Menu Close
Page Title
చాళుక్య యుగం

4. నన్నయ ఊరు పేరు – నన్నయ రచనలో కావ్యగుణాలు:

నన్నయ ఊరు పేరు అనాంధ్రమే అనే వాదాన్ని 1938 లో, శ్రీ అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు లేవదీశారు. ఈయన శ్రీనాథుని కూడా కర్ణాటకుడని నిర్ధారించారు (స.ఆం.సా పేజి 153).

నన్నయ పాత మైసూర్ ప్రాంతం నుండి వచ్చి వేంగీ లో స్థిరపడ్డారు అని హోసూరు కె.ఎస్.కోదండరామయ్య గారి మాట (స.ఆం.సా పేజి 152).

నన్నయ పద్యాన్ని బట్టి ఆరుద్ర గారి అభిప్రాయంలో నన్నయ స్వచ్ఛమైన ఆంధ్రుడు. ఆ పద్యం;

అనఘుల శాస్త్ర విధిజ్ఞుల
ననురక్తుల పితృ పితా మహాక్రమమున, వ
చ్చిన విప్రుల, మంత్రుల
నొనరించితి కార్య సంప్రయోగము పొంటెన్.
(స.ఆం.సా పేజి 156) (ఆం.భా.సభా.1-27)

ఇందులో “పితృ పితా మహాక్రమమున..” అనేది మూలంలో లేదు. తనను గూర్చి చెప్పుకోవడానికే ఇది చేర్చాడని, నన్నయ కుటుంబీకులు చాళుక్య రాజుల వద్ద ఎప్పటి నుంచో మంత్రులుగా ఉన్నారని తెల్పుతున్నది ఈ పద్యమని ఆరుద్ర అభిప్రాయపడ్డారు. అందువల్ల నన్నయ స్వచ్ఛమైన తెలుగువాడు అని ఆరుద్ర విశ్వసించారు.

పేరు: తమిళ, కన్నడ, తెలుగు భాషలలోనేగాక తెలుగు దేశంలో కూడా నన్నయ, నన్న, నన్ని అనేవి దక్షిణ భారత దేశంలో ఉన్నాయని చెప్పి ఆరుద్ర వాటిని గూర్చి చాలానే చర్చించారు. దాని సారాంశం;

  1. ‘నన్నయ రాయర్’ అనేది వైదంబు రాజులలో ఒకని పేరు.
  2. నంజనగుడి అనే ఊరిలో ‘నంజుడేశ్వరుడు’ అనే దేవుడున్నారు. అతనికి నన్నయ అనే మరో పేరున్నట్లు నగర్ల గ్రామా శాసనంలో ఉన్నది. ఈ సంగతి తెల్సినవారు హోసూరు కె.ఎస్.కోదండరామయ్య గారు.

నన్నయ పేరు తెలుగుదేశంలో గూడా ఉంది. అలాగే నన్నయ తెలుగువాడు అనే సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నన్నయ నూటికి నూరుపాళ్ళు తెలుగువాడు అని ఆరుద్ర అభిప్రాయపడ్డారు.

నన్నయ రచనలలోని కావ్యగుణాలు :

మహాకావ్యం

నన్నయ వ్రాయబోతున్నది సామాన్య కావ్యం కాదు. అందుకే, శౌనకాది మహామునులను సూతుడు “మీకు ఎలాంటి కథ కావాలి? అని అడిగినప్పుడు వారు –

వ్రాయది హృద్యమపూర్వం
బేయది, ఎద్దాని వినిన యెఱుక సమగ్రం
బైయుండు, నఘ బిబర్హణ
మేయది, యక్కథయ వినంగ నిష్టము మాకున్
(స.ఆం.సా పేజి 146) (ఆం.భా.1-1-30)

ఇది చక్కని నిర్వచనం అన్నారు ఆరుద్ర.

నన్నయ తనకు తానుగానే తన కావ్య గుణాలను చెప్పుకొన్నాడు. అవి (1) అక్షర రమ్యత, (2) ప్రసన్న కథా కలితార్థ యుక్తి, (3) నానా రుచిరార్థ సూక్తులు. ఇవి కాక నన్నయ – ఔచిత్యపోషణ, పాత్ర చిత్రణ, అనువాద విధానం మొదలైన వాటిలో సిద్ధహస్తుడు, మార్గదర్శకుడు.

1) అక్షర రమ్యత (స.ఆం.సా పేజి 141)

“ధార ఏ అడ్డంకులు లేకుండా ప్రయోగించుకొంటూ పోవడానికి, శబ్దాలంకారాలకు నన్నయ గారు ‘అక్షర రమ్యత’ అని పేరు పెట్టినట్లున్నది. పోతన గారిలో ఈ అక్షర రమ్యత పూర్తిగా ఉంది. నన్నయలో లోపించిందేమో అని మొదట మనకు తోస్తుంది. తరచి చూస్తే పోతరాజు గారికి ఒరవడి పెట్టింది నన్నయ గారే” అని అన్నారు ఆరుద్ర. నన్నయ పద్యం అక్షర రమ్యత –

‘మద మాతంగ కురంగ కాంచన లసన్మాణిక్య గాణిక్య సంపద లోలిం గొని వచ్చి.... ‘(ఆం.భా.2-1-19)

నన్నయ పద్యాలే తర్వాతి కవులకు ఒజ్జ బంతులైనాయి అన్నారు ఆరుద్ర. ప్రసన్నతను కోరి నన్నయ గారడీ రచనలు చేయలేదు. కాని అరణ్య పర్వంలో ‘నల చరిత్ర’ ఘట్టంలో ఉన్న ‘సహకార మత్ప్రియ సహకార పున్నాగ’ అనే పద్యం నన్నయది కాదు. ఎవరో వ్రాసి దూర్చారు. ఇలాంటి రచనలు తర్వాత కవులలో ఎక్కువై మొహమొత్తేటట్లు చేశాయన్నారు ఆరుద్ర. (స.ఆం.సా పేజి 144).

2) ప్రసన్న కథా కలితార్థ యుక్తి

నన్నయ రచనలో వ్యాఖ్యానిస్తే గాని తెలియని కొన్ని సొగసులను ‘లోనారసి’ చూడమన్న నన్నయ మాటలను జ్ఞప్తి చేస్తూ విశ్వనాథ వారు “నన్నయ కథా కవితార్థ యుక్తి” **** అనే పేరున ఒక గ్రంథం వ్రాశారు.

“కవితార్థ యుక్తి అంటే కథతో కూడికొని యొక మహార్థము ప్రవేశించుట. ఇది ఒక మహా శిల్పము. అది నన్నయ గారి యుపబిక్ష” అని విశ్వనాథ వారు తెల్పారు. అంతేగాక కవి విశ్వనాథ వారు ఇంకా ఇలా అన్నారు –

“ఆంధ్రభాషకు నన్నయ గారు పెట్టినది భిక్ష. తక్కిన కవులందరూ నన్నయ గారి నుండి భాషా శబ్దములు, పద్యరచనా మెరుపులు గ్రహించిన వారే గాని యొక్కరికిని నన్నయ గారి ‘ప్రసన్న కథా కలితార్థ యుక్తి’ తెలియదు”

కట్టమంచి రామలింగారెడ్డి గారు “నన్నయ గాని ప్రసన్నమైన రచనకు మూలకారణం – నన్నయ మితభాషి. గాంభీర్యం అనేది నన్నయ గారి శైలికి ప్రాణం” అని గుర్తు చేశారు.

నానారుచిరార్థ సూక్తులతో గంభీరమైన శైలితో తొలి తెలుగు కావ్యం ఆవిర్భవించిన రోజు ఏదో గాని అది ఏటేటా పండుగ జరుపుకోవాల్సిన రోజే గదా” అన్నారు ఆరుద్ర. (స.ఆం.సా. పేజీ – 160).

[**** ‘ప్రసన్న కథా కలితార్థ యుక్తి’ అను దానికి సూక్ష్మ వివరణ –

దీనిని గూర్చి చర్చించిన వారిలో ముఖ్యులు విశ్వనాథ సత్యనారాయణ గారు. వారి అభిప్రాయం లో “...ప్రసన్న కథా కలితార్థ యుక్తి కి ప్రసన్నమైన కథతో కూడుకొని యున్న అర్థముల సంయోజనం.” అని, మరియు “ప్రసన్న కవితార్థ యుక్తి అనే సమాసానికి ప్రసన్న కథ యొక్కయు, కవితార్థము యొక్కయు, యుక్తి అనగా కవితార్థము తో ప్రసన్నమైన కథ యుండుట ప్రసన్నమగుట”. విశ్వనాథ సత్యనారాయణ గారు ఇచ్చిన పై రెండు వివరణలు బహుళ ప్రచారంలో ఉన్నవి.

(శ్రీమదాంధ్రమహాభారతము, ఆది, ప్రథమ, పేజీలు 19-20, TTD ప్రచురితము, ప్రథమ ముద్రణ -2000)

దీనిని బట్టి విశ్వనాథ వారు మూల పాదంలోని కలిత అనే పదాన్ని కవిత అని సవరించారని తెలుస్తున్నది. అయితే శబ్దార్థ నిఘంటువు, కలితము అనే పదానికి, మరికొన్ని అర్థాలతో పాటు ‘మనోహరము’ అనే అర్థం కూడా ఇచ్చింది. ప్రసన్న+కథా+కలిత+అర్థ+యుక్తి అన్నప్పుడు ప్రసన్నమైన కథ(ల)తో, మహోహరమైన అర్థములతో కూడిన.. అని (భారత కథలలో, పదాలలో, వాక్యాలలో గల అర్థం మనోహరంగా ఉన్నదని) నన్నయ దానిని ఉపయోగించాడేమో! అని ఒక భావన. ఇలా చెప్పడంలో శాస్త్రరీత్యా పొరపాటు ఉన్నదా? అలా కాకపోతే విశ్వనాథ వారు ఎందుకు సవరిస్తారు? అన్న శంక మనసును పీడిస్తున్నప్పటికీ నాకు తోచిన వివరణ ఇవ్వడం మంచిదని తెలియపరుస్తున్నాను. విజ్ఞులు మన్నించి మీ అభిప్రాయం మాతో పంచుకోగలరు.- సి.వసుంధర]

3) నానా రుచిరార్థ సూక్తులు

“నానా రుచిరార్థ సూక్తి నిధి నన్నయ. నన్నయ చెప్పిన సూక్తులు మూలంలో లేవు. కేవలం ప్రజల క్షేమం కోరి నన్నయ సొంతంగా చెప్పిన సూక్తులు, ఈనాడు కూడా ప్రజల వాడుకలో ఉన్నాయి.” అన్నారు ఆరుద్ర.

“క్షమలేని తపసివనమును” అనే నన్నయ పద్యం, సుమతి శతకారుడు వ్రాసిన ‘తన కోపమె తన శత్రువు’ అనే పద్యానికి మూలమయి ఉంటుందని ఆరుద్ర అభిప్రాయ పడ్డారు.

గత కాలము మేలు వచ్చు కాలము....(ఆం.భా. 1-5 -159)
వృద్ధుల బుద్దులు చంచలింపనే....(ఆం.భా. 2-2-9)

“నారిజాక్షులందు వైవాహికములందు” అనే నన్నయ పద్యం మాదిరే పోతన కూడా వ్రాసాడని చెప్పి ‘చను బొంకగ, బ్రాణాత్యాయమున....” అనే పోతన పద్యాన్ని ఆరుద్ర నన్నయ పద్యంతో పోల్చి, నన్నయ పద్యం కొంచెం కుంటినట్లుగా ఉంటుంది. పోతన పద్యం చదువుకోవడానికి హాయిగా ఉంటుంది అని వివరించారు.

4) ఔచిత్యం

ఉచిత, అనుచితములకు భేదం తెలిసికొని వ్రాయడం, మాట్లాడటం, ప్రవర్తించడం, ఒక నిర్ణయం తీసుకోవడం ఔచిత్యమవుతుంది. నన్నయ ఇందులో సిద్ధహస్తుడు.

మహాభారతంలో భీముడు ఒక చోట మాట్లాడిన దానిని ఒక పద్య రూపంలో నన్నయ తెల్పిన, దానిని ఆరుద్ర ఇక్కడ ఉదహరించాడు.

కడుపునిండ గుడువ గానమి, రేయెల్ల
గన్ను నొందకున్న, గరము డస్సి
యున్నవాడ నాకు నోపుదురేని యా
హార తృప్తి సేయుడట్టులయిన (స.ఆం.సా. పేజీ – 137)

బకాసురుని చంపబోయే భీముడు తామున్న ఇల్లుగల వారితో అన్న మాటలు ఇవి. “మీ పిల్లవాణ్ణి బకాసురుని నుండి కాపాడుతాను. మీకు స్తోమత, ఓపిక ఉండి (ఓపుదురేని) నాకు కావాల్సిన ఆహారతృప్తి చెయ్యగలిగితే చెయ్యండి.” అని భీముడు తన తిండితనంలో ఉన్న దండితనం తెలుసుకాబట్టి ఔచిత్య పూరితంగా తన అవసరాన్ని తన ఇల్లు గల వాళ్లకు చెప్పాడు. ‘మీరు భోజనం పెడితేనే వెళతాను’ అని భీముడు మాట్లాడివుంటే అది అనౌచిత్యమౌతుంది.

5) అనువాద విధానం – సహజత

నన్నయ సంస్కృత భారతాన్ని అనువాదం చేశాడు అనే దానికంటే, అనువాదమైనా అనువాదం కాని పంథాలో భారత రచన చేసాడన్న ఆరుద్ర మాటలు అక్షర సత్యాలు.

**** సశేషం ****

Posted in April 2021, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!