పద్యాలలో రకాలు
తెలుగు కవుల ప్రయోగాలలో కనిపించే పద్యాలలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవి:
1) వృత్తాలు (చంపకమాల, ఉత్పలమాల, మత్తేభము, శార్దూలము, మొదలగునవి)
2) జాతులు (కందము, ఉత్సాహము, తరువోజ, ద్విపద, అక్కరలు, రగడలు, మొదలగునవి)
3) ఉపజాతులు (గీతాలు, సీసాలు)
పద్యాలలో ఒక్కొక్క పంక్తిని పాదము అంటారు. ఇటువంటివి నాలుగు కలిస్తే పద్యము అవుతుంది.
వృత్తాల సంఖ్య
రకరకాలవృత్తాలలో ఒక్కొక్క పాదానికి 1 అక్షరమునుండి 26 అక్షరాలవరకు ఉంటాయి. ఇంకా ఎక్కువ అక్షరాలు ఉన్నపాదాలతో రచించిన పద్యాలను మాలికావృత్తాలు అంటారు (లయగ్రాహి, లయవిభాతి, లయహారి, త్రిభంగి, దండకాలు). అలాగే నాలుగు పాదాలను మించి రచిస్తే కూడా మాలికలు అంటారు (సుప్రసిద్ధకవి అల్లసాని పెద్దనగారు కవిత్వము ఎలా ఉండాలో ఆశువుగా చెప్పి రాయలవారిని మెప్పించి గండపెండేరాన్ని సొంతము చేసికొన్న ఉత్పలమాలిక, ఇంకా సీసమాలికలు, మొదలగునవి).
వృత్తపద్యములోని ప్రతిపాదానికి ఉన్న గణాలు మఱియు యతి, వృత్తాన్ని సూచిస్తే, అక్షరసంఖ్య ఛందస్సును సూచిస్తుంది. ఇవి పాదానికి 1 అక్షరము ఉన్న ‘ఉక్త’ ఛందస్సు నుండి పాదానికి 26 అక్షరాలు ఉన్న ‘ఉత్కృతి’ ఛందస్సు వరకు ఉంటాయి. ప్రతిఒక్క అక్షరము ఉచ్చారణకాలమునుబట్టి, రెండు లేదా ఇంకా ఎక్కువ మాత్రలు అయితే గురువు, ఒకేమాత్ర అయితే లఘువు అవుతుంది. అందుచేత ‘ఉక్త’ ఛందస్సులో పాదానికి ఒక్క గురువున్న వృత్తము, అలాగే పాదానికి ఒక్క లఘువున్న మఱొక వృత్తము - మొత్తము రెండు వృత్తాలు ఏర్పడ్డాయి. గణితశాస్త్రము ప్రకారము పాదానికి 2 అక్షరాలయితే 2x2=4 వృత్తాలు, 3 అక్షరాలయితే 2x2x2=8 వృత్తాలు ఏర్పడతాయి. పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని సార్లు 2ను 2 చేత హెచ్చవెస్తే ఆ ఛందస్సులోని మొత్తము వృత్తాలసంఖ్య వస్తుంది.
ఉదాహరణకి, పాదానికి 20 అక్షరాలు ఉన్న ఉత్పలమాల ‘కృతి’ ఛందస్సు లోని ఒక వృత్తము. ఈ ఛందస్సులో ఏర్పడిన మొత్తము వృత్తాల సంఖ్య కావాలంటే 2 ను 20 సార్లు 2 చేత హెచ్చవెయ్యాలి. అలా చేస్తే వచ్చే సంఖ్య 10,48,576 (=2^20). అంటే ఈ ఒక్క ఛందస్సులోనే 10 లక్షలపైన వృత్తాలు ఉన్నాయన్న మాట. అలాగే పాదానికి 26 అక్షరాలు ఉన్న ‘ఉత్కృతి’ ఛందస్సులో 6,71,08,864(=2^26) వృత్తాలు పుట్టేయి. అందులో ఒకటి మంగళమహాశ్రీ అనే వృత్తము.
ఇలా లెక్కవేస్తే, పాదానికి 1 అక్షరము నుండి పాదానికి 26 అక్షరాలున్న ఛందస్సు లన్నింటిలో వెరసి 13,42,17,726 [=2(2^26-1)/(2-1)] వృత్తాలు, అంటే 13 కోట్లపైన సంఖ్యకల వృత్తాలు, పుట్టేయన్న మాట. ఇవన్నీ సమవృత్తాలే. అంటే పద్యంలోని నాలుగు పాదాలలో ఒకే వృత్తము కలవి.
అసమవృత్తాల గురించి తర్వాత తెలిసికొందాము.
పద్యాలనడకలు
పద్యాలలో నడక గురువు, లఘువుల అమరికను బట్టి ఏర్పడుతుంది. గణాలు గురులఘువులను నిర్ణీతపధ్ధతిలో నిలిపితే ఏర్పడుతాయి కనుక పద్యాలనడక కూడా గణాలను బట్టి ఏర్పడుతుంది. అందు చేతనే ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క నిర్ణీతమైన గణాల వరుస, దానితోపాటు నడక ఉంటుంది. ఈ నడక/గణాలవరుస మారడంతో పద్యాల పేర్లు కూడా మారుతాయి. నడక మారకుండా ఉంటే, గణాలు వాటి అంతట అవే వచ్చి వరుసగా నిలబడతాయి. ఈ నడకల మూసలలో చక్కని భావాలను కరిగించి నింపితే ఘనీభవించిన తర్వాత అవే మంచి పద్యా లవుతాయి. ఇదే పద్యరచనలోని రహస్యము.
పద్యాలమార్పిడి
కొన్ని ఎంపిక చేసిన గురువులను రెండేసి లఘువులుగా మారిస్తే పద్యం నడకలో పెద్ద తేడా రాదు కాని కొంచెం తేడా అయితే తప్పకుండా ఉంటుంది.
ఉదాహరణకి, ఉత్పలమాలలోని మొదటి గురువును రెండు లఘువులుగా మారిస్తే చంపకమాల అవుతుంది. అలాగే శార్దూలము మత్తేభముగా, మత్తకోకిల తరలముగా, మార్పు చెందుతాయి. అయితే యతులు, ప్రాసలు తప్పకుండా పాటించాలి. ఇటువంటి కొన్ని నిర్ణీతమైన మార్పులతో మత్తకోకిల అనే పద్యము తరలము, వసంతకోకిల, పరభృతము, కరిబృంహితము అనే అవతారాలు దాలుస్తుంది.
పద్యాలమూసలు
ఒక్కొక్కవృత్తానికి ఒక్కొక్క మూస ఉంటే, మొదట పేర్కొన్న జాతులు, ఉపజాతులు కోవకు చెందిన పద్యాలలో ఒక్కొక్కదానికి ఎన్నో మూసలు ఉంటాయి. అందుకే అవి పదప్రయోగాలకు ఎంతో సౌలభ్యము చేకూరుస్తాయి. ఉదాహరణకి — కందము కష్టమన్నా అందులో ఇమడని శబ్దాలు ఉండవు. నిడివి తక్కువున్నా ఇవి చిట్టికాజాల వంటివి. అలాగే, భావము పెద్దదైతే, మాలికల జోలికి పోకపోతే, సీసానికి మించినది లేదు.
వృత్తాలు పట్టాలమీద పరుగెత్తే రైళ్ళయితే, మిగతావి గాలినింపిన టైర్లమీద పరుగెత్తే వాహనాలని నా భావన.
వృత్తపద్యాల విభజన
వృత్తము=గణాలు+యతి. ఛందస్సు=పద్యపాదములో అక్షరాల సంఖ్య
అ) సమవృత్తము -> అన్ని పాదాలు ఒకే వృత్తము
ఆ) అర్థసమవృత్తము -> 1,3 పాదాలు ఒకే వృత్తము, 2,4 పాదాలు వేఱొక వృత్తము
ఆ1) స్వస్థానము -> అన్ని పాదాలకి ఒకే అక్షరసంఖ్య ఉదాII నారీప్లుతము
ఆ2) పరస్థానము -> 1,3 పాదాలు ఒక అక్షరసంఖ్య, 2,4 పాదాలు వేఱొక అక్షరసంఖ్య
ఉదాII మనోహరము
ఇ) విషమవృత్తము -> ఒక్కొక్కపాదము వేఱ్వేఱు వృత్తము
ఇ1) స్వస్థానము -> అన్ని పాదాలకి ఒకే అక్షరసంఖ్య ఉదాII నదీప్రఘోషము
ఇ2) పరస్థానము -> 3 పాదాలు ఓకే అక్షరసంఖ్య, ఇంకొక పాదము వేఱొక అక్షరసంఖ్య
ఉదాII రథగమనమనోహరము
ఇ3) సర్వపరస్థానము -> ఒక్కొక్క పాదము వేఱ్వేఱు అక్షరసంఖ్య ఉదాII వీణారచనము
పాదాలలో వృత్తాన్ని (గణాలు+యతి) బట్టి సమ/అర్ధసమ/విషమ వృత్తాలు ఏర్పడుతాయి.
పాదాలలో ఛందస్సును(అక్షరసంఖ్య) బట్టి స్వస్థాన/పరస్థాన/సర్వపరస్థాన వృత్తాలు ఏర్పడుతాయి.
Excellent sir .
Highly knowledgeable and informative 🙏🏻