Menu Close
Page Title

తెలుగు జాతి, భాష మొదలైన వాటి ప్రాచీనతను నిరూపించడానికి ముఖ్యమైన వారిలో ‘నాగులు’ ఒకరు. ప్రాచీన బౌద్ధగ్రంథాలలో ఆంధ్రదేశాన్ని నాగభూమిగా వర్ణించారు. పల్లవ రాజ్యస్థాపకుడైన వీరకూర్చవర్మ మహారాజు నాగుల ఇంటి ఆడబడుచును వివాహం చేసుకొన్నాడు. ఆంధ్రదేశానికి నాగులు కొత్తవారు కారని, నేలటూరు వెంకట రమణయ్య తెలిపారు. పల్లవులది ఆంధ్రదేశంలోని పలనాడే (స.ఆం.సా. 1వ సం. పుట 14).

టేకుమళ్ళ రామచంద్రరావు 1937 ఆగష్టు భారతిలో కోయవారిని గూర్చి వ్రాసిన వ్యాసంలో కోయవారి ఆచార వ్యవహారాలన్నీ తెలుగువారివేనని సవిస్తరంగా నిరూపించారు (స.ఆం.సా. 1వ సం. పుట 12).

మధ్య ద్రావిడ భాషలోని ‘కూబి’ భాష వారు తాము పాండవుల సంతతివారమని, పాండవదొరలమని చెప్పుకొన్నారు.

మన గ్రాంధిక భాషలో (తెలుగు) ఉన్న ఈవు (నీవు) ఈరు (మీరు) మొదలైనవి ‘కుయి’ భాషలో నేటికీ సజీవంగా ఉన్నాయి. గ్రియర్యన్ తన భారతీయ భాషల సర్వేలో “..కొలామీ కొన్ని విషయాలలో తెలుగును, కొన్ని విషయాలలో కన్నడాన్ని పోలివుంటుంది” అన్నాడు. కొన్ని ద్రావిడ జాతుల వారు భీమసేనుడు తమ మూలపురుషుడని చెప్పడం కూడా ద్రావిడ జాతుల వారి ప్రాచీనతను ఋజువు చేస్తున్నది. (స.ఆం.సా. 1వ సం. పుట 14-15).

తొలి తెలుగుమాట:

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అమరావతీ స్థూపం అతి ప్రాచీనమైనది. క్రీ.పూ. 200 మొదలు క్రీ.శ.200 వరకు దీని నిర్మాణం సాగింది. ఇక్కడ ఒక రాతి ఫలకం మీద ‘నాగబు’ అనే మాట కనపడింది. ఇదే మనకు లభించిన తొలి తెలుగుమాట. ఇది నాగంబు, నాగమ్భు, నాగమ్ము, నాగం అని మార్పులు చెందింది. ఇందులో ‘నాగంబు’ అనే మాటను గూర్చి చెప్తూ ఆరుద్ర “ఈ కోవలో ఉన్న అసలు సిసలు ద్రావిడ భాషా పదాన్ని మనం నేటికీ నిత్యం వాడుతూనే ఉన్నాం. అది చెంబు. అందువల్ల నాటినుండి నేటి వరకు ‘బు’ ప్రత్యయం తెలుగు భాషలో సజీవంగా ఉంది” అని అన్నారు (స.ఆం.సా. 1వ సం. పుట 3-4).

పదాల పట్టికలు:

ఆరుద్ర ప్రాచీన కాలపు రాజుల యొక్క, ఇతరుల యొక్క శాసనాలలో ఉన్న తెలుగు పదాలను పట్టికగా ఇచ్చారు. అలాగే గాథా సప్తశతిలోని తెలుగు మాటల పట్టిక కూడా ఇచ్చాడు. శాతవాహన రాజైన హాలుడు ప్రాకృత భాషలో, ఆంధ్రదేశంలో తన కాలంలో ఉన్న కవిత్వాన్ని సంకలం చేశాడు. దానిలో ఉన్న తెలుగు మాటలను గూర్చి తిరుమల రామచంద్ర గారు 1948 భారతిలో వ్యాసాలు వ్రాశారు. అలాగే దివాకర్ల వెంకటావధాని గారు ‘ప్రాఙ్నన్నయ యుగం’ అనే తన రచనలో తెలుగు పదాల గురించి చర్చించారు. వాటి ఆధారంగా ఆరుద్ర పట్టిక తయారు చేశారు (స.ఆం.సా. 1వ సం. పుట 7).

పదకవిత్వం:

ఆనాటి – అంటే ఆదిమయుగం నాటి పద కవిత్వం గూర్చి తెల్పుతూ, తెలుగువారికి పొరుగున ఉన్న తమిళుల పద సాహిత్యాన్ని గూర్చి కూడా ఆరుద్ర ప్రస్తావించారు. కోయజాతి ప్రజలు ప్రాచీన కాలంలో పాటలలోనే దైవ కార్యాలు కూడా నిర్వర్తించేవారు అని గిడుగు రామమూర్తి గారి రచనలు చెబుతున్నాయి.

తమిళులు క్రీ.శ. 4 వ శతాబ్దిలో ఒక ఉద్యమం లాగా ప్రాచీన తమిళ వాఙ్మయంలోని పాటలను, పదకవిత్వాన్ని సేకరించే కార్యక్రమం చేపట్టారు. దీనికి ప్రముఖులైన కవులనే నియమించారు. వాటిని సంకలనాలుగా ఏర్పరిచారు. మొత్తం మీద తమిళులు తమ ప్రాచీన సాహిత్యాన్ని భద్రపరుచుకొన్నారని చెప్పవచ్చు. ఆ గేయాలు అగవల్ అనే ఛందస్సులో ఉన్నాయని ఆరుద్ర తెలిపారు.

దీనిని గూర్చి చెప్తూ ఆరుద్ర తమిళులకన్నా ముందు ఆంధ్రదేశంలో క్రీ.శ. 1 వ శతాబ్దిలోనే ప్రాకృత భాషలో గాధాసప్తశతి అనే సంకలన గ్రంథం వెలువడిన విషయాన్ని జ్ఞప్తి చేస్తూ,

“తమిళులు ప్రాచీన సాహిత్యం కలవాళ్ళైనా అది మన తెలుగు గడ్డ మీద జరిగిన దానికి అక్షరాలా అనుకరణే” అన్నారు. మనకు కూడా పద సాహిత్యం బాగానే ఉందన్నారు. అయినా ఇంకా ప్రాచీన కాలపు పద సాహిత్యాన్ని సేకరించకుండా నిర్లక్ష్యం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ “మన పండితులకు తెలుగంటే ఈసడింపు” అన్నారు ఆరుద్ర. ఆంధ్రుల రాక వల్ల తెలుగు దేశంలో, తెలుగు భాషలో, తెలుగువారిలో సంస్కృత భాషా ప్రభావం బాగా పాతుకొని పోయింది. భాషాపరంగా అంటే తెలుగు భాషా వికాసానికి సంస్కృతం ఒక వరమైతే, తెలుగు భాషకు రావల్సినంత అభివృద్ధి రాకపోవడం గూడా సంస్కృత భాష వల్ల సంభవించింది (స.ఆం.సా. 1వ సం. పుట 20-21).

రేనాటి చోళులు – ఆరుద్ర అంతరంగ తరంగాలు

“రేనాటి చోళుల ధర్మమా అని మనకు ప్రాచీన తెలుగు వాక్య రచనా విధానం తెలుస్తున్నా వాళ్ళ చరిత్ర పూర్తిగా మనకు తెలియదు. రావు బహదూర్ హెచ్. కృష్ణ శాస్త్రి గారు, నేలటూరు వెంకట రమణయ్య గారు, మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు, ముట్నూరి వెంకట రామయ్య గారు, కే.ఎ. నీలకంఠ శాస్త్రి గారు వీరందరూ ఈ రేనాటి చోళులను గురించి పత్రికలలో వ్రాసిన వ్యాసాలూ ఇప్పటికీ చెల్లా చెదురు గానే ఉన్నాయి. వాటి సారాంశాన్ని ఏ చరిత్రకారుడూ క్రోడీకరించలేదు. ఆనాటి తెలుగు భాషా స్వరూపాన్ని ఇప్పటిదాకా నిలబెట్టిన ఈ పూజనీయులను గురించి అందులోనూ అక్షరాలా పుణ్యకుమారుణ్ణి గురించి పట్టుమని పది వాక్యాలు వరుసగా మన అధికారిక చారిత్రిక గ్రంథాలలో కనబడవు. వీళ్ళను గురించి (రేనాటి చోళులను గూర్చి) వివిధ పత్రికలలో ప్రామాణిక చరిత్రకారులు చెప్పిన విషయాలను క్రోడీకరించి చెప్పుకొని మన కృతజ్ఞతలను తెలియజేసుకొందాం (స.ఆం.సా. 1వ సం. పుట 29).

రేనాటి చోళులతో పాటు తెలుగులోనే తమ శాసనాలను వేయించిన ప్రశంసనీయులు బాణరాజులు, వైదంబులు... ఇప్పటిదాకా ఇటువంటి రెండవశ్రేణి రాజకుటుంబాల చరిత్ర పట్ల ఎవరూ శ్రద్ధ కనపరచకపోవడానికి కారణం నన్నయ గారికి పూర్వమున్న తెలుగు శాసనాలన్నీ ప్రకటించకపోవడమే...” (స.ఆం.సా. 1వ సం. పుట 40).

రేనాటి చోళులపైన ఆరుద్రకున్న ప్రత్యేక గౌరవం, శ్రద్ధ పైన వ్రాసిన దానిని బట్టి వ్యక్తమౌతున్నది. అంతేకాక సాహిత్య చరిత్రకారుడైన తాను ఎందుకు రేనాటి చోళుల గూర్చి క్లుప్తంగానైనా వ్రాయవలసి వచ్చిందో చెప్తూ ఆరుద్ర గారు, “...ఏ ప్రామాణిక గ్రంథాలలోనూ నాటి చోళులను గురించి ఈ మాత్రమైనా చెప్పారు గనుక తెలుసుకొన్నాం...” అంటూ వారిని గూర్చి తానూ తయారుచేసిన వంశవృక్షాన్ని (రేనాడు చోళుల) ప్రచురించారు (స.ఆం.సా. 1వ సం. పుట 39).

ప్రముఖ సాహిత్యకారుడైన ఆరుద్ర చేత ఇంతగా గౌరవింపబడిన రేనాటి చోళుల ప్రత్యేకత ఏమిటి? తెలుగు భాషా శాసన చరిత్రలో గాని ఇతరత్రాగాని రేనాటి చోళులకు గల విశిష్టత ఏమిటి? దీనికి సమాధానం –“తెలుగు లిపిలో ఉన్న మొట్టమొదటి తెలుగు శాసనాలన్నీ మనకు రాయలసీమలోనే దొరికాయి. క్రీ.శ. 6 వ శతాబ్దం నాటికి రాయలసీమ పేరు రేనాడు. అది ఏడువేల గ్రామాల మండలం దీనిని ఆనాడు చోళులు పాలిస్తూ ఉండేవారు. రేనాడును పాలించడం వల్ల వీరికి రేనాటి చోళులు అనే పేరు వచ్చింది” (స.ఆం.సా. 1వ సం. పుట 28). రేనాటి చోళుల విశిష్టతను గూర్చి ఆరుద్ర మాటల్లోనే తెలుసుకొన్నాం.

ఆరుద్ర రేనాటి చోళులను గూర్చి చెప్పిన వంశాది  విషయాలను ఇక్కడ పొందుపరుస్తాను.

వంశం: రేనాటి చోళులు తాము కరికాళ చోళుని వంశం వాళ్ళమని చెప్పుకొన్నారు.

కరికాళుడు: నేలటూరి వెంకట రమణయ్య గారు కరికాళ  చోళుని గూర్చి గొప్ప పరిశోధన చేసి, అంతవరకు కరికాళుడు మిధ్యా పురుషుడని అందరూ భావిస్తున్న తరుణంలో ఆయనకు చారిత్రిక స్థానం కల్పించడం గొప్ప విషయం. కరికాళుని రాజధాని ఉరయూరు. ఇది తమిళనాడు లోని కావేరీ నదీ తీరంలో ఉంది. కరికాళుడు ఆంధ్రదేశాన్ని కూడా పాలించాడు. “కరికాళుని గూర్చి తమిళనాడు లో ప్రాచీనకాలం నుండి విస్తారంగా పాటలు ప్రశంసలు ఉన్నాయి” అన్నారు ఆరుద్ర. అతన్ని గురించిన ప్రమాణాలు ఆంధ్రదేశంలోనే దొరికాయి.

కరికాళుడు ఉత్తర దేశంలో దిగ్విజయం చేసినప్పుడు కొందరు చోళులు రేనాడులో నిలిచిపోయారు. వారే అక్కడ రాజ్యం ఏలడం వాళ్ళ రేనాటి చోళులని వారిని పిలవడం జరిగింది. ఆరుద్ర కరికాళుని గూర్చి, రేనాటి చోళుల రాజ్యాది విషయాలను గూర్చి మరికొంత చర్చించారు. ఒక పటాన్ని కూడా తన రచనలో పొందుపరిచారు.

రేనాటి చోళులలో మొదటి రాజు (క్రీ.శ.550) నందివర్మ. ఇతనికి ముగ్గురు కుమారులు, సింహ విష్ణువు, సుందర నందుడు, ధనంజయుడు. ధనంజయుని మనుమడు పుణ్యకుమారుడు. రేనాటి రాజులలో ఎన్నదగినవారు ధనంజయుడు, పుణ్యకుమారుడు. వీరు వేయించిన శాసనాలకు ఆంధ్రదేశ చరిత్రలో ప్రత్యేకత ఉంది. రేనాటి చోళుల శాసనాలు దొరికినంతమటుకు 33 ఉన్నాయి. ఇందులో ప్రాచీనమైనది ధనంజయుని కనుమళ్ళ శాసనం.

రేనాటి చోళుల శాసనాలు:

ధనంజయునికి ఎరికల్ ముత్తరాజు అనేది, బిరుదువంటిది ఉంది. ‘ఎరికల్’ దీనిని గూర్చి చాలా చర్చ జరిగింది. ఎరికల్ అనేది ఒక ప్రదేశం పేరు. ఇది ప్రస్తుతం కాళహస్తి డివిజన్ లో ఉన్న ‘ఇనగలూరు’ అనే గ్రామంగా నీలకంఠ శాస్త్రి, వెంకటరామయ్య కుందుర్తి ఈశ్వరదత్తు మొదలైనవారు నిర్ణయించారు. ఇదే రేనాటి చోళుల మొట్టమొదటి నివాసస్థానం అని వారు నిర్ణయించారు. దీనిని ఎరికల్ ముత్తరాజు ధనంజయుడు పాలించాడు. ‘ముత్తరాజు’ అనే పదం రాజులకు గల రాజార్హత తెల్పేది. అలాగే ‘మహారాజు’ అంటే రాజ్యాన్ని పాలిస్తుండేవాడు. ‘యువరాజు’ అంటే మహారాజు తర్వాత రాజ్యాధికారానికి అర్హుడైన వాడు. ‘ముత్తరాజు’ అంటే యువరాజు తర్వాత రాజుగారి మగ సంతానంలో పెద్దవాడు. ఇతనికి యువరాజు తో పాటు రాజ్యార్హత ఉంది. అందుకే ఇనగలూరును (ఎరికల్) పాలించిన (ముత్తరాజు) ధనంజయుడు అనే పేరుగల రాజు, ఎరికల్ ముత్తరాజు ధనంజయుడుగా పిలువబడ్డాడు. ఇతను రేనాడును పాలించాడు (స.ఆం.సా. 1వ సం. పుట 28).

ధనంజయుని కనుమళ్ళ శాసనం అతి ప్రాచీనమైనది (క్రీ.శ.575). ఈ శాసనం కమలాపురం తాలూకా కరిమళ్ళ గ్రామంలో చెన్నకేశవాలయంలో దొరికింది. ధనంజయుడు దానమిచ్చిన విషయం తెల్పే శాసనమిది. ఇతనిదే అనుకొంటున్న మరొక శాసనం కమలాపురం తాలూకా ఎర్రగుడిపాడు గ్రామంలో దొరికింది. ఇందలి విషయం రాజకీయం.

పుణ్యకుమారుడు: ఇతడు ధనంజయుని మనుమడు. ఇతని భార్య వసంత పోరి వేయించిన శాసనంలో చోళ మహారాజు మొ|| ఇతని బిరుదులున్నాయి. ఇతను వేయించిన రామేశ్వర స్థంభ శాసనం శిధిలం కాలేదు. మరొక శాసనం పొట్లదుర్తి – మారేపాడు శాసనం. ఈ రెండు గ్రామాల మధ్య ఈ శాసనం దొరికింది (స.ఆం.సా. 1వ సం. పుట 36-42). ఇది తరిగిపోని కరిగిపోని ప్రాచీన పద సంపద. ముద్దనూరు మండలం చినదుగ్యాల గ్రామ సమీపంలో ఈ మధ్యనే మరొక చోళమహారాజు శాసనం దొరికింది. 8 వ శతాబ్దానికి చెందినదిగా చెప్పబడుతున్న ఈ శాసనంలో ఒక బ్రాహ్మణునికి మహారాజు భూమిని దానం చేసిన ప్రస్తావన ఉంది.

**** సశేషం ****

Posted in October 2020, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!