కాకతీయ యుగం
అన్నమయ్య తన రచనను ‘సర్వేశ్వర శతకం’ అని, మరోసారి ‘సర్వేశ్వర స్త్రోత్రం’ అని మరోచోట ‘సర్వేశ్వర ప్రాకామ్యస్తవం’ అని పేర్కొన్నాడు. అన్నమయ్య ఒక గొప్ప పని చేశాడు. తాను తన గ్రంథం ఎప్పుడు రచించింది చక్కగా గ్రంథస్తం చేశాడు.
యధావాక్కుల అన్నమయ్య రచించిన సర్వేశ్వర ప్రాకామ్యస్తవం (సర్వేశ్వర శతకం) శాలివాహన శకం 1164 – అనగా క్రీ.శ.1242 లో రచించినట్లు చెప్పాడు. ఇతని గురువు పాల్కురికి సోమనాథుడని నిడదవోలు వెంకట్రావు గారి మాట. దీనిని వేదం వెంకట క్రిష్ణయ్య గారు ఖండించారు. ఆరుద్ర కూడా వేదం వారి మాటే సబబు అన్నారు.
ఒక చిన్న కథ – అన్నమయ్య తన మెడకు ఒక గండ కత్తెర తగిలించుకొని సర్వేశ్వర శతకంలోని ఒక్కొక్క పద్యాన్ని ఒక్కొక్క తాళపత్రం మీద వ్రాసి కృష్ణా నదిలో వదిలేవాడట. ఆ పద్యం తిరిగి తన వద్దకు వస్తే సరి. లేకపోతే తన మెడకు తగిలించుకొన్న గండ కత్తెరతో తన తలను కత్తిరించుకొంటానని ప్రతిజ్ఞ చేశాడట. అప్పుడు ఒక పద్యం తిరిగి రాలేదు. వెంటనే అన్నమయ్య తల కత్తిరించుకోబోగా ఒక పశువుల కాపరి ‘ఇదిగో నీ పద్యం’ అని ఇవ్వగా, అన్నమయ్య ఆ పద్యాన్ని చూచాడు. కాని అది తను వ్రాసిన పద్యం కాదు. అప్పుడు భగవంతుడే అలా వచ్చాడని అన్నమయ్య సంతోషించి తన ప్రయత్నం మానుకొన్నాడట. “అయితే అన్నమయ్య రచనకు ఈ కథకు పొత్తు కుదరదు” అన్నారు ఆరుద్ర.
అన్నమయ్య అటు వీర శైవ భక్తిని, ఇటు అద్వైతాన్ని రెంటిని ఖండిస్తూ “చావంబుట్టుచు బుట్ట చచ్చుచు...” అనే నేపధ్యంలో ఈ అభిప్రాయాన్ని అన్నమయ్య వెలిబుచ్చాడు. (స.ఆం.సా పేజి – 282).
అన్నమయ్య వాడిన కార్ముకం, శూకలాశ్వం మొ|| పదాల వల్ల యితడు దండనాథుడుగా ఉండవచ్చు. ఇతను తత్సమాలు ఎక్కువగా వాడాడు. కొంగ జపం అనే దానికి బక వేషార్చన – ఇలా వాడాడు. జయంతి రామయ్య గారు ఈ శతకాన్ని గూర్చి “శైలి హృద్యము. ధార అనర్గళము....పద్యరచనా శిల్పమునకిది ముఖ్య లక్షణము” అన్నారు.
క్షేమేంద్రుడు :
సంస్కృతంలో ఒక క్షేమేంద్రుడు ఉన్నాడు. తెలుగులో లక్కా భట్టు అనే కవి, సంస్కృత క్షేమేంద్రుని రచనలలో ఏదో ఒకటి అనువదించి క్షేమేంద్రుడు అనే బిరుదుని పొందివుంటాడు అని ఆరుద్ర అభిప్రాయం. మానవల్లి రామకృష్ణ కవి గూడా ఇలానే అభిప్రాయ పడ్డారు.
ఈ తెలుగు క్షేమేంద్రుడు క్రీ.శ.1080 తర్వాతివాడు. అందుకే యితడు కాకతీయ యుగం తొలిదినాలలో ఉన్నట్లు పండితుల అభిప్రాయం. తెలుగు క్షేమేంద్రుడు (లక్కా భట్టు) రచించింది ముద్రామాత్యం అని అనుకోవాలి. ఇతని పద్యాలను మడిక సింగన సకలనీతి సమ్మతంలో ఉదహరించాడు.
లక్కా భట్టు రచించినట్లు చెప్పబడుతున్న “శతపక్షి సంవాదం” లోని ఒక పద్యంలోని రెండు పాదాలు తిక్కన రచించినట్లు చెప్పబడుతున్న ‘కవి వాగ్భంధం’ అనే లక్షణ గ్రంథంలో ఉన్నాయి. (స.ఆం.సా పేజి – 288).
ముద్రామాత్యం నీతి గ్రంథమే గాక “ఒక రాజుకు ప్రాభవమును సంపాదించు మంత్రి శిఖామణి నీతి ధౌరందర్యమును వర్ణించు కావ్యమేమో యను సందియము కలుగుచున్నది” అని రామకృష్ణ కవిగారి మాట.
ముద్రామాత్యం లోని పద్యాలలోని నీతులు వక్రమార్గాన్ని గూడా సమర్ధిస్తున్నాయి. చాటున దాగి యుద్ధం చెయ్యవచ్చు. అపకారికి ఉపకారం చెయ్యకూడదు. రాజ్యం కోసం ఏమైనా చేయవచ్చు. – ఇలాంటివి ఇందులో ఉన్నాయి. ఆరుద్ర ఈ సందర్భంగా విక్రమాదిత్యుని గూర్చి ఆసక్తికరంగా తెల్పాడు. విక్రమాదిత్యుడు మిధ్యా పురుషుడని భ్రమ ఉండేది. కాని ఆటను చారిత్రక పురుషుడని తెలిసింది. విక్రమాదిత్యుడు ఎవరో కాదు. సంస్కృతంలో మృచ్ఛకటికం అనే నాటకాన్ని రచించిన శూద్రుకుడే. అని ఆరుద్ర తెల్పారు.
స్కాంధ పురాణంలో క్రీ.శ. 586 ప్రాంతంలోని ‘సుమతీ తంత్రం’ లో శూద్రక యుగం ప్రస్తావింపబడిందని కే.పి. జయస్వాల్ గారు తెలిపారు. (స.ఆం.సా పేజి – 292).
ఈ కవి క్రీ.శ.1600 పూర్వం వాడు. ఇతడు సంస్కృతంలో ‘గణమంజరి’ ‘పదమంజరి’ అనే గ్రంథాలు వ్రాశాడు. అలాగే ‘విక్రమార్క చరిత్ర’ అనే గ్రంథం వ్రాశాడు. దీనికి ‘భేతాళ వంశవింశతి’, ‘శూద్రక రాజ చరిత్రము’ అని కూడా పేర్లు ఉన్నట్లు ఆరుద్ర మాట. ఈ ‘భేతాళ వంశవింశతి’. షోడశ కుమార చరిత్రగా 14 వ శతాబ్దంలో వెలిసిందని నిడదవోలు వెంకట్రావు గారి అభిప్రాయం. వేటూరి ప్రభాకర శాస్త్రి పంచ వింశతిని అచ్చుకు సిద్ధం చేశారు. అది వెలుగు చూడడం అవసరం అని ఆరుద్ర అభిప్రాయం.
తిక్కన సోమయాజి:
‘నా దేశం ఆనందించడానికి నేను ఈ కావ్యం చెప్తున్నాను’ అని చెప్పిన మొదటి కవి తిక్కన గారు – ఆరుద్ర.
ఒక్క చేతి మీదుగా భారతంలో 15 పర్వాలను రమారమి 16,437 గద్య, పద్యాలతో తిక్కన రచించారు. నిర్వచనోత్తర రామాయణం వ్రాశాడు. కృతులు పుచ్చుకొన్నాడు.
మూలఘటిక కేతన తానూ వ్రాసిన ‘దశకుమార చరిత్ర’ ను తిక్కనకు అంకితమిచ్చాడు. అందులో తిక్కన యొక్క సర్వతోముఖ ప్రతిభను వేనోళ్ళ కొనియాడాడు. అందులో కొన్ని –
- వేదాది సమస్త విధ్యాభ్యాస విభాని (1-87)
- విద్యా విశారద్వసమద్యోతితమతి (1-96)
- అనితర గమ్య వాఙ్మయ మహార్ణవవర్తన కర్ణ ధారుడు (8-94)
- మయూర సన్నిభ మహాకవితా భారవితుల్యుడు. పోషిత సత్కవీంద్రుడు (4-128), మొదలైనవి.
తిక్కన రచనలు:
నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర మహాభారతము రెండు మాత్రమే మనకు లభించాయి. ఇవిగాక విజయసేన, కవి వాగ్భంధనము, కృష్ణ శతకము రచించినట్లు కొన్ని పద్యాల వల్ల తెలుస్తున్నది.
విజయసేన ప్రబంధమని కాకుమారి అప్పకవి మాట. దొరికిన రెండు పద్యాలలో వినాయక ప్రార్థన ఉంది. అయితే తిక్కన భారతంలో గాని, నిర్వచనోత్తర రామాయణం లో గాని వినాయక ప్రార్థన చేయలేదు. అందువల్ల తిక్కన గారి తొలి రచనలలోవి కాబోలు ఆ పద్యాలు అని ఆరుద్ర అభిప్రాయం. దీనిని గూర్చి ఆరుద్ర మరికొంత చర్చించారు.
‘కవి వాగ్బంధనము’ ఇది తాళపత్ర గ్రంథ రూపంలోనే తంజావూరు సరస్వతీ మహలులో (దాని సంఖ్య 703) ఉంది. అందులో ఉన్న ఒక్క పద్యమే తిక్కన దీనిని వ్రాశాడనడానికి ఆధారం.
‘కృష్ణ శతకము’ తిక్కన వ్రాశాడనడానికి కూడా ఒక్క పద్యమే ఆధారం. అయితే దీనిని గూర్చి కూడా తిక్కన గ్రంథం కాదన్న వాదన ఉంది.