తర్వాతే శ్రీనాథుని భీమఖండ రచన జరిగింది అని తెల్పిన ఆరుద్ర, “రాధా-మాధవుల శృంగారం మనకు గజపతులు ఇచ్చిన వారసత్వమే. భారతీయ శిల్ప రీతులలో కళింగ రీతి అనేది విలక్షణమైనది.” అని అన్నారు. (స.ఆం.సా పేజీ 804).

గజపతులు తాము జయించిన ప్రదేశాలలో దేవాలయ నిర్మాణం చేశారు. ఉత్తరాన మిధుర పురం మొదలు  దక్షిణాన నెల్లూరు దాకా వీరు కట్టించిన దేవాలయాలు ఉన్నాయి. పూరీ జగన్నాథుడు తెలుగు వారికి ముఖ్య దైవమై, ఆ ఆలయం వీరి వల్లనే పేరు గాంచింది. కాటమరాజు కథలో కూడా జగన్నాథునికి ఆవులు, ఆంబోతులు కానుకగా పంపినట్లు చెప్పబడింది.

గజపతులు చేసిన గొప్ప పని- తెలుగు వారి వంశ పారంపర హక్కులకు సముచిత స్థానం ఇవ్వడమే కాకుండా వాటిని శాసన బద్ధం చేయడం. ఈ విషయం ఒకచోట స్పష్టంగా తెలుస్తున్నది.

అది ఏదనగా జయదేవుని గీతగోవిందం. ఇది శృంగార గేయ ప్రబంధం. దీనిని ఇప్పటికీ పూరీ జగన్నాథుని సన్నిధిలో అభినయిస్తారు. ఈ విధంగా దానిని ఏర్పరిచి ఆ హక్కును ప్రసాదించింది గజపతులే.

పూరీ ఆలయంలో పాడి, అభినయించే హక్కు తెలంగాణా నుండి వచ్చి పూరీలో స్థిరపడ్డ నట్టువ మేళం వారికే ఉండగా దానిని మరింత సుస్థిరం చేస్తూ ప్రతాపరుద్ర గజపతి వారికే అది పాడే హక్కు శాశ్వతంగా ఉండేటట్లు ఒరియా భాషా లిపిలో ఒక శాసనం చేయించాడు. ఈ శాసనం క్రీ.శ. 1498 లో చేయబడింది.

గజపతులు హృదయం లేని రాజులని సురవరం ప్రతాపరెడ్డి గారు చెప్పారని, గజపతుల రాజ్యపాలన తెలుగు దేశంలో ఎలా జరిగిందో సురవరం ప్రతాపరెడ్డి గారు వివరించిన దాన్ని ఆరుద్ర తెల్పారు. అది క్లుప్తంగా

రెడ్డి రాజుల తర్వాత క్రీ.శ. 1434 ప్రాంతంలో బాగా యత్నించి ఓడ్ర (ఒడ్డె) రాజులు తూర్పు తీరంలో గుంటూరు ను స్వాధీనం చేసుకొని పాలించారు. ఓడ్ర (ఒడ్డె) రాజులు తెలుగు దేశంలో అడుగుపెట్టారు కానీ వీరికి తెలుగు ప్రజలపై ప్రేమ లేదు. దేశాన్ని దోచుకొన్నారు. కవులకు కళాపోషణకు తావేలేదు. అందుకే శ్రీనాథుడంతటి మహాకవిని వారం రోజులు చిత్రహింసలు పెట్టి వృద్ధుడైన ఆ మహాకవి అంత్యదశ అత్యంత హృదయ విదారకం కావడానికి గజపతులు కారణమైనారు.

వీరి కాలంలో రైతుల బాధలు వర్ణనాతీతం. శిస్తు కట్టలేకపోయినపుడు వారు విధించే శిక్షలు కడు క్రూరంగా ఉండేవి. రైతులను ఎండలో నిలబెట్టి బండలు వీపు మీద పెట్టడం, ఇనుపగుండును భుజాన పెట్టడం వంటి క్రూర శిక్షలు విధించేవారు.

కానీ, ఇవి ఒడ్డె రాజుల కాలంలోనే గాక, వేరే చోట్ల కూడా ఉన్నాయనడానికి సాక్ష్యంగా మాచెన తన కీయూరబాహు చరిత్రలో, అనంతామాత్యుని భోజరాజీయంలో, కాకతీయ యుగపు గ్రంథం విజ్ఞానేశ్వరంలో తదితర గ్రంథాలలో ఈ శిక్షల గురించిన ప్రస్తావన ఉంది. అందుకే పోతన ‘రాజుల్, మత్తుల్...అంటూ నిరసించాడు.

శ్రీనాథుడు వీరి కాలంలోనే అన్నానికి జరగక కృష్ణా నది ఒడ్డున సేద్యం చేసి నువ్వులు, పెసలు పండించబోగా కృష్ణ వరదల్లో అవి కొట్టుకుపోయాయి. శిస్తు కట్టలేదని గజపతులు శ్రీనాథునికి కూడా మెడ మీద ఇనుపగుండు పెట్టి కాళ్ళకు సంకెళ్ళు తగిలించి మెడలో ముళ్ళదండ వేసి ఎర్రని ఎండలో నడిపించి ఆ వృద్ధ మహాకవి ఉసురు తీశారని సురవరం ప్రతాపరెడ్డి గారు చెప్పినట్లుగా ఆరుద్ర తన రచనలో వివరించారు.

అయితే వీరు చెరువులు త్రవ్వించడంలో గొప్ప శ్రద్ధ చూపారు. వీరి రాజ్యపాలన రెడ్డి రాజుల చివరలో, మలిరాయల యుగంతో పెనవేసుకుని ఉన్నది. అని ఆరుద్ర తెల్పారు.

**** సశేషం ****

Posted in June 2024, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!